
‘సాక్షి’తో కల్నల్ పరీక్షిత్ మెహ్రా, బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ మాజీ ఏడీజీ పురుషోత్తం
రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఎస్‌ఎల్‌బీసీ క్యాంప్ వద్ద సహాయక చర్యల పర్యవేక్షణ
సాక్షి, హైదరాబాద్: భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా సొరంగాల నిర్మాణంలో అత్యవసర మార్గాలను నిర్మిస్తారని.. కానీ ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌కు అది లేకపోవడమే ఇటీవల జరిగిన ప్రమాదంలో 8 మంది ఆచూకీ దొరకకపోవడానికి కారణమని జాతీయ స్థాయిలో టన్నెల్ ప్రమాదాల్లో సహాయ చర్యలను పర్యవేక్షించిన నిపుణులు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు గురువారం ఎస్‌ఎల్‌బీసీ క్యాంపు సైట్ వద్దకు చేరుకున్న ఆర్మీ వెస్టర్న్ కమాండెంట్ కల్నల్ పరీక్షిత్ మెహ్రా, బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ (బీఆర్‌ఓ) మాజీ అదనపు డీజీ కె.పి. పురుషోత్తం ఈ సందర్భంగా ‘సాక్షి’తో మాట్లాడారు.
భూగర్భంలో 43 కి.మీ. పొడవున నీటిని సరఫరా చేసే సొరంగం దేశంలోకెల్లా ఎస్‌ఎల్‌బీసీ ఒక్కటేనన్నారు. నేషనల్ హైవేలు, రైల్వేలైన్లు, సముద్రమార్గాలను భూగర్భంలో నిర్మించినప్పటికీ నీటి సరఫరా కోసం అంతదూరంపాటు చేపట్టిన ఎస్‌ఎల్‌బీసీ సొరంగ ప్రాజెక్టు దేశంలోనే మొదటిదని పేర్కొన్నారు. అయితే ఈ నిర్మాణం అత్యంత క్లిష్టమైనదని వారు అభిప్రాయపడ్డారు.
టన్నెల్ బోరింగ్ మెషీన్ (టీబీఎం) టెక్నాలజీతో సాగే నిర్మాణం మంచిదే అయినప్పటికీ.. ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఈ ప్రమాదం నొక్కి చెప్పిందన్నారు. ప్రమాదంలో కార్మికులు, ఇంజనీర్లపై మట్టిపెళ్లల శిథిలాలు పడి ఉంటాయని భావిస్తున్నట్లు చెప్పారు. కార్మికులు గల్లంతైన చోట జరుగుతున్న రెస్క్యూ ఆపరేషన్‌లో ఒకట్రెండు రోజుల్లో ఫలితం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.