Rice Grain
-
బియ్యపు గింజపై ‘ఓటు వేయండి’!
దేశంలో లోకసభ ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు జరుగున్నాయి. వివిధ పార్టీల నేతలు ముమ్మరంగా ప్రచారాలు సాగిస్తున్నారు. అయితే జనం చేతిలో ఓటు అనే అయుధం ఉంది. దీనితో వారు తమకు నచ్చిన అభ్యర్థిని ఎన్నుకోగలుగుతారు. ప్రజాస్వామ్యంలో ఓటుహక్కుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అందుకే ఎన్నికల సంఘం ఓటు హక్కు గురించి ప్రచారం చేస్తుంటుంది. రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన ఒక హస్త కళాకారిణి వినూత్న రీతిలో ఓటు హక్కుకున్న ప్రాముఖ్యత తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు. జైపూర్‌లోని సాంగనేర్ నివాసి నీరూ చాబ్రా ప్రజలకు ఓటుహక్కు ప్రాముఖ్యతను తెలియజేయాలని భావించారు. ఇందుకోసం ఆమె బియ్యపుగింజలపై ‘ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి’ అంటూ రాశారు. ఆమె బియ్యపు గింజపై భారత మ్యాప్‌ను సూక్ష్మ శైలిలో గీయడంతోపాటు ఎన్నికల స్లోగన్ కూడా రాశారు. ఈ సందర్భంగా నీరూ చాబ్రా మీడియాతో మాట్లాడుతూ 1984 నుంచి తాను బియ్యపు గింజపై సూక్ష్మ అక్షరాలు రాయడాన్ని కొనసాగిస్తున్నానని, కిచెన్‌లో వంట చేసేటప్పుడు తనకు ఈ ఐడియా వచ్చిందని తెలిపారు. మెల్లమెల్లగా ఈ కళలో ప్రావీణ్యం సంపాదించానని అన్నారు. కాగా నీరూ బియ్యపు గింజపై 108 అక్షరాలు రాసి రికార్డు సృష్టించారు. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ తదితరులు నీరూ చాబ్రా ప్రతిభను గతంలో మెచ్చుకున్నారు. -
తెలంగాణ వ్యవసాయ విధానాల్లో స్వామినాథన్ ముద్ర
సాక్షి, హైదరాబాద్: హరిత విప్లవ పితామహుడు డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ తెలంగాణ వ్యవసాయ విధానాల్లో తనదైన ముద్ర వేశారు. తెలంగాణ ప్రభుత్వం స్వామినాథన్ సిఫార్సులను దృష్టిలో ఉంచుకొని పలు నిర్ణయాలు చేసిందని వ్యవసాయశాఖ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. రైతులకు విరివిగా ప్రోత్సాహకాలు ఇవ్వాలనేది స్వామినాథన్ ఆలోచనల్లో ఒకటి. సీఎం కేసీఆర్ రైతుబంధుకు రూపకల్పన చేయడం రైతులకు అందిస్తున్న ప్రోత్సాహకాల్లో అత్యంత కీలకమైంది. రైతుబంధు, రైతుబీమా పథకాలను పలు సందర్భాల్లో స్వామినాథన్ ప్రశంసించారు. అంతేకాదు స్వామినాథన్ కీలక సిఫార్సుల్లో ఒకటైన కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) అమలు విషయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ కేంద్రానికి పలు ప్రతిపాదనలు చేసింది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ సీజన్లలో రైతులు పండించే పంటలకు ఎంతెంత ఎంఎస్పీ ఉండాలో స్వామినాథన్ సిఫార్సులను లెక్కలోకి తీసుకొని కేంద్రానికి ప్రతిపాదనలు పంపించింది. స్వామినాథన్ సిఫార్సులను పక్కన పెట్టిన కేంద్రం వివిధ పంటల సాగు ఖర్చుల ప్రకారం స్వామినాథన్ సిఫార్సులను అమలు చేయాలని తాము కోరితే కేంద్రం పెడచెవిన పెట్టిందని కూడా వ్యవసాయశాఖ వర్గాలు చెపుతున్నాయి. ఈ ప్రకారం రైతులు పండించిన పంటకు వచ్చేది నష్టమే తప్ప లాభం లేదని అంటున్నాయి. ఉదాహరణకు సీఏసీపీకి రాష్ట్ర వ్యవసాయశాఖ పంపిన నివేదికల ప్రకారం తెలంగాణలో క్వింటా వరి సాధారణ (కామన్) రకం ధాన్యానికి రూ.3,300, ఏ గ్రేడ్ ధాన్యం పండించాలంటే రూ. 3,400, పత్తికి రూ. 11 వేలు, మొక్కజొన్నకు రూ.2 వేలు, సోయా పంటకు రూ. 4,500 రైతు గతేడాది ఖర్చు చేశారు. ఈ ఖర్చులకు స్వామినాథన్ సిఫార్సుల ప్రకారం 50 శాతం అదనంగా కలపాలని రాష్ట్రం సూచించింది. ఆ ప్రకారం మద్దతు ధరలను ఖరారు చేయాలని కోరింది. ఉదాహరణకు పత్తి క్వింటాకు రూ. 11 వేలు ఖర్చు అయితే, స్వామినాధన్ సిఫార్సుల ప్రకారం అందులో 50 శాతం కలపాలి. ఆ ప్రకారం మద్దతు ధరగా రూ. 16,500 ప్రకటించాలని రాష్ట్రం కేంద్రానికి ప్రతిపాదించింది. కానీ కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినట్లు ఎంఎస్పీ ఖరారు చేయలేదు. స్వామినాథన్ సిఫార్సులను పక్కన పెట్టినా వాస్తవ సాగు ఖర్చు ప్రకారమైనా మద్దతు ధర ప్రకటించలేదన్న విమర్శలు ఉన్నాయి. -
అమెరికాలో బియ్యం కోసం ఎగబడుతున్న తెలుగువారు
-
ధాన్యం కొనుగోలుపై రైతులకు అవగాహన
పిఠాపురం: ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలపై రైతులకు అవగాహన కల్పించాలని పౌర సరఫరాల కార్పొరేషన్ వీసీ, ఎండీ వీరపాండ్యన్ అన్నారు. మండలంలోని జల్లూరులోని రైతు భరోసా కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం ఆయన సందర్శించారు. రబీ సీజన్లో ధాన్యం సేకరణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలలో తేమ శా«తం, గోనె సంచుల నిల్వ, రైతుల రిజిస్ట్రేషన్ అంశాలను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమయ్యాయన్నారు. రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించామన్నారు. ప్రభుత్వం నిర్ధేశించిన కనీస మద్దతు ధర లభించేలా అధికారులు చొరవ చూపాలన్నారు. కలెక్టర్ కృత్తికా శుక్లా మాట్లాడుతూ ఈ ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జాయింట్ కలెక్టర్ అలేఖ్య, పౌరసరఫరాల జెడ్ఎం మేనేజర్ డి.పుష్పామణి, జియం వి.లక్ష్మీరెడ్డి పాల్గొన్నారు. అధికారులకు జేడీ సూచనలు జగ్గంపేట: రైతు భరోసా కేంద్రాలలో «ధాన్యం కొనుగోలుపై రైతులకు అవగాహన కలిగించాలని జిల్లా వ్యవసాయ అధికారి జె.విజయకుమార్ సూచించారు. జగ్గంపేట వ్యవసాయ మార్కెట్ కమిటి కార్యాలయంలో గురువారం జగ్గంపేట వ్యవసాయ సబ్ డివిజన్లోని కిర్లంపూడి, ఏలేశ్వరం, జగ్గంపేట,గండేపల్లి మండలాలల అధికారులు, సిబ్బందితో ఆయన సమావేశం నిర్వహించారు. ధాన్యం కొనుగోలు సందర్భంగా ఏర్పడుతున్న సమస్యలను అధికారులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. వాటికి విజయ్‌కుమార్ పరిష్కారాలను చూపించారు. ప్రతి రైతు భరోసా కేంద్ర పరిధిలో ఒక కమ్యూనిటీ హైరింగ్ సెంటర్ గ్రూపు ఏర్పాటు చేయాలని ఏడీ చెప్పారు. ప్రభుత్వం 40శాతం సబ్సిడీపై ఇస్తున్న వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలను గ్రూపు ద్వారా కొనుగోలు చేయించి అందుబాటులో ఉంచాలన్నారు. భూమిలేని కౌలు రైతులను గుర్తించి కౌలు కార్డులు ఇప్పించాలన్నారు. పొలంబడులు నిర్వహించాలన్నారు. జగ్గంపేట వ్యవసాయ శాఖ ఏడీ బండారు నాగకుమార్, మండల వ్యవసాయ అధికారి ఇంటిగ్రేటెడ్ అగ్రీ ల్యాబ్ అధికారి కరుణాకర్‌రాజు, జగ్గంపేట మండల వ్యవసాయ అధికారి రెడ్ల శ్రీరామ్, వివిధ మండలాల వ్యవసాయ అధికారులు,రైతు భరోసా కేంద్రాల సిబ్బంది పాల్గొన్నారు. -
కల్వకుంట్ల కవితకు రేవంత్ రెడ్డి కౌంటర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో ట్వీట్ల వార్ నడుస్తోంది. ధాన్యం కొనుగోలు విషయంలో కాంగ్రెస్ నేతలు, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మధ్య వాడీవేడిగా రాజకీయ విమర్శలు కొనసాగుతుండగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. ధాన్యం కొనుగోలు విషయంపై రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. ‘‘తెలంగాణలో పండిన చివరి గింజ కొనేవరకూ, రైతుల తరపున కాంగ్రెస్ పార్టీ కొట్లాడి తీరుతుంది. తెలంగాణ రైతుల ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు తమ నైతిక బాధ్యతను విస్మరిస్తూ, రైతుల శ్రమతో రాజకీయం చేయడం సిగ్గుచేటు. రైతు వ్యతిరేక విధానాలతో అన్నం పెట్టే రైతులని క్షోభ పెట్టే పనులు మాని, పండించిన ప్రతి గింజా కొనాలి’ అంటూ డిమాండ్ చేశారు. తెలంగాణ రైతుల ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు తమ నైతిక బాధ్యతను విస్మరిస్తూ, రైతుల శ్రమతో రాజకీయం చేయడం సిగ్గుచేటు. రైతు వ్యతిరేక విధానాలతో అన్నం పెట్టే రైతులని క్షోభ పెట్టే పనులు మాని, పండించిన ప్రతి గింజా కొనాలి. — Rahul Gandhi (@RahulGandhi) March 29, 2022 దీనికి ప్రతిగా.. టీఆర్ఎస్ తరపున కల్వకుంట్ల స్పందించారు. ‘‘రాజకీయ లబ్ధి కోసం సంఘీభావం తెలపడం మాత్రమే కాదని.. పార్లమెంట్లో టీఆర్ఎస్ ఎంపీలతో కలిసి నిరసనలకు కలిసి రావాలంటూ పిలుపు ఇచ్చారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు ఒక నీతి, ఇతర రాష్ట్రాలకు మరో నీతి ఉండకూడదని రాహుల్ గాంధీ’’ని విమర్శించారు. .@RahulGandhi గారు మీరు ఎంపీగా ఉన్నారు, రాజకీయ లబ్ది కోసం నామమాత్రంగా ట్విట్టర్లో సంఘీభావం తెలుపడం కాదు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు ఒక నీతి, ఇతర రాష్ట్రాలకు మరో నీతి ఉండకూడదని @trspartyonline ఎంపీలు ప్రతిరోజు పార్లమెంట్ వెల్ లోకి వెళ్లి 1/2 https://t.co/BTMd0GwKPe — Kavitha Kalvakuntla (@RaoKavitha) March 29, 2022 దీంతో రంగంలోకి దిగిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి.. ట్విట్టర్ వేదికగా సీఎం కేసీఆర్‌కు, కవితకు కౌంటర్ ఇచ్చారు. ట్విట్టర్లో.. ‘‘కవిత గారూ.. టీఆర్ఎస్ ఎంపీలు లోక్ సభలో పోరాటం చేయడం లేదు... సెంట్రల్ హాల్లో కాలక్షేపం చేస్తున్నారు. ఎఫ్‌సీఐకి ఇకపై బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని 2021 ఆగస్టులో ఒప్పందంపై సంతకం చేసి తెలంగాణ రైతుల మెడకు ఉరితాడు బిగించింది కేసీఆరే అన్న విషయం మర్చిపోయారా!?’’ అంటూ వ్యాఖ్యలు చేశారు. కవిత గారూ...టీఆర్ఎస్ ఎంపీలు లోక్ సభలో పోరాటం చేయడం లేదు... సెంట్రల్ హాల్లో కాలక్షేపం చేస్తున్నారు. ఎఫ్ సీఐకి ఇకపై బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని 2021 ఆగస్టులో ఒప్పందంపై సంతకం చేసి తెలంగాణ రైతుల మెడకు ఉరితాడు బిగించింది కేసీఆరే అన్న విషయం మర్చిపోయారా!?#FightForTelanganaFarmers https://t.co/WtYnUu9hjM — Revanth Reddy (@revanth_anumula) March 29, 2022 ఇది చదవండి: రాముడు కాదు.. వాళ్లు రావణుడి భక్తులు.. మంత్రి సంచలన వ్యాఖ్యలు -
సన్న రకం.. ‘ధర’హాసం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఈ ఇద్దరే కాదు.. ఉమ్మడి నల్లగొండలో సన్నరకం ధాన్యాన్ని మిల్లుల్లో విక్రయిస్తున్న రైతులకు ఇప్పుడు మంచి ధర వస్తోంది. ఈ నెల మొదట్లో ఎక్కువ మందికి క్వింటాకు రూ.1,700, కొంతమందికి రైతులకు రూ. 1,960లోపే చెల్లించిన మిల్లర్లు.. ఇప్పుడు సర్కారు మద్దతు ధర రూ. 1,960 కన్నా ఎక్కువగా గరిష్టంగా రూ. 2,300 వరకు ఇస్తున్నారు. దీంతో రైతులు సంబురపడిపోతున్నారు. కారణమిదీ.. జిల్లాలోని మిల్లర్లు సన్నరకం ధాన్యాన్నే ఎగుమతి చేస్తారు. ఈ ధాన్యాన్ని రా రైస్‌గా మార్చి హైదరాబాద్ సహా దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలు, విదేశాలకు ప్రతి ఏడాది ఎగుమతి చేస్తుంటారు. ఇటీవల ఆయా ప్రాంతాల వ్యాపారులు పెద్ద ఎత్తున సన్నరకం కావాలని కోరడంతో ధాన్యం కొనుగోళ్లను పెంచినట్లు మిల్లర్లు చెబుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో సన్న ధాన్యం విక్రయించేందుకు వస్తున్న రైతులు తగ్గడంతో మిల్లర్లు పోటీపడి మరీ ఎక్కువ ధరకు కొంటున్నారు. ఒక్క మిర్యాలగూడలోనే 83 మిల్లులు సన్నరకం ధాన్యం కొనుగోలు చేస్తున్నాయి. చివరి దశకు సన్నరకం అమ్మకాలు నల్లగొండ జిల్లాలో సన్నరకం ధాన్యం 6,09,758 మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చింది. ఇందులో రైతులు తాము తినేందుకు పక్కనపెట్టుకున్నవి పోనూ మిగతా 5 లక్షల మెట్రిక్ టన్నులు అమ్ముతారని అధికారులు అంచనా వేశారు. మిల్లర్లు ఇప్పటికే 3.5 లక్షల మెట్రిక్ టన్నులు కొన్నారు. దీంతో ధాన్యం రాక తగ్గింది. యాదాద్రి జిల్లాలో 1.12 లక్షల హెక్టార్లకు గాను 7 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చింది. ఇందులో ఎక్కువ శాతం సాధారణ రకమే. సూర్యాపేట జిల్లాలో 4,51,623 మెట్రిక్ టన్నుల సన్నరకం ధాన్యం దిగుబడి రాగా ఇందులో సగానికిపైగా ఇప్పటికే మిల్లర్లకు అమ్మేశారు. ఇలా వచ్చే ధాన్యం తగ్గుతుండటం, వ్యాపారుల నుంచి డిమాండ్ ఉండటంతో రేటు పెరుగుతోంది. ఈయన పేరు పేరం వెంకన్న. ఊరు నేరేడుచర్ల మండ లం నర్సయ్యగూడెం. తనకున్న ఐదెకరాలతో పాటు మరో పదెకరాలు కౌలుకు తీసుకొని చింట్లు రకం ధాన్యం సాగు చేశాడు. పదెకరాల్లో పండిన ధాన్యాన్ని 15 రోజుల కిందట క్వింటాకు రూ.1,700 చొప్పున విక్రయించాడు. తాజాగా ఆదివారం ఐదెకరాల ధాన్యాన్ని క్వింటా రూ.2,300 చొప్పున అమ్మాడు. ఒక్కో క్వింటాపై రూ. 600 ఎక్కువ రావడంతో సంతోషించాడు. -
ఇకపై అంతా పచ్చిబియ్యమే..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ధాన్యం సేకరణపై భారత ఆహార సంస్థ కొత్త కొర్రీలు పెడుతోంది. దేశవ్యాప్తంగా పచ్చిబియ్యం (రా రైస్)కు డిమాండ్ పెరుగుతున్న దృష్ట్యా ఇకపై దాన్ని మాత్రమే సేకరిస్తామని అంటోంది. వానాకాలం, యాసంగి సీజన్లలోనూ ఇకపై పచ్చిబియ్యం మాత్రమే తమకు అందించాలని లేని పక్షంలో తామేమీ చేయలేమని చేతులెత్తేస్తోంది. ఈ వానాకాలానికి సంబంధించి 48 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించేందుకు ముందుకు వచ్చి న ఎఫ్‌సీఐ పూర్తి పచ్చిబియ్యాన్ని మాత్రమే తీసుకోనుంది. పచ్చి బియ్యమే.. పరమాన్నం రాష్ట్రం నుంచి అధికంగా ఉప్పుడు బియ్యాన్ని సేకరించి పొరుగు రాష్ట్రాలకు సరఫరా చేసే ఎఫ్‌సీఐ... గతేడాది యాసంగి నుంచి తన విధానాన్ని మార్చుకుంటూ వస్తోంది. బాయిల్డ్ రైస్ వినియోగం అధికంగా ఉండే తమిళనాడు, కేరళ నుంచి డిమాండ్ తగ్గడం, వినియోగం లేక ఎఫ్‌సీఐ వద్ద నిల్వలు పెరుగుతుండటంతో డిమాండ్ అధికంగా ఉన్న రా రైస్ ఇవ్వాలని ఎఫ్‌సీఐ షరతులు పెట్టింది. గత యాసంగిలో 1.32 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి రాగా ఇందులో 80.88 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఎఫ్‌సీఐ సేకరించింది. ఈ ధాన్యాన్ని మర పట్టించడం ద్వారా 55లక్షల మె ట్రిక్ టన్నుల బియ్యం ఉత్పత్తి ఉంటుందని అంచనా వేసిం ది. మర పట్టించి ఇచ్చిన బియ్యంలో ఏటా 95 శాతం వరకు ఉప్పుడు బియ్యాన్నే ఎఫ్‌సీఐ సేకరిస్తూ రాగా గత సీజన్లో రా రైస్ మాత్రమే ఇవ్వాలని పట్టుబట్టింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర రైతులకు నష్టం జరిగే అవకాశం ఉన్న దృష్ట్యా 80 శాతం బాయిల్డ్ రైస్, 20 శాతం రా రైస్ తీసుకోవాలని ఎఫ్‌సీఐని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. అయినప్పటికీ దాన్ని పట్టించుకోని ఎఫ్‌సీఐ 60 శాతం మేర రా రైస్ ఇవ్వాలని కోరింది. 55 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యంలో 24.75 లక్షల మెట్రిక్ టన్నులే బాయిల్డ్ కింద ఇవ్వాలని మిగతా 30.25 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని రా రైస్‌గా ఇవ్వాలని స్పష్టం చేసింది. ప్రస్తుతం 24.75 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్‌లో 15 లక్షల టన్నుల సేకరణ పూర్తి చేసింది. మిగతా సేకరణ ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తంగా 24.75 లక్షల టన్నుల బాయిల్డ్ సేకరణ తర్వాత మిగతా బియ్యాన్ని సేకరిస్తుందా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఎఫ్‌సీఐ సేకరించని పక్షంలో రాష్ట్రానికి ఇక్కట్లు తప్పేలా లేవు. ఇక ప్రస్తుత వానాకాలం సీజన్‌కు సంబంధించి ప్రభుత్వం 80 లక్షల మెట్రిక్ టన్నుల మేర ధాన్యం సేకరణ అవసరం ఉంటుందని అంచనా వేస్తుండగా ఇందులో గత సీజన్లను అనుసరించి 48 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని అంటోంది. దీనికి సంబంధించి పూర్తిగా పచ్చి బియ్యాన్ని ఇవ్వాలని కోరింది. అయితే రాష్ట్రంలో ప్రస్తుత సీజన్లోనూ దొడ్డు రకాల సాగు ఎక్కువగా జరిగిన నేపథ్యంలో పచ్చి బియ్యం ఎలా ఇవ్వగలమన్నది ప్రశ్నగా మారింది. ఎఫ్‌సీఐ కొర్రీల దృష్ట్యానే సన్న రకాల సాగు పెంచాలని ప్రభుత్వం కోరినా గిట్టుబాటు ధరలు రాని దృష్ట్యా ఈ సీజన్లో దొడ్డు రకాల సాగు ఎక్కువగా జరిగింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. -
పత్తి.. వరి.. కంది
సాక్షి, హైదరాబాద్: ఈ వానాకాలం సీజన్లో ఏకంగా 1.40 కోట్ల ఎకరాల్లో సాగు లక్ష్యంగా నిర్ణయించిన వ్యవసాయ శాఖ.. పత్తి, వరితో పాటు కంది పంటలను ప్రోత్సహించేలా ప్రణాళిక రూపొందించింది. దీంతో ఈసారి రాష్ట్రంలో కంది, పత్తి, వరి ఈ మూడు పంటలే అత్యధికంగా సాగు కానున్నాయి. గతంలో పత్తి, వరితో పాటు మొక్కజొన్న అధిక శాతం విస్తీర్ణంలో సాగవుతుండగా, ఈసారి మొక్కజొన్న స్థానంలో కంది పంట వచ్చి చేరింది. దేశంలో మొక్కజొన్న నిల్వలు ఎక్కువగా ఉండటం, ధర, డిమాండ్ లేని నేపథ్యంలో ఈ పంట సాగును తగ్గించాలని ప్రభుత్వం గత ఏడాదే నిర్ణయించింది. ఈ మేరకు అవసరమైన విత్తనాలను, ఎరువులను సక్రమంగా సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పత్తి, వరికి మరింత ప్రోత్సాహం 2012–22 వానాకాలం సీజన్(ఖరీఫ్)కు సంబంధించిన సాగు ప్రణాళికను వ్యవసాయ శాఖ రూపొందించింది. గతేడాది వానాకాలంలో అన్ని పంటల సాధారణ సాగు విస్తీర్ణం 1.03 కోట్ల ఎకరాలు కాగా, ఈ సీజన్లో ఏకంగా 1.40 కోట్ల ఎకరాల్లో సాగు లక్ష్యంగా నిర్ణయించింది. గతేడాది పత్తి 44.50 లక్షల ఎకరాలు సాధారణ సాగుగా నిర్ధారించగా, 54.45 లక్షల ఎకరాల్లో సాగైంది. అయితే ఈసారి 70.04 లక్షల ఎకరాల సాధారణ సాగు విస్తీర్ణం ఉండాలని, ఆ మేరకు రైతులను ప్రోత్సహించాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది. పత్తికి మంచి ధర ఉండటం వల్లే ఈ నిర్ణయం తీసుకుంది. ఇక సాగు నీటి వసతి ఎక్కువగా ఉండటం వల్ల ఈసారి వరి సాధారణ సాగు విస్తీర్ణం పెరిగింది. గతేడాది వానాకాలం వరి సాధారణ సాగు విస్తీర్ణం 27.25 లక్షల ఎకరాలు కాగా, అప్పుడు 41.19 లక్షల ఎకరాల్లో సాగైంది. దీంతో ఈసారి వరి సాధారణ సాగు విస్తీర్ణాన్ని 41.85 లక్షల ఎకరాలుగా నిర్ధారించారు. మొక్కజొన్న 22 శాతానికే పరిమితం ఇప్పటివరకు పత్తి, వరి తర్వాత అత్యంత కీలకమైన పంటగా ఉన్న మొక్కజొన్న సాగు గణనీయంగా తగ్గనుంది. గతేడాది వానాకాలం సీజన్లో మొక్కజొన్న సాధారణ సాగు విస్తీర్ణం 11.76 లక్షల ఎకరాలు కాగా, అప్పుడు 10.11 లక్షల ఎకరాల్లో సాగైంది. అయితే ఈసారి మొక్కజొన్న సాధారణ సాగు విస్తీర్ణం కేవలం 2.27 లక్షల ఎకరాలుగా నిర్ణయించారు. అంటే మొత్తం పంటల్లో దాదాపు 22.45 శాతానికే మొక్కజొన్న పరిమితం కానుంది. ఇక విత్తన కొరత, ఇతర కారణాలతో సోయాబీన్ సాగు కూడా తగ్గిపోనుంది. గతేడాది వానాకాలంలో సాధారణ సాగు విస్తీర్ణం 4.88 లక్షల ఎకరాలు కాగా, అప్పుడు 4.26 లక్షల ఎకరాల్లో సాగైంది. తాజాగా దీనిని కేవలం 1.33 లక్షల ఎకరాలకే పరిమితం చేశారు. కందికి మంచిరోజులు ఈసారి పత్తి, వరితో పాటు కంది సాగును బాగా ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతేడాది కంది సాధారణ సాగు విస్తీర్ణం 7.61 లక్షల ఎకరాలు కాగా, 7.38 లక్షల ఎకరాల్లో రైతులు సాగు చేశారు. అయితే ఈసారి వానాకాలంలో ఏకంగా 20 లక్షల ఎకరాల్లో కందిని సాగు చేయించాలని నిర్ణయించారు. ఈసారి 20 రకాల పంటలకు సంబంధించిన 1.40 కోట్ల సాధారణ సాగు విస్తీర్ణంలో పత్తి, కంది, వరి సాధారణ సాగు విస్తీర్ణమే ఏకంగా 1.31 కోట్ల ఎకరాలు (94.13 శాతం) ఉండటం గమనార్హం. ఇలావుండగా ఈ సీజన్‌కు మొత్తం 25.50 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను కేటాయించారు. వీటిలో ప్రస్తుతం 6.77 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నట్లు వ్యవసాయ శాఖ వెల్లడించింది. చదవండి: Telangana: తొలి మాసం.. శుభారంభం -
శ్రీవారి కోసం 365 రకాల దేశీ వరి!
పోషకాలతోపాటు ఔషధ విలువలు కలిగిన దేశీ వరి వంగడాల పరిరక్షణ ఉద్యమంలో తెలుగు నాట కొత్త శకం ఆరంభమైంది. దేశీ వరి బియ్యాన్ని మాత్రమే శ్రీవారి నైవేద్యానికి వినియోగించాలని తిరుమల తిరుపతి దేవస్థానం ఇటీవల నిర్ణయించింది. మే 1 నుంచి తిరుమలలో శ్రీవారికి గో ఆధారిత ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండించిన దేశీ వరి బియ్యంతో రోజూ 8 రకాల ప్రసాదాలను తయారు చేసి నైవేద్యం పెడుతున్నారు. వచ్చే ఏడాది శ్రీరామనవవి నుంచి రోజుకో దేశీ వరి రకం బియ్యంతో తిరుమలలో శ్రీవారికి నైవేద్యం అందించాలన్నది సంకల్పం. 60 ఏళ్ల క్రితం వరకు కొనసాగిన ఈ సంప్రదాయాన్ని టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో పునరుద్ధరిండం విశేషం. టీటీడీ పాలక మండలి సభ్యులు, యుగ తులసి ఫౌండేషన్ అధ్యక్షులు కొలిశెట్టి శివకుమార్, ‘సేవ్’ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు, దేశీ వరి రకాల పరిరక్షణ ఉద్యమకారుడు ఎం. విజయరామ్ సంయుక్త కృషి ఫలితంగా ఇది సాధ్యమైంది. ఒడిషాకు చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత సబర్మతి నుంచి సేకరించిన 365 రకాల దేశీ వరి విత్తనాలను జూన్ నెలలో ఒక్కో రైతుకు ఒక్కో రకం విత్తనాన్ని అందించడానికి ‘సేవ్’ సంస్థ ఏర్పాట్లు చేసింది. 2–3 ఏళ్లుగా గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులకు మాత్రమే ఈ అవకాశం ఉంటుందని విజయరామ్ అన్నారు. నవారా, కాలాభట్ తప్ప మిగతా రకాలు ఎకరానికి 18–23 బస్తాల ధాన్యం దిగుబడి ప్రకృతి వ్యవసాయం ద్వారా వస్తుందని, 20 బస్తాలు పండితే వెయ్యి కిలోల బియ్యం వస్తాయన్నారు. టీటీడీపై ఆర్థిక భారం పడకుండానే రైతులు, దాతల ద్వారానే శ్రీవారి నైవేద్యానికి రోజుకో రకం దేశీ వరి బియ్యాన్ని అందించాలనేది సంకల్పం. ముందస్తు ఒప్పందం మేరకు రైతుల నుంచి దాతలు కిలో బియ్యం రూ. 60–70లకు సేకరించి, సొంత రవాణా ఖర్చులతో టీటీడీకి అందజేస్తారన్నారు. ఎవరిని సంప్రదించాలి? దేశీ వరి వంగడాలను భక్తి శ్రద్ధలతో గోఆధారిత ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేసే రైతులు హైదరాబాద్ లోయర్ ట్యాంక్‌బండ్ (ఇందిరా పార్కు వద్ద, రామకృష్ణ మఠం ఎదురుగా) లో గల ‘సేవ్’ సంస్థ కార్యాలయం (040–27654337)లో సంప్రదించవచ్చు. గో ఆధారిత ఉత్పత్తులనూ ప్రోత్సహించాలి అపురూపమైన దేశీ వరి వంగడాలు అంతరించిపోకుండా కాపాడటానికి టీటీడీ నిర్ణయం దోహదపడుతుంది. 2022 శ్రీరామనవవి నుంచి రోజుకో రకం దేశీ వరి బియ్యాన్ని శ్రీవారి నైవేద్యానికి అందించనున్నాం. గో ఆధారిత ఉత్పత్తులను కూడా టీటీడీ ప్రోత్సహించాలి. ఇందుకోసం తిరుమలలో ప్రత్యేక శిక్షణా కేంద్రాన్ని నెలకొల్పాలి. – ఎం. విజయరామ్, ‘సేవ్’ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకులు letssave@gmail.com గోవిందునికి గోమహానైవేద్యం గోవిందునికి శ్రీకృష్ణ దేవరాయలు కాలంలో మాదిరిగా గోమహానైవేద్యం పెట్టాలని టీటీడీ పాలక మండలి నిర్ణయించడం శుభపరిణామం. ప్రతి రైతూ ఇందులో భాగస్వాములు కావాలి. తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రంలోనూ దేశీ వరి బియ్యాన్నే వాడాలి. దేవాలయాలన్నిటిలోనూ నైవేద్యానికి దేశీ వరి బియ్యాన్నే వాడాలి. – కొలిశెట్టి శివకుమార్, టీటీడీ పాలక మండలి సభ్యులు, యుగ తులసి ఫౌండేషన్ చైర్మన్ -
వరికంకుల కొత్త చరిత్ర
సాక్షి, వరంగల్: విస్తారంగా వానలు.. నిండుకుండల్లా జలాశయాలు.. మత్తడి దుంకిన చెరువులు, కుంటలు.. పొలాలకు సమృద్ధిగా జలాలు.. భూమికి పచ్చాని రంగేసినట్టు పచ్చదనం... ఆకట్టుకున్న ప్రాజెక్టుల ఆయకట్టులు.. కాళేశ్వరం, దేవాదుల, శ్రీరాంసాగర్, నాగార్జునసాగర్ తదితర ప్రాజెక్టుల నీరు బిరబిరా కాల్వల్లో పరుగులు... ఫలితంగా రాష్ట్రంలో వరిసాగు రెండింతలైంది. వరికంకులు కొత్త చరిత్ర సృష్టించాయి. 2020– 21 యాసంగిలో మొత్తం పంటల అంచనా 36,43,770 ఎకరాలు కాగా, 68,14,555(187.02 శాతం) ఎకరాల్లో రైతులు వివిధ పంటలు వేశారు. వరిసాగు అంచనా 22,19,326 ఎకరాలు కాగా.. అనూహ్యంగా 52,78,636 (237.85 శాతం) ఎకరాల్లో సాగైంది. వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలు 1,47,80,181 టన్నుల ధాన్యం దిగుబడి రావొచ్చని అంచనా. అయితే ఇప్పటికే రైసుమిల్లులు, సీడబ్ల్యూసీ, ఎస్‌డబ్ల్యూసీ గోదాములు వానాకాలం ధాన్యంతో నిండిపోయాయి. ఈసారి యాసంగి పంట కొనుగోళ్లు సవాల్‌గా మారనున్నాయి. 137 శాతం అధికంగా వరిసాగు గత యాసంగి, ఖరీఫ్‌తో పోలిస్తే ఈసారి పంటలు దండిగా రానున్నాయి. అంచనాలకు మించి 137 శాతం అధికంగా వరి సాగైంది. ఒకదశలో ఈ యాసంగి ధాన్యం కోనుగోలు చేయబోమని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. రైతుల్లో అలజడి చెలరేగడంతో మళ్లీ వెనుకడుగు వేసింది. యాసంగి ధాన్యం కూడా కొనుగోలు చేస్తామని సీఎం కేసీఆర్ తాజాగా వెల్లడించారు. గతేడాది యాసంగిలో 38,62,510 ఎకరాల్లో వేస్తే ఈసారి 14,16126 ఎకరాల్లో అదనంగా సాగు చేశారు. వరంగల్ రూరల్ జిల్లాలో సాగు అంచనా 43,710 ఎకరాలు కాగా, 1,19,682 ఎకరాల్లో వరివేశారు. నిజామాబాద్‌లో 1,92,616 ఎకరాలకుగాను 3,87,628, మహబూబ్‌నగర్ 29,415కుగాను 1,21,004, కరీంనగర్లో 1,21,853కుగాను 2,64,609, జగిత్యాలలో 1,32,648కుగాను 2,98,283, పెద్దపల్లిలో 1,13,520 ఎకరాలకుగాను 1,97,741 ఎకరాల్లో వరివేశారు. మొత్తంగా ఈ ఏడు 1.48 కోట్ల టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేశారు. గోదాములే సమస్య రాష్ట్రవ్యాప్తంగా యాసంగిలో వరి విస్తీర్ణం 52.78 లక్షల ఎకరాలకు చేరిన నేపథ్యంలో 6,408 కొనుగోలు కేంద్రాలను 31 జిల్లాల్లో ఏర్పాటు చేయనున్నారు. ఇందులో 2,131 ఐకేపీ, 3,964 పీఏసీఎస్(ఫా్యక్స్), 313 ఏఎంసీ, ఇతర కేంద్రాల ద్వారా కొనుగోళ్లు చేయనున్నారు. ప్రస్తుత సీజన్‌కు కూడా కామన్ రకం క్వింటాకు రూ.1,868, ‘ఏ’గ్రేడ్ రకానికి చెందిన ధాన్యం క్వింటాకు రూ.1,888గా కనీసమద్దతు ధర(ఎంఎస్పీ) చెల్లిం చనున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా వానాకాలం ధాన్యంతో రైసుమిల్లులు, గోదాములు నిండుకుండల్లా మార డం ప్రతిబంధకం కావచ్చని మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారి ఒకరు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో కొత్తవి, పాతవి కలిపితే 21.99 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోదాములే అందుబాటులో ఉన్నాయి. తెలంగాణవ్యాప్తంగా 2,210 రైస్ మిల్లులున్నాయి. ఈ మిల్లులు ఏడాదికి కోటి లక్షల టన్నుల బియ్యం తయారు చేస్తాయి. గతంలో వీటికి సరిపడా ధాన్యం కూడా రాకపోయేది. కానీ, ఈసారి సగం మిల్లుల్లో వానాకాలం ధాన్యం, బియ్యం నిల్వలు ఫుల్‌గా ఉన్నాయి. 2020–21 యాసంగి సాగు వివరాలు (ఎకరాల్లో) ► యాసంగిలో మొత్తం పంటల అంచనా-36,43,770 ► ఈ ఏడాది యాసంగి సాగు-68,14,555 ► మొత్తంగా సాగు శాతం -187.02 ► గతేడాది యాసంగి సాగు-52,22,377 ► అత్యధికంగా పంటలు సాగైన జిల్లా-వరంగల్ రూరల్ (299.10 శాతం) ► అత్యల్పంగా పంటలు సాగైన జిల్లా-ఆసిఫాబాద్ కొమురం భీం (128.95 శాతం) ► రాష్ట్రంలో వరిసాగు అంచనా(ఎకరాల్లో)-22,19,326 ► ఈ యాసంగి సాగు-52,78,636 ► మొత్తంగా వరిసాగు శాతం- 237.85 ► దిగుబడి అంచనా-1,47,80,181 (దొడ్డు రకం 1.19 కోట్ల టన్నులు + టన్నులు ► సన్నాలు 28.80 లక్షల టన్నులు) ► గతేడాది సాగు-38,62,510 ► యాసంగి కొనుగోళ్లు ఇలా ► మొత్తం కొనుగోలు కేంద్రాలు-6,408 ► ఐకేపీ కేంద్రాలు-2,131 ► పీఏసీఎస్ (ఫా్యక్స్) కేంద్రాలు-3,964 ► ఏఎంసీ, ఇతర కేంద్రాలు-313 ► కనీస మద్దతుధర (ఎంఎస్పీ) ► ‘ఏ’గ్రేడ్ (క్వింటాకు)-రూ.1,888 ► కామన్ రకం (క్వింటాకు)-రూ.1,868 ఇబ్బందులు తలెత్తకుండా ధాన్యం కొనుగోళ్లు యాసంగిలో రైతులు అధికమొత్తంలో దొడ్డురకం వరిధాన్యం సాగు చేశారు. అక్కడక్కడ మాత్రమే సన్నరకం వరి వేశారు. ఈ యాసంగిలో వరి ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉందని గుర్తించాం. కొనుగోలు కేంద్రాల ఏర్పాటు కోసం కసరత్తు పూర్తయింది. ఎలాంటి ఇబ్బందులు రాకుండా కొనుగోలు చేసి మిల్లులకు తరలించేందుకు అనుమతుల కోసం లేఖ రాశాం. – రాఘవేందర్, డీఎం, జయశంకర్ భూపాలపల్లి ఈసారి కొంత ఎక్కువ దిగుబడి పోయినసారి కన్నా ఈసారి కొంత ఎక్కువ దిగుబడి వచ్చింది. పోయిన యాసంగిల ఎకరానికి 23 క్వింటాళ్లు వస్తే, పోయిన వానాకాలంల కేవలం 18 క్వింటాళ్లే వచ్చాయి. ఈసారి అధికారులు 28 అంటున్రుగాని సుమారు 26 క్వింటాళ్ల వరకు వచ్చే అవకాశాలున్నాయి. – ఎండపెల్లి శ్యాంసుందర్‌రెడ్డి, రైతు, కమలాపూర్, వరంగల్ అర్బన్ జిల్లా ఇప్పటికైతే మంచిగానే ఉంది ఎన్నో ఏళ్లుగా ఎవుసాన్ని నమ్ముకొని బతుకుతున్న. మూడు, నాలుగేళ్లుగా ఎవుసం చేస్తె అప్పులే తప్ప గవ్వ మిగులలేదు. వానాకాలం పంట చేతికి వచ్చే సమయానికి వాన నిండా ముంచింది. యాసంగి పంట దిగుబడి ఇప్పటికైతే మంచిగానే ఉంది. కోసే దాక వానలు కొట్టకపోతే ఎకరానికి 25 క్వింటాళ్ల దాక వడ్లు చేతికి వస్తయ్. – డొంగరి రాజయ్య, రైతు, కాటారం, జేఎస్ భూపాలపల్లి జిల్లా -
కరోనా నేపథ్యంలో సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం
హైదరాబాద్: రైతులు ఇబ్బంది పడకూడదని, గ్రామాల్లోనే ధాన్యం కొనుగోలు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. పరిమిత సంఖ్యలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొంటామని ఇటీవల అసెంబ్లీలో ప్రకటించినప్పటికీ.. యాసంగిలో భారీ విస్తీర్ణంలో వరి సాగు జరిగినందున రైతుల క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఖరీఫ్లాగే కొనుగోళ్లు జరపాలని నిర్ణయం తీసుకున్నారు. యాసంగిలో పండనున్న వరి ధాన్యాన్ని గ్రామాల్లోనే 6,408 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి పూర్తిస్థాయిలో కొనుగోలు చేస్తామని సీఎం కేసీఆర్ సోమవారం ప్రకటించారు. కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో రైతుల ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. యాసంగిలో 52.76 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగిందని, 1.17 కోట్ల మెట్రిక్ టన్నుల దొడ్డు రకం ధాన్యం, 21 లక్షల మెట్రిక్ టన్నుల సన్నరకం ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని సీఎం పేర్కొన్నారు. వ్యవసాయ, మార్కెటింగ్, పౌర సరఫరాల శాఖలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ధాన్యం కొనుగోళ్లకు అవసరమైన రూ.20 వేల కోట్ల రుణానికి బ్యాంకు గ్యారంటీ ఇచ్చే ఏర్పాట్లను మంగళవారం సాయంత్రానికల్లా పూర్తి చేయాలని ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావును ఆదేశించారు. తక్షణం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు అన్ని జిల్లాల కలెక్టర్లతో అత్యవసర వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను కోరారు. హైదరాబాద్‌లోనే ఉండి కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, ధాన్యం కొనుగోళ్లను నిరంతరం పర్యవేక్షించాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి సూచించారు. వ్యవసాయ, మార్కెటింగ్, పౌరసరఫరాల శాఖలను సమన్వయం చేసుకుంటూ ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి, సీఎస్, అధికారులను ఆదేశించారు. ఐకేపీ ఆధ్వర్యంలో 2,131, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (పీఏసీఎస్) ఆధ్వర్యంలో 3,964, మరో 313 కేంద్రాలు కలిపి మొత్తం 6,408 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. తేమ 17 శాతానికి మించకుండా చూసుకోవాలి కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చే రైతులు.. కనీస మద్దతు ధర లభించేలా నిబంధనలను కచ్చితంగా పాటించాలని ముఖ్యమంత్రి కోరారు. వడ్లు ఎండబోసి, తాలు లేకుండా, తేమ 17 శాతానికి మించకుండా ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని రైతులకు సూచించారు. కొనుగోలు కేంద్రాలకు అవసరమైన 20 కోట్ల గన్నీ బ్యాగులను సిద్ధంగా ఉంచుకోవాలని అధికారులకు సూచించారు. ఆహార ధాన్యాల నిల్వల కోసం అదనపు గోదాములను నిర్మించేందుకు సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ సిద్ధంగా ఉన్నందున, కార్పొరేషన్‌కు లీజుకు ఇవ్వడానికి స్థలాలను ఎంపిక చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సీఎం ఆదేశించారు. మన పత్తికి మంచి డిమాండ్ తెలంగాణ రాష్ట్రంలో పండే పత్తికి అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్నదని, మంచి క్వాలిటీ ఉండటమే దీనికి కారణమని కేసీఆర్ తెలిపారు. ఎక్కువ దిగుబడి వచ్చి.. అధిక ధర లభించే అవకాశం ఉన్నందున, వచ్చే వానాకాలం 75 నుండి 80 లక్షల ఎకరాల్లో పత్తి పండించడానికి సిద్ధం కావాలని సీఎం రైతులకు సూచించారు. ఇందుకు అవసరమైన విత్తనాల కోసం ఇప్పటినుంచే ఏర్పాట్లు చేయాలని వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి జనార్దన్ రెడ్డిని ఆదేశించారు. 20– 25 లక్షల ఎకరాల్లో కందిపంట సాగుకు చర్యలు చేపట్టాలని కోరారు. పత్తి, కంది పంటలకు నీళ్ల తడులు పెడితే దిగుబడి ఎక్కువ వస్తుందని సీఎం తెలిపారు. ఈ సమీక్షలో మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, పౌరసరఫరాల కార్పొరేషన్ చైర్మన్ మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ నర్సింగ్ రావు, సెక్రటరీ భూపాల్ రెడ్డి, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి జనార్దన్ రెడ్డి, పౌర సరఫరాల కమిషనర్ అనిల్ కుమార్, ఎఫ్.సి.ఐ జనరల్ మేనేజర్ అశ్వినీగుప్తా పాల్గొన్నారు. 80 లక్షల టన్నులకు ఎఫ్‌సీఐ ఓకే యాసంగిలో భారీ విస్తీర్ణంలో వరి సాగైందని, ధాన్యం తీసుకోవాలని భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ)ను రాష్ట్రం కోరింది. ఈ మేరకు ఇటీవల ఎఫ్‌సీఐతో చర్చలు జరిపింది. దాంతో ఎఫ్‌సీఐ 80 లక్షల టన్నుల ధాన్యాన్ని తీసుకునేందుకు సమ్మతించింది. ధాన్యం సేకరణకు 18 కోట్ల గోనె సంచులు అవసరం ఉండగా... 8 కోట్లు లభ్యతగా ఉన్నాయి. మిగతా 10 కోట్ల గోనె సంచుల కోసం పౌర సరఫరాల శాఖ ఇప్పటికే కేంద్ర జౌళి శాఖకు ఆర్డర్ ఇచ్చింది. కాగా గ్రేడ్–1 రకం ధాన్యానికి రూ. 1,888 మద్దతు ధర ఉండగా, కామన్ రకానికి 1,868 రూపాయలు ఉంది. ఖరీఫ్‌లో రాష్ట్ర ప్రభుత్వం 6,506 కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొనుగోళ్లు జరిపింది. -
ఉద్భవించిన ‘తెలంగాణ సోనా’
సాక్షి, హైదరాబాద్: ధాన్య భాండాగారంగా జాతీయస్థాయి గుర్తింపు పొందిన తెలంగాణ రాష్ట్రం మరో అద్భుతమైన వరి వంగడం సాగుకు వేదిక కానుంది. నాటుపెట్టిన స్వల్పకాలంలోనే పంట దిగుబడి వచ్చే ఈ సన్న రకం ధాన్యం పేరు ‘తెలంగాణ సోనా’. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు రూపొందించిన ఈ వరి రకం సాంబమసూరి కన్నా సన్నరకమే కాక.. దానికంటే తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడినిస్తుంది. ఎంటీయూ– 1010 రకాన్ని ఆడమొక్కగా, జేజీఎల్–3855 (కరీంనగర్ సాంబ) రకాన్ని మగమొక్కగా సంకరంచేసి రూపొందించిన ఈ వంగడంలో పిండి పదార్థాలు కూడా చాలా తక్కువని తేలింది. అందుకే దీన్ని ‘షుగర్ ఫ్రీ రైస్’ అని అంటున్నారు. ఇప్పుడు ఈ స్వల్పకాలిక సన్నరకం ధాన్యాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఈ వానాకాలంలో రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల ఎకరాల్లో సాగుకు ప్రణాళికలు రచిస్తోంది. స్వల్పకాలిక దిగుబడులు ఇచ్చే వంగడాల ఉత్పత్తిలో భాగంగా ‘తెలంగాణ సోనా’ ఉద్భవించింది. ఇది సాంబమసూరి కన్నా సన్నగింజ పంట. మార్కెట్లో సన్న బియ్యానికి మంచి డిమాండ్ ఉంది. సాంబమసూరి అగ్గితెగులు, దోమపోటు, ఆకు ఎండు తెగుళ్ల బారినపడుతుంది. వాటిని తట్టుకోలేదు. కానీ, తెలంగాణ సోనా అగ్గి తెగులును పూర్తిగా తట్టుకుంటుంది. ఆలస్యంగా నాటడం వల్ల దోమపోటును తప్పించుకుంటుంది. దీంతో పురుగుమందులపై ఖర్చు తగ్గుతుంది. పర్యావరణానికీ మేలు కలుగుతుంది. సాంబమసూరి, ఇతర వరి రకాలతో పోలిస్తే ఇందులో పిండి పదార్థాల శాతం తక్కువ. కాబట్టి ఇది షుగర్ వ్యాధిగ్రస్తులకు ఉపయోగపడుతుంది. తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ కలిగి ఉండడం వల్ల దీన్ని ‘షుగర్ ఫ్రీ రైస్’అనీ పిలుస్తున్నారు. పెట్టుబడి తక్కువ.. దిగుబడి ఎక్కువ ఉత్తర, మధ్య, దక్షిణ తెలంగాణ ప్రాంతాల్లోని అన్ని వ్యవసాయ వాతావరణ మండలాల్లో ‘తెలంగాణ సోనా’రకం సాగుకు అనుకూలమే. సాంబ మసూరి కన్నా దాదాపు 50 శాతం తక్కువ ఖర్చుతో, 20–30 శాతం ఎక్కువ దిగుబడిని సాధించవచ్చు. సాంబమసూరి (బీపీటీ–5204) స్థానంలో దీన్ని సాగుచేయవచ్చు. దీన్ని చౌడు నేలల్లో సాగు చేయకూడదు. 125 రోజుల పంట కాల పరిమితితో, ఆలస్యంగా నారు పోసుకోవడానికి అనుకూలమైన రకం. వానాకాలంలో ఆలస్యంగా విత్తుకునే రకం కనుక పచ్చిరొట్ట పంటలతో భూసారాన్ని పెంచుకోవచ్చు. సాంబమసూరి పంటకాలం 150 రోజులు. తెలంగాణ సోనా సాగు కాలం 125 రోజులే. కాటన్ దొర సన్నాలతో సమానమైన అధిక దిగుబడినిస్తుంది. హెక్టారుకు 7 టన్నుల వరకు ఉత్పత్తి వస్తుంది. 100 కిలోల ధాన్యానికి 68–70 కిలోల బియ్యం వస్తుంది. ఇది 100 సెంటీమీటర్ల ఎత్తు పెరుగుతుంది. గాలికి పడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి పంట యాజమాన్యంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మే ఆఖరి వారంలో నాటువేస్తే 150 రోజుల్లోనూ, జూన్ మొదటి, రెండో వారాల్లో నారుపోస్తే 130–140 రోజుల్లోనూ పంట వస్తుంది. జూలై రెండో వారం తరవాత నారుపోస్తే 120 రోజుల్లో, ఆగస్ట్‌లో పోస్తే 100 రోజుల్లోనే పంట చేతికొస్తుంది. వానాకాలంలో తప్పనిసరిగా జూలైలో మాత్రమే నారుపోసుకోవాలి. యాసంగిలోనూ ఇదే తరహాలో పంట వస్తుంది. నవంబర్ 15 ప్రాంతంలో నారుపోస్తే పంటకాలం 150 రోజులు. డిసెంబర్ 15 ప్రాంతంలో పోస్తే పంటకాలం 120రోజులు. జనవరిలో నారుపోస్తే 100 రోజుల్లో వస్తుంది. యాసంగిలో నవంబర్ 15 – డిసెంబర్ 7లోపు నారు పోయాలి. స్వల్పకాలిక రకాలే మేలు వాస్తవానికి, వానాకాలంతో పోలిస్తే యాసంగిలోనే వరి ఎక్కువ దిగుబడి వస్తుంది. యాసంగిలో అధిక సూర్యరశ్మి, తక్కువ చీడపీడలు, అనుకూల వాతావరణం ఉండడం ఇందుకు కారణమని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వానాకాలంలో తక్కువ సూర్యరశ్మి, తుపానుల తాకిడి, చీడపీడల ఉ«ధృతి ఎక్కువగా ఉండడం వల్ల దిగుబడులు తక్కువొస్తాయనేది వారి విశ్లేషణ. దీంతో వాతావరణ మార్పులు, చీడపీడలు, వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వరిలో మధ్య, స్వల్పకాలిక రకాలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో శాస్త్రవేత్తలు పలు రకాల వరి వంగడాలను రూపొందిస్తున్నారు. దీర్ఘకాలిక రకాలకు (150 రోజుల కాలపరిమితి గల పంట) ఎక్కువ నీరు, ఎక్కువ విద్యుత్ అవసరం. అంతేకాక పచ్చిరొట్ట పంటలువేసి భూమిలో కలియదున్నే సమయం ఉండదు. ప్రాజెక్టుల కింద ఆలస్యంగా నార్లుపోసి, నాట్లు పెట్టడం వల్ల చీడపీడలకు గురయ్యే ప్రమాదం ఉంది. ఇక, పూత సమయంలో వచ్చే చలి వల్ల తాలు గింజలు ఏర్పడి దిగుబడులు తగ్గిపోతాయి. దీంతో స్వల్పకాలిక రకాలను సాగు చేయడం ద్వారా నీటి వినియోగంతో పాటు సాగుఖర్చులు తగ్గించుకుని దిగుబడులు పెంచుకోవచ్చు. సాగులో దిగుబడులకు రెండు పద్ధతులుంటాయని, అందులో 50 శాతం సేద్యపు పద్ధతులపై దిగుబడులు ఆధారపడి ఉంటే, మరో 50 శాతం ఎంపిక చేసుకునే రకాన్ని బట్టి ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తెలంగాణ సోనాలాంటి స్వల్పకాలిక రకాలను ఎంపిక చేసుకోవడం ద్వారా యాజమాన్య పద్ధతులతో తక్కువ కాలంలో మంచి దిగుబడులు సాధించవచ్చంటున్నారు. అందుకే తెలంగాణ రైతన్నను ఈ వానాకాలం నుంచే ‘తెలంగాణ సోనా’సాగు దిశగా ప్రోత్సహించేందుకు వ్యవసాయశాఖ అన్ని ఏర్పాట్లుచేస్తోంది. -
‘అలాంటి ధాన్యం కొనుగోలు చేయోద్దు’
సాక్షి, మెదక్ : రైతు సమన్వయ సమితి సభ్యుల సహకారంతో పనిచేసి వరి ధాన్యం కొనుగోలులో ఇబ్బంది లేకుండా జాగ్రత్త తీసుకోవాలని అధికారులను మంత్రి హరీష్ రావు ఆదేశించారు. ప్రత్యేకంగా టోకెన్ జారీ చేయాలని, కనీస ప్రమాణాలు లేని ధాన్యాన్ని కొనుగోలు చేయోద్దని సూచించారు. శనివారం మెదక్ జిల్లాలో వరి ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా హారీష్ రావు మాట్లాడుతూ.. ‘‘ జిల్లాలో పండిన వరి ధాన్యం కోతకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వరికోత యంత్రాలు సిద్ధం చేయాలి. 350 వరికోత యంత్రాలు అవసరం. యంత్రాలకు డ్రైవర్స్, మెకానిక్‌లు అందుబాటులో ఉండేలా చూడాలి. అధికారులు, యంత్రాల అసోసియేషన్ వారితో సమావేశం ఏర్పాట్లు చేసి మాట్లాడాలి. ధాన్యం కొనుగోలుకు సరిపడా గన్నీ బ్యాగులు, ఇతర సామాగ్రి సిద్ధం చేసుకోవాల’’ని అన్నారు. -
‘శ్రీ’ పద్ధతిలో దిగుబడి ఘనం
సాక్షి,జగిత్యాల అగ్రికల్చర్: వరి పంటను రకరకాల పద్ధతుల్లో సాగు చేస్తున్నప్పటికీ ‘శ్రీ’ పద్ధతిలో వరిని సాగు చేస్తే అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉంది. ఇంగ్లిష్‌లో ‘శ్రీ’ అంటే ఎస్ఆర్ఐ (సిస్టమ్ ఆఫ్ రైస్ ఇంటెన్సిఫికేషన్). ఈ పద్ధతిని 1983లో మడగాస్కర్‌లో అభివృద్ధి చేశారు. శ్రీ పద్ధతిలో వరిని సాగు చేస్తే ఖర్చు లేకుండా ఎలా దిగుబడులు సాధించవచ్చనే విషయాల గురించి జగిత్యాలకు చెందిన క్రిషి సంస్థ ప్రతినిధి నర్సింగరావు(94410 35869) వివరించారు. ఎలాంటి నేలలు అనుకూలమంటే.. శ్రీ పద్ధతిలో సాగు చేయడానికి చౌడు నేలలు పనికి రావు. నీరు బాగా ఇంకే భూములు, చదునుగా ఉండే భూములు అనుకూలం. నీరు పెట్టినప్పుడు అవి పొలమంతా సమానంగా పారాలి. పచ్చిరొట్ట ఎరువులైన జనుము, జీలుగను వరినాట్ల కంటే 40 రోజుల ముందు విత్తుకొని, పూతకొచ్చే సమయానికి నీరు పెట్టి ట్రాక్టర్‌తో దమ్ము చేయాలి. 10 రోజులు మురిగిన తర్వాత నాట్లు వేయడానికి నేలను సిద్ధం చేసుకోవాలి. అలాగే 2500 కిలోల నాడెప్ కంపోస్టు వేయాలి. నాటే రోజు 125 కిలోల ఘన జీవామృతం వేయాలి. 30 రోజుల తర్వాత 125 కిలోల ఘన జీవామృతం వేయాలి. 45, 60 రోజులకొకసారి 200 లీటర్ల ద్రవజీవామృతాన్ని పారించాలి. నారును ఎలా పెంచాలంటే.. శ్రీ పద్ధతిలో 8 నుంచి 12 రోజుల నారును నాటుతారు. ఒక ఎకరానికి కావాల్సిన నారుకు 400 చదరపు అడుగుల నారుమడి కావాలి. నారుమడి తయారు చేసేటప్పుడు.. ఒకటవ పొరలో ఒక అంగుళం బాగా చివికిని పశువుల ఎరువు, 2వ పొరలో ఒకటిన్నర అంగుళాల మట్టి, 3వ పొరలో ఒక అంగుళం బాగా చివికిని పశువుల ఎరువు, 4వ పొరలో రెండున్నర అంగుళాల మట్టి.. ఇలా పొరలన్నింటినీ బాగా కలపాలి. నారుమడి చుట్టు కాలువ తీయాలి. వరి విత్తనాన్ని 12 గంటల పాటు నానబెట్టాలి. ఆ తర్వాత గోనెసంచిలో పోసి 24 గంటల పాటు గాలి తగలకుండా ఉంచాలి. మొలకెత్తిన 2 కిలోల విత్తనాలకు 100 గ్రాముల అజోస్పైరిల్లంతో విత్తన శుద్ది చేయాలి. ఈ విత్తనాన్ని నారుమడిలో చల్లాలి. అలా చల్లిన విత్తనంపై వరి గడ్డి కప్పి ఉదయం, సాయంత్రం నీరు పోయాలి. దీనివల్ల విత్తనం ఎండకు, వానకు నేరుగా గురికాకుండా ఉంటుంది. పక్షులు తినకుండా ఉంటాయి. ప్రధాన పొలం తయారీ పొలం దున్నడంలో మామూలు పద్ధతికి, శ్రీ పద్ధతికి ఏమి తేడా లేదు. పొలం చదునుగా ఉండాలి. నాట్లు వేసేటప్పుడు నీరు అసలు ఉండకూడదు. వరుసకు, వరుసకు, మొక్కకు మొక్కకు మధ్య 25 సెం.మీ. ఉండే విధంగా నాటాలి. చదరపు మీటర్‌కు 16 మొక్కలు పడతాయి. మొక్క బతుకుతుందో.. లేదో అనుకుంటే ఒక్కో చోట 2 మొక్కలు నాటవచ్చు. జంబు చేసిన పొలంలో మార్కర్‌ను ఉపయోగించి నాటాలి. వరిలో ప్రతి 2 మీటర్లకు 200 సెంమీ వెడల్పుతో కాలి బాటలను వదలాలి. వరి మొక్కలను పైపైన వేర్లు ఉండే విధంగా నాటాలి. నాటు వేయడానికి ఎకరానికి 10 మంది కూలీలు అవసరమవుతారు. కలుపు, నీటి యాజమాన్యం శ్రీ పద్ధతిలో నీరు ఎక్కువగా నిల్వ ఉండకపోవడం వల్ల కలుపు ఎక్కువగా ఉంటుంది. కలుపును చేతితో తీయడానికి బదులు దానిని భూమిలోకి కలిపి వేసేలా, కోనోవీడర్ పరికరాన్ని ఉపయోగించాలి. కలుపు పచ్చిరొట్టలా పనికొస్తుంది. నాటు వేసిన 10 రోజులకు మొదటి కలుపు తీయాలి. తర్వాత 10 రోజులకు ఒకసారి చొప్పున 5 సార్ల వరకు తీయాలి. పం టలో రెండు వైపులా వీడర్ నడిపితే కలుపు సమస్య చాల వరకు పరిష్కారమవుతుంది. ఇలా కలుపు తీయడం వల్ల వరి మొక్కల వేర్లు గాలి పోసుకుని బలంగా పెరుగుతాయి. పిలకలు బాగా పెడతాయి. భూమి, వాతావరణాన్ని బట్టి ఎన్ని రోజులకు ఒక తడి ఇవ్వాలో రైతులు నిర్ణయించుకోవాలి. ఒక రోజు ముందు పలుచగా నీరు పెట్టి వీడర్ నడపాలి. వరి పంట పొట్టదశకు వచ్చి నప్పటి నుంచి ఒక అంగుళం మేర నీరు నిలబెట్టాలి. గింజ 70 శాతం గట్టిపడే వరకు పొ లంలో నీరు పెట్టి ఆ తర్వాత తీసివేయాలి. పురుగులు, తెగుళ్ల యాజమాన్యం ఈ పద్ధతిలో పురుగులు, తెగుళ్ల బెడద సహజంగా తక్కువగా ఉంటుంది. ముందుజాగ్రత్తగా వరి నాటిన 10 రోజులకు నీమాస్త్రం, 30 రోజులకు బ్రహ్మాస్త్రం, 45 రోజులకు అగ్నిస్త్రం పిచికారి చేయడం వల్ల అన్ని రకాల పురుగులను నివారించొచ్చు. రసాయన ఎరువులు, కలుపు మందులు, పురుగుమందులు ఏవీ వాడరాదు. -
తగ్గిన ఖరీఫ్ వరి దిగుబడి
సాక్షి, హైదరాబాద్: ఖరీఫ్‌లో వరి ఉత్పత్తి గణనీయంగా తగ్గింది. 2017–18 ఖరీఫ్‌లో వరి ఉత్పత్తి లక్ష్యం 32.47 లక్షల టన్నులు కాగా, దిగుబడి 30.42 లక్షల టన్నులకు పడిపోయిందని ప్రభుత్వం వెల్లడించింది. ఈ మేరకు రెండో ముందస్తు అంచనా నివేదిక విడుదల చేసింది. 2 లక్షల టన్నులకుపైగా వరి ఉత్పత్తి పడిపోవడం గమనార్హం. మొత్తం ఆహారధాన్యాల ఉత్పత్తి లక్ష్యం 54.60 లక్షల మెట్రిక్ టన్నులు కాగా, కేవలం 50.29 లక్షల టన్నుల దిగుబడి వచ్చింది. అంటే, 4 లక్షల టన్నుల మేర ఆహార ఉత్పత్తులు తగ్గాయి. ఖరీఫ్‌లో ఆహారధాన్యాల ఉత్పత్తి ఆశించిన మేర లేకపోవడంతో రబీపైనే ప్రభుత్వం ఆశలు పెట్టుకుంది. రబీలో మొత్తం ఆహారధాన్యాల ఉత్పత్తి లక్ష్యం 36.28 లక్షల మెట్రిక్ టన్నులు కాగా, ఉత్పత్తి 44.72 లక్షల మెట్రిక్ టన్నులు అవుతుందని సర్కారు తాజా నివేదికలో అంచనా వేసింది. వరి ఉత్పత్తి లక్ష్యం 25.64 లక్షల మెట్రిక్ టన్నులు కాగా, 35.16 లక్షల టన్నుల దిగుబడి వస్తుందని అంచనా వేసింది. అయితే, రబీలో వరినాట్లు కేవలం 87 శాతానికే పరిమితం కావడం గమనార్హం. -
బియ్యం చౌక దందా కేక
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: మెతకు సీమ అక్రమ రేషన్ బియ్యం దందాకు అడ్డాగా మారింది. స్టాక్ మార్కెట్ తరహాలో సిద్దిపేట, మెదక్, పటాన్చెరు కేంద్రాలుగా ఈ వ్యాపారం జోరుగా సాగుతోంది. రోజుకు కనీసం రూ.30 లక్షల విలువైన రేషన్ బియ్యం దారి మళ్లుతున్నట్టు అంచనా! జిల్లాలో పేరున్న కొందరు డీలర్ల కనుసన్నల్లో వ్యాపారం నడుస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. జిల్లా అంతటా పలుచోట్ల బియ్యం నిల్వలను ఉంచి వాటిని రాత్రికి రాత్రే లారీల్లో తరలిస్తున్నారు. అయినా అటు పౌరసరఫరాల అధికారులు, ఇటు విజిలెన్స్ సిబ్బంది పట్టించుకోవడం లేదు. ఎక్కడికక్కడ నిల్వ కేంద్రాలు జిల్లాలో రేషన్ బియ్యం పక్కదారి పట్టడం, పే దల బియ్యాన్ని అక్రమార్కులు బొక్కేయడం కొత్తేమీ కాదు. అయితే, ఇటీవల ఈ దందా వే ళ్లూనుకుంది. దుబ్బాక, గజ్వేల్, సిద్దిపేట, సం గారెడ్డి, జోగిపేట, పటాన్చెరు నియోజకవర్గాల నుంచి సేకరించిన రేషన్ బియ్యాన్ని పఠాన్‌చెరు లో నిల్వ చేస్తున్నట్టు సమాచారం. మెదక్, నారాయణఖేడ్ నియోజకవర్గాల బియ్యాన్ని జహీరాబాద్‌లో ఉంచుతున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ గతంలో మూతపడిన ఓ రైస్‌మిల్లును అడ్డాగా చేసుకొన్నారు. రేషన్ షాపుల్లో బియ్యాన్ని టా టా ఏస్ వాహనాల్లో ఆయా పట్టణాల్లోని నిల్వ కేంద్రాలకు తరలిస్తారు. మళ్లీ అవే వాహనాల్లో రాత్రి వేళ లారీల్లోకి లోడ్ చేస్తారు. ఈ సరుకును హైదరాబాద్, నిజామాబాద్, మహారాష్ట్రలోని పలు పారాబాయిల్డ్ మిల్లులకు తరలిస్తారు. స్టాక్‌మార్కెట్ల తరహాలో... ఈ వ్యాపారంలో రోజుకు రూ.లక్షలు చేతులు మారుతున్నాయి. డీలర్ల నుంచి వ్యాపారులు రూ.10 కిలో చొప్పున కొనుగోలు చేస్తున్నారు. వాటిని రూ.18 చొప్పున మిల్లర్లకు విక్రయిస్తున్నారు. సరుకును రెండుమూడ్రోజుల్లో లారీల్లో ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఒక్కో లారీ లో 204 క్వింటాళ్ల బియ్యం తరలింపు లెక్క వే సుకున్నా మొత్తం రోజువారీ వ్యాపారం రూ.30 లక్షల వరకు జరుగుతోందని అంచనా. అయితే, ఈ రేటు కూడా నిలకడగా ఉండదు. కొన్ని రో జులుగా టాస్క్‌ఫోర్స్ దాడులు ఎక్కువైన నేపథ్యంలో వ్యాపారులు బియ్యం కొనలేమని చెప్పి డీలర్లకు కిలోకు రూ.8-7కు తగ్గించినట్టు తెలుస్తోంది. ఇలా స్టాక్ మార్కెట్ల తరహాలో రోజుకో రేటుతో వ్యాపారం జరుగుతున్నా అధికారులకు పట్టించుకోవడం లేదు. అప్పుడప్పుడూ పోలీ సులు అక్రమ రేషన్ బియ్యమంటూ ఒకటి, రెం డు ఆటోలను పట్టుకుని వదిలేస్తున్నారు. దీంతో వ్యాపారం షరా మామూలేగా మారింది. -
ధాన్యం.. వర్షార్పణం
కడెం, న్యూస్‌లైన్ : అన్నదాతపై ప్రకృతి కన్నెర్రజేసింది. కష్టపడి పండిం చిన పంట వర్షార్పణం అయింది.దీంతో రైతులు చాలా ఆందోళన చెందుతున్నారు. కడెం మండలంలో బుధవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి అంబారీపేట, పాండ్వాపూరు, లింగాపూరు తదితర గ్రామాల్లో చాలా వరకు రైతుల ధాన్యం దెబ్బతింది. పాండ్వాపూరు గ్రామంలోని ఐకేపీ వారి ధాన్యం కొనుగోలు కేంద్రంలోని ధాన్యం అంతా తడిసిపోయింది. కేంద్రంలో అమ్ముకునేందుకు తెచ్చిన రైతు ల ధాన్యం కూడా తడిసింది. కేంద్రంలో దాదాపు 2వేల క్విం టాళ్ల ధాన్యం తూకం చేసేందుకు తెచ్చిన ధాన్యం నీటిపాలైం ది. ఇక్కడ వీరబత్తుల రమేశ్, గోపు సత్తన్న, ఎండీ లాయక్, ముద్దసాని లక్ష్మణ్, బండి శంకర్, బండి అంజన్న, పిన్నం అంజన్నలతో పాటు పలువురు రైతుల ధాన్యం తడిసింది. అంబారీపేట గ్రామంలోని పీఏసీఎస్ వారి కేంద్రంలోని ధాన్యం కూడా వర్షానికి తడిసింది. కేంద్రంలో గల 1755 సంచులు ఇంకా వేముల రాయలింగు, అల్లంల భూమన్న, అల్లంల గంగన్న, పసుల రాజన్న, ఎంకోసి రాజన్న, బైరి భూమన్న, బూస మల్లేశ్, కొప్పుల నర్సయ్యలతో పాటు చాలా మంది ధాన్యం తడిసింది. కేంద్రంలో రైతులు తమ తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టుకుంటున్నారు. గ్రామం చివరన గల వేముల శేఖర్‌కు చెందిన పంట భూమిలో అతని వరి కుప్పపై పిడుగు పడడంతో ఆ కుప్ప మొత్తం దగ్ధమైంది.