సాక్షి, హైదరాబాద్: ఈ వానాకాలం సీజన్‌లో ఏకంగా 1.40 కోట్ల ఎకరాల్లో సాగు లక్ష్యంగా నిర్ణయించిన వ్యవసాయ శాఖ.. పత్తి, వరితో పాటు కంది పంటలను ప్రోత్సహించేలా ప్రణాళిక రూపొందించింది. దీంతో ఈసారి రాష్ట్రంలో కంది, పత్తి, వరి ఈ మూడు పంటలే అత్యధికంగా సాగు కానున్నాయి. గతంలో పత్తి, వరితో పాటు మొక్కజొన్న అధిక శాతం విస్తీర్ణంలో సాగవుతుండగా, ఈసారి మొక్కజొన్న స్థానంలో కంది పంట వచ్చి చేరింది. దేశంలో మొక్కజొన్న నిల్వలు ఎక్కువగా ఉండటం, ధర, డిమాండ్ లేని నేపథ్యంలో ఈ పంట సాగును తగ్గించాలని ప్రభుత్వం గత ఏడాదే నిర్ణయించింది. ఈ మేరకు అవసరమైన విత్తనాలను, ఎరువులను సక్రమంగా సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
పత్తి, వరికి మరింత ప్రోత్సాహం
2012–22 వానాకాలం సీజన్(ఖరీఫ్)కు సంబంధించిన సాగు ప్రణాళికను వ్యవసాయ శాఖ రూపొందించింది. గతేడాది వానాకాలంలో అన్ని పంటల సాధారణ సాగు విస్తీర్ణం 1.03 కోట్ల ఎకరాలు కాగా, ఈ సీజన్‌లో ఏకంగా 1.40 కోట్ల ఎకరాల్లో సాగు లక్ష్యంగా నిర్ణయించింది. గతేడాది పత్తి 44.50 లక్షల ఎకరాలు సాధారణ సాగుగా నిర్ధారించగా, 54.45 లక్షల ఎకరాల్లో సాగైంది. అయితే ఈసారి 70.04 లక్షల ఎకరాల సాధారణ సాగు విస్తీర్ణం ఉండాలని, ఆ మేరకు రైతులను ప్రోత్సహించాలని వ్యవసాయశాఖ నిర్ణయించింది.
పత్తికి మంచి ధర ఉండటం వల్లే ఈ నిర్ణయం తీసుకుంది. ఇక సాగు నీటి వసతి ఎక్కువగా ఉండటం వల్ల ఈసారి వరి సాధారణ సాగు విస్తీర్ణం పెరిగింది. గతేడాది వానాకాలం వరి సాధారణ సాగు విస్తీర్ణం 27.25 లక్షల ఎకరాలు కాగా, అప్పుడు 41.19 లక్షల ఎకరాల్లో సాగైంది. దీంతో ఈసారి వరి సాధారణ సాగు విస్తీర్ణాన్ని 41.85 లక్షల ఎకరాలుగా నిర్ధారించారు.
మొక్కజొన్న 22 శాతానికే పరిమితం
ఇప్పటివరకు పత్తి, వరి తర్వాత అత్యంత కీలకమైన పంటగా ఉన్న మొక్కజొన్న సాగు గణనీయంగా తగ్గనుంది. గతేడాది వానాకాలం సీజన్‌లో మొక్కజొన్న సాధారణ సాగు విస్తీర్ణం 11.76 లక్షల ఎకరాలు కాగా, అప్పుడు 10.11 లక్షల ఎకరాల్లో సాగైంది. అయితే ఈసారి మొక్కజొన్న సాధారణ సాగు విస్తీర్ణం కేవలం 2.27 లక్షల ఎకరాలుగా నిర్ణయించారు.
అంటే మొత్తం పంటల్లో దాదాపు 22.45 శాతానికే మొక్కజొన్న పరిమితం కానుంది. ఇక విత్తన కొరత, ఇతర కారణాలతో సోయాబీన్ సాగు కూడా తగ్గిపోనుంది. గతేడాది వానాకాలంలో సాధారణ సాగు విస్తీర్ణం 4.88 లక్షల ఎకరాలు కాగా, అప్పుడు 4.26 లక్షల ఎకరాల్లో సాగైంది. తాజాగా దీనిని కేవలం 1.33 లక్షల ఎకరాలకే పరిమితం చేశారు.
కందికి మంచిరోజులు
ఈసారి పత్తి, వరితో పాటు కంది సాగును బాగా ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతేడాది కంది సాధారణ సాగు విస్తీర్ణం 7.61 లక్షల ఎకరాలు కాగా, 7.38 లక్షల ఎకరాల్లో రైతులు సాగు చేశారు. అయితే ఈసారి వానాకాలంలో ఏకంగా 20 లక్షల ఎకరాల్లో కందిని సాగు చేయించాలని నిర్ణయించారు. ఈసారి 20 రకాల పంటలకు సంబంధించిన 1.40 కోట్ల సాధారణ సాగు విస్తీర్ణంలో పత్తి, కంది, వరి సాధారణ సాగు విస్తీర్ణమే ఏకంగా 1.31 కోట్ల ఎకరాలు (94.13 శాతం) ఉండటం గమనార్హం. ఇలావుండగా ఈ సీజన్‌కు మొత్తం 25.50 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను కేటాయించారు. వీటిలో ప్రస్తుతం 6.77 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నట్లు వ్యవసాయ శాఖ వెల్లడించింది.
చదవండి: Telangana: తొలి మాసం.. శుభారంభం
Comments
Please login to add a commentAdd a comment