
సంప్రదాయ రూపమైనా ఇండో వెస్ట్రన్ కాంబినేషన్ అయినా కాటన్‌తో డ్రెస్సింగ్ స్టైల్స్ ఏమీ ఉండవు అనుకునేవారికీ ప్రతి వేసవి కొత్త మోడల్స్‌ని పరిచయం చేస్తూనే ఉంది. ఉన్న మోడల్స్‌ని మరింత వినూత్నంగా కళ్లకు కడుతోంది. ఫ్యాషన్ వేదికలపైనా స్టైలిష్‌గా వెలిగిపోతోంది... ఇంటింటికీ వచ్చి కాటన్ షో చేస్తోంది.
ఇంటికి వచ్చిన.. కాటన్ షో
శరీరానికి పట్టిన చెమటను పీల్చుకొని, కంఫర్ట్‌గా ఉంచే కాటన్ ఫ్యాబ్రిక్‌ను స్టైలిష్ వేర్‌కు జతచేసేటప్పుడు ఆ మెటీరియల్ బరువు, నేత, రంగును కూడా చూడాలి.
సల్వార్ సూట్
రోజువారీ ధరించేదే కదా ఏముంది స్పెషల్... అనుకోవడానికి వీలు లేని కంఫర్ట్‌బుల్ డ్రెస్‌గా మన్ననలు అందుకుంది సల్వార్ సూట్. స్ట్రెయిట్ కట్, ఎ లైన్, ఫ్రాక్ స్టైల్, పలాజో, టులిప్, ధోతీ ప్యాట్స్.. అంటూ సోషల్ మీడియా ట్రెండ్‌గా ఉన్న సల్వార్స్ కాటన్స్‌లో కంఫర్ట్‌గా లభిస్తున్నాయి.
బ్రైట్ వైట్
కాటన్ పాప్లిన్ క్లాత్ వేడి వాతావరణానికి అనువైనదిగా పేరొందింది. మస్లిన్, వాయిల్, సీర్ సకర్.. వంటివి ఈ కాలం తేలికగా అనిపించే మెటీరియల్. సాధారణంగా కాటన్స్‌లో వైట్, లైట్ షేడ్స్ మెటీరియల్ లభిస్తుంది. డల్‌గా ఉండే కలర్ ఫ్యాబ్రిక్ అంటూ పక్కన పెట్టేసే రోజులు కావివి. ఫ్లోరల్ మోటిఫ్స్, ప్యాచ్‌వర్క్, టై అండ్ డై తో షార్ట్ అండ్ లాంగ్ ఫ్రాక్స్, వెస్ట్రన్‌స్టైల్‌లో ఆకట్టుకునే ట్యునిక్స్.. ఈ సమ్మర్‌లో వెలిగిపోనున్నాయి.
ఫెదర్ లైట్
జమదాని, ఫెదర్ లైట్ మల్ మల్ కాటన్స్, చందేరీ, ఇక్కత్ కాటన్స్‌తో చేసే ప్రయోగాలు స్టైలిష్‌వేర్‌ని వినూత్నంగా చూపుతున్నాయి. ఎంపిక చేసుకునేటప్పుడు స్టైలిష్‌గానే కాదు మన్నిక ఎంత ఉన్నాయో చూసుకోవాలి.
రెడీమేడ్ అయితే ఆ డ్రెస్‌పై ఉండే లేబుల్‌ను చెక్ చేయాలి. ఉతకడం, ఆరబెట్టడం వంటి సూచనలపై లేబుల్ తగిన సమాచారాన్ని ఇస్తుంది.
కొన్ని రకాల కాటన్ డ్రెస్సులు నీళ్లలో పెట్టినప్పుడు రంగు పోతుంటాయి. ఒకదాని కలర్ మరో డ్రెస్‌కు పట్టే అవకాశం ఉంటుంది. ముదురు, లేత రంగులు, ఒకే రంగు కలవి విడివిడిగా ఉతకడం మేలు.
నీళ్లలో పెట్టినప్పుడు కాటన్ ఫ్యాబ్రిక్ ష్రింక్ అవడం, స్టార్చ్ పోవడం జరుగుతుంది. శుభ్రపరచడానికి చల్లటి నీటిని ఉపయోగించడం, డ్రైయర్‌ను ఉపయోగించకుండా ఆరవేయడం వల్ల కాటన్ క్లాత్ ఎక్కువ కాలం మన్నికగా ఉంటుంది.