
డెలివరీ కోసం వెళ్లినందుకు ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీశారు. అయితే..
సాక్షి, మంచిర్యాల: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ల నిర్లక్ష్యంతో దారుణం జరిగింది. డెలివరీ సమయంలో ఆపరేషన్ చేసి.. కడుపులో కాటన్ పాడ్ వదిలేశారు వైద్యులు. దీంతో ఆ బాలింత ప్రాణాల మీదకు వచ్చింది.
ఐదురోజుల కిందట.. వేమనపల్లి మండలంలోని నీల్వాయి గ్రామానికి చెందిన కీర్తి లయకు పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో కాన్పు కోసం మంచిర్యాల ప్రభుత్వాసుపత్రిలో చేరింది. ఆ సమయంలో ఆపరేషన్ చేశారు వైద్యులు. ఆపరేషన్ సక్సెస్ అయ్యి.. పండంటి బిడ్డకు ఆమె జన్మనిచ్చింది. అయితే ఆపరేషన్ సమయంలో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. కాటన్ ప్యాడ్‌ను వైద్యులు ఆమె కడుపులో వదిలేశారు.
ఈ క్రమంలో ఆ బాలింత తీవ్ర అస్వస్థతకు గురవుతూ వచ్చింది. సోమవారం రాత్రి ఆమె పరిస్థితి మరింత దిగజారండంతో.. చెన్నూర్ అసుపత్రికి తరలించారు. అక్కడ డ్యూటీ డాక్టర్లు కీర్తి లయను పరిశీలించి.. ఆపై ఆపరేషన్ చేసి కాటన్ పాడ్‌ను బయటకు తీశారు. దీంతో ఆమె ప్రాణాపాయం నుంచి బయటపడింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది.