వెయ్యి మందికి ఉచితంగా చియా విత్తనాలు
‘సాక్షి సాగుబడి’ కథనంతో రైతుల నుంచి అనూహ్య స్పందన
హైదరాబాద్ సీఎఫ్‌టీఆర్‌ఐలో విత్తనాల పంపిణీ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన, అధిక పోషక విలువలు కలిగిన చియా పంట విత్తనాలను ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని వెయ్యిమంది రైతులకు అందించనున్నట్లు కేంద్రీయ ఆహార సాంకేతికత పరిశోధనా సంస్థ (సీఎఫ్‌టీఆర్‌ఐ– మైసూర్) శాస్త్రవేత్త డాక్టర్ ఎల్.ప్రసన్నాంజనేయరెడ్డి తెలిపారు. సాక్షి ‘సాగుబడి’ పేజీలో ఈ నెల 16న ‘చక్కని లాభాల పంట చియా’ శీర్షికతో ప్రచురితమైన కథనానికి తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక రైతుల నుంచి కూడా అనూహ్య స్పందన లభించిందని అన్నారు. హైదరాబాద్ హబ్సిగూడలోని సీఎఫ్‌టీఆర్‌ఐ కార్యాలయంలో గురువారం రైతులకు చియా విత్తనాల పంపిణీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ ఒక్కో రైతుకు అరెకరానికి సరిపోయే 50 గ్రాముల చియా విత్తనాలను ఉచితంగా ఇస్తున్నామని, రైతులు సంఘాలుగా ఏర్పడితే మార్కెటింగ్‌కు తోడ్పడతామని చెప్పారు.
నూర్పిడి చేసిన చియా గింజలను నేరుగా ఆహారంగా వాడొచ్చని, కినోవా మాదిరిగా పొట్టు తీయాల్సిన పనిలేదని ప్రసన్నాంజనేయరెడ్డి అన్నారు. ఒమోగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, నూనె శాతం విషయంలో చాలా మెరుగైనదని వివరించారు. క్వింటాలుకు రూ.15 వేల నుంచి రూ. 20 వేల వరకు ఆదాయాన్నిస్తుందని చెప్పారు. ఈ పంటకు అడవి జంతువులు, పక్షులు, చీడపీడల బెడద లేదని పేర్కొన్నారు. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో చియాకు గిరాకీ ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీఎఫ్‌టీఆర్ రిసోర్స్ సెంటర్ అధిపతి డాక్టర్ ఆర్.జి.మథ్, సీనియర్ ప్రిన్సిపాల్ సైంటిస్ట్ డాక్టర్ టి.జ్యోతిర్మయి పాల్గొన్నారు. చియా (తెలుపు) విత్తనాలు కావాల్సిన రైతులు 040– 27151157 నంబర్‌లో తమను సంప్రదించవచ్చని సూచించారు.