Telangana Sona rice
-
కడుపు నిండుగా.. షుగర్‌కు దూరంగా..!
ఏ రోజైనా వేరే ఏం తిన్నా, ఎంత తిన్నా.. కాసింత అన్నం కడుపులో పడితే తప్ప మనసున పట్టదు.. కూరలు ఏవైనా చేత్తో కలుపుకొంటూ ఇంత అన్నం తింటే ఉండే తృప్తే వేరు. కానీ మధుమేహం (షుగర్) వ్యాధి వచ్చి.. ఈ సంతృప్తి లేకుండా చేస్తోంది. అన్నం త్వరగా అరిగి, శరీరంలోకి వేగంగా గ్లూకోజ్ విడుదల కావడం.. రక్తంలో షుగర్ స్థాయిలు వేగంగా పెరిగిపోయే అవకాశం ఉండటమే దీనికి కారణం. దీనితో షుగర్‌తో బాధపడుతున్నవారు అన్నాన్ని చూస్తూనే నోరు కట్టేసుకుంటున్నారు. పెద్దగా అలవాటు లేకపోయినా, తినడానికి కాస్త ఇబ్బందిగా ఉన్నా.. గోధుమ, జొన్న రొట్టెలనో.. కొర్రలు, ఊదలతో చేసిన అన్నమో తింటున్నారు. కానీ షుగర్ బాధితులు పెద్దగా గాభరా అవసరం లేకుండా హాయిగా లాగించేయడానికి వీలైన బియ్యం రకమే.. ‘తెలంగాణ సోనా’. సాధారణ బియ్యంతో పోలిస్తే.. ఈ బియ్యం గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువని, రక్తంలో వేగంగా షుగర్ లెవల్స్ పెరిగే సమస్య తక్కువని తెలంగాణ వ్యవసాయ శాస్త్రవేత్తలు చెప్తున్నారు.మన వ్యవసాయ వర్సిటీలోనే అభివృద్ధి.. అన్నం తింటే రక్తంలో షుగర్ స్థాయి వేగంగా పెరుగుతుందన్న భయంతో నడి వయస్కులు కూడా ఆహార అలవాట్లను మార్చుకుంటున్నారు. షుగర్ వచ్చినవారు, యాభై ఏళ్లు దాటినవారైతే నోటికి తాళం వేసుకుంటున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న దాదాపు అన్ని రకాల బియ్యంతోనూ ఇదే సమస్య. అదే ‘తెలంగాణ సోనా (ఆర్ఎన్ఆర్–15048)’రకంతో ఈ ఇబ్బంది ఉండదని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మిగతా రకాల బియ్యంతో పోలిస్తే.. ఈ రకం బియ్యం గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువని, మనకిష్టమైన అన్నం తింటూనే షుగర్‌ను నియంత్రణలో పెట్టుకోవచ్చని వివరిస్తున్నారు. ఈ తెలంగాణ సోనా బియ్యం ప్రత్యేకతలకు సంబంధించి అమెరికా ‘జర్నల్ ఆఫ్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్’లోనూ ఆర్టికల్ ప్రచురితమైందని చెబుతున్నారు. ఈ బియ్యం గ్లైసిమిక్ ఇండెక్స్ 51.5 మాత్రమే. ఈ రకాన్ని వ్యవసాయ వర్సిటీ శాస్త్రవేత్తలే అభివృద్ధి చేయడం గమనార్హం. సరిహద్దులు దాటిన తెలంగాణ సోనా ‘షుగర్ ఫ్రీ రైస్’గా పేరు తెచ్చుకున్న తెలంగాణ సోనా బియ్యానికి దేశంలోని వివిధ రాష్ట్రాలతోపాటు విదేశాల్లోనూ డిమాండ్ పెరుగుతోంది. దీంతో ఈ రకం వరిని పండించేందుకు వివిధ రాష్ట్రాల రైతులు మొగ్గుచూపుతున్నారు. మిగతా సన్నరకాల వరితో పోల్చితే పెట్టుబడి ఖర్చు తక్కువగా ఉండటం, తక్కువ కాలంలోనే పంట చేతికి రావడం, అన్ని కాలాల్లోనూ సాగుకు అనుకూలం కావడంతో.. ‘తెలంగాణ సోనా’రకం వరి సాగు విస్తీర్ణం పెరుగుతోంది. మూడేళ్ల క్రితం రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలకే పరిమితమైన తెలంగాణ సోనా సాగు.. ఇప్పుడు ఎనిమిది రాష్ట్రాలకు విస్తరించింది. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌తోపాటు పలు ఉత్తరాది రాష్ట్రాల్లోనూ సాగు చేస్తున్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం లెక్కల ప్రకారం తెలంగాణలో రెండు సీజన్లలో కలిపి 20 లక్షల ఎకరాల్లో తెలంగాణ సోనా వరి సాగవుతోంది. ఇతర రాష్ట్రాల్లో మరో 30 లక్షల ఎకరాలు సాగు చేస్తున్నారు. సాధారణంగా ఇతర సన్నరకాల వడ్లను మిల్లింగ్ చేస్తే.. 50 నుంచి 60 కిలోల బియ్యమే వస్తాయి. నూకల శాతం ఎక్కువగా ఉంటుంది. తెలంగాణ సోనా రకమైతే 68 నుంచి 70 కిలోల వరకు బియ్యం వస్తున్నాయని.. ఈ రకం సాగు వ్యవధి మిగతా వాటి కంటే 20 రోజులు తక్కువకావడం వల్ల ఫెర్టిలైజర్ వాడకం కూడా తక్కువేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆన్లైన్లో భారీగా వ్యాపారం తెలంగాణ సోనా బియ్యానికి మార్కెట్లో డిమాండ్ పెరిగింది. షుగర్ బాధితులతోపాటు సాధారణ వ్యక్తులూ దీనిపై ఆసక్తి చూపిస్తున్నారు. దీనితో ఆన్లైన్లో ఈ బియ్యం వ్యాపారం పెరిగింది. అమెజాన్ వంటి ప్రముఖ ఈ–కామర్స్ సైట్లలోనూ తెలంగాణ సోనా విక్రయాలు సాగుతున్నాయి. ‘డయాబెటిక్ కంట్రోల్ వైట్ రైస్, డయాబెటిక్ కేర్ రైస్, షుగర్ కంట్రోల్ రైస్, డెక్కన్ ముద్ర లో జీఐ, గ్రెయిన్ స్పేస్ తెలంగాణ సోనా రైస్, డాక్టర్ రైస్ డయాబెటిక్ రైస్’తదితర పేర్లతో ఆన్లైన్లో లభ్యమవుతున్నాయి.అయితే ఈ పేరిట అమ్ముతున్నదంతా తెలంగాణ సోనా రకమేనా అన్నది తేల్చడం, పక్కాగా అదేనా, కాదా అని గుర్తుపట్టడం కష్టమేనని నిపుణులు చెప్తున్నారు. ఈ క్రమంలోనే ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ)తోపాటు పలు సంస్థలు, వ్యక్తులతో వ్యవసాయ విశ్వవిద్యాలయం తెలంగాణ సోనా బ్రాండింగ్‌పై అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. గ్లైసిమిక్ ఇండెక్స్ ఏంటి? దానితో సమస్యేమిటి? మనం తీసుకునే ఏ ఆహారమైనా ఎంత వేగంగా అరిగిపోయి, శరీరంలోకి ఎంత గ్లూకోజ్‌ను విడుదల చేస్తుందనే లెక్కను గ్లైసిమిక్ ఇండెక్స్(జీఐ)తో కొలుస్తారు. జీఐ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకుంటే.. రక్తంలో షుగర్ స్థాయిలు అంత వేగంగా పెరుగుతాయన్న మాట. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు తీవ్రమైన సమస్యగా మారుతుంది. బియ్యంతో చేసిన అన్నం ఎక్కువ. 1–55 మధ్య ఉంటే తక్కువగా అని.. 56–69 ఉంటే మధ్యస్థమని.. 70 శాతానికి పైగా ఉంటే అత్యధికమని చెబుతారు. సాధారణంగా బియ్యం గ్లైసిమిక్ ఇండెక్స్ 79.22 వరకు ఉంటుంది. అందుకే షుగర్ బాధితులు అన్నం తగ్గించి, ఇతర ఆహారం తీసుకుంటారు. అయితే తెలంగాణ సోనా గ్లైసిమిక్ ఇండెక్స్ 51.5 వరకే ఉంటుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అయితే హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ‘జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) మాత్రం తెలంగాణ సోనాలో మరీ అంత తక్కువగా గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండదని పేర్కొంది. ఓ మోతాదు మేరకు తినొచ్చుసాధారణ బియ్యంతో పోలిస్తే తెలంగాణ సోనా గ్లైసిమిక్ ఇండెక్స్ త క్కువని వ్యవసాయ విశ్వవిద్యాల యం శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ లెక్కన చూ స్తే ఇతర రకాల బియ్యం కంటే తెలంగాణ సోనాతో ప్రయోజనం ఉంటుందని చెప్పవచ్చు.మధుమే హం బాధితులు ఓ మోతాదు వరకు ఈ బియ్యంతో వండిన అన్నం తీసుకో వచ్చు. దక్షిణ భారతంలో వేల ఏళ్లుగా అన్నమే ప్రధాన ఆహారం. అన్నం తింటేనే కాస్త సంతృప్తి. అందువల్ల మధు మేహ బాధితులు వైద్యులను సంప్రదించి.. ఎంత మేరకు ఈ అన్నం తినవచ్చన్నది నిర్ధారించుకుని వాడితే మంచిది. – ప్రొఫెసర్ కిరణ్ మాదల, గాంధీ మెడికల్ కాలేజీ, హైదరాబాద్ బాధితులకు తెలంగాణ సోనాతో మేలు తెలంగాణ సోనా రకం బియ్యంతో వండిన అన్నాన్ని షుగర్ బాధితులు తీసుకో వచ్చు. ఇది మెల్లగా జీర్ణమవుతుంది. గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ కావడం వల్ల గ్లూకోజ్ లెవల్స్ వేగంగా పెరగవు. షుగర్ బాధితులేకాదు.. మిగతా వారంతా ఈ బియ్యాన్ని వాడటం వల్ల ప్రయోజనం ఉంటుంది. – డాక్టర్ ఆర్.జగదీశ్వర్, రిటైర్డ్ పరిశోధన సంచాలకుడు, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈ బియ్యంలో పిండి పదార్థాలు తక్కువ సాంబమసూరి, ఇతర వరి రకాలతో పోలిస్తే తెలంగాణ సోనా బియ్యంలో పిండి పదార్థాల శాతం తక్కువ. కాబట్టి ఇది షుగర్ బాధితులకు ఉపయోగపడుతుంది. వాస్తవంగా షుగర్ నియంత్రణ కోసం ఈ వరి వంగడాన్ని తయారు చేయలేదు. రూపొందించిన తర్వాత అందులో గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువని తేలింది. పలు పరిశోధనల తర్వాత వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 2015లో తెలంగాణ సోనాను అభివృద్ధి చేసింది. రకం సాగుతో రైతులకూ ప్రయోజనం. పెట్టుబడి తక్కువ. దిగుబడి ఎక్కువ. – డాక్టర్ వై.చంద్రమోహన్, ప్రిన్సిపల్ సైంటిస్ట్, రైస్బ్రీడర్, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం– సాక్షి, హైదరాబాద్Suh -
ఉద్భవించిన ‘తెలంగాణ సోనా’
సాక్షి, హైదరాబాద్: ధాన్య భాండాగారంగా జాతీయస్థాయి గుర్తింపు పొందిన తెలంగాణ రాష్ట్రం మరో అద్భుతమైన వరి వంగడం సాగుకు వేదిక కానుంది. నాటుపెట్టిన స్వల్పకాలంలోనే పంట దిగుబడి వచ్చే ఈ సన్న రకం ధాన్యం పేరు ‘తెలంగాణ సోనా’. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు రూపొందించిన ఈ వరి రకం సాంబమసూరి కన్నా సన్నరకమే కాక.. దానికంటే తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడినిస్తుంది. ఎంటీయూ– 1010 రకాన్ని ఆడమొక్కగా, జేజీఎల్–3855 (కరీంనగర్ సాంబ) రకాన్ని మగమొక్కగా సంకరంచేసి రూపొందించిన ఈ వంగడంలో పిండి పదార్థాలు కూడా చాలా తక్కువని తేలింది. అందుకే దీన్ని ‘షుగర్ ఫ్రీ రైస్’ అని అంటున్నారు. ఇప్పుడు ఈ స్వల్పకాలిక సన్నరకం ధాన్యాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఈ వానాకాలంలో రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల ఎకరాల్లో సాగుకు ప్రణాళికలు రచిస్తోంది. స్వల్పకాలిక దిగుబడులు ఇచ్చే వంగడాల ఉత్పత్తిలో భాగంగా ‘తెలంగాణ సోనా’ ఉద్భవించింది. ఇది సాంబమసూరి కన్నా సన్నగింజ పంట. మార్కెట్లో సన్న బియ్యానికి మంచి డిమాండ్ ఉంది. సాంబమసూరి అగ్గితెగులు, దోమపోటు, ఆకు ఎండు తెగుళ్ల బారినపడుతుంది. వాటిని తట్టుకోలేదు. కానీ, తెలంగాణ సోనా అగ్గి తెగులును పూర్తిగా తట్టుకుంటుంది. ఆలస్యంగా నాటడం వల్ల దోమపోటును తప్పించుకుంటుంది. దీంతో పురుగుమందులపై ఖర్చు తగ్గుతుంది. పర్యావరణానికీ మేలు కలుగుతుంది. సాంబమసూరి, ఇతర వరి రకాలతో పోలిస్తే ఇందులో పిండి పదార్థాల శాతం తక్కువ. కాబట్టి ఇది షుగర్ వ్యాధిగ్రస్తులకు ఉపయోగపడుతుంది. తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ కలిగి ఉండడం వల్ల దీన్ని ‘షుగర్ ఫ్రీ రైస్’అనీ పిలుస్తున్నారు. పెట్టుబడి తక్కువ.. దిగుబడి ఎక్కువ ఉత్తర, మధ్య, దక్షిణ తెలంగాణ ప్రాంతాల్లోని అన్ని వ్యవసాయ వాతావరణ మండలాల్లో ‘తెలంగాణ సోనా’రకం సాగుకు అనుకూలమే. సాంబ మసూరి కన్నా దాదాపు 50 శాతం తక్కువ ఖర్చుతో, 20–30 శాతం ఎక్కువ దిగుబడిని సాధించవచ్చు. సాంబమసూరి (బీపీటీ–5204) స్థానంలో దీన్ని సాగుచేయవచ్చు. దీన్ని చౌడు నేలల్లో సాగు చేయకూడదు. 125 రోజుల పంట కాల పరిమితితో, ఆలస్యంగా నారు పోసుకోవడానికి అనుకూలమైన రకం. వానాకాలంలో ఆలస్యంగా విత్తుకునే రకం కనుక పచ్చిరొట్ట పంటలతో భూసారాన్ని పెంచుకోవచ్చు. సాంబమసూరి పంటకాలం 150 రోజులు. తెలంగాణ సోనా సాగు కాలం 125 రోజులే. కాటన్ దొర సన్నాలతో సమానమైన అధిక దిగుబడినిస్తుంది. హెక్టారుకు 7 టన్నుల వరకు ఉత్పత్తి వస్తుంది. 100 కిలోల ధాన్యానికి 68–70 కిలోల బియ్యం వస్తుంది. ఇది 100 సెంటీమీటర్ల ఎత్తు పెరుగుతుంది. గాలికి పడిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి పంట యాజమాన్యంలో జాగ్రత్తలు తీసుకోవాలి. మే ఆఖరి వారంలో నాటువేస్తే 150 రోజుల్లోనూ, జూన్ మొదటి, రెండో వారాల్లో నారుపోస్తే 130–140 రోజుల్లోనూ పంట వస్తుంది. జూలై రెండో వారం తరవాత నారుపోస్తే 120 రోజుల్లో, ఆగస్ట్‌లో పోస్తే 100 రోజుల్లోనే పంట చేతికొస్తుంది. వానాకాలంలో తప్పనిసరిగా జూలైలో మాత్రమే నారుపోసుకోవాలి. యాసంగిలోనూ ఇదే తరహాలో పంట వస్తుంది. నవంబర్ 15 ప్రాంతంలో నారుపోస్తే పంటకాలం 150 రోజులు. డిసెంబర్ 15 ప్రాంతంలో పోస్తే పంటకాలం 120రోజులు. జనవరిలో నారుపోస్తే 100 రోజుల్లో వస్తుంది. యాసంగిలో నవంబర్ 15 – డిసెంబర్ 7లోపు నారు పోయాలి. స్వల్పకాలిక రకాలే మేలు వాస్తవానికి, వానాకాలంతో పోలిస్తే యాసంగిలోనే వరి ఎక్కువ దిగుబడి వస్తుంది. యాసంగిలో అధిక సూర్యరశ్మి, తక్కువ చీడపీడలు, అనుకూల వాతావరణం ఉండడం ఇందుకు కారణమని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వానాకాలంలో తక్కువ సూర్యరశ్మి, తుపానుల తాకిడి, చీడపీడల ఉ«ధృతి ఎక్కువగా ఉండడం వల్ల దిగుబడులు తక్కువొస్తాయనేది వారి విశ్లేషణ. దీంతో వాతావరణ మార్పులు, చీడపీడలు, వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వరిలో మధ్య, స్వల్పకాలిక రకాలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో శాస్త్రవేత్తలు పలు రకాల వరి వంగడాలను రూపొందిస్తున్నారు. దీర్ఘకాలిక రకాలకు (150 రోజుల కాలపరిమితి గల పంట) ఎక్కువ నీరు, ఎక్కువ విద్యుత్ అవసరం. అంతేకాక పచ్చిరొట్ట పంటలువేసి భూమిలో కలియదున్నే సమయం ఉండదు. ప్రాజెక్టుల కింద ఆలస్యంగా నార్లుపోసి, నాట్లు పెట్టడం వల్ల చీడపీడలకు గురయ్యే ప్రమాదం ఉంది. ఇక, పూత సమయంలో వచ్చే చలి వల్ల తాలు గింజలు ఏర్పడి దిగుబడులు తగ్గిపోతాయి. దీంతో స్వల్పకాలిక రకాలను సాగు చేయడం ద్వారా నీటి వినియోగంతో పాటు సాగుఖర్చులు తగ్గించుకుని దిగుబడులు పెంచుకోవచ్చు. సాగులో దిగుబడులకు రెండు పద్ధతులుంటాయని, అందులో 50 శాతం సేద్యపు పద్ధతులపై దిగుబడులు ఆధారపడి ఉంటే, మరో 50 శాతం ఎంపిక చేసుకునే రకాన్ని బట్టి ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తెలంగాణ సోనాలాంటి స్వల్పకాలిక రకాలను ఎంపిక చేసుకోవడం ద్వారా యాజమాన్య పద్ధతులతో తక్కువ కాలంలో మంచి దిగుబడులు సాధించవచ్చంటున్నారు. అందుకే తెలంగాణ రైతన్నను ఈ వానాకాలం నుంచే ‘తెలంగాణ సోనా’సాగు దిశగా ప్రోత్సహించేందుకు వ్యవసాయశాఖ అన్ని ఏర్పాట్లుచేస్తోంది. -
10 లక్షల ఎకరాల్లో తెలంగాణ ‘సోన’
సాక్షి, హైదరాబాద్: వచ్చే వర్షాకాలం సీజన్‌కు రాష్ట్రంలో తెలంగాణ సోనా రకం వరిని 10 లక్షల ఎకరాల్లో సాగు చేయించాలని వ్యవసాయ శాఖ సూత్రప్రాయంగా నిర్ణయించింది. సాంబమసూరి రకాన్ని కూడా 10 లక్షల ఎకరాల్లో సాగు జరిగేలా ప్రణాళిక రచించింది. రాష్ట్రవ్యాప్తంగా మేలు రకం వరి విత్తనాలను సాగు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో అధికారులు ఏయే రకాన్ని ఎంత విస్తీర్ణంలో సాగు చేయాలనే దానిపై ప్రణాళికలు తయారు చేశారు. (పద్ధతిగా.. పది) పలు దఫాలుగా శాస్త్రవేత్తలతో చర్చించి వరి సాగు విస్తీర్ణంపై నిర్ణయం తీసుకున్నారు. ఆ రెండు రకాలతో పాటు 35 వేల ఎకరాల్లో జేజీఎల్–1798, 25 వేల ఎకరాల్లో డబ్ల్యూజీఎల్–384, హెచ్ఎంటీ సోనా 25 వేల ఎకరాల్లో, అలాగే జై శ్రీరాం, ఇతరాలు కలిపి 4.15 లక్షల ఎకరాల్లో సాగు చేయాలని ప్రతిపాదించింది. అలాగే ఇతర సాధారణ వరిలో ఎంటీయూ–1010 రకాన్ని 9 లక్షల ఎకరాలు, 3.5 లక్షల ఎకరాల్లో కేఎన్ఎం–118 రకం, 50 వేల ఎకరాల్లో ఎన్టీయూ–1001, 30 వేల ఎకరాల్లో ఎంటీయూ–1061, ఇతరాలు 1.7 లక్షల ఎకరాల్లో సాగు చేయాలని ప్రతిపాదించారు. మేలు రకం, సాధారణ రకం వరి కలిపి 40 లక్షల ఎకరాల్లో సాగు చేస్తారు. మూడు జిల్లాల్లో అత్యధికంగా వరి సాగును వ్యవసాయ శాఖ ప్రతిపాదించింది. ఇందులో నల్లగొండ, సూర్యాపేట, నిజామాబాద్ జిల్లాలు ఉన్నాయి. మొత్తం ప్రతిపాదిత విస్తీర్ణంలో 24.5 శాతం ఈ మూడు జిల్లాల నుంచే ఉండటం గమనార్హం. రాష్ట్రవ్యాప్తంగా వరి విత్తనాల లభ్యత కూడా అధికంగానే ఉందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ఆ విత్తనాల సరఫరా నిలిపివేత.. సమగ్ర వ్యవసాయ విధానాన్ని తీసుకొస్తున్న ప్రభుత్వం.. ఇప్పటికే జిల్లాల్లో వరి, మొక్కజొన్న విత్తనాల విక్రయాలను తాత్కాలికంగా నిలిపేయాలని డీలర్లకు ఆదేశాలు వెళ్లాయి. దీంతో క్షేత్రస్థాయిలో రైతులకు ప్రస్తుతం విత్తనాలు అమ్మట్లేదు. రెండు, మూడు రోజుల్లో వరి విత్తనాల విక్రయాలు ప్రారంభించనున్నట్లు తెలిసింది. అది కూడా ప్రభుత్వం ఏయే జిల్లాలో ఎంత విస్తీర్ణం చెప్పిందో ఆ మేరకు నిల్వలు ఉండేలా చర్యలు తీసుకోనున్నారు. ఇక మొక్కజొన్న అసలు వానాకాలంలో సాగు చేయొద్దని ఆ విత్తనాలు అందుబాటులో ఉంచొద్దని స్పష్టం చేసినట్లు తెలిసింది. అయితే విత్తన కంపెనీలు, డీలర్లు మాత్రం సాగు సమీపించే సమయంలో నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఆర్థికంగా నష్టపోతామని ప్రభుత్వానికి మొర పెట్టుకుంటున్నారు. -
‘తెలంగాణ సోన’పై చెన్నైలో పరీక్షలు
♦ మధుమేహాన్ని నియంత్రించే ఆర్ఎన్ఆర్-15048 రకం వరికి పెరుగుతున్న ఆదరణ ♦ ఈనెల 13న కేంద్ర విత్తన కమిటీ గుర్తింపు లభించే అవకాశం సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ సోన’ పేరుతో గత అక్టోబర్‌లో విడుదల చేసిన మధుమేహాన్ని నియంత్రించే ఆర్ఎన్ఆర్-15048 రకం వరిపై జాతీయ స్థాయిలో మరోసారి పరీక్షలు చేయించాలని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం నిర్ణయించింది. ఇందులో గైసీమిక్ ఇండెక్స్ తక్కువ ఉండటంతో మధుమేహ రోగులకు వరప్రదాయినిగా ఉంటుందని వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీంతో ఈ బియ్యానికి క్రేజ్ పెరిగింది. మరింత కచ్చితత్వం కోసం చెన్నైలోని ‘మద్రాస్ డయాబెటిస్ రీసెర్చ్ ఫౌండేషన్’లో మరోసారి పరీక్షలు చేయించాలని నిర్ణయించినట్లు తెలంగాణ సోనను కనుగొన్న జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని వరి పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సురేందర్‌రాజు ‘సాక్షి’కి తెలిపారు. చెన్నైలో ఈ పరీక్ష చేయడానికి రూ. 3.5 లక్షల ఖర్చు అవుతుందన్నారు. సాధారణ పద్ధతిలో బియ్యాన్ని ఒకసారి వండి గైసీమిక్ ఇండెక్స్‌పై పరీక్షిస్తారని... ఆ తర్వాత వారు ధ్రువీకరణ పత్రం ఇస్తారని వెల్లడించారు. ఇప్పటికే హైదరాబాద్ లేబరేటరీల్లో పరీక్షలు చేయించడంతో అందులో గైసీమిక్ ఇండెక్స్ తక్కువ ఉందని తేలిందని ఆయన పేర్కొన్నారు. ఇది మధుమేహ రోగులకు, స్థూలకాయులకు మరింత ప్రయోజనమన్నారు. గైసీమిక్ ఇండెక్స్ సూచిక 51.6 మాత్రమే సాధారణ రకం బియ్యాల్లో గైసీమిక్ ఇండెక్స్ సూచిక 55 పైనే ఉంటుందని... ‘తెలంగాణ సోన’గా పేరుపొందిన మధుమేహా నియంత్రణ బియ్యంలో ఈ సూచిక 51.6 మాత్రమే ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందువల్ల మధుమేహ రోగులు ఎన్నిసార్లు ఈ బియ్యంతో వండిన అన్నం తిన్నా ఇబ్బంది ఉండదని అంటున్నారు. సహజంగా మధుమేహ రోగులు మధ్యాహ్నం అన్నం, రాత్రివేళల్లో రొట్టెలు ఆహారంగా తీసుకుంటారు. కానీ తెలంగాణ సోన బియ్యంలో గైసీమిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్నందున... మధుమేహా రోగుల్లో గ్లూకోజ్ స్థాయిలను వేగంగా పెంచకుండా చేస్తుందని... కాబట్టి రోజుకు మూడు నాలుగుసార్లు ఈ బియ్యంతో వండిన అన్నం తిన్నా ఎటువంటి ఇబ్బంది ఉండబోదని వారు స్పష్టం చేస్తున్నారు. ఈ రకం వరికి, బియ్యానికి కర్ణాటకలో అధిక డిమాండ్ ఉందని చెబుతున్నారు. తక్కువ కాల పరిమితి, తక్కువ పెట్టుబడుల కారణంగా రైతులు కూడా ఈ పంట సాగు పట్ల ఆసక్తి చూపుతున్నారు. ఇదిలావుంటే తెలంగాణ సోనకు ఈ నెల 13వ తేదీన కేంద్ర విత్తన కమిటీ గుర్తింపు లభించనుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జాతీయ విత్తన కమిటీ గుర్తింపు లభిస్తే దేశవ్యాప్తంగా మార్కెట్లో విక్రయించుకోవడానికి అనుమతి లభించినట్లేనని అంటున్నారు. ఇప్పటికే ఈ వరి రకాన్ని రాష్ట్రంలో 1.25 లక్షల ఎకరాల్లో సాగు చేపట్టారు. పంట కాల వ్యవధి 125 రోజులే ఉండటం... సాధారణ వరి కంటే ఎకరాకు 8 క్వింటాళ్లు అధిక దిగుబడి ఉండటంతో రైతులు దీనిపట్ల ఆసక్తి ప్రదర్శిస్తున్నారని విశ్వవిద్యాలయం వర్గాలు చెబుతున్నాయి. వచ్చే ఖరీఫ్‌లో కనీసం 5 లక్షల ఎకరాల్లో తెలంగాణ సోనను రైతులు సాగు చేసే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందరూ తినవచ్చు రాష్ట్రంలో ఈ రకం సాగుపై రైతుల్లో ఆసక్తి పెరిగింది. తెలంగాణ సోన బియ్యంతో వండిన అన్నాన్ని మధుమేహ రోగులు, స్థూలకాయులు ఎన్నిసార్లైనా తినవచ్చు. ఇది అందరికీ మంచి పోషకాహారం. - డాక్టర్ దామోదర్‌రాజు, సీనియర్ శాస్త్రవేత్త, వరి పరిశోధన కేంద్రం, హైదరాబాద్