హైకోర్టును ఆశ్రయించిన ఆర్జీయూకేటీ పూర్వ విద్యార్థి
భైంసా: బాసర ట్రిపుల్‌ఐటీ పూర్వ విద్యార్థి సామల ఫణికుమార్ తన సర్టిఫికెట్లు ఇప్పించాలని హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించకపోవడంతో క్యాంపస్ అధికారులు సర్టిఫికెట్లు ఇవ్వడంలేదని ఈనెల 22న హైకోర్టును ఆశ్రయించాడు. సర్టిఫికెట్లు లేక తాను ఉద్యోగరీత్యా విదేశాల్లో పనిచేసేందుకు వెళ్లలేకపోతున్నానని పిటిషన్‌లో పేర్కొన్నాడు. గురువారం కోర్టు పిటిషన్‌పై విచారణ జరిపింది.
నల్గొండ జిల్లా గట్టుపల్లి మండలం పేరడిపెల్లి గ్రామానికి చెందిన ఫణికుమార్ 2017లో ట్రిపుల్‌ఐటీలో చేరాడు. 2023 వరకు ఇంజినీరింగ్ పూర్తిచేశాడని, సెమ్ టాపర్‌గా డైరెక్టర్ అకడమిక్ ఎక్సలెన్స్ అవార్డు కూడా అందుకున్నాడని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. రూ.86 వేల ఫీజు బకాయిలు ప్రభుత్వం మంజూరు చేసినా ఆ నిధులు ఇంకా క్యాంపస్‌కు జమకాలేదని తెలిపారు. దీంతో ఒరిజినల్ డిగ్రీ, టీసీ, స్టడీ కండక్ట్ సర్టిఫికెట్లు ఇవ్వలేదని వివరించారు. ఎంతో మంది విద్యార్థుల పరిస్థితి ఇలాగే ఉందని కోర్టుకు తెలిపారు.
చాలా మంది సొంతంగా డబ్బులు చెల్లించి సర్టిఫికెట్ల తీసుకెళ్లారని పేర్కొన్నారు. దీంతో న్యాయమూర్తి రెండు రోజుల్లో పూర్తి వివరాలతో సంప్రదించాలని న్యాయస్థానం పిటిషనర్‌కు సూచించింది. ట్రిపుల్ ఐటీకి కూడా నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. ఈ విషయంపై ఆర్టీయూకేటీ ఇన్‌చార్జి వీసీ గోవర్ధన్ ఒక ప్రకటన విడుదలచేశారు. బాసర పూర్వ విద్యార్థి హైకోర్టులో కేసు ఫైల్‌చేసిన నేపథ్యంలో న్యాయస్థానం సూచనలుపాటిస్తూ విశ్వవిద్యాలయ నియమనిబంధనలు అనుసరిస్తూ నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment