‘పది’ పరీక్షలకు 99.76శాతం హాజరు
మంచిర్యాలఅర్బన్: పదో తరగతి పరీక్షలు రెండో రోజు శనివారం ప్రశాంతంగా సాగాయి. జిల్లాలోని 49 పరీక్ష కేంద్రాల్లో సెకండ్ లాగ్వేజ్(తెలుగు, ఉర్దూ, హిందీ) పరీక్షకు 99.76శాతం విద్యార్థులు హాజరయ్యారు. రెగ్యులర్ విద్యార్థులు 9,185మందికి గాను 9,163మంది హాజరు కాగా, 22మంది గైర్హాజరయ్యారు. గతంలో ఫెయిలైన విద్యార్థులు ముగ్గురికి గాను ఒక్కరే పరీక్ష రాశారు. మొదటి రోజు మంచిర్యాల జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల పరీక్ష కేంద్రంలో పేపరు తారుమారు, ఆలస్యంతో శనివారం పరీక్ష కేంద్రాలను అధికారులు వరుస తనిఖీలు చేశారు. గర్మిళ్ల పాఠశాల, జెడ్పీహెచ్‌ఎస్(జీ), ట్రినిటీ పాఠశాల పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తనిఖీ చేశారు. జిల్లా ప్రశ్నపత్రాల స్టోరేజీ పాయింట్‌ను రాష్ట్ర పరిశీలకుడు సత్యనారాయణరెడ్డి సందర్శించి ప్రశ్నపత్రాలు తీసుకునే విధానం పరిశీలించారు. చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్‌మెంటు అధికారులకు సూచనలు చేశారు. జిల్లా కేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్ బాలుర ఉన్నత పాఠశాలతో మరో ఏడు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. డీఈవో యాదయ్య మంచిర్యాల, నస్పూర్‌లో పరీక్ష కేంద్రాలు పరిశీలించారు.
దోషులకు శిక్ష పడేందుకు కృషి
మంచిర్యాలక్రైం: దోషులకు శిక్ష పడేందుకు కోర్టు కానిస్టేబుళ్లు, లైసన్ అధికారులు కృషి చేయాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. శనివారం రామగుండం కమిషనరేట్‌లో కోర్టు కానిస్టేబుళ్లు, లైసన్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం మంచిర్యాల ట్రాఫిక్ పోలీసుస్టేషన్ హెడ్‌కానిస్టేబుల్ కే.నాగరాజు గుండెపోటుతో మృతిచెందగా ఆయన భార్య విజయకుమారికి రూ.7.48లక్షల ఎక్స్‌గ్రేషియా అందజేశారు. ఈ కార్యక్రమాల్లో అడిషనల్ డీసీపీ రాజు, ఎస్‌బీ ఏసీపీ రాఘవేంద్రరావు, టాస్క్‌ఫోర్స్ ఏసీపీ మల్లరెడ్డి, లీగల్‌సెల్ సీఐ కృష్ణ, సీసీఆర్‌బీ సీఐ సతీష్, ఐటీ సెల్ సీఐ చంద్రశేఖర్‌గౌడ్, పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు బోర్లకుంట పోచలింగం పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment