sakshi sagubadi
-
తెల్లబియ్యం తిన్నా.. షుగర్ పెరగదు!
సాక్షి, సాగుబడి డెస్క్: ప్రపంచవ్యాప్తంగా 54 కోట్ల మంది షుగర్ వ్యాధి (మధుమేహం) బాధితులుంటే.. అందులో 10.1 కోట్ల మంది భారతీయులే (2030 నాటికి ఈ సంఖ్య 15 కోట్లకు చేరనుంది). త్వరలోనే ఈ జాబితాలో చేరే వారు జనాభాలో మరో 15% ఉంటారు. గ్లైసైమిక్ ఇండెక్స్ (జీఐ) ఎక్కువగా ఉండే సాంబ మసూరి (జీఐ 72) వంటి పాలిష్ చేసిన తెల్ల బియ్యం తినటం మధుమేహానికి ప్రధాన కారణాల్లో మొదటిదని ఫిలిప్పీన్స్‌లోని అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ (ఇరి) గుర్తించింది. ఏదైనా ఆహార పదార్ధాన్ని తిన్న తర్వాత అది ఎంత త్వరగా గ్లూకోజ్‌గా మారి రక్తంలో కలుస్తున్నదో సూచించేదే ‘గ్లైసైమిక్ ఇండెక్స్’. ఇది ఎంత ఎక్కువగా ఉంటే అంత హానికరమన్నమాట. హరిత విప్లవానికి ముందు ఐఆర్8 వంటి అధిక దిగుబడినిచ్చే ‘మిరకిల్ రైస్’ వంగడాన్ని ఇచ్చి మన దేశ ఆకలి తీర్చిన ‘ఇరి’.. ఇప్పుడు షుగర్ పెంచని, ప్రొటీన్ లోపాన్ని ఎదుర్కొనే మరో రెండు అద్భుత వంగడాలను అందుబాటులోకి తెస్తోంది. లో గ్లైసైమిక్ ఇండెక్స్ (55%) కలిగిన ‘ఐఆర్ఆర్ఐ147’ ఈ ఏడాది ఖరీఫ్‌లోనే మన దేశంలో అందుబాటులోకి రానుంది. అలాగే అల్ట్రా లో మిగతా 2వ పేజీలో uగ్లైసైమిక్ (45%) + హై ప్రొటీన్ (16%)ను అందించే మరో అద్భుత వంగడం ఇంకో ఏడాదిలో అందుబాటులోకి రానుందని ‘ఇరి’ ప్రధాన శాస్త్రవేత్త, కంజ్యూమర్–డ్రివెన్ గ్రెయిన్ క్వాలిటీ అండ్ న్యూట్రిషన్ యూనిట్ హెడ్ డా.నెసె శ్రీనివాసులు తెలిపారు. ఈ రెండో వంగడానికి డాక్టర్ శ్రీనివాసులు స్వయంగా రూపకల్పన చేశారు. భారత్ పర్యటనలో భాగంగా ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిన ఆయన ‘సాక్షి సాగుబడి’తో ముచ్చటించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. తక్కువ జీఐ.. ‘ఐఆర్ఆర్ఐ147’ ‘ఐఆర్ఆర్ఐ 147’ రకం తెల్లగా పాలిష్ చేసిన బియ్యంలో గ్‌లెసైమిక్ ఇండెక్స్ (55%) తక్కువగా ఉంటుంది. 22.3 పీపీఎం జింక్ ఉంటుంది. ఉప్పదనాన్ని, తెగుళ్లను తట్టుకుంటుంది. భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్)కి రెండేళ్ల క్రితం ‘ఇరి’ ఈ వంగడాన్ని అందించింది. ఒడిశా రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ఐసీఏఆర్ ఈ వంగడాన్ని ప్రయోగాత్మకంగా క్షేత్రస్థాయిలో సాగు చేసింది. 7కు గాను 4 జోన్లలో మంచి ఫలితాలు వచ్చాయి. హెక్టారుకు 5– 9.5 టన్నుల దిగుబడి వచ్చింది. ప్రస్తుతం ‘సీడ్ వితవుట్ బార్డర్స్–ఎల్లలు లేని విత్తనాలు’ కార్యక్రమంలో భాగంగా ఫాస్ట్ ట్రాక్‌లో విడుదల చేసే ప్రయత్నం జరుగుతోంది. ఇది ముతక రకం కావటంతో ఉప్మా రవ్వ, అటుకులు, తదితర అల్పాహార ఉత్పత్తులుగా ప్రాసెస్ చేసి విక్రయించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏడాది ఖరీఫ్ నాటికి మన దేశంలోని రైతులకు ఐసీఏఆర్ ద్వారా ఈ న్యూక్లియస్ సీడ్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. అత్యల్ప జీఐ, రెట్టింపు ప్రొటీన్! షుగర్ రోగులు కూడా తినదగిన అతి తక్కువ గ్‌లెసైమిక్ ఇండెక్స్‌తో పాటు అధిక ప్రొటీన్‌ను కలిగి ఉండే అద్భుత వరి వంగడాన్ని ‘ఇరి’ భారతీయులకు అందిస్తోంది. దీనికి ఇంకా పేరు పెట్టలేదు. అత్యంత ప్రజాదరణ పొందిన సాంబ మసూరి మాదిరిగానే ఇది సన్న రకం, అధిక దిగుబడినిచ్చేది కూడా. సాధారణ సాంబ మసూరి జీఐ 72% కాగా, ప్రొటీన్ 8%, కుక్డ్ రెసిస్టెంట్ స్టార్చ్ 0.3% మాత్రమే. సాంబ మసూరితో కలిపి రూపొందిస్తున్న ఈ సరికొత్త రకం జీఐ కేవలం 45% మాత్రమే. ప్రొటీన్ మాత్రం రెట్టింపు. అంటే.. 16%. కుక్డ్ రెసిస్టెంట్ స్టార్చ్ కూడా 3.8% ఉంటుంది. అందువల్ల తిన్న తర్వాత 125 నిమిషాల వరకు నెమ్మదిగా జీర్ణమవుతూ గ్లూకోజ్‌ను తగుమాత్రంగా విడుదల చేస్తూ ఉంటుంది. షుగర్ వ్యాధిగ్రస్తులు, ప్రీ డయాబెటిక్ స్థితిలో ఉన్న వారు కూడా ఈ రకం తెల్ల బియ్యాన్ని ఇబ్బంది లేకుండా తినవచ్చు. వచ్చే ఏడాది దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈ వంగడాన్ని ప్రయోగాత్మకంగా ఐసీఏఆర్ ఆధ్వర్యంలో సాగు చేస్తాం. ప్రజల దైనందిన ఆహారం ద్వారా డయాబెటిస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు, ప్రొటీన్ లోపాన్ని అరికట్టడానికి ఈ వంగడం ఉపకరిస్తుంది. ఎఫ్‌పీవోల ద్వారా సాగు..మహిళా సంఘాల ద్వారా ప్రాసెసింగ్ అత్యల్ప గ్‌లెసైమిక్ ఇండెక్స్‌తో పాటు రెట్టింపు ప్రొటీన్‌ను కలిగి ఉండే ఆరోగ్యదాయకమైన కొత్త రకం వరి బియ్యాన్ని, ఇతర ఉప ఉత్పత్తులను దేశంలోని సాధరణ ప్రజలకు సైతం అందుబాటులోకి తేవాలన్నదే ‘ఇరి’ లక్ష్యం. ఒకసారి అందుబాటులోకి వస్తే భారత్‌తో పాటు ఇతర దేశాల్లోనూ ఈ బియ్యానికి చాలా గిరాకీ ఉంటుంది. అందువల్ల ఈ వంగడంపై పెద్ద కంపెనీలు గుత్తాధిపత్యం పొందటానికి వీల్లేకుండా, ఈ బియ్యాన్ని, ఇతర ఉత్పత్తులను దేశ ప్రజలకు సరసమైన ధరకే అందుబాటులోకి తేవటానికి కేంద్రం, ఒడిశా ప్రభుత్వాలతో కలసి పనిచేస్తున్నాం. ( వేగంగా బరువు తగ్గాలనుకుంటున్నారా? బెస్ట్ టిప్స్ ఇవే!)ఇందులో భాగంగా ఒడిశాలో ఎంపిక చేసిన కొన్ని రైతు ఉత్పత్తిదారుల సంఘాల (ఎఫ్పీఓలు) రైతులతో సాగు చేయిస్తున్నాం. మిల్లింగ్, ప్రాసెసింగ్‌లో 30 మహిళా స్వయం సహాయక బృందాలకు శిక్షణ ఇచ్చారు. భువనేశ్వర్ దగ్గర్లో ప్రత్యేక ప్రాసెసింగ్ ఫ్యాక్టరీని ప్రభుత్వం భారీ పెట్టుబడితో నెలకొల్పుతోంది. ప్రత్యేక బ్రాండ్‌ను ప్రారంభించి ఆరోగ్యదాయకమైన ఈ బియ్యం, ఇతర ఉత్పత్తులను రిటైల్ మార్కెట్లోని పెద్ద కంపెనీల ద్వారా సరసమైన ధరలకే ప్రజలకు విక్రయించేందుకు గట్టిగా కృషి చేస్తున్నాం. ఇదీ చదవండి: వేసవిలో మెరిసే చర్మం : అద్భుతమైన మాస్క్‌లు -
పత్తి తీసే యంత్రం రెడీ!
సాక్షి సాగుబడి, హైదరాబాద్: దేశంలో అత్యధిక విస్తీర్ణంలో సాగయ్యే పంటల్లో వరి తర్వాత ముఖ్యమైనది పత్తి. వర్షాధారంగా గానీ, ఆరుతడి పంటగా గానీ దాదాపు 113 లక్షల హెక్టార్లలో పత్తిని సాగు చేస్తున్నప్పటికీ పత్తి తీయటానికి ఉపయోగపడే యంత్రం లేదు. మార్కెట్లో కనీసం ఒక్క హార్వెస్టర్ కూడా అందుబాటులో లేని ముఖ్యమైన పంట ఏదైనా ఉందంటే అది పత్తి మాత్రమే. రైతులు పత్తి తీతకు పూర్తిగా కూలీలపైనే ఆధారపడాల్సి రావటం, సీజన్లో రైతులందరికీ ఒకేసారి పత్తి తీసే అవసరం ఉండటంతో వారు అనేక కష్టాలు ఎదుర్కోక తప్పటం లేదు.కాటన్ హార్వెస్టర్ రాక కోసం రైతులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్న సమయంలో భోపాల్‌లోని కేంద్రీయ వ్యవసాయ ఇంజనీరింగ్ సంస్థ (సీఐఏఈ)లో వ్యవసాయ యాంత్రీకరణ విభాగాధిపతి వి.పి.చౌదరి తీపి కబురు చెప్పారు. ట్రాక్టర్‌కు జోడించి పత్తి తీసే యంత్రంపై తమ పరిశోధన కొలిక్కి వస్తోందని, త్వరలో ప్రొటోటైప్ సిద్ధమవుతుందని ఇటీవల హైదరాబాద్ పర్యటనకు వచ్చిన చౌదరి ‘సాక్షి సాగుబడి’ తో చెప్పారు.పత్తి తీతలో 95% సామర్థ్యంట్రాక్టర్కు జోడించి నడిపించే బ్రష్ టైప్ కాటన్ హార్వెస్టర్ పొలంలోని 95 శాతం పత్తిని సమర్థవంతంగా తీయగలుగుతోందని చౌదరి చెప్పారు. ఒక హెక్టారు పత్తి పొలంలో దూదిని పూర్తిగా తీయటానికి 1,560 గంటల మానవ శ్రమ అవసరమవుతోందని శాస్త్రవేత్తల అంచనా. ఒక మనిషి నిమిషానికి ఒకటిన్నర (1.58) మొక్కల నుంచి దూదిని తీస్తుంటే, తాము రూపొందించిన యంత్రం 70 మొక్కల నుంచి దూదిని తీస్తోందన్నారు.మనిషి గంటకు 4.92 కిలోల గింజల పత్తిని తీస్తుంటే, ఈ యంత్రం 150–217 కిలోలు తీస్తోందని తెలిపారు. అయితే పత్తి మొక్కల నుంచి దూదిని తీసే క్రమంలో 28 శాతం వరకు ఆకులు, రెమ్మలు తదితర చెత్త కూడా పత్తికి అంటుకొని వస్తోందన్నారు. ఈ యంత్రానికి ప్రీ క్లీనర్లను అమర్చటం ద్వారా చెత్తను 10–12 శాతానికి తగ్గించగలిగామని చెప్పారు. ప్రొటోటైప్ యంత్రాన్ని సిద్ధం చేసి టెక్నాలజీని కంపెనీలకు అందుబాటులోకి తెస్తామని చౌదరి వెల్లడించారు. దీని ధర మార్కెట్లో రూ.5 లక్షల వరకు ఉండొచ్చని తెలిపారు.అనువైన వంగడాల లేమి!పత్తి తీసే యంత్రం సిద్ధమైనంత మాత్రాన సమస్య తీరిపోదు. మిషీన్ హార్వెస్టింగ్‌కు అనువైన పత్తి వంగడాలు మన దగ్గర లేకపోవటం మరో ప్రధాన ప్రతిబంధకం. విదేశాల్లో పండించే పత్తి రకాలు యంత్రం వినియోగానికి అనువుగా ఉంటాయని చౌదరి వివరించారు. మొక్కకు ఒకే కొమ్మ (సింగిల్ షూట్) పెరుగుతుందని, అన్ని కాయలూ ఒకేసారి పక్వానికి వస్తాయన్నారు. అయితే, దేశంలో సాగయ్యే పత్తి మొక్కలకు అనేక కొమ్మలు వస్తాయని తెలిపారు.కాయలన్నీ ఒకేసారి పక్వానికి రావు.. పగలవని, అందుకే నాలుగైదు దఫాలుగా పత్తి తీయాల్సి వస్తోందని వివరించారు. కాయలన్నీ ఒకేసారి కోతకు వచ్చే పత్తి వంగడాన్ని రూపొందించడానికి నాగపూర్‌లోని కేంద్రీయ పత్తి పరిశోధనా కేంద్రంలో పరిశోధనలు కొనసాగుతున్నాయని ఆయన వెల్లడించారు. యంత్రంతో పత్తి తీయటానికి కొద్ది రోజుల ముందే పత్తి మొక్కల ఆకులను రాల్చేందుకు డీఫోలియంట్ రసాయనాన్ని పిచికారీ చేయాల్సి ఉంటుందన్నారు. దూదితో పాటు వచ్చే చెత్త శాతాన్ని తగ్గించటంలో ఇది కూడా కీలకమని చౌదరి చెప్పారు. -
‘సాక్షి సాగుబడి' రాంబాబు, 'సాక్షి టీవీ' కిషోర్ లకు ఉత్తమ జర్నలిస్టు అవార్డులు
సాక్షి, హైదరాబాద్: ‘సాక్షి సాగుబడి’ ఇన్చార్జ్ పంతంగి రాంబాబు బుధవారం హైటెక్స్‌లో జరిగిన హైబిజ్ టీవీ మీడియా అవార్డ్స్ ఫంక్షన్లో తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలి చేతుల మీదుగా ఉత్తమ ప్రింట్ అగ్రికల్చరల్ జర్నలిస్ట్ పురస్కారాన్ని అందుకున్నారు. 37 ఏళ్లుగా పాత్రికేయుడిగా సేవలందిస్తున్న రాంబాబు గతంలో విశాలాంధ్ర, ఆంధ్రభూమి డైలీలో పనిచేశారు. గత 15 ఏళ్లుగా సాక్షిలో పనిచేస్తూ తెలుగు రాష్ట్రాల్లో ప్రకృతి వ్యవసాయం, సేంద్రియ ఇంటిపంటలు, సిరిధాన్యాల వ్యాప్తికి విశేష కృషి చేస్తూ ట్రెండ్ సెట్టర్‌గా పేరుగాంచారు. ప్రతి మంగళవారం సాక్షి దిన పత్రికలో ప్రచురితమయ్యే ‘సాగుబడి’ పేజీని దశాబ్దకాలంగా రైతు జన రంజకంగా నిర్వహిస్తున్నారు. పన్నెండేళ్లుగా సేంద్రియ ఇంటిపంటలపై కథనాలు రాస్తూ ప్రాచుర్యంలోకి తెస్తున్న ఆయన గత సంవత్సరంగా ‘సాక్షి ఫన్డే’లో ప్రపంచవ్యాప్తంగా అర్బన్ అగ్రికల్చర్ పోకడలపై కాలమ్ రాస్తున్నారు. ప్రకృతి వ్యవసాయోద్యమ పితామహుడు పద్మశ్రీ పురస్కార గ్రహీత సుభాష్ పాలేకర్, స్వతంత్ర శాస్త్రవేత్త, పద్మశ్రీ పురస్కార గ్రహీత డా. ఖాదర్ వలి, మట్టి సేద్య నిపుణుడు పద్మశ్రీ పురస్కార గ్రహీత చింతల వెంకటరెడ్డి వంటి ఉద్ధండుల విశేష కృషిని తెలుగు ప్రజలకు విస్తృతంగా అందుబాటులోకి తేవటంలో రాంబాబు కృషి చేస్తున్నారు. అదేవిధంగా, గ్రామీణులు, రైతు శాస్త్రవేత్తలు ఆవిష్కరించిన అనేక యంత్ర పరికరాలను వెలుగులోకి తేవడంలో విశేష కృషి చేసినందుకు నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ (ఎన్.ఐ.ఎఫ్.) 2017లో జాతీయ పురస్కారాన్ని న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో సాక్షి పత్రిక తరఫున రాంబాబు స్వీకరించిన విషయం తెలిసిందే. చేవెళ్ల ఎంపీ జి. రంజిత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సాక్షి టీవీ న్యూస్ కాస్టర్ కిషోర్ తో పాటు వివిధ పత్రికలు, సోషల్ మీడియా సంస్థలు, శాటిలైట్ ఛానళ్లలో సేవలందిస్తున్న పాత్రికేయులు, ఫోటో, వీడియో జర్నలిస్టులు పలువురు పురస్కారాలు అందుకున్నారు. ఇక సాక్షి టీవీలో సీనియర్ ప్రజంటర్ గా చేస్తోన్న DV నాగ కిషోర్ ఉత్తమ న్యూస్ ప్రజంటర్ గా అవార్డు అందుకున్నారు. 23 సంవత్సరాలుగా టెలివిజన్ రంగంలో న్యూస్ ప్రెజంటర్గా, అలాగే సీనియర్ జర్నలిస్ట్ గా పనిచేస్తున్నారు కిషోర్. రాజకీయ, సామాజిక అంశాలకు సంబంధించిన డిబేట్ లను సాక్షి టీవీ వేదికగా నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో పీజీతో పాటు ఎం.కాం., ఎంబీఏ చదువుకున్న కిషోర్, గతంలో రేడియో ప్రజంటర్ గా కూడా పని చేశారు. కర్ణాటక, రాజస్థాన్, ఢిల్లీతో పాటు పలు రాష్ట్రాల్లో రిపోర్టింగ్ చేసిన అనుభవం కిషోర్ కు ఉంది. తాజాగా కర్ణాటక ఎన్నికలపై క్షేత్ర స్థాయిలో పర్యటించి గ్రౌండ్ రిపోర్టులు అందించారు కిషోర్. చదవండి: రోజుకు రూ. 1500.. ఎకరంన్నరలో ఏటా 4 లక్షలు! ఇలా చేస్తే లాభాలే! విద్యార్థులకు స్కాలర్ షిప్‌లు.. ఆర్థికంగా వెనుకబడిన మీడియా సిబ్బంది కుటుంబంలో చురుకైన విద్యార్థులకు హై బిజ్ టీవీ ఆసరాగా నిలిచింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి అలాంటి 10 మంది స్టూడెంట్స్ ను ఎంపిక చేసి వారికి రూ. 25 వేల స్కాలర్ షిప్ ఇచ్చింది. రెసొనెన్స్ జూనియర్ కాలేజీల(ఐఐటీ-జేఈఈ, నీట్) సహకారంతో ఈ ఆర్థిక సాయాన్ని అందించింది. ఈ సందర్భంగా రెసొనెన్స్ విజయగాథను తెలియజేసే కాఫీ టేబుల్ బుక్ ను మంత్రి మహమూద్ అలీ ఆవిష్కరించారు. స్కాలర్ షిప్ పొందిన విద్యార్థుల వివరాలు: ఎన్. సాయిప్రియ - పదో తరగతి (10 జీపీఏ) - జడ్పీ స్కూల్ తలమడుగు, ఆదిలాబాద్ జిల్లా (D/O అశోక్ - రిపోర్టర్, ఆంధ్రజ్యోతి) ఇస్క పునీత్ అభిషేక్, ఇంటర్ (94.5%), హైదరాబాద్ (S/O రాజేశ్ బాబు - సూర్య డెయిలీ) ఎం. త్రిశూల్, 9వ తరగతి (10 జీపీఏ), ప్రేరణ కాన్సెప్ట్ స్కూల్, నల్లగొండ (S/O శ్రీనివాస్ - హన్స్ ఇండియా) ఎం. వేద సహస్ర, ప్రస్తుతం 9వ తరగతి, భాష్యం వనస్తలిపురం, గ్రేడ్ ఏ-1 (D/O శ్రీనివాస్ - వీ6 కెమెరామెన్) ఎం. హాసిని, 6వ తరగతి, శ్రీ చైతన్య టెక్నో, మెహదీపట్నం, ఏ+ (D/O పూర్ణచందర్ - ఆర్ఎండి విభాగం, టైమ్స్ ఆఫ్ ఇండియా) షేక్ రమీజా, బీఎస్సీ (అగ్రికల్చర్) 3వ సంవత్సరం, మల్లారెడ్డి యూనివర్సిటీ, ఏ+ (D/O షేక్ మస్తాన్ - ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి ఎడిషన్) పి. జైవంత్, 9వ తరగతి, భద్రాచలం పబ్లిక్ స్కూల్, ఏ1 (S/0 పీవీ సత్యనారాయణ - హన్స్ ఇండియా, ఖమ్మం) ఎ. స్రవంతి, ఎంబీబీఎస్, ప్రభుత్వ మెడికల్ కాలేజీ, నల్లగొండ (D/O శ్రీనివాస్ - జీ24 ఎక్స్ కెమెరామెన్) హజి హాసిని, పదో తరగతి, టీఎస్ఎస్ డబ్ల్యూ రెసిడెన్షియల్ స్కూల్, ఎకర్ల (D/O గోపీకుమార్, ఎక్స్ ప్రజా శక్తి, కామారెడ్డి) పి. శరణ్య, 5వ తరగతి, సెయింట్ ఆన్స్ తార్నాక, ఏ+ (D/O ప్రవీణ్, వాయిస్ ఆఫ్ వర్డ్స్) చదవండి: ప్రకృతిని, ఆవులను నమ్ముకున్నారు.. 40 సెంట్లు.. రూ.3 లక్షలు! హెచ్.ఎం.ఎ-2023 కార్యక్రమానికి డాక్టర్ రంజిత్ రెడ్డి (ఎంపీ), ఈవీ నర్సింహారెడ్డి - ఐఏఎస్ (వీసీ & ఎండీ టీఎస్ ఐఐసీ), నరేంద్ర రామ్ నంబుల (సీఎండీ - లైఫ్ స్పాన్ ప్రైవేట్ లిమిటెడ్), పి. చక్రధర్ రావు (ప్రెసిడెంట్ -ఐపిఈఎంఏ, పౌల్ట్రీ ఇండియా), ఎం. రవీందర్ రెడ్డి (డైరెక్టర్ మార్కెటింగ్ - భారతి సిమెంట్స్), వి. రాజశేఖర్ రెడ్డి (జనరల్ సెక్రటరీ - క్రెడాయ్), ఎం. రాజ్ గోపాల్ (ఎండీ - హై బిజ్ టీవీ, తెలుగు నౌ), డాక్టర్ జె. సంధ్యారాణి (సీఈవో - హై బిజ్ టీవీ, తెలుగు నౌ) తదితరులు హాజరయ్యారు. -
ఎకరంలో 8 రకాల కూరగాయలు
సేంద్రియ బహుళ పంటల పద్ధతిలో కూరగాయలను సాగు చేస్తూ ఆర్థిక స్వావలంబన సాధిస్తున్నారు యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం ఇస్కిళ్ల గ్రామానికి చెందిన ఈశ్వరమ్మ. సేంద్రియ ఎరువులు, జీవామృతంను ఉపయోగిస్తూ ఎకరం విస్తీర్ణంలో ఏడాదికి 3 లక్షల రూపాయల దిగుబడిని సాధిస్తూ ఆదర్శంగా నిలిచింది ఈశ్వరమ్మ. రామన్నపేట మండలం పల్లివాడ గ్రామానికి చెందిన కల్లెం భీమలింగం – ఈశ్వరమ్మ దంపతులు ఐదు సంవత్సరాల క్రితం అదే మండలంలోని ఇస్కిళ్ల గ్రామానికి వలస వెళ్లారు. డ్రిప్ డీలర్ అయిన భీమలింగం ఇస్కిళ్ల – ఉత్తటూరు గ్రామాల మధ్య 3.29 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేశాడు. ఆ భూమిని సాగు చేసే బాధ్యతను భార్య ఈశ్వరమ్మకు అప్పగించాడు. నిరక్ష్యరాస్యులైన ఈశ్వరమ్మ భర్త ప్రోత్సాహంతో నాబార్డు వారు పంటల సాగుపై ఏర్పాటు చేసిన అవగాహనా సదస్సులకు హాజరై వ్యవసాయంపై మక్కువ పెంచుకున్నది. పంటల సాగుపై అవగాహన తరగతులు బోధించే రమేష్ ప్రోత్సాహంతో బహుళ పంటల విధానంలో కూరగాయలను సాగు చేయడం ప్రారంభించింది. తమ వ్యవసాయ భూమిలో ఎకరంలో కూరగాయలు సాగు చేస్తున్నారు. ఐదు ట్రాక్టర్ల పశువుల ఎరువును పొలంలో చల్లి మెత్తగా దున్నించి ట్రాక్టర్‌తోనే 4 అడుగుల ఎడంలో బోదెలు(మట్టి కట్టలు) పోయించారు. ఐదు వరుసలకు ఒక పంట చొప్పున మిర్చి, వంకాయ, కాకర, టమాట, బీర, సొర, దోస, బంతి వంటి ఎనిమిది రకాల కూరగాయలను సాగు చేశారు. హైదరాబాద్‌లోని నర్సరీల నుంచి తెచ్చిన నారు, విత్తనాలు విత్తారు. భూమిలో తేమ తొందరగా ఆవిరైపోకుండా, కూరగాయలు నేలను తాకి చెడిపోకుండా, మొక్కలకు వైరస్ సోకకుండా ఉండేందుకు బోదెలపై మల్చింగ్ షీట్‌ను పరిచారు. డ్రిప్‌ను అమర్చి మొక్కలకు నీరందించే ఏర్పాటు చేశారు. తీగ జాతి మొక్కలు ఏపుగా పెరగడంతోపాటు, కాయల బరువుకు మొక్కలు నేలను తాకకుండా ఉండేందుకు గాను వెదురు బొంగులను నాటి బైండింగ్ వైరుతోపాటు, సుతిలి తాడును అల్లారు. ప్రతీ ఐదు బోదెలకు ఒక వరుసతో పాటు, పొలం చుట్టూ బంతి పూల మొక్కలు పెట్టారు. కూరగాయల మొక్కలకు వచ్చే చీడపీడలను ముందుగానే బంతి మొక్కల ద్వారా గుర్తించి కషాయాలను పిచికారీ చేస్తూ సస్యరక్షణ చర్యలు చేపడుతున్నారు. కూరగాయల రకాన్ని బట్టి నాటిన నలభై ఐదు రోజుల నుంచి తొమ్మిది నెలల వరకు పంట దిగుబడి వస్తుంది. ఏదేని ఒక రకం పంట కాలం ముగియగానే.. చదును చేసి బోదెలు పోసి పంట మార్పిడి చేసి.. మరో రకం కూరగాయ మొక్కలు నాటుతున్నారు. పండించిన కూరగాయలను తమ టాటాఏస్ వాహనంలో తీసుకువెళ్లి పరిసర గ్రామాల్లో దళారుల ప్రమేయం లేకుండా నేరుగా ప్రజలకు అమ్ముతుండటం విశేషం. ఈ విధంగా సంవత్సరానికి రూ. 3 లక్షల ఆదాయం పొందుతున్నారు. పెట్టుబడి పోను రూ. రెండు లక్షల వరకు నికరాదాయాన్ని ఆర్జిస్తున్నట్లు ఈశ్వరమ్మ తెలిపారు. సేంద్రియ పద్దతుల్లో కూరగాయలను సాగు చేస్తూ నేరుగా ప్రజలకు విక్రయిస్తున్న ఈశ్వరమ్మ గత ఏడాది జిల్లా స్థాయిలో ఉత్తమ మహిళా రైతుగా ఎంపికై కలెక్టర్ చేతుల మీదుగా అవార్డును పొందింది. గత అక్టోబర్‌లో నాబార్డు హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆవరణలో సేంద్రియ పంటల ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఈశ్వరమ్మ ఒక్కరికే స్టాల్‌ను ఏర్పాటు చేసే అవకాశం వచ్చింది. తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర్‌రాజన్ ఈశ్వరమ్మ సేంద్రియ కూరగాయల స్టాల్‌ను సందర్శించి, ఆమె కృషిని అభినందించారు. (ఈశ్వరమ్మ భర్త భీమలింగంను 96668 46907 నంబరులో సంప్రదించవచ్చు) – కనుతాల శశిధర్‌రెడ్డి, సాక్షి, రామన్నపేట, యాదాద్రి భువనగిరి జిల్లా -
అంతటితో ‘ఆగ’లేదు!
‘పత్తి పండే వరకు అదే పని. సంక్రాంతి వెళ్లిన తర్వాత కూరగాయలు, ఆకుకూరలు పండిస్తా. బండి (మోపెడ్) మీద ఇంటింటికీ తిరిగి అమ్ముకుంటా. ఇంకా ఖాళీ ఉంటే కూలి పనికి వెళ్తా. కాయకష్టంతో వ్యవసాయాన్నే నమ్ముకున్నా. ఏ పంట టైములో ఆ పని చేస్తా.. పిల్లలను పోషించుకోవాలి, పెళ్లిళ్లు చేయాలి కదా.. ఎవరికీ భయపడనవసరం లేదు. మనమేమీ తప్పు చేస్తలేం కదా అని మా ఆయన చెప్పిన మాటలను ప్రతి రోజూ గుర్తుచేసుకుంటున్నా..’ ఇదీ ఒంటరి మహిళా రైతు తనుగుల ఆగమ్మ మనసులో మాట. జీవితంలో కష్టాలు కట్టగట్టుకొని ఎదురొచ్చినా చెక్కు చెదరని మనోధైర్యంతో నిలబడి, దృఢచిత్తంతో ముందడుగు వేస్తోంది. ఆగమ్మ ములుగు జిల్లా బండారుపల్లిలో పేద వ్యవసాయ కుటుంబంలో పుట్టి పెరిగింది. చదువుకోలేదు. వరంగల్ రూరల్ జిల్లా ఆత్మకూరుకు చెందిన పేద రైతు తనుగుల కుమారస్వామితో 20 ఏళ్ల క్రితం పెళ్లయింది. వాళ్లకు ముగ్గురు ఆడ పిల్లలు.. ఆమని, కావ్య, శ్రావణి. వాళ్లకు చిన్న పెంకుటిల్లుతో పాటు ఎకరం 30 గుంటల (ఎకరం 75 సెంట్లు) భూమి ఉంది. వర్షాధార వ్యవసాయమే. భార్యా భర్తలిద్దరూ కలిసి వ్యవసాయ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటూ సంతోషంగా ఉన్న సమయంలో పెను విషాదం చోటు చేసుకుంది. మోపెడ్‌పై వెళ్తున్న కుమారస్వామిని రోడ్డు ప్రమాదం రూపంలో వచ్చిన మృత్యువు మింగేసింది. భర్త హఠాన్మరణం ఆగమ్మ ఆశలు చెదిరిపోయాయి. అయినా, పిల్లలను గుండెలకు హత్తుకొని దుఃఖాన్ని దిగమింగుకుంది. తనకు తానే ధైర్యం చెప్పుకొని మొక్కవోని ధైర్యంతో నిలబడింది. వ్యవసాయం కొనసాగిస్తూ కాయకష్టంతో పిల్లలను అన్నీ తానే అయి పోషించుకుంటున్నది. అన్నదమ్ములు లేకపోవడంతో.. వృద్ధులైన తల్లిదండ్రులను అవివాహితగా ఉండిపోయిన సోదరి పోషిస్తున్నది. దీంతో ఆగమ్మ పిల్లలతోపాటు మెట్టినింటిలోనే ఉండిపోయింది. సొంత భూమితో పాటు రెండెకరాలను కౌలుకు తీసుకొని మరీ పత్తి, కూరగాయలు, మొక్కజొన్న తదితర పంటలు శ్రద్ధగా సాగు చేస్తూ ఆదర్శంగా నిలిచింది. ఒక్క రోజు కూడా ఖాళీగా ఉండదు. తన పొలంలో ఏ పనీ లేకపోతే కూలికి వెళ్తుంది. రూపాయికి రూపాయి కూడబెట్టి ఎవరిపైనా ఆధారపడకుండా గత ఏడాది పెద్ద కుమార్తె ఆమనికి మంచి సంబంధం చూసి పెళ్లి చేసింది. రెండో బిడ్డ కావ్య ముల్కనూరు మోడల్ స్కూల్లో ఇంటర్ చదువుతోంది. చిన్న కుమార్తె శ్రావణి ఆత్మకూరు జెడ్పీ హైస్కూల్లో 9వ తరగతి చదువుతోంది. తండ్రి లేకపోయినా ఆగమ్మ శ్రద్ధగా వ్యవసాయం చేస్తూ పిల్లలను కంటికి రెప్పలా చూసుకుంటున్నది. సొంత కష్టం.. సొంత మార్కెటింగ్.. కుటుంబ పెద్దగా, తల్లిగా, రైతుగా ఆగమ్మ విజయపథంలో పయనిస్తోంది అంటే అతిశయోక్తి కాదు. ఈ విజయం వెనుక మొక్కవోని దీక్ష, కఠోర శ్రమ, క్రమశిక్షణతోపాటు చక్కని వ్యవసాయ ప్రణాళిక కూడా ఉంది. తన వంటి చిన్న, సన్నకారు మెట్ట రైతులు చాలా మంది పత్తి, మొక్కజొన్న , పసుపు వంటి పంటలతో సరిపెట్టుకుంటూ ఉంటే.. ఆగమ్మ అంతటితో ఆగలేదు. ఆదాయం కోసం పత్తి, మొక్కజొన్నతో పాటు కుటుంబ పోషణ కోసం, అనుదిన ఆదాయం కోసం కూరగాయలు, ఆకుకూరలను సాగు చేస్తూ ఉన్నంతలో సంతోషంగా, ధీమాగా జీవిస్తోంది. ఈ ఏడాది కౌలు భూమి రెండెకరాల్లో పత్తిని వర్షాధారంగా సాగు చేసింది. రూ. 70 వేలు ఖర్చు చేసి 12 క్వింటాళ్ల దిగుబడి తీసింది. పత్తిని రూ. లక్షకు అమ్మింది. ఎకరంలో మొక్కజొన్న, 30 గుంటల్లో పసుపు సాగు చేస్తోంది. పత్తి పంట అయిపోయిన తర్వాత 10 గుంటల (25 సెంట్ల) భూమిలో టమాటోలు, పాలకూర, కొత్తిమీర బావి కింద సాగు చేస్తోంది. ఎరువులు వేయటం, పురుగుమందు కొట్టడం, కలుపు తీయటం.. వంటి అన్ని పనులూ తానే చేసుకుంటుంది. టమాటోలు 15 రోజుల్లో కాపు మొదలవుతుంది. నెల రోజుల్లో చేతికొచ్చే పాలకూర, కొత్తిమీరతో నిరంతర ఆదాయం పొందుతోంది. ఆకుకూరలు, కూరగాయలను పండించడం తానే స్వయంగా ఊళ్లు, ఇళ్ల వెంట తిరిగి అమ్ముకుంటుంది. ద్విచక్రవాహనం(మోపెడ్)ను నడుపుకుంటూ వెళ్లి ఏ పూటకు ఆ పూట తాజా ఆకుకూరలు అమ్ముతుంది. కిలో కొత్తిమీర విత్తనాలు (ధనియాలు) రూ. వందకు కొనితెచ్చి విత్తుకొని రూ. రెండు నుంచి మూడు వేలు ఆదాయం పొందుతున్నానని, తాము ఇంట్లో వండుకోవడానికీ కూరగాయల కొరత లేదని సంతోషంగా చెప్పింది ఆగమ్మ. దురదృష్టవశాత్తూ భర్తలను కోల్పోయిన మహిళా రైతులే ఇంటి పెద్దలై వ్యవసాయాన్ని, కుటుంబాన్నీ సమర్థవంతంగా నడుపుతున్న ఎందరో మహిళల గుండె ధైర్యానికి చక్కని ప్రతీకగా నిలిచిన ఆగమ్మ(90142 65379)కు మహిళా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి సాగుబడి’ జేజేలు! ఇటువంటి క్రమశిక్షణ గల రైతులకు ప్రకృతి వ్యవసాయం నేర్పితే వారి జీవితాలు మరింత జీవవంతమవుతాయి!! – పోలు రాజేష్‌కుమార్, సాక్షి, ఆత్మకూరు, వరంగల్ రూరల్ జిల్లా -
రైతు రాణులకు జేజేలు!
మన దేశంలోని రైతు కుటుంబాల్లో 80–85% వరకు ఎకరం, రెండెకరాల భూమి ఉన్న చిన్న, సన్నకారు రైతు కుటుంబాలే. ఆరుగాలం రెక్కలు ముక్కలు చేసుకొని జీవనం సాగించే ఈ వ్యవసాయ కుటుంబాల్లో పురుషుల కన్నా మహిళా రైతుల శ్రమే అధికం. దీక్షగా, క్రమశిక్షణగా వ్యవసాయం చేస్తూ అరకొర వనరులతోనే చక్కని ఫలితాలు సాధిస్తూ కుటుంబాల అభ్యున్నతికి అహరహం కృషి చేస్తున్న మహిళా రైతులెందరో ఉన్నారు. ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా మనోబలంతో నిలబడి వ్యవసాయాన్నే నమ్ముకొని కుటుంబాలకు బాసటగా నిలుస్తున్న ఈ ధీర వనితలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేళ ‘సాక్షి సాగుబడి’ జేజేలు పలుకుతోంది. ‘మీ మిరప పంటలో తాలు కూడా లేదమ్మా..’ మిర్చి పంటకు తెగుళ్లు, చీడపీడలు ఆశించటం సహజం. నారు వేసిన దగ్గర్నుంచి మిర్చి కోతలు కోస్తున్నంత వరకు దాడి చేస్తుంటాయి. ఒక పురుగుమందు పనిచేయకపోతే మరొకటి వాడుతూ రసాయన మందులతో రైతులు ఒక రకంగా యుద్ధమే చేస్తారు. అటువంటిది ఎలాంటి పురుగుమందులూ వాడకుండా కేవలం కషాయాలతోనే మిర్చిని పండించాలని చూసిన మహిళా రైతును, తోటి రైతులు ఎగతాళి చేశారు. మందులు కొట్టకుండా పంట ఎట్లా తీస్తావు? అంటూ ప్రశ్నించారు. ప్రకృతి వ్యవసాయాన్ని నమ్ముకొని ఆచరించిన ఆ రైతు చేలో మిరప విరగపండింది. అంతర పంటలతోనూ ఆదాయాన్ని తీశారు. నాడు నవ్విన రైతులే ఇప్పుడు ‘తాలు కూడా లేదమ్మా మీ పంటలో...’ అంటూ ప్రశంసిస్తున్నారు. అన్ని జిల్లాల వ్యవసాయ అధికారుల నుంచి ప్రపంచ బ్యాంకు బృందం సహా ఆ మిరప చేనును సందర్శించారు. శభాష్... అంటూ అభినందించారు. మిర్చి పంట సాగులో అద్భుత విజయం సాధించిన ఆ మహిళా రైతే పరమాత్ముల కోటేశ్వరమ్మ. గుంటూరు జిల్లా పెదనందిపాడు దగ్గర్లోని కొప్పర్రు. జిల్లాకు తలమానికమైన మిర్చిని కోటేశ్వరమ్మ, భర్త వెంకటేశ్వరరావుతో కలిసి ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేస్తున్నారు. ఒక అమ్మాయి, అబ్బాయి. ఇద్దరికీ పెళ్లిళ్లయ్యాయి. ఈ నేపధ్యలలో రైతు దంపతులు పట్టుదలతో నూటికి నూరు శాతం రసాయనాలు వాడకుండా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. ఎకరంలో తొలి కోతకే 12 క్వింటాళ్లు దుక్కిన దున్ని ఘన జీవామృతం వేయడంతో ఆరంభించి, బీజామృతంతో శుద్ధిచేసిన నారును నాటిన దగ్గర్నుంచి ప్రతి దశలోనూ మిరప మొక్కలకు ద్రవ జీవామృతంతో సహా రోగ నిరోధక శక్తికి, దృఢంగా ఉండేందుకు సప్త ధాన్యాంకుర కషాయాన్ని వాడుతూ, వివిధ రకాల కషాయాలతో తెగుళ్లను నిరోధిస్తూ మిర్చిని పండించుకున్నారు. ఎకరం పొలంలో తొలి కోతకే 12 క్వింటాళ్ల మిరప పండ్ల దిగుబడిని తీశారు. చెట్టు నిండుగా కనిపిస్తున్న మిరపకాయ, మరో 13 క్వింటాళ్లు వస్తాయన్న ధీమానిస్తోంది. అందులో వేసిన రకరకాల అంతర పంటలతో మిర్చి చేతికొచ్చేలోగానే దఫాలుగా ఆదాయాన్నీ కళ్ల చూశారు. మిర్చి పంట సాగుకు పెట్టుబడులు రైతులందరికీ సమానమే అయినా, ఎరువులు, పురుగుమందులకే రసాయనిక వ్యవసాయం చేసే ఇతర రైతులందరూ ఎకరాకు రూ.75 వేలకు పైగా వ్యయం చేస్తే, ప్రకృతి వ్యవసాయాన్ని నమ్ముకున్న కోటేశ్వరమ్మకు కషాయాలు, జీవామృతాల తయారీకి రూ.4,800 మాత్రమే ఖర్చయింది. అయితే, ఆమె మిర్చిని అందరికన్నా ఎక్కువ ధరకే అమ్మారు. రసాయన రహిత పంట తీశామన్న సంతృప్తినీ పొందానని కోటేశ్వరమ్మ అన్నారు. ప్రకృతి వైపు మళ్లించిన పుల్లమజ్జిగ కొప్పర్రు గ్రామంలో మిరప, పత్తి పంటల సాగు అధికం. కోటేశ్వరమ్మ, వెంకటేశ్వరరావు దంపతులకున్న ఎకరం మెట్ట పొలానికి, మరో ఎకరం కౌలుకు తీసుకుని అవే పంటలు సాగు చేస్తుండేవారు. కొంత భూమిలో బెండకాయ, దోసకాయ వంటి కూరగాయలను పండించేవారు. కలుపు మందులు, పురుగు మందులు చల్లాల్సి వస్తుండేది. ఒక పంట తీసేసరికి రెండెకరాలకు కలిపి రూ.1.20 లక్షల వరకు వీటికే ఖర్చు చేసినట్టయ్యేది. పెట్టుబడికి, ఖర్చులకు పెద్దగా వ్యత్యాసం వుండేది కాదు. తాతలనాటి వ్యవసాయాన్ని వదులుకోలేక, అస్తుబిస్తు సంపాదనతో కొనసాగుతున్న కోటేశ్వరమ్మకు, ప్రభుత్వ ప్రకృతి వ్యవసాయ విభాగంలో పనిచేస్తుండే చిరుద్యోగి ఒకరు చెప్పిన చిట్కాతో తరుణోపాయం కనిపించింది. ఆ ఉత్సాహం ఆమెను ప్రకృతి వ్యవసాయం దిశగా నడిపించింది. నాలుగేళ్ల క్రితం చేలోని మిరపకు పండాకు తెగులు ఆశించింది. ఎప్పట్లాగే నివారణ రసాయనిక పురుగు మందుల కోసం చూస్తున్న కోటేశ్వరమ్మకు, ‘పుల్ల మజ్జిగ కొట్టి చూడండి’ అన్న సూచన ఆలోచింపజేసింది. పోయేదేముంది.. పాలు ఖర్చే కదా! అనుకున్నారు. ‘నాలుగు లీటర్ల పాలు తీసుకొచ్చి, కాచి తోడువేశాం.. 5 రోజులు మురగనిచ్చి, నీటితో కలిపి 15 ట్యాంకులు పిచికారీ చేశాం.. కంట్రోలు అయింది... ప్రకృతి వ్యవసాయంపై అలా గురి కుదిరింది’ అని చెప్పారు కోటేశ్వరమ్మ. అదే పురుగుమందులు చల్లితే రూ.1,200 వరకు ఖర్చు. పురుగుమందు చల్లటం వల్ల చేతులు, ఒళ్లు దురదలు, కళ్లు మంటలు ఉండేవన్నారు. ఆ అనుభవంతో ప్రకృతి వ్యవసాయం సత్తా ఏమిటో తెలిసింది. గత మూడేళ్లుగా రసాయన ఎరువులు/ పురుగుమందుల జోలికే వెళ్లకుండా ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అనుసరిస్తూ వస్తున్నారు. ‘మేం వేల రూపాయలు ఖర్చుపెట్టి మందులు వాడుతుంటేనే తెగుళ్లు పోవటం లేదు.. ఆకులు, ఎద్దుపేడ, ఆవు మూత్రంతోనే పోతాయా? అంటూ ఊళ్లోని రైతులు ఎకసెక్కంగా మాట్లాడారు.. ఎరువులు వేసిన చేలల్లోలా మొక్కలు గుబురుగా, కంటికి ఇంపుగా ఎదగలేదు. అది చూసి నవ్వారు. ఓపిగ్గా ప్రకృతి వ్యవసాయ పద్ధతులు పాటిస్తూ వచ్చాం. అధిక వర్షాలకు మొక్కలను కాపాడుకునేందుకు తీవ్రంగా శ్రమించాం. మా కష్టం ఫలించింది. చేను అందంగా కనిపించకున్నా, మొక్క మొక్కకు నాణ్యమైన కాయ విరగ కాసింది. మొదట్లో ఎగతాళి చేసిన వారే ఇప్పుడు ఆశ్చర్యపోతున్నారు. మీ చేలో తాలు కాయ ఒక్కటీ లేదంటూ మెచ్చుకోవటం సంతోషంగా ఉంది’’ అన్నారు కోటేశ్వరమ్మ. మిర్చిలో బంతి, జొన్న, ఉల్లి, ముల్లంగి... గత ఆగస్టు 28న ఎకరంలో మిర్చి నారుతో నాట్లు వేశారు. ఎకరాకు 12 వేల మొక్కలు. సరిహద్దు పంటగా మూడు వైపులా జొన్న, మరోవైపు కంది వేశారు. ఎర పంటగా 400 బంతి మొక్కలు పెంచారు. అంతర పంటలుగా ఒక్కోటి నాలుగు వేల మొక్కలు వచ్చేలా ముల్లంగి, ఉల్లి, కొత్తిమీర వేశారు. అనుసరించిన పద్ధతులను వివరిస్తూ, ముందుగా ఎనిమిది కిలోల బెల్లం, ఎనిమిది కిలోల శనగపిండి, నాలుగు గుప్పిళ్లు మట్టి, 40 లీటర్ల మూత్రం, 2500 కిలోల కంపోస్టు ఎరువుతో తయారుచేసిన 400 కిలోల ఘనజీవామృతాన్ని చల్లామని కోటేశ్వరమ్మ చెప్పారు. అయిదు కిలోల పేడ, అయిదు కిలోల ఆవు మూత్రం, 20 లీటర్ల నీరు, 15 గ్రాముల సున్నంతో చేసిన బీజామృతంతో నారు శుద్ధి చేసి నాటాం. అయిదు కిలోల వేపాకు, ఆవు పేడ, ఆవు మూత్రం కలిపి తయారుచేసిన 100 లీటర్ల నీమాస్త్రం పిచికారీ చేశాం. కిలో పండు మిర్చి రూ. వంద పచ్చళ్లకు అడుగుతున్నారని పండుకాయ వచ్చాక కోత మొదలుపెట్టారు. మార్కెట్లో పండుకాయ కిలో రూ.60 వుంటే కోటేశ్వరమ్మ పొలంలో పండు మిర్చి రూ.100 చొప్పున 1.60 క్వింటాళ్లు అమ్మకం చేశారు. మిగిలిన పంట కోసింది కోసినట్టుగా ఎండబెడుతున్నారు. మొత్తం మీద మరో 13 క్వింటాళ్లు వస్తాయని అంచనాతో ఉన్నారు. అంతర పంటల్లో ముందే పీకిన రూ.1000, బంతి పూలతో రూ.4,000, కొంతభాగం విక్రయించిన ఉల్లితో రూ.2,000, ముల్లంగితో మరో రూ.2,000 ఆదాయం సమకూరింది. ప్రకృతి వ్యవసాయం, అంతర పంటలు ఆదాయాన్నిస్తూ ఉంటే.. భూమిని నమ్ముకున్నందుకు నిశ్చింతగా అనిపిస్తోంది.. సమాజానికి ఆరోగ్యకర పంటలు అందిస్తున్నామన్న భావన తమకెంతో సంతృప్తినిస్తున్నదని కోటేశ్వరమ్మ సంతోషంగా చెప్పారు. కాకపోతే ప్రకృతి వ్యవసాయంలో చాకిరీ మాత్రం చేసుకోవాల్సిందేనన్నారు. భర్తతో కలిసి ప్రతి రోజూ ఆరింటికల్లా పొలంలో దిగి, సాయంత్రం ఆరు గంటల వరకూ ఉంటున్నానన్నారు. వళ్లు మంటలు.. కళ్లు మంటలు లేవు.. మూడేళ్ల నుంచి (రసాయనిక) మందుల్లేకుండా పట్టుదలగా పంటలు పండిస్తున్నాం. ఈ విషయం ఇప్పుడిప్పుడే చాలా మందికి తెలిసి వచ్చి చూసెళ్తున్నారు. ఇన్నాళ్లూ ఆ ఏముందిలే అన్న ఊహలో ఉన్నారు. ఇప్పుడు పొలంలోకి వచ్చి ఏమి వేస్తున్నారు, ఎలా పండిస్తున్నారో చూస్తున్నారు. మందుల్లేని పండు మిరప కాయలకు ఈ ఏడు చాలా గిరాకీ వచ్చింది. ఎండు మిరపకాయలకు కూడా ముందే ఆర్డర్లు వస్తున్నాయి. ఎకరం కౌలు రూ. 30–40 వేలు కావటంతో ఇతర రైతులు ప్రకృతి వ్యవసాయం చేయటానికి వెనకాడుతున్నారు. సొంత చేనే కదా అని మేం పట్టుదలతో చేస్తున్నాం. ఎకరానికి ఎరువులు, పురుగుమందులకే రూ. 60–70 వేలు ఖర్చు చేస్తున్నారు. మాకు గత ఏడాది జీవామృతానికి, కషాయాలకు 4 వేలు ఖర్చయింది. మందులు కొట్టే వాళ్లకు, నీళ్లు పోసే వాళ్లకు వళ్లు మంటలు, కళ్లు మంటలు వస్తుంటాయి. ఇప్పుడు ఆ బాధ లేదు. అయితే, కషాయాల తయారీలో వాసనలు, చాకిరీ గురించి కొందరు ఇబ్బంది పడుతున్నారు. మిషన్లు వస్తే సులభంగా ఉంటుంది. భూమి బాగు కోసం, ఆరోగ్యం కోసం ఒకరు అడుగేస్తే కదా.. పది మందీ నడిచేది.. అని మేం డీపీఎం రాజకుమారి ప్రోత్సాహంతో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాం. పంటను అమ్ముకోవటంలో అంత ఇబ్బందేమీ లేదు. – పరమాత్ముల కోటేశ్వరమ్మ(63013 51363), మహిళా రైతు, కొప్పర్రు, గుంటూరు జిల్లా కల్లెం ఈశ్వరమ్మ తనుగుల ఆగమ్మ భర్త వేంకటేశ్వరరావుతో కలిసి కళ్లంలో మిరప పండ్లను ఎండబోస్తున్న కోటేశ్వరమ్మ – బి.ఎల్.నారాయణ, సాక్షి, తెనాలి, గుంటూరు జిల్లా -
‘సాగుబడి’ రాంబాబుకు జీవన సాఫల్య పురస్కారం
సాక్షి, హైదరాబాద్: ‘సాక్షి సాగుబడి’డెస్క్ ఇన్చార్జ్, సీనియర్ న్యూస్ ఎడిటర్ పంతంగి రాంబాబుకు 2019 సంవత్సరానికి గాను ప్రతి ఏటా రైతు దినోత్సవం సందర్భంగా కర్షక సాధికార సంఘటన (కేఎస్ఎస్) అందించే మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ జీవన సాఫల్య పురస్కారం లభించింది. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో విశిష్ట సేవలందించిన తెలంగాణ, ఏపీకి చెందిన పలువురు రైతులు, పాత్రికేయులు, శాస్త్రవేత్తలకు కె.ఎస్.ఎస్ ఈ పురస్కారాలను అందిస్తోంది. పంతంగితో పాటుగా పసుపు విత్తన రైతు పిడికిటి చంద్రశేఖర ఆజాద్ (తెలంగాణ), ప్రకృతి వ్యవసాయ మహిళా రైతు అన్నే పద్మావతి (నూజివీడు), టీ న్యూస్ చేను–చెలక ఎడిటర్ విద్యాసాగర్, సైంటిస్ట్ డా.సురేంద్రరాజులకు ఈ అవార్డు లభించింది. ఈమేరకు కేఎస్ఎస్ అధ్యక్షుడు మారం కరుణాకరరెడ్డి, ప్రధాన కార్యదర్శి వెలది పురుషోత్తంరావు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 23న రాజేంద్రనగర్‌లోని ‘వాలంతరి’లో జరిగే సభలో తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఈ పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. -
ఆకుకూరగా కుసుమ సాగు!
నూనెగింజల పంటగా కుసుమను రబీలో సాగు చేస్తున్నారు. అయితే, కుసుమను ఆకుకూర పంటగా కూడా సాగు చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఏడాదంతా ఏ కాలంలోనైనా సాగుకు అనుకూలంగా ఉండటం, మంచి పోషకాలను కలిగి ఉండటం వల్ల ఆకుకూరగా కుసుమ పంట సాగుతో రైతులు మంచి ఆదాయం ఆర్జించవచ్చంటున్నారు. మన దేశంలో వందలాది ఏళ్లుగా కుసుమ ఉత్పత్తులను రంగులు, ఔషధాల తయారీలో వాడుతున్నారు. కుసుమ నూనె అత్యుత్తమమైన వంట నూనె. ఈ నూనెలో బహుళ సంతృప్త కొవ్వు ఆమ్లాలు, ఫ్లేవనాయిడ్స్ చాలా ఎక్కువ. కొన్ని రకాల కేన్సర్లు, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధుల బారి నుంచి ఇవి కాపాడతాయి. ఆకుకూరగా కుసుమ మంచి సమతులాహారం. ఆకుకూరలను సలాడ్ల తయారీలో వాడతారు. పీచు, ఖనిజాలు, మాంసకృత్తులు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. విటమిన్–ఎ, సీ, ఇనుము, కాల్షియం పాళ్లూ అధికమే. పూత దశ పూర్తయ్యేవరకు కుసుమ మొక్క అడుగు భాగంలో ఉన్న ఆకులను కూరకు ఉపయోగించవచ్చు. కుసుమ ఆకుతో చేసే టీతో పలు ప్రయోజనాలున్నాయి. ఆకలిని పెంచుతుంది. పులియబెట్టిన కుసుమ ఆకులతో చేసిన ద్రావణానికి మహిళల్లో వంధ్యత్వాన్ని, గర్భస్రావాలను నిరోధించే శక్తి ఉందని సంప్రదాయ వైద్యులు విశ్వసిస్తారు. గోంగూర, తోటకూరకు మల్లే కుసుమను కూడా రైతులతో సాగు చేయించేందుకు మహారాష్ట్ర సతారా జిల్లా పాల్తాన్లోని నింబార్కర్ వ్యవసాయ పరిశోధనా సంస్థ (ఎన్.ఏ.ఆర్.ఐ.– నారి) కృషి చేస్తోంది. కుసుమను ఏడాదంతా ఆకుకూరగా సాగు చేయవచ్చని ఈ సంస్థ చెబుతోంది. కుసుమ ప్రతికూల పరిస్థితులను తట్టుకొని పెరుగుతుంది. ఆకుకూర పంటగా సాగు చేయటం వల్ల రైతులకు మంచి ఆదాయం, వినియోగదారులకు మంచి పోషకాహారం లభిస్తాయని ఎన్.ఎ.ఆర్.ఐ. తెలిపింది. కుసుమ సాగుకు ఏ కాలమైనా అనువైనదేనని, ప్రతికూల వాతావరణ పరిస్థితులలో సైతం అధిక దిగుబడులు వస్తాయని క్షేత్రస్థాయి అధ్యయనంలో తేలింది.ఇతర ఆకుకూరలతో పోల్చితే కుసుమలో అధిక పోషక విలువలు ఉన్నట్టు ఎన్.ఎ.ఆర్.ఐ. తెలిపింది. మెంతి, బచ్చలికూర కన్నా కుసుమలోనే కొవ్వు, మాంసకృత్తులు, విటమిన్ సీ, పెనోలిక్ కాంపౌండ్స్ ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటి వరకు శీతాకాలంలో నూనెగింజల పంటగా సాగు చేస్తున్నారు. పంటను విత్తుకున్న 30–35 రోజుల దశలో సాళ్లలో ఎక్కువగా ఉన్న మొక్కలను తొలగిస్తారు. ఇలా పీకిన కుసుమ మొక్కలను ఆకుకూరగా రైతు కుటుంబాలు తినవచ్చు. మార్కెట్లో అమ్ముకోవచ్చు లేదా పశువుల మేతగానూ వాడవచ్చు. కుసుమ పంట నూర్చిన తర్వాత విత్తనాలు, పువ్వుల ద్వారా మంచి ఆదాయం లభిస్తుంది. కుసుమ సాగుతో కలిగే ప్రయోజనాల గురించి, కుసుమ ఆకుకూర వాడకం ద్వారా లభించే ఆరోగ్యపరమైన ప్రయోజనాల గురించి విస్తృతంగా ప్రచారం చేయటం అవసరం. 30 రోజుల్లోపలే ఆకుకూరగా వాడాలి కుసుమను సాగు చేసే రైతులు సాళ్లలో ఒత్తుగా ఉన్న మొక్కలను పీకి ఆకుకూరగా వాడుకోవటమే తప్పించి ఆకుకూర పంటగా మాత్రం సాగులో లేదు. ఇప్పుడు సాగులో ఉన్న రకాల్లో 30 రోజులు దాటితే ముళ్లు వస్తాయి. నారి–6 రకం కుసుమ మొక్కలకు ముళ్లు రావు. కానీ 30 రోజులు దాటాక ఆకులు గిడసబారతాయి. కాబట్టి ఆకుకూరగా 30 రోజుల్లోగానే వాడుకోవాలి. కుసుమ విత్తనాలు కావలసిన రైతులకు మేం సరఫరా చేస్తాం. కిలో విత్తనాల ధర రూ. 90. – డాక్టర్ సి. సుధాకర్ ( 98496 26312), సీనియర్ శాస్త్రవేత్త, అఖిల భారత సమన్వయ కుసుమ పరిశోధన కార్యక్రమం, వ్యవసాయ పరిశోధనా స్థానం, తాండూరు, వికారాబాద్ జిల్లా – దండేల కృష్ణ, సాగుబడి డెస్క్ -
సాగుబడి 6th Feb 2017
-
సాగుబడి 23rd January 2107
-
సాగుబడి 21st January 2107
-
సాగుబడి 16th January 2017
-
సాగుబడి 9th January 2017
-
సాగుబడి 6th January 2017
-
సాగుబడి 31th December 2016
-
సాగుబడి 30th December 2016
-
సాగుబడి 3rd November 2016
-
సాగుబడి 2nd November 2016
-
సాగుబడి 1st November 2016
-
సాగుబడి 31st october 2016
-
సాగుబడి 28th October 2016
-
సాగుబడి 27th October 2016
-
సాగుబడి 26th Oct 2016
-
సాగుబడి 25th October 2016
-
సాగుబడి 24th Oct 2016
-
స్టార్ రైతు 1st Oct 2016
-
స్టార్ రైతు 24th Sept 2016
-
సాగుబడి 23rd Sept 2016
-
సాగుబడి 22nd Sept 2016
-
సాగుబడి 21st Sept 2016
-
సాగుబడి 19th Sept 2016
-
స్టార్ రైతు 17th Sept 2016
-
సాగుబడి 16th Sept 2016
-
సాగుబడి 14th Sept 2016
-
సాగుబడి 13th Sept 2016
-
సాగుబడి 12th Sept 2016
-
సాగుబడి 8th Sept 2016
-
సాగుబడి 7th Sept 2016
-
సాగుబడి 6th Sept 2016
-
సాగుబడి 5th September 2016
-
సాగుబడి 3rd Sep 2016
-
సాగుబడి 1st Sep 2016
-
సాగుబడి 31st Aug 2016
-
సాగుబడి 30th Aug 2016
-
సాగుబడి 27th Aug 2016
-
సాగుబడి 26th Aug 2016
-
వెయ్యి మందికి ఉచితంగా చియా విత్తనాలు
‘సాక్షి సాగుబడి’ కథనంతో రైతుల నుంచి అనూహ్య స్పందన హైదరాబాద్ సీఎఫ్టీఆర్ఐలో విత్తనాల పంపిణీ ప్రారంభం సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన, అధిక పోషక విలువలు కలిగిన చియా పంట విత్తనాలను ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని వెయ్యిమంది రైతులకు అందించనున్నట్లు కేంద్రీయ ఆహార సాంకేతికత పరిశోధనా సంస్థ (సీఎఫ్టీఆర్ఐ– మైసూర్) శాస్త్రవేత్త డాక్టర్ ఎల్.ప్రసన్నాంజనేయరెడ్డి తెలిపారు. సాక్షి ‘సాగుబడి’ పేజీలో ఈ నెల 16న ‘చక్కని లాభాల పంట చియా’ శీర్షికతో ప్రచురితమైన కథనానికి తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక రైతుల నుంచి కూడా అనూహ్య స్పందన లభించిందని అన్నారు. హైదరాబాద్ హబ్సిగూడలోని సీఎఫ్టీఆర్ఐ కార్యాలయంలో గురువారం రైతులకు చియా విత్తనాల పంపిణీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ ఒక్కో రైతుకు అరెకరానికి సరిపోయే 50 గ్రాముల చియా విత్తనాలను ఉచితంగా ఇస్తున్నామని, రైతులు సంఘాలుగా ఏర్పడితే మార్కెటింగ్‌కు తోడ్పడతామని చెప్పారు. నూర్పిడి చేసిన చియా గింజలను నేరుగా ఆహారంగా వాడొచ్చని, కినోవా మాదిరిగా పొట్టు తీయాల్సిన పనిలేదని ప్రసన్నాంజనేయరెడ్డి అన్నారు. ఒమోగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, నూనె శాతం విషయంలో చాలా మెరుగైనదని వివరించారు. క్వింటాలుకు రూ.15 వేల నుంచి రూ. 20 వేల వరకు ఆదాయాన్నిస్తుందని చెప్పారు. ఈ పంటకు అడవి జంతువులు, పక్షులు, చీడపీడల బెడద లేదని పేర్కొన్నారు. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో చియాకు గిరాకీ ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీఎఫ్టీఆర్ రిసోర్స్ సెంటర్ అధిపతి డాక్టర్ ఆర్.జి.మథ్, సీనియర్ ప్రిన్సిపాల్ సైంటిస్ట్ డాక్టర్ టి.జ్యోతిర్మయి పాల్గొన్నారు. చియా (తెలుపు) విత్తనాలు కావాల్సిన రైతులు 040– 27151157 నంబర్లో తమను సంప్రదించవచ్చని సూచించారు. -
సాగుబడి 25th Aug 2016
-
సాగుబడి 23rd Aig 2016
-
సాగుబడి 20th Aug 2016
-
సాగుబడి 15th Aug 2016
-
సాగుబడి 13th Aug 2016
-
సాగుబడి 4th Aug 2016
-
సాగుబడి 30th July 2016
-
సాగుబడి 29th July 2016
-
సాగుబడి 28th July 2016
-
సాగుబడి 27th July 2016
-
సాగుబడి 26th July 2016
-
సాగుబడి 25th July 2016
-
సాగుబడి 22nd July 2016
-
సాగుబడి 9th July 2016
-
సాగుబడి 15th january 2016
-
సాగుబడి 13th january 2016
-
సాగుబడి 1st january 2016 2015
-
సాగుబడి 31st December 2015
-
సాగుబడి 26th December 2015
-
సాగుబడి 19th December 2015
-
సాగుబడి 17th December 2015
-
సాగుబడి 28th November 2015
-
సాగుబడి 23rd November 2015
-
సాగుబడి 19th November 2015
-
సాగుబడి 17th November 2015
-
సాగుబడి 16th November 2015
-
సాగుబడి 14th November 2015
-
సాగుబడి 9th November 2015
-
సాగుబడి 7th November 2015
-
సాగుబడి 6th November 2015
-
సాగుబడి 5th November 2015
-
సాగుబడి 2nd November 2015