
ఆ నగరం.. ఒకప్పుడు చెత్త కుప్పలతో నిండి ఉండేది, విచ్చలవిడిగా పందులు, కుక్కలు తిరుగుతుండేవి.. వాటి విసర్జన కుప్పలు ఈగల సమూహాలతో వీధులు నిండిపోయేవి.. ఇలాంటి అత్యంత అపరిశుభ్ర పరిస్థితుల మధ్య నుంచి.. తనను తాను మార్చుకుంటూ.. కొత్తగా మలుచుకుంటూ ఇప్పుడు అత్యంత పరిశుభ్ర నగరంగా అవతరించింది ఇండోర్. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఈ క్లీనెస్ట్ సిటీ ఆఫ్ ఇండియా.. ఇండోర్ సక్సెస్ సీక్రెట్స్ ఏంటి? ఈ స్థానంలో మన హైదరాబాద్ నగరం కూడా చోటు దక్కించుకోగలదా?
దేశంలోని 471 పట్టణాలు, నగరాల్లో అత్యంత పరిశుభ్రమైన నగరం అనే అవార్డును ఎనిమిది సంవత్సరాలుగా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరం గెలుస్తూనే ఉంది. ఇదే ఇండోర్ నగరం 2017కి ముందు, పరిశుభ్రత ర్యాంకింగ్స్‌లో 25వ స్థానంలో ఉంది. దీనికి కారణాలేమిటి? మన ఇండియాలోనే ఉన్నామా? ‘మనం విమానాశ్రయం నుంచి బయటకు వచ్చినప్పుడు, రోడ్డు చూడగానే భారతదేశంలో లేమేమో అనిపిస్తుంది, అంత పరిశుభ్రంగా ఉంటుంది అని నగరం నుంచి ఉద్యోగ బాధ్యతల నిమిత్తం తరచూ ఇండోర్‌కు రాకపోకలు సాగించే కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ నితీష్ అంటున్నారు.
మన నగరంలో పలు కుటుంబాలు తమ ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకుంటాయి. కానీ ముందు తలుపు నుంచి కొన్ని అడుగుల దూరంలో చెత్త కుప్పలుగా పోగుబడి ఉంటుంది. ‘ఆ కుప్ప ప్రాంతం వేరొకరి బాధ్యతగా భావిస్తారు. దీంతో తమ పరిశుభ్రమైన ఇంటికి దుర్వాసనతో కూడిన ఆ చెత్త కుప్ప మీదుగా వెళ్లడంలో ఎవరూ ఎటువంటి ఇబ్బందీ పడరు’ అయితే ఇండోర్‌లో దీనికి భిన్నమైన దృశ్యం కనిపిస్తుందని చెప్పారాయన. ఈ సందర్భంగా ఆయన పంచుకున్న కొన్ని ఇండోర్ ‘విజయ’విశేషాలు..
క్లీన్ టూ విన్..
పేవ్‌మెంట్‌లు, రోడ్ డివైడర్‌లు రీసైకిల్ చేసిన నీటి గొట్టాలను కలిగి ఉంటాయి. అక్కడి చెత్త వ్యాన్‌లు ఇండోర్ నంబర్ వన్‌గా మారింది అనే జింగిల్‌ను పదే పదే ప్లే చేస్తుంటాయి. ఆ శబ్దం తమను సమీపిస్తుండగానే జనం తమ ఇళ్లలో నుంచి తమ చెత్త బుట్టలతో బయటపడతారు. అతి చిన్న సందులో ఉండే వేలాది విభిన్న రంగుల డబ్బాల నుంచి వ్యర్థాలను తొలగించి, శుద్ధి చేసే విధానం అమలు చేసేందుకు దాదాపు 850 మంది పారిశుధ్య సిబ్బంది సైన్యం తరహాలో సిద్ధంగా ఉంటుంది.
ఇవీ కీలకాంశాలు..
జీపీఎస్ ట్రాకింగ్ ఉపయోగించి, ఓ ప్రత్యేక బృందం చెత్త వ్యాన్‌ల కదలికలను నిరంతరం పర్యవేక్షిస్తుంది, వారు తమ పనిని నిర్ధేశించిన విధంగా చేస్తున్నారో లేదో సునిశితంగా పరిశీలిస్తారు.
గృహస్థుల వ్యర్థాలను తడి, ఎల్రక్టానిక్స్, ప్లాస్టిక్స్, నాన్‌ప్లాస్టిక్, బయోమెడికల్, ప్రమాదకర పదార్థాలుగా విభజన జరుగుతుంది.
వ్యర్థాలను ఇంధనంగా, కంపోస్టుగా మార్చి రైతులకు ఎరువుగా విక్రయిస్తున్నారు. చాలా రెస్టారెంట్లు మొబైల్ కంపోస్టింగ్ వ్యాన్‌లను రెస్టారెంట్స్ బయట
ఉంచుతాయి.పండ్లు, కూరగాయల మార్కెట్‌లో వివిధ రకాల వ్యర్థాల కోసం వేర్వేరు డబ్బాలు ఏర్పాటు చేసి ఉంటాయి. అక్కడ ఒక యంత్రం కూడా ఉంది. ఇది వ్యర్థాలను సిటీ బస్సుల కోసం వాడే, అలాగే వంటకు ఉపయోగించే ఇంధనంగా మారుస్తుంది.
తమ నగరం పరిశుభ్రత పరంగా దేశంలోనే నెంబర్ వన్ అనే టైటిల్ ప్రతి ఒక్కరికీ స్ఫూర్తినిచ్చే ఒక ఇంధనంగా మారింది. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుతామని పాఠశాల విద్యార్థులు ప్రతి రోజూ ప్రతిజ్ఞ చేస్తారు.
సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎవరైనా చెత్త వేసినట్లు గుర్తిస్తే వెంటనే జరిమానాలు విధించడం లాంటి కట్టుదిట్టమైన చట్టాలు ఉన్నాయి.
స్థానిక ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో పరిశుభ్రత పోటీలను నిర్వహిస్తున్నారు. మతపరమైన గ్రంథాలను ఆధారం చేసుకుని, పరిశుభ్రత అవసరాన్ని తలకెక్కించడానికి, మత పెద్దలను కూడా ఈ కార్యక్రమంలో భాగం చేశారు. హోలీ వంటి పండుగల సందర్భంగా, వీధులు, భవనాలు రంగులతో తడిసినప్పుడు, అదనపు వాహనాలు నీటి ట్యాంకర్లు నగరాన్ని శుభ్రం చేయడానికి శరవేగంగా బయటకు వస్తాయి.
ప్రజలు ప్రభుత్వాలు తలచుకుంటే ఇండోర్ విజయాన్ని మన నగరంలో కూడా పునరావృతం చేయవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ‘స్వచ్ఛందంగా ముందుకొచ్చే ప్రజానీకం, దృఢమైన చిత్తశుద్ధి కలిగిన ప్రభుత్వం ఉంటే తరతరాలుగా వస్తున్న కొన్ని ‘చెత్త’ అలవాట్లు మారతాయి’ అంటున్నారాయన.
(చదవండి: కోర్టులు ఆమెను గౌరవించాయి..! ఐనా ఆ ఒక్క ఉద్యోగమే కాదు..)