‘తెలంగాణ సోన’పై చెన్నైలో పరీక్షలు
♦ మధుమేహాన్ని నియంత్రించే ఆర్‌ఎన్‌ఆర్-15048 రకం వరికి పెరుగుతున్న ఆదరణ
♦ ఈనెల 13న కేంద్ర విత్తన కమిటీ గుర్తింపు లభించే అవకాశం
సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ సోన’ పేరుతో గత అక్టోబర్‌లో విడుదల చేసిన మధుమేహాన్ని నియంత్రించే ఆర్‌ఎన్‌ఆర్-15048 రకం వరిపై జాతీయ స్థాయిలో మరోసారి పరీక్షలు చేయించాలని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం నిర్ణయించింది. ఇందులో గైసీమిక్ ఇండెక్స్ తక్కువ ఉండటంతో మధుమేహ రోగులకు వరప్రదాయినిగా ఉంటుందని వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీంతో ఈ బియ్యానికి క్రేజ్ పెరిగింది.
మరింత కచ్చితత్వం కోసం చెన్నైలోని ‘మద్రాస్ డయాబెటిస్ రీసెర్చ్ ఫౌండేషన్’లో మరోసారి పరీక్షలు చేయించాలని నిర్ణయించినట్లు తెలంగాణ సోనను కనుగొన్న జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని వరి పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సురేందర్‌రాజు ‘సాక్షి’కి తెలిపారు. చెన్నైలో ఈ పరీక్ష చేయడానికి రూ. 3.5 లక్షల ఖర్చు అవుతుందన్నారు. సాధారణ పద్ధతిలో బియ్యాన్ని ఒకసారి వండి గైసీమిక్ ఇండెక్స్‌పై పరీక్షిస్తారని... ఆ తర్వాత వారు ధ్రువీకరణ పత్రం ఇస్తారని వెల్లడించారు. ఇప్పటికే హైదరాబాద్ లేబరేటరీల్లో పరీక్షలు చేయించడంతో అందులో గైసీమిక్ ఇండెక్స్ తక్కువ ఉందని తేలిందని ఆయన పేర్కొన్నారు. ఇది మధుమేహ రోగులకు, స్థూలకాయులకు మరింత ప్రయోజనమన్నారు.
గైసీమిక్ ఇండెక్స్ సూచిక 51.6 మాత్రమే
సాధారణ రకం బియ్యాల్లో గైసీమిక్ ఇండెక్స్ సూచిక 55 పైనే ఉంటుందని... ‘తెలంగాణ సోన’గా పేరుపొందిన మధుమేహా నియంత్రణ బియ్యంలో ఈ సూచిక 51.6 మాత్రమే ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందువల్ల మధుమేహ రోగులు ఎన్నిసార్లు ఈ బియ్యంతో వండిన అన్నం తిన్నా ఇబ్బంది ఉండదని అంటున్నారు. సహజంగా మధుమేహ రోగులు మధ్యాహ్నం అన్నం, రాత్రివేళల్లో రొట్టెలు ఆహారంగా తీసుకుంటారు. కానీ తెలంగాణ సోన బియ్యంలో గైసీమిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్నందున... మధుమేహా రోగుల్లో గ్లూకోజ్ స్థాయిలను వేగంగా పెంచకుండా చేస్తుందని... కాబట్టి రోజుకు మూడు నాలుగుసార్లు ఈ బియ్యంతో వండిన అన్నం తిన్నా ఎటువంటి ఇబ్బంది ఉండబోదని వారు స్పష్టం చేస్తున్నారు.
ఈ రకం వరికి, బియ్యానికి కర్ణాటకలో అధిక డిమాండ్ ఉందని చెబుతున్నారు. తక్కువ కాల పరిమితి, తక్కువ పెట్టుబడుల కారణంగా రైతులు కూడా ఈ పంట సాగు పట్ల ఆసక్తి చూపుతున్నారు. ఇదిలావుంటే తెలంగాణ సోనకు ఈ నెల 13వ తేదీన కేంద్ర విత్తన కమిటీ గుర్తింపు లభించనుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జాతీయ విత్తన కమిటీ గుర్తింపు లభిస్తే దేశవ్యాప్తంగా మార్కెట్లో విక్రయించుకోవడానికి అనుమతి లభించినట్లేనని అంటున్నారు. ఇప్పటికే ఈ వరి రకాన్ని రాష్ట్రంలో 1.25 లక్షల ఎకరాల్లో సాగు చేపట్టారు. పంట కాల వ్యవధి 125 రోజులే ఉండటం... సాధారణ వరి కంటే ఎకరాకు 8 క్వింటాళ్లు అధిక దిగుబడి ఉండటంతో రైతులు దీనిపట్ల ఆసక్తి ప్రదర్శిస్తున్నారని విశ్వవిద్యాలయం వర్గాలు చెబుతున్నాయి. వచ్చే ఖరీఫ్‌లో కనీసం 5 లక్షల ఎకరాల్లో తెలంగాణ సోనను రైతులు సాగు చేసే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
అందరూ తినవచ్చు
రాష్ట్రంలో ఈ రకం సాగుపై రైతుల్లో ఆసక్తి పెరిగింది. తెలంగాణ సోన బియ్యంతో వండిన అన్నాన్ని మధుమేహ రోగులు, స్థూలకాయులు ఎన్నిసార్లైనా తినవచ్చు. ఇది అందరికీ మంచి పోషకాహారం.
- డాక్టర్ దామోదర్‌రాజు, సీనియర్ శాస్త్రవేత్త, వరి పరిశోధన కేంద్రం, హైదరాబాద్