Chia seeds
-
శీతాకాలంలో ఈ సూపర్ ఫుడ్‌తో అనేక సమస్యలకు చెక్
చలి కాలంలో శ్వాసకోశ వ్యాధులు, గుండె జబ్బులు ఎక్కువగా ప్రబలే అవకాశం ఉంది. అందుకే ఈ సీజన్‌కు తగినట్టుగా మన ఆహార అలవాట్లు మార్చుకోవాలి. చలికాలంలో బాడీని వేడిగా ఉంచుకోవడంతోపాటు, కొవ్వులేని ఆహార పదార్థాలను తీసుకోవాలి. వివిధ ఆరోగ్య ప్రయోజనాలను అందించే చియా గింజలను వింటర్ సూపర్ ఫుడ్‌గా చెబుతారు ఆహార నిపుణులు. వీటిల్లో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, ముఖ్యంగా ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ (ALA)లో పుష్కలంగా లభిస్తాయంటున్నారు నిపుణులు. ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు గుండె, మెదడు పనితీరును మెరుగుపర్చడంలో కీలక పాత్ర పోషిస్తాయి.చియా సీడ్స్‌లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్, ప్రొటీన్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు , మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. వీటిని పలు రకాలుగా మన ఆహారంలో చేర్చుకోవచ్చు. ముఖ్యంగా చియా వాటర్, స్మూతీస్, యోగర్ట్స్, లలాడ్స్, పుడ్డింగ్ రూపంలో తీసుకోవచ్చు. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ఆరోగ్యకరమైన కొవ్వులు గుండె ఆరోగ్యానికి, మంటను తగ్గించడానికి, మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి.చియా గింజల్లో ఎక్కువగా లభించే డైటరీ ఫైబర్ జీర్ణ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. మంచి శక్తి నిస్తుంది.యాంటీఆక్సిడెంట్లతో నిండిన చియా విత్తనాలు పర్యావరణ కారకాలు, కాలానుగుణ హెచ్చుతగ్గుల వల్ల కలిగే సమస్యల్ని ఎదుర్కోవడంలో సహాయపడతాయి, రోగనిరోధక వ్యవస్థను బలపరుస్తాయి. జలుబు, దగ్గు, ఫ్లూ వంటి సమస్యలనుంచి ఉపశమనానికి తోడ్పడతాయి.అలాగే చలికాలంలో నీళ్లు ఎక్కువగా తాగుతాం కాబట్టి చియా గింజల వాటర్ తీసుకోవడం మంచిది. చియా విత్తనాలు హైడ్రోఫిలిక్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఫలితంగా శీతాకాలంలో శరీరంలో తేమను నిలుపుకోవడంలో సహాయపడతాయి. చియా విత్తనాలు చర్మం తేమను కోల్పోకుండా కాపాడుతాయి. చర్మ సమస్యలను దూరం చేస్తాయి.హెర్బల్ టీ లేదా హాట్ చాక్లెట్ వంటి వేడి పానీయాలకు చియా సీడ్స్ యాడ్ చేసుకోవచ్చు.ఒక గ్లాస్ నీటిలో, కొద్దిగా చియా గింజలు వేసి, రాత్రంతా నానబెట్టాలి. ఆ నీటిని ఉదయం పరగడుపునే తాగితే, రోజంతా హైడ్రేటెడ్‌గా ఉంటుంది. పీచు పదార్థం పుష్కలంగా అందుతుంది. తద్వారా జీర్ణక్రియ ఆరోగ్యం మెరుగుపడుతుంది. మలబద్ధకం నుంచీ ఉపశమనం లభిస్తుంది.చియా గింజల్లో యాంటి ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ నుంచి శరీరాన్ని రక్షించడంలో సాయపడతాయి. ఇందులోని యాంటి ఇన్ఫ్లమేటరీ గుణాలు కేన్సర్ లక్షణాలను తగ్గిస్తాయి. చియా పుడ్డింగ్: పాలలో (బాదం లేదా కొబ్బరి పాలతో కూడా) చియా గింజలను నానబెట్టి రాత్రంతా రిఫ్రిజిరేటర్లో ఉంచి, నచ్చిన మరికొన్ని పండ్ల ముక్కలను కలుపుకొని చియా సీడ్ పుడ్డింగ్‌ను చేసుకోవచ్చు. సౌందర్య పోషణలోనూ, జుట్టు సంరక్షణలో కూడా చియా గింజలు ప్రభావవంతంగా పనిచేస్తాయి. -
అధికబరువు : చియా సీడ్స్, లెమన్ వాటర్ మ్యాజిక్ తెలుసా?
బరువు తగ్గే ఆలోచనలో ఉన్నారా? యోగా, ఇతర వ్యాయామంతోపాటు, ఈజీగా బరువు తగ్గడానికి కొన్ని ఆహార జాగ్రత్తలు, చిట్కాలతో సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బరువు తగ్గొచ్చు. వాటిల్లో ముఖ్యమైన ఒక చిట్కా గురించి తెలుసుకుందాం రండి..! అధిక బరువును తగ్గించడంలో చియా సీడ్స్ ఎంతో కీలక పాత్ర పోషిస్తాయి. వీటిని నీళ్లలో నాన బెట్టి తినడం వల్ల వీటిలో అధిక మోతాదులో ఉండే ఫైబర్, రిచ్ ప్రోటీన్ శరీరానికి బలాన్నిస్తాయి. అంతేకాదు పొట్ట నిండిన ఫీలింగూ కలుగుతుంది. దీనికి నిమ్మరసం కలిపి మరింత ఉపయోగంగా ఉంటుంది. బరువుని నియంత్రణలోఉంచడంతోపాటు శరీరంలోని మలినాల్ని బైటికి పంపడంలో నిమ్మరసం ముఖ్యమైన హోం రెమెడీ. విటమిన్ సీ సిట్రిక్ యాసిడ్, కాల్షియం , యాంటీ ఆక్సిడెంట్లతో సహా కొన్ని పోషకాల పవర్‌హౌస్ నిమ్మకాయ. జర్నల్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ అండ్ బయోమెడికల్ అనాలిసిస్లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, నిమ్మ కాయల్లోని యాంటీవైరల్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని నివారించేలా రోగనిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తాయి. చియా విత్తనాలలో ఫైబర్ ఉంటుంది ఫైబర్, విటమిన్ బీ కాల్షియం, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రోటీన్ , మెగ్నీషియం పుష్కలంగా ఉన్నాయి. ఈ రెండూ కలిపి తాగం వల్ల వెయిట్ లాస్ జర్నీ మరింత సులభం అవుతుంది. ఎలా తయారు చేసుకోవాలి ముందుగా ఒక గిన్నెలో ఒక టీస్పూన్ చియా సీడ్స్ నానబెట్టాలి. చియా సీడ్స్ చక్కగా ఉబ్బుతాయి.ఇందులో కొద్దిగా నిమ్మకాయ రసం, తేనె వేసి బాగా కలపాలి. కావాలంటే రుచికి పుదీనా ఆకులు కూడా వేసుకోవచ్చు. ఈ వాటర్‌ను 20 30 నిమిషాల తర్వాత మరోసారి హాయిగా తాగేయడమే. భారీ భోజనం తర్వాత లేదా ఉదయాన్నే కూడా త్రాగవచ్చు. సులభంగా జీర్ణం కావడానికి , వ్యర్థాలను తొలగించేందుకు దీన్ని మించిన డ్రింక్ లేదు. -
వెయిట్ లాస్ జర్నీలో.. ఈ డ్రైఫ్రూట్స్ పని అద్భుతం!
బరువు తగ్గడం అనే ప్రక్రియలో జీవనశైలి మార్పులు, ఆహార అలవాట్లు కీలక పాత్ర పోషిస్తాయి. అయితే చాలామంది వెయిట్‌లాస్ కోసం నట్స్, డ్రై ఫ్రూట్స్ వంటివి డైట్లో చేర్చుకుంటారు. కొన్ని డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల పోషకాలు అందడంతోపాటు బరువు తగ్గే పనిని వేగవంతం చేస్తాయి. అవేంటో ఒకసారి చూద్దాం! తక్కువ క్యాలరీలు.. ఎక్కువ పోషకాల కోసం డ్రై ఫ్రూట్స్ బెస్ట్ ఆప్షన్ వీటిలో అన్నిరకాల విటమిన్లు, మినరల్స్ , ఫైబర్, ఇతర సూక్ష్మపోషకాలుంటాయి. క్రమం తప్పకుండా నట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్‌ను తినడం ద్వారా ఈజీగా బరువు తగ్గుతారు. అలాగే ఎముకల ఆరోగ్యం, జ్ఞాపకశక్తి, జుట్టు, చర్మం ఆరోగ్యంతోపాటు, కేన్సర్ నివారణకు కూడా ఉపయోగపడతాయి.క్యాన్సర్ నివారణకు కూడా ఉపయోగపడతాయి. మెదడును పనితీరును మెరుగుపరుస్తాయి. బాదం: ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. రోజూ ఓ పది బాదం పప్పులను ఆరు గంటల సేపు నానబెట్టిన తరువాత తీసుకుంటే శరీరానికి కావాల్సిన హెల్దీ ఫ్యాట్స్ లభిస్తాయి. ఎండు ద్రాక్ష: ఇది తక్షణ శక్తినివ్వడంతో పాటు ఆకలి తగ్గుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. మెదడు ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుంది. అంజీర్: ఎండిన అంజీరలో క్యాలరీలు తక్కువ, ఫైబర్ ఎక్కువ. ఇది డైజెషన్‌ను ఇంప్రూవ్ చేస్తుంది. గుండె జబ్బులకు, క్యాన్సర్‌కు, వెయిట్ లాస్‌కు ఇది బాగా పనిచేస్తుంది.ముఖ్యంగా ఆడవారికి చాలామంచిది. ఖర్జూరం(మితంగా): వీటినే డేట్స్ అంటారు. వీటి ద్వారా తక్షణ శక్తి వస్తుంది. అన్ని రకాల మినరల్స్ ఇందులో లభిస్తాయి. ఎండు ఖర్జూరంతో రక్తపోటు తగ్గుతుంది. అంతేకాదు, మలబద్దకానికి మంచి మందు. వీటిని నానబెట్టి తింటే ఇంకా మంచిది. ఆప్రికాట్లు కూడా బరువును తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఆకలిని నియంత్రించి అతిగా తినడానికి చెక్ చెబుతాయి. చియాసీడ్స్: వీటినీ నానబెట్టి తినాలి. ఇవి నీళ్లో వేయగానే చక్కగా ఉబ్బి, ట్రాన్సపరెంట్గా మారిపోతాయి. ఇవి జీర్ణక్రియకు సాయపడతాయి. బరువు తగ్గించే విషయంలో ఇవి అద్భుతంగా పనిచేస్తాయి. ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు, మినరల్స్ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలం. గుండె జబ్బులు, మధుమేహం ప్రమాదాన్ని తగ్గిస్తాయి. సీవీడ్ స్నాక్స్: తక్కువ కేలరీలు ,పోషకాలు అధికంగా ఉంటాయి, సీవీడ్ స్నాక్స్ అవసరమైన ఖనిజాలను అందించడంతోపాటు, బరువు నిర్వహణకు బాగా హెల్ప్ చేస్తాయి. జీడిపప్పు (మితంగా): జీడిపప్పులో ప్రొటీన్స్ ఎక్కువ. మినరల్స్, విటమిన్స్‌తో నిండిన జీడిపప్పు ఇమ్యూనిటీని పెంచుతుంది. బీపీని తగ్గిస్తుంది. ఇందులో హెల్దీ ఫ్యాట్స్ కూడా ఉంటాయి. అందుకే వెయిట్ లాస్ కోసం ఇది కూడా మంచి ఆప్షన్. నోట్: ఏదైనా మితంగా తినడం ఉత్తమం. అందులోనూ షుగర్,బీపీ ఇతర జబ్బులు ఉన్న వాళ్లు వెయిట్ తగ్గాలి అనుకున్నపుడు నిపుణుల సలహా మేరకు కేలరీలు, పోషకాలను అంచనా వేసుకుని మన డైట్లో చేర్చుకుంటే ఫలితం అద్బుతంగా ఉంటుంది. -
ఎముకల నొప్పులా? అవిశ, సబ్జా, గుమ్మడి గింజల పొడి రోజూ స్పూన్ తీసుకుంటే!
బ్యాక్ పెయిన్, లోయర్ బ్యాక్ పెయిన్, భుజాలు, కీళ్ల నొప్పులు... ఇలా అనేక రకాలుగా ఎముకల బలహీనత వల్ల శరీరంలో నొప్పులు బాధిస్తుంటాయి. కాల్షియం లోపం ఇందుకు ప్రధాన కారణం. ఎముకల నొప్పులు తగ్గాలంటే మంచి ఉపాయం ఒకటుంది. మూడురకాల గింజల పొడుల మిశ్రమం ఎముకల పటిష్టతకు తోడ్పడి నొప్పులు శాశ్వతంగా దూరం అవుతాయి. ఈ మూడురకాల గింజలు తేలిగ్గా మార్కెట్లో దొరికేవే. ఒకసారి ప్రయత్నించి చూడండి. అవిశె గింజలు, సబ్జాగింజలు, గుమ్మడి గింజలు.. ఈ మూడు రకాల గింజల వినియోగం వల్ల చాలా ప్రయోజనం కలుగుతుంది. అవిశ గింజలు (ఫ్లాక్స్ సీడ్స్) ఫ్లాక్స్ సీడ్స్ ఒమెగా 3 పోషకాల గని. కాల్షియం, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఒమెగా 3 శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో బాగా పనిచేస్తుంది. అలాగే వీటిల్లో ఉంటే కాల్షియం ఎముకలను పటిష్టం చేస్తుంది. దీనిలో పుష్కలంగా ఉండే డైటరీ ఫైబర్ అధిక ఆకలిని తగ్గించి శరీర బరువును అదుపులో ఉంచుతుంది. సబ్జా గింజలు (చియా సీడ్స్) సబ్జా గింజలు లేదా చియా సీడ్స్‌లో ప్రొటీన్, ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. కాల్షియం, మెగ్నీషియం ఎముకలు పటిష్టంగా ఉండేలా తోడ్పాటు అందిస్తాయి. ఇందులో కూడా ఒమెగా 3 ఉంటుంది. అలాగే చియా సీడ్స్ యాంటీ ఆక్సిడంట్స్‌గా పనిచేస్తాయి. గుమ్మడి గింజలు (పంప్కిన్ సీడ్స్) ఇందులో ప్రొటీన్, ఫైబర్, ఒమెగా 3, మెగ్నీషియం, జింక్ పోషకాలు ఉంటాయి. బాగా శక్తినివ్వడంతో పాటు మీ శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. ఎలా తయారు చేయాలి? అవిశ గింజలు, చియా సీడ్స్, గుమ్మడి గింజలను సమపాళ్లలో తీసుకుని వేర్వేరుగా వేయించుకోవాలి ఉదాహరణకు ఒకరకం గింజలను 100 గ్రాములు తీసుకుంటే మిగిలిన వాటిని కూడా వంద వంద గ్రాములే తీసుకోవాలి. దోరగా వేగిన తరువాత చల్లార్చి మిక్సీలో వేర్వేరుగా పొడి చేసుకోవాలి. మిక్సీ వేయడం పూర్తయ్యాక మూడు పొడులను కలిపేసుకుని ఒక డబ్బాలో పెట్టుకోవాలి. రోజూ ఈ మిశ్రమం నుంచి టీ స్పూన్ పొడిని మజ్జిగలో కలుపుకొని తాగాలి లేదా అన్నంలోనైనా కలుపుకొని తినొచ్చు. ఇలా కొద్దిరోజులు రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే మీ ఎముకల నొప్పులు, నడుము నొప్పి మాయం అవడమే కాకుండా.. మళ్లీ నొప్పులు రావు. చదవండి: Amarnath Vasireddy: కూర్చోవడం అంటే మరణాన్ని ఆహ్వానించడమే! అన్నం ఎక్కువ తిన్నారో! -
వెయ్యి మందికి ఉచితంగా చియా విత్తనాలు
‘సాక్షి సాగుబడి’ కథనంతో రైతుల నుంచి అనూహ్య స్పందన హైదరాబాద్ సీఎఫ్టీఆర్ఐలో విత్తనాల పంపిణీ ప్రారంభం సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన, అధిక పోషక విలువలు కలిగిన చియా పంట విత్తనాలను ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని వెయ్యిమంది రైతులకు అందించనున్నట్లు కేంద్రీయ ఆహార సాంకేతికత పరిశోధనా సంస్థ (సీఎఫ్టీఆర్ఐ– మైసూర్) శాస్త్రవేత్త డాక్టర్ ఎల్.ప్రసన్నాంజనేయరెడ్డి తెలిపారు. సాక్షి ‘సాగుబడి’ పేజీలో ఈ నెల 16న ‘చక్కని లాభాల పంట చియా’ శీర్షికతో ప్రచురితమైన కథనానికి తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక రైతుల నుంచి కూడా అనూహ్య స్పందన లభించిందని అన్నారు. హైదరాబాద్ హబ్సిగూడలోని సీఎఫ్టీఆర్ఐ కార్యాలయంలో గురువారం రైతులకు చియా విత్తనాల పంపిణీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ ఒక్కో రైతుకు అరెకరానికి సరిపోయే 50 గ్రాముల చియా విత్తనాలను ఉచితంగా ఇస్తున్నామని, రైతులు సంఘాలుగా ఏర్పడితే మార్కెటింగ్‌కు తోడ్పడతామని చెప్పారు. నూర్పిడి చేసిన చియా గింజలను నేరుగా ఆహారంగా వాడొచ్చని, కినోవా మాదిరిగా పొట్టు తీయాల్సిన పనిలేదని ప్రసన్నాంజనేయరెడ్డి అన్నారు. ఒమోగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, నూనె శాతం విషయంలో చాలా మెరుగైనదని వివరించారు. క్వింటాలుకు రూ.15 వేల నుంచి రూ. 20 వేల వరకు ఆదాయాన్నిస్తుందని చెప్పారు. ఈ పంటకు అడవి జంతువులు, పక్షులు, చీడపీడల బెడద లేదని పేర్కొన్నారు. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో చియాకు గిరాకీ ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో సీఎఫ్టీఆర్ రిసోర్స్ సెంటర్ అధిపతి డాక్టర్ ఆర్.జి.మథ్, సీనియర్ ప్రిన్సిపాల్ సైంటిస్ట్ డాక్టర్ టి.జ్యోతిర్మయి పాల్గొన్నారు. చియా (తెలుపు) విత్తనాలు కావాల్సిన రైతులు 040– 27151157 నంబర్లో తమను సంప్రదించవచ్చని సూచించారు.