ఇంటావిడ బాసన్లు కడుగుతుంటే ఇంటాయన చేతిలో కర్ర పట్టుకుని నిల్చున్నాడేంటని అనుకుంటున్నారా? ఆలిపై అనుమానంతో కాదు.. ఆవిడను రక్షించడానికే ఆయనీలా పహరా కాస్తున్నారు. ఆ ఊర్లో అందరి ఇళ్లలోనూ ఇంచుమించు అందరూ ఇలాగే చేస్తుంటారు. ఇదేదో ఆచారం అనుకునేరు! మహిళలు ఆరు బయట పనులు చేయడం పూర్తయ్యే వరకు పురుషులు సెక్యురిటీ డ్యూటీ చేయాల్సిందే. ఎందుకంటే వానరాల బారి నుంచి కాపాడుకోవడానికి అని చెబుతున్నారు ఆ ఊరి ప్రజలు.
మంచిర్యాల జిల్లాలో కోతులు బెంబేలెత్తిస్తున్నాయి. భీమారం మండల కేంద్రంలో ఆరుబయట ఇంటి పనులు చేసుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్నారు. ఒక మహిళ శనివారం తన ఇంటి ఆవరణలో వంటపాత్రలు శుభ్రం చేస్తుండగా.. ఆమె భర్త కర్ర పట్టుకుని కోతుల నుంచి రక్షణ కల్పించాల్సి వచ్చింది. ఇప్పటికే గ్రామంలో అనేక మంది కోతుల దాడిలో గాయపడ్డారు. దీంతో గ్రామంలో కోతుల బాధితుల సంఘమే ఏర్పాటైంది. కోతులను తరలించాలని అటవీ అధికారులు, పంచాయతీ అధికారులకు వినతిపత్రం అందజేసింది.
– సాక్షి ప్రతినిధి, మంచిర్యాల
‘సౌర’భాలు
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల నుంచి చంద్రాపూర్ వరకు ఇటీవల నిర్మించిన 363వ జాతీయ రహదారిపై.. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని పై వంతెన వద్ద సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేశారు. ఈ మార్గంలో రాత్రి వేళ జిగేల్‌మంటున్న సౌర విద్యుద్దీపాలు ప్రయాణికులను ఆకట్టుకుంటున్నాయి.
ట్రిపుల్ ఐటీలో వాకథాన్
నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో శనివారం ఉదయం వాకథాన్ నిర్వహించారు. ఇన్‌చార్జ్ వీసీ గోవర్దన్, ఎస్పీ జానకీషర్మిల విద్యార్థులతో కలిసి క్యాంపస్ ఆవరణలోని ఎకో పార్క్‌లో వాకింగ్ చేశారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి గోవర్దన్ మాట్లాడారు. విద్యార్థుల రక్షణ, సహకారం కోసం ఎస్పీ వర్సిటీని దత్తత తీసుకున్నట్టు వెల్లడించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, ఆరోగ్య సంరక్షణ, పాఠ్యేతర కార్యకలాపాలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తామని జానకీషర్మిల తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ అవినాష్‌కుమార్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రణదీర్ సాగి, అసోసియేట్ డీన్ స్టూడెంట్ వెల్ఫేర్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment