ప్రైవేట్ ఆసుపత్రిలో వివాహిత మృతి
♦ వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ
♦ బంధువుల ఆందోళన
♦ ఆసుపత్రి అద్దాలు ధ్వంసం
♦ నిరసనకారులపై లాఠీచార్జి
సంగారెడ్డి టౌన్ : సంగారెడ్డిలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఓ మహిళ మృతి చెందింది. ఇందుకు వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ మృతురాలి బంధువులు శనివారం ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఆసుపత్రి అద్దాలను ధ్వంసం చేశారు. ఆందోళనకారులు శాంతించకపోవడంతో పోలీసులు లాఠీచార్జి చేశారు. బాధితుల కథనం ప్రకారం.. సంగారెడ్డి మండలం పోతిరెడ్డిపల్లి పంచాయతీ మదిర గ్రామమైన గొల్లగూడెంకు చెందిన పండరి, శంకరమ్మ దంపతుల కూతురు మానస (24) ఇంటి దగ్గర పురుగుల మందు తాగిందని శుక్రవారం ఉదయం 11 గంటలకు సంగారెడ్డిలోని గోకుల్ వెంకటేశ్వర మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి తీసుకొచ్చారు.
ప్రాథమిక చికిత్స చేసిన తర్వాత నయమవుతుందని డాక్టర్లు తెలిపారు. సాయంత్రం వరకు మానన బాగానే ఉందని డాక్టర్లు చెప్పారు. శనివారం తెల్లవారుజామున వేరే ఆసుపత్రికి తీసుకెళ్లాలని చెప్పి డాక్టరు వెళ్లిపోయారు. చేసేదేమిలేక పోతిరెడ్డిపల్లిలో ఉన్న మరో ఆసుపత్రికి తీసుకెళ్లగా.. మానస చనిపోయి చాలాసేపైందని అక్కడి వైద్యులు తెలిపారు. ఆగ్రహం ఊగిపోయిన వారు శవాన్ని తీసుకొచ్చి అక్కడే బైఠాయించారు. డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే తన భార్య మృతిచెందిందని ఆమె భర్త మహేశ్ ఆరోపించారు.
పోలీసుల లాఠీచార్జి
మానస బంధువులు పెద్ద ఎత్తున గోకుల్ ఆసుపత్రికి చేరుకుని ఉదయం 10.30 గంటలకు వరకు ఆందోళన కొనసాగించారు. వైద్యులను వాగ్వాదానికి దిగారు. అద్దాలు ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ తిరుపతన్న ఆధ్వర్యంలో పోలీసులు పెద్ద సంఖ్యలో వచ్చి వారిని అదుపు చేసేందుకు లాఠీచార్జి చేశారు. అక్కడున్న వారందరిని స్టేషన్‌కు తరలించారు. 12 మందిపై కేసు నమోదు చేసినట్టు సీఐ తెలిపారు.
డాక్టర్లే నా బిడ్డను బలిగొన్నారు..
మానస మంచిగానే ఉందని చెప్పి డాక్టర్లు ప్రాణాలు తీశారు. మాతో కాదని చెబితే వేరే ఆసుపత్రి పోతుంటుమి. అంతా బాగుందని రాత్రి వరకు చెప్పారు. అర్ధరాత్రి వచ్చి వేరే ఆసుపత్రికి తీసుకెళ్లాలని చెప్పారు. చనిపోయిన తర్వాత అప్పగించారు. డాక్టర్లే నా బిడ్డను బలి తీసుకున్నారు.
- పండరి, మృతురాలి తండ్రి