ఉద్భవించిన ‘తెలంగాణ సోనా’ | Professor Jayashankar University Scientists Discovered New Variety Of Rice Telangana Sona | Sakshi
Sakshi News home page

మన ఘన తెలంగాణ సోనా

Published Thu, Jun 25 2020 12:59 AM | Last Updated on Thu, Jun 25 2020 9:23 AM

Professor Jayashankar University Scientists Discovered New Variety Of Rice Telangana Sona - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ధాన్య భాండాగారంగా జాతీయస్థాయి గుర్తింపు పొందిన తెలంగాణ రాష్ట్రం మరో అద్భుతమైన వరి వంగడం సాగుకు వేదిక కానుంది. నాటుపెట్టిన స్వల్పకాలంలోనే పంట దిగుబడి వచ్చే ఈ సన్న రకం ధాన్యం పేరు ‘తెలంగాణ సోనా’. ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు రూపొందించిన ఈ వరి రకం సాంబమసూరి కన్నా సన్నరకమే కాక.. దానికంటే తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడినిస్తుంది. ఎంటీయూ– 1010 రకాన్ని ఆడమొక్కగా, జేజీఎల్‌–3855 (కరీంనగర్‌ సాంబ) రకాన్ని మగమొక్కగా సంకరంచేసి రూపొందించిన ఈ వంగడంలో పిండి పదార్థాలు కూడా చాలా తక్కువని తేలింది. అందుకే దీన్ని ‘షుగర్‌ ఫ్రీ రైస్‌’ అని అంటున్నారు. ఇప్పుడు ఈ స్వల్పకాలిక సన్నరకం ధాన్యాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఈ వానాకాలంలో రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల ఎకరాల్లో సాగుకు ప్రణాళికలు రచిస్తోంది.

స్వల్పకాలిక దిగుబడులు ఇచ్చే వంగడాల ఉత్పత్తిలో భాగంగా ‘తెలంగాణ సోనా’ ఉద్భవించింది. ఇది సాంబమసూరి కన్నా సన్నగింజ పంట. మార్కెట్లో సన్న బియ్యానికి   మంచి డిమాండ్‌ ఉంది. సాంబమసూరి అగ్గితెగులు, దోమపోటు, ఆకు ఎండు తెగుళ్ల బారినపడుతుంది. వాటిని తట్టుకోలేదు. కానీ, తెలంగాణ సోనా అగ్గి తెగులును పూర్తిగా తట్టుకుంటుంది. ఆలస్యంగా నాటడం వల్ల దోమపోటును తప్పించుకుంటుంది. దీంతో పురుగుమందులపై ఖర్చు తగ్గుతుంది. పర్యావరణానికీ మేలు కలుగుతుంది. సాంబమసూరి, ఇతర వరి రకాలతో పోలిస్తే ఇందులో పిండి పదార్థాల శాతం తక్కువ. కాబట్టి ఇది షుగర్‌ వ్యాధిగ్రస్తులకు ఉపయోగపడుతుంది. తక్కువ గ్లైసిమిక్‌ ఇండెక్స్‌ కలిగి ఉండడం వల్ల దీన్ని ‘షుగర్‌ ఫ్రీ రైస్‌’అనీ పిలుస్తున్నారు.
పెట్టుబడి తక్కువ.. దిగుబడి ఎక్కువ

  • ఉత్తర, మధ్య, దక్షిణ తెలంగాణ ప్రాంతాల్లోని అన్ని వ్యవసాయ వాతావరణ మండలాల్లో ‘తెలంగాణ సోనా’రకం సాగుకు అనుకూలమే. సాంబ మసూరి కన్నా దాదాపు 50 శాతం తక్కువ ఖర్చుతో, 20–30 శాతం ఎక్కువ దిగుబడిని సాధించవచ్చు. సాంబమసూరి (బీపీటీ–5204) స్థానంలో దీన్ని సాగుచేయవచ్చు. దీన్ని చౌడు నేలల్లో సాగు చేయకూడదు.
  • 125 రోజుల పంట కాల పరిమితితో, ఆలస్యంగా నారు పోసుకోవడానికి అనుకూలమైన రకం. వానాకాలంలో ఆలస్యంగా విత్తుకునే రకం కనుక పచ్చిరొట్ట పంటలతో భూసారాన్ని పెంచుకోవచ్చు.
  • సాంబమసూరి పంటకాలం 150 రోజులు. తెలంగాణ సోనా సాగు కాలం 125 రోజులే. కాటన్‌ దొర సన్నాలతో సమానమైన అధిక దిగుబడినిస్తుంది. హెక్టారుకు 7 టన్నుల వరకు ఉత్పత్తి వస్తుంది. 100 కిలోల ధాన్యానికి 68–70 కిలోల బియ్యం వస్తుంది.
  • ఇది 100 సెంటీమీటర్ల ఎత్తు పెరుగుతుంది. గాలికి పడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి పంట యాజమాన్యంలో జాగ్రత్తలు తీసుకోవాలి.
  • మే ఆఖరి వారంలో నాటువేస్తే 150 రోజుల్లోనూ, జూన్‌ మొదటి, రెండో వారాల్లో నారుపోస్తే 130–140 రోజుల్లోనూ పంట వస్తుంది. జూలై రెండో వారం తరవాత నారుపోస్తే 120 రోజుల్లో, ఆగస్ట్‌లో పోస్తే 100 రోజుల్లోనే పంట చేతికొస్తుంది. వానాకాలంలో తప్పనిసరిగా జూలైలో మాత్రమే నారుపోసుకోవాలి.
  • యాసంగిలోనూ ఇదే తరహాలో పంట వస్తుంది. నవంబర్‌ 15 ప్రాంతంలో నారుపోస్తే పంటకాలం 150 రోజులు. డిసెంబర్‌ 15 ప్రాంతంలో పోస్తే పంటకాలం 120రోజులు. జనవరిలో నారుపోస్తే 100 రోజుల్లో వస్తుంది. యాసంగిలో నవంబర్‌ 15 – డిసెంబర్‌ 7లోపు నారు పోయాలి.

స్వల్పకాలిక రకాలే మేలు
వాస్తవానికి, వానాకాలంతో పోలిస్తే యాసంగిలోనే వరి ఎక్కువ దిగుబడి వస్తుంది. యాసంగిలో అధిక సూర్యరశ్మి, తక్కువ చీడపీడలు, అనుకూల వాతావరణం ఉండడం ఇందుకు కారణమని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వానాకాలంలో తక్కువ సూర్యరశ్మి, తుపానుల తాకిడి, చీడపీడల ఉ«ధృతి ఎక్కువగా ఉండడం వల్ల దిగుబడులు తక్కువొస్తాయనేది వారి విశ్లేషణ. దీంతో వాతావరణ మార్పులు, చీడపీడలు, వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వరిలో మధ్య, స్వల్పకాలిక రకాలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో శాస్త్రవేత్తలు పలు రకాల వరి వంగడాలను రూపొందిస్తున్నారు. దీర్ఘకాలిక రకాలకు (150 రోజుల కాలపరిమితి గల పంట) ఎక్కువ నీరు, ఎక్కువ విద్యుత్‌ అవసరం. అంతేకాక పచ్చిరొట్ట పంటలువేసి భూమిలో కలియదున్నే సమయం ఉండదు. ప్రాజెక్టుల కింద ఆలస్యంగా నార్లుపోసి, నాట్లు పెట్టడం వల్ల చీడపీడలకు గురయ్యే ప్రమాదం ఉంది. ఇక, పూత సమయంలో వచ్చే చలి వల్ల తాలు గింజలు ఏర్పడి దిగుబడులు తగ్గిపోతాయి.

దీంతో స్వల్పకాలిక రకాలను సాగు చేయడం ద్వారా నీటి వినియోగంతో పాటు సాగుఖర్చులు తగ్గించుకుని దిగుబడులు పెంచుకోవచ్చు. సాగులో దిగుబడులకు రెండు పద్ధతులుంటాయని, అందులో 50 శాతం సేద్యపు పద్ధతులపై దిగుబడులు ఆధారపడి ఉంటే, మరో 50 శాతం ఎంపిక చేసుకునే రకాన్ని బట్టి ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తెలంగాణ సోనాలాంటి స్వల్పకాలిక రకాలను ఎంపిక చేసుకోవడం ద్వారా యాజమాన్య పద్ధతులతో తక్కువ కాలంలో మంచి దిగుబడులు సాధించవచ్చంటున్నారు. అందుకే తెలంగాణ రైతన్నను ఈ వానాకాలం నుంచే ‘తెలంగాణ సోనా’సాగు దిశగా ప్రోత్సహించేందుకు వ్యవసాయశాఖ అన్ని ఏర్పాట్లుచేస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement