
ట్రాక్టర్ ఆపరేటెడ్ బ్రష్ టైప్ కాటన్ హార్వెస్టర్ త్వరలో సిద్ధం
భోపాల్‌లోని ఐసీఏఆర్ సంస్థ సీఐఏఈ రూపకల్పన
95 శాతం సమర్థతతో గంటకు 150–217 కిలోల పత్తి తీత
‘సాక్షి సాగుబడి’ ముఖాముఖిలో సీఐఏఈ వ్యవసాయ యాంత్రీకరణ విభాగాధిపతి వి.పి.చౌదరి వెల్లడి
సాక్షి సాగుబడి, హైదరాబాద్: దేశంలో అత్యధిక విస్తీర్ణంలో సాగయ్యే పంటల్లో వరి తర్వాత ముఖ్యమైనది పత్తి. వర్షాధారంగా గానీ, ఆరుతడి పంటగా గానీ దాదాపు 113 లక్షల హెక్టార్లలో పత్తిని సాగు చేస్తున్నప్పటికీ పత్తి తీయటానికి ఉపయోగపడే యంత్రం లేదు. మార్కెట్‌లో కనీసం ఒక్క హార్వెస్టర్ కూడా అందుబాటులో లేని ముఖ్యమైన పంట ఏదైనా ఉందంటే అది పత్తి మాత్రమే. రైతులు పత్తి తీతకు పూర్తిగా కూలీలపైనే ఆధారపడాల్సి రావటం, సీజన్‌లో రైతులందరికీ ఒకేసారి పత్తి తీసే అవసరం ఉండటంతో వారు అనేక కష్టాలు ఎదుర్కోక తప్పటం లేదు.
కాటన్ హార్వెస్టర్ రాక కోసం రైతులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్న సమయంలో భోపాల్‌లోని కేంద్రీయ వ్యవసాయ ఇంజనీరింగ్ సంస్థ (సీఐఏఈ)లో వ్యవసాయ యాంత్రీకరణ విభాగాధిపతి వి.పి.చౌదరి తీపి కబురు చెప్పారు. ట్రాక్టర్‌కు జోడించి పత్తి తీసే యంత్రంపై తమ పరిశోధన కొలిక్కి వస్తోందని, త్వరలో ప్రొటోటైప్ సిద్ధమవుతుందని ఇటీవల హైదరాబాద్ పర్యటనకు వచ్చిన చౌదరి ‘సాక్షి సాగుబడి’ తో చెప్పారు.
పత్తి తీతలో 95% సామర్థ్యం
ట్రాక్టర్‌కు జోడించి నడిపించే బ్రష్ టైప్ కాటన్ హార్వెస్టర్ పొలంలోని 95 శాతం పత్తిని సమర్థవంతంగా తీయగలుగుతోందని చౌదరి చెప్పారు. ఒక హెక్టారు పత్తి పొలంలో దూదిని పూర్తిగా తీయటానికి 1,560 గంటల మానవ శ్రమ అవసరమవుతోందని శాస్త్రవేత్తల అంచనా. ఒక మనిషి నిమిషానికి ఒకటిన్నర (1.58) మొక్కల నుంచి దూదిని తీస్తుంటే, తాము రూపొందించిన యంత్రం 70 మొక్కల నుంచి దూదిని తీస్తోందన్నారు.
మనిషి గంటకు 4.92 కిలోల గింజల పత్తిని తీస్తుంటే, ఈ యంత్రం 150–217 కిలోలు తీస్తోందని తెలిపారు. అయితే పత్తి మొక్కల నుంచి దూదిని తీసే క్రమంలో 28 శాతం వరకు ఆకులు, రెమ్మలు తదితర చెత్త కూడా పత్తికి అంటుకొని వస్తోందన్నారు. ఈ యంత్రానికి ప్రీ క్లీనర్లను అమర్చటం ద్వారా చెత్తను 10–12 శాతానికి తగ్గించగలిగామని చెప్పారు. ప్రొటోటైప్ యంత్రాన్ని సిద్ధం చేసి టెక్నాలజీని కంపెనీలకు అందుబాటులోకి తెస్తామని చౌదరి వెల్లడించారు. దీని ధర మార్కెట్‌లో రూ.5 లక్షల వరకు ఉండొచ్చని తెలిపారు.
అనువైన వంగడాల లేమి!
పత్తి తీసే యంత్రం సిద్ధమైనంత మాత్రాన సమస్య తీరిపోదు. మిషీన్ హార్వెస్టింగ్‌కు అనువైన పత్తి వంగడాలు మన దగ్గర లేకపోవటం మరో ప్రధాన ప్రతిబంధకం. విదేశాల్లో పండించే పత్తి రకాలు యంత్రం వినియోగానికి అనువుగా ఉంటాయని చౌదరి వివరించారు. మొక్కకు ఒకే కొమ్మ (సింగిల్ షూట్) పెరుగుతుందని, అన్ని కాయలూ ఒకేసారి పక్వానికి వస్తాయన్నారు. అయితే, దేశంలో సాగయ్యే పత్తి మొక్కలకు అనేక కొమ్మలు వస్తాయని తెలిపారు.
కాయలన్నీ ఒకేసారి పక్వానికి రావు.. పగలవని, అందుకే నాలుగైదు దఫాలుగా పత్తి తీయాల్సి వస్తోందని వివరించారు. కాయలన్నీ ఒకేసారి కోతకు వచ్చే పత్తి వంగడాన్ని రూపొందించడానికి నాగపూర్‌లోని కేంద్రీయ పత్తి పరిశోధనా కేంద్రంలో పరిశోధనలు కొనసాగుతున్నాయని ఆయన వెల్లడించారు. యంత్రంతో పత్తి తీయటానికి కొద్ది రోజుల ముందే పత్తి మొక్కల ఆకులను రాల్చేందుకు డీఫోలియంట్ రసాయనాన్ని పిచికారీ చేయాల్సి ఉంటుందన్నారు. దూదితో పాటు వచ్చే చెత్త శాతాన్ని తగ్గించటంలో ఇది కూడా కీలకమని చౌదరి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment