భారతదేశంలోనే స్వచ్ఛ నగరంగా ఇండోర్ వరుసగా ఆరోసారి తొలిస్థానం దక్కించుకున్న సంగతి తెలిసిందే. ఐతే ఇండోర్ నగరమే ఎందుకు ఆ ఘనతను దక్కించుకోగలిగందంటే..ఎక్కడైన పొడిచెత్తను, తడిచెత్తను విభజించడం సర్వసాధారణం. కానీ ఇండోర్‌లో మాత్రం చెత్త సేకరణ వద్దే ఆరు విభాగాలుగా విభజిస్తారు. మధ్యప్రదేశ్ రాష్ట్ర వాణిజ్య రాజధానిగా పిలిచే ఇండోర్ సుమారు 35 లక్షల జనాభా కలిగిన అతి పెద్ద నగరం. ప్రతిరోజు దాదాపు 1200 టన్నుల పొడి చెత్త, సుమారు 700 టన్నుల తడి చెత్తను విడుదల చేస్తున్నప్పటికీ చెత్త డబ్బాల్లో చెత్త మాత్రం కనిపించదు.
ఎందుకంటే... అక్కడ దాదాపు 850 వాహనాలతో గృహాలు, వ్యాపార సంస్థలను నుంచి సేకరించే వేస్ట్‌ను ఆరు విభాగాలు విభజించి ఎప్పటికప్పుడూ తరలిస్తారని ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్ సూపరింటెండెంట్ ఇంజనీర్ మహేష్ శర్మ తెలిపారు. వాహానాల్లోని వ్యర్థాలకు సంబంధించి ప్రత్యేక కంపార్ట్‌మెంట్‌లు ఉంటాయి. దీంతో సేకరణ ప్రారంభంలోనే సమర్ధవంతంగా ఆ వేస్ట్‌ని ప్రాసెస్ చేసేందుకు సులభంగా ఉంటుంది. ప్రధానంగా సేకరించిన తడి చెత్త కోసం బయో సీఎన్‌జీ(కంప్రెషన్ నేచురల్ గ్యాస్) ప్లాంట్ ఏర్పాటు చేశారు.
ఈ ప్లాంట్ ఆసియాలోనె అతిపెద్దది. ఈ ఏడాది ఫిబ్రవరి 19న ప్రధాని నరేంద్ర మోదీ 150 కోట్లతో ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్‌ని ప్రారంభించారు. ఈ ప్లాంట్ రోజుకు 550 మిలియన్ టన్నుల పొడి చెత్తను ప్రాసెస్ చేయడమే కాకుండా సుమారు 17 వేల నుంచి 18 వేల కిలోల బయో సీఎన్‌జీ తోపాటు దాదాపు 10 టన్నుల సేంద్రీయ ఎరువును ఉత్పత్తి చేయగలదు. ఈ సీఎన్‌జీతో దాదాపు 150 సీటీ బస్సులు నడుపుతోంది.
దీని ధర వాణిజ్య సీఎన్‌జీ కంటే రూ. 5లు తక్కువ కూడా. గత ఆర్థిక సంవత్సరంలో వ్యర్థాల తొలగింపుతో సుమారు రూ. 14 కోట్లు ఆర్జించింది. అందులో కార్బన్ క్రెడిట్ అమ్మకం ద్వారానే దాదాపు రూ. 8 కోట్లు కాగా, బయో సీఎన్‌జీ ప్లాంట్‌కి వ్యర్థాలను సరఫరా చేసినందుకు ప్రైవేట్ కంపెనీ నుంచి వార్షిక ప్రీమియం సుమారు రూ. 2 కోట్లు ఆర్జించింది.
ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో ఈ వ్యర్థాల తొలగింపుతో దాదాపు రూ. 20 కోట్లు ఆర్జించాలని పౌర సంఘం లక్ష్యంగా పెట్టుకుందని సూపరింటెండెంట్ మహేష్ శర్మ చెప్పారు. అంతేకాదు నగరంలో విడుదలయ్యే మరుగు నీటిని సైతం ప్రత్యేక ప్లాంట్‌లలో శుద్ధి చేసి సుమారు 200 పబ్లిక్ గార్డెన్‌లు, పొలాలు, నిర్మాణ కార్యకలాపాలకు తిరిగి ఉపయోగిస్తారని ఉద్యానవన అధికారి చేతన్ పాట్ తెలిపారు.
(చదవండి: దేశంలోనే స్వచ్ఛ నగరంగా మళ్లీ ‘ఇండోర్’.. విజయవాడకు నాలుగో స్థానం)
Comments
Please login to add a commentAdd a comment