సర్వజనాస్పత్రిలోసర్జరీ వైద్యుల నిర్లక్ష్యం
ఆపరేషన్ చేసి వార్డుకు తరలించిన రోజే బయటపడిన పేగులు
నెపం రోగిపై నెట్టి చేతులెత్తేసిన వైద్యులు
ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న వృద్ధుడు
అనంతపురం మెడికల్: జీవి పుట్టుకకు దేవుడు కారణమైతే... ఆ జీవి ఆయురారోగ్యాలతో పరిపూర్ణ జీవితం గడిపేందుకు వైద్యులు కారణమై దేవుడితో సమానంగా ఖ్యాతి దక్కించుకున్నారు. అయితే కొందరు వైద్యుల కారణంగా ఈ ఖ్యాతి కాస్త అపఖ్యాతిగా మారుతోంది. ఇందుకు ప్రభుత్వ సర్వజనాస్పత్రి (జీజీహెచ్)లో సర్జరీ విభాగం సేవలే నిదర్శనం. ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రికి చేరుకున్న ఓ వృద్ధుడికి శస్త్రచికిత్స చేసి వార్డుకు తరలిస్తే పేగులు బయటపడ్డాయి. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా...
కణేకల్లు మండలం బెన్నికల్‌కు చెందిన వృద్ధుడు హనుమప్ప కడుపునొప్పితో బాధపడుతుంటే కుటుంబసభ్యులు ఆ చుట్టుపక్కల ఆస్పత్రుల్లో చికిత్స చేయించారు. నయం కాకపోవడంతో అక్కడి వైద్యుల సూచన మేరకు గత నెల సర్వజనాస్పత్రికి పిలుచుకొచ్చారు. పరీక్షించిన వైద్యులు గత నెల 25న యూనిట్ 2 కింద అడ్మిట్ చేసుకుని వైద్యపరీక్షలు నిర్వహించారు. ఇంటర్ స్టైనల్ ఇన్‌ఫెక్షన్ కారణంగా కడుపు నొప్పి వస్తోందని గుర్తించి లాపరోటమీ సర్జరీ (పొత్తికడుపు ఓపెన్ సర్జరీ) చేసి ఎస్‌ఐసీయూకు తరలించారు. ఐసీయూకు తరలించిన అదే రోజు హనుమప్పకు సర్జరీ వైద్యులు వేసిన కుట్లు తెరుచుకుని కడుపులో నుంచి పేగులు బయటపడ్డాయి. దీంతో కుటుంబీకులు, పక్కనే ఉన్న రోగులు, వారి సహాయకులు భయభ్రాంతులకు గురయ్యారు.
వార్డులోని సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడి విషయాన్ని వెంటనే వైద్యులు దృష్టికి తీసుకెళ్లారు. అప్పటికే అనస్తీసియా నుంచి బయటపడిన హనుమప్ప నొప్పి భరించలేక కేకలు వేస్తుండడంతో ఎస్‌ఐసీయూలో భయానక వాతావరణం నెలకొంది. అదే సమయంలో అక్కడకు చేరుకున్న వైద్యులు వెంటనే తమ తప్పును సరిదిద్దుకునే చర్యలు చేపట్టారు. ఇదేమిటని బాధిత కుటుంబసభ్యులు వైద్యులను ఆరా తీస్తే హనుమప్పకదలడం, ఆయాసం అధికంగా కావడంతో పేగులు బయట పడ్డాయని నిర్లక్ష్యంగా సమాధానమిస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.
అంతేకాక ఈ అంశం వెలుగు చూడకుండా తొక్కిపెట్టారు. ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో హనుమప్ప కొట్టుమిట్టాడుతున్నట్లు సమాచారం. కాగా, యూనిట్ 2 వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే శస్త్రచికిత్స విఫలమైనట్లు స్పష్టంగా తెలుస్తోంది. సర్జరీ విభాగంలో సరైన ప్రమాణాలను వైద్యులు పాటించడం లేదని ఆస్పత్రి వర్గాలే బాహటంగా చెబుతున్నాయి. సీనియర్లు చేయాల్సిన సర్జరీని పీజీ వైద్య విద్యార్థులతో చేయిస్తూ రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నట్లు ఆరోపణలున్నాయి. సర్వజనాస్పత్రిలో సర్జరీ విభాగం వైఫల్యాలపై ఆస్పత్రి పాలక వర్గం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment