తెల్లబియ్యం తిన్నా.. షుగర్‌ పెరగదు! | Experiments completed International Rice Research Institute in Philippines | Sakshi
Sakshi News home page

తెల్లబియ్యం తిన్నా.. షుగర్‌ పెరగదు!

Feb 21 2025 6:17 AM | Updated on Feb 21 2025 9:47 AM

Experiments completed International Rice Research Institute in Philippines

ఈ ఏడాది ఖరీఫ్‌కు లో గ్లైసైమిక్‌ ఇండెక్స్‌తో కూడిన ‘ఐఆర్‌ఆర్‌ఐ 147’ సిద్ధం 

ఇంకో ఏడాదిలో అత్యల్ప గ్లైసైమిక్‌తో హై ప్రొటీన్‌ను అందించే మరో వంగడం రెడీ 

ఫిలిప్పీన్స్‌లోని అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థలో పూర్తి కావొచ్చిన ప్రయోగాలు 

‘సాక్షి సాగుబడి’తో ముఖాముఖిలో ‘ఇరి’ ప్రధాన శాస్త్రవేత్త డా.నెసె శ్రీనివాసులు

సాక్షి, సాగుబడి డెస్క్‌:  ప్రపంచవ్యాప్తంగా 54 కోట్ల మంది షుగర్‌ వ్యాధి (మధుమేహం) బాధితులుంటే.. అందులో 10.1 కోట్ల మంది భారతీయులే (2030 నాటికి ఈ సంఖ్య 15 కోట్లకు చేరనుంది). త్వరలోనే ఈ జాబితాలో చేరే వారు జనాభాలో మరో 15% ఉంటారు. గ్లైసైమిక్‌ ఇండెక్స్‌ (జీఐ) ఎక్కువగా ఉండే సాంబ మసూరి (జీఐ 72) వంటి పాలిష్‌ చేసిన తెల్ల బియ్యం తినటం మధుమేహానికి ప్రధా­న కారణాల్లో మొదటిదని ఫిలిప్పీన్స్‌లోని అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ (ఇరి) గుర్తించింది. 

ఏదైనా ఆహార పదార్ధాన్ని తిన్న తర్వాత అది ఎంత త్వరగా గ్లూకోజ్‌గా మారి రక్తంలో కలుస్తున్నదో సూచించేదే  ‘గ్లైసైమిక్‌ ఇండెక్స్‌’. ఇది ఎంత ఎక్కువగా ఉంటే అంత హానికరమన్నమాట. హరిత విప్ల­వా­నికి ముందు ఐఆర్‌8 వంటి అధిక దిగుబడినిచ్చే ‘మిరకిల్‌ రైస్‌’ వంగడాన్ని ఇచ్చి మన దేశ ఆకలి తీర్చిన ‘ఇరి’.. ఇప్పుడు షుగర్‌ పెంచని, ప్రొటీ­న్‌ లోపాన్ని ఎదుర్కొనే మరో రెండు అద్భుత వంగడాలను అందుబాటులోకి తెస్తోంది. లో గ్లైసైమిక్‌ ఇండెక్స్‌ (55%) కలిగిన ‘ఐఆర్‌ఆర్‌ఐ147’ ఈ ఏడాది ఖరీఫ్‌లోనే మన దేశంలో అందుబాటులోకి రానుంది. అలాగే అల్ట్రా  లో     మిగతా 2వ పేజీలో u

గ్లైసైమిక్‌ (45%) + హై ప్రొటీన్‌ (16%)ను అందించే మరో అద్భుత వంగడం ఇంకో ఏడాదిలో అందుబాటులోకి రానుందని  ‘ఇరి’ ప్రధాన శాస్త్రవేత్త, కంజ్యూమర్‌–డ్రివెన్‌ గ్రెయిన్‌ క్వాలిటీ అండ్‌ న్యూట్రిషన్‌ యూనిట్‌ హెడ్‌ డా.నెసె శ్రీనివాసులు తెలిపారు. ఈ రెండో వంగడానికి డాక్టర్‌ శ్రీనివాసులు స్వయంగా రూపకల్పన చేశారు. భారత్‌ పర్యటనలో భాగంగా ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిన ఆయన ‘సాక్షి సాగుబడి’తో ముచ్చటించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. 


తక్కువ జీఐ.. ‘ఐఆర్‌ఆర్‌ఐ147’  
‘ఐఆర్‌ఆర్‌ఐ 147’ రకం తెల్లగా పాలిష్‌ చేసిన బియ్యంలో గ్‌లెసైమిక్‌ ఇండెక్స్‌ (55%) తక్కువగా ఉంటుంది. 22.3 పీపీఎం జింక్‌ ఉంటుంది. ఉప్పదనాన్ని, తెగుళ్లను తట్టుకుంటుంది. భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసీఏఆర్‌)కి రెండేళ్ల క్రితం ‘ఇరి’ ఈ వంగడాన్ని అందించింది. ఒడిశా రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ఐసీఏఆర్‌ ఈ వంగడాన్ని ప్రయోగాత్మకంగా క్షేత్రస్థాయిలో సాగు చేసింది. 7కు గాను 4 జోన్లలో మంచి ఫలితాలు వచ్చాయి. 

హెక్టారుకు 5– 9.5 టన్నుల దిగుబడి వచ్చింది. ప్రస్తుతం ‘సీడ్‌ వితవుట్‌ బార్డర్స్‌–ఎల్లలు లేని విత్తనాలు’ కార్యక్రమంలో భాగంగా ఫాస్ట్‌ ట్రాక్‌లో విడుదల చేసే ప్రయత్నం జరుగుతోంది. ఇది ముతక రకం కావటంతో ఉప్మా రవ్వ, అటుకులు, తదితర అల్పాహార ఉత్పత్తులుగా ప్రాసెస్‌ చేసి విక్రయించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌ నాటికి మన దేశంలోని రైతులకు ఐసీఏఆర్‌ ద్వారా  ఈ న్యూక్లియస్‌ సీడ్‌ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. 

అత్యల్ప జీఐ, రెట్టింపు ప్రొటీన్‌! 
షుగర్‌ రోగులు కూడా తినదగిన అతి తక్కువ గ్‌లెసైమిక్‌ ఇండెక్స్‌తో పాటు అధిక ప్రొటీన్‌ను కలిగి ఉండే అద్భుత వరి వంగడాన్ని ‘ఇరి’ భారతీయులకు అందిస్తోంది. దీనికి ఇంకా పేరు పెట్టలేదు. అత్యంత ప్రజాదరణ పొందిన సాంబ మసూరి మాదిరిగానే ఇది సన్న రకం, అధిక దిగుబడినిచ్చేది కూడా. సాధారణ సాంబ మసూరి జీఐ 72% కాగా, ప్రొటీన్‌ 8%, కుక్‌డ్‌ రెసిస్టెంట్‌ స్టార్చ్‌ 0.3% మాత్రమే. సాంబ మసూరితో కలిపి రూపొందిస్తున్న ఈ సరికొత్త రకం జీఐ కేవలం 45% మాత్రమే. ప్రొటీన్‌ మాత్రం రెట్టింపు. అంటే.. 16%. కుక్‌డ్‌ రెసిస్టెంట్‌ స్టార్చ్‌ కూడా 3.8% ఉంటుంది. 

అందువల్ల తిన్న తర్వాత 125 నిమిషాల వరకు నెమ్మదిగా జీర్ణమవుతూ గ్లూకోజ్‌ను తగుమాత్రంగా విడుదల చేస్తూ ఉంటుంది. షుగర్‌ వ్యాధిగ్రస్తులు, ప్రీ డయాబెటిక్‌ స్థితిలో ఉన్న వారు కూడా ఈ రకం తెల్ల బియ్యాన్ని ఇబ్బంది లేకుండా తినవచ్చు. వచ్చే ఏడాది దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఈ వంగడాన్ని ప్రయోగాత్మకంగా ఐసీఏఆర్‌ ఆధ్వర్యంలో సాగు చేస్తాం. ప్రజల దైనందిన ఆహారం ద్వారా డయాబెటిస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు, ప్రొటీన్‌ లోపాన్ని అరికట్టడానికి ఈ వంగడం ఉపకరిస్తుంది.  

ఎఫ్‌పీవోల ద్వారా సాగు..మహిళా సంఘాల ద్వారా ప్రాసెసింగ్‌ 
అత్యల్ప గ్‌లెసైమిక్‌ ఇండెక్స్‌తో పాటు రెట్టింపు ప్రొటీన్‌ను కలిగి ఉండే ఆరోగ్యదాయకమైన కొత్త రకం వరి బియ్యాన్ని, ఇతర ఉప ఉత్పత్తులను దేశంలోని సాధరణ ప్రజలకు సైతం అందుబాటులోకి తేవాలన్నదే ‘ఇరి’ లక్ష్యం. ఒకసారి అందుబాటులోకి వస్తే భారత్‌తో పాటు ఇతర దేశాల్లోనూ ఈ బియ్యానికి చాలా గిరాకీ ఉంటుంది. అందువల్ల ఈ వంగడంపై పెద్ద కంపెనీలు గుత్తాధిపత్యం పొందటానికి వీల్లేకుండా, ఈ బియ్యాన్ని, ఇతర ఉత్పత్తులను దేశ ప్రజలకు సరసమైన ధరకే అందుబాటులోకి తేవటానికి కేంద్రం, ఒడిశా ప్రభుత్వాలతో కలసి పనిచేస్తున్నాం.  ( వేగంగా బరువు తగ్గాలనుకుంటున్నారా? బెస్ట్‌ టిప్స్‌ ఇవే!)

ఇందులో భాగంగా ఒడిశాలో ఎంపిక చేసిన కొన్ని రైతు ఉత్పత్తిదారుల సంఘాల (ఎఫ్‌పీఓలు) రైతులతో సాగు చేయిస్తున్నాం. మిల్లింగ్, ప్రాసెసింగ్‌లో 30 మహిళా స్వయం సహాయక బృందాలకు శిక్షణ ఇచ్చారు. భువనేశ్వర్‌ దగ్గర్లో ప్రత్యేక ప్రాసెసింగ్‌ ఫ్యాక్టరీని ప్రభుత్వం భారీ పెట్టుబడితో నెలకొల్పుతోంది. ప్రత్యేక బ్రాండ్‌ను ప్రారంభించి  ఆరోగ్యదాయకమైన ఈ బియ్యం, ఇతర ఉత్పత్తులను రిటైల్‌ మార్కెట్‌లోని పెద్ద కంపెనీల ద్వారా సరసమైన ధరలకే ప్రజలకు విక్రయించేందుకు గట్టిగా కృషి చేస్తున్నాం.   

ఇదీ చదవండి: వేసవిలో మెరిసే చర్మం : అద్భుతమైన మాస్క్‌లు


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement