Professor Jayashanker
-
త్వరలో రెండు వ్యవసాయ కళాశాలలు
జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉప కులపతి డాక్టర్ ప్రవీణ్‌రావు రాజేంద్రనగర్: జగిత్యాల, అశ్వరావుపేటలో ఫుడ్ టెక్నాలజీ, వ్యవసాయ కళాశాలలను ప్రారంభించనున్నామని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉప కులపతి డాక్టర్ వి.ప్రవీణ్‌రావు తెలిపారు. భారత వ్యవసాయ పరిశోధన మండలి ఉన్నత స్థాయి కమిటీ సభ్యులు సోమవారం వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. రెండు రోజుల పాటు జరిగే పర్యటనలో వారు మండలి నిధులతో చేపట్టిన వివిధ కార్యక్రమాలు, అభివృద్ధి పనులను పరిశీలిస్తారు. గుజరాత్‌కు చెందిన మాజీ ఉపకులపతి డాక్టర్ ఆర్సీ మహేశ్వరి నేతృత్వంలోని ప్రతినిధులు విశ్వవిద్యాలయం పరిపాలనా భవనంలో ప్రవీణ్‌రావుతో సమావేశమయ్యారు. వ్యవసాయ కళాశాలలో వర్చ్యువల్ తరగతి గదిని ప్రారంభించారు. కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ పథకం మీద రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. -
పాఠ్య పుస్తకాల్లో కొత్త పాఠాలు
► 1 నుంచి 10వ తరగతిలో జెండర్ సెన్సిటివిటీ ► టెన్త్ సోషల్‌లో ఎన్నికల సంస్కరణలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఒకటి నుంచి పదో తరగతి వరకున్న వివిధ పాఠ్య పుస్త కాల్లో కొత్త పాఠాలు రాబోతున్నాయి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి మారిన పాఠ్యాం శాలు అమల్లోకి వస్తాయి. ఈ మేరకు విద్యా శాఖ చర్యలు చేపట్టింది. 2014లో రాష్ట్రం ఏర్పడిన తరువాత పాఠ్య పుస్తకాలను తెలం గాణకు అనుగుణంగా మార్పులు చేసిన వి ద్యాశాఖ తాజాగా వాటిల్లో పొరపాట్లను సవ రించి కొన్ని కొత్త పాఠాలను చేర్చుతోంది. ఈ ప్రక్రియ దాదాపు పూర్తి కావచ్చింది. ఇవీ మార్పులు... ♦ ముఖ్యంగా 9వ తరగతిలోని సాంఘిక శాస్త్రంలో తెలంగాణ ఉద్యమం పాఠంలో ప్రొఫెసర్ జయశంకర్ గురించి పలు అంశాలను చేర్చారు. ♦ కొత్తగా ఏర్పడిన 31 జిల్లాల భౌగోళిక అంశాలు, వివరాలను 6 నుంచి 9వ తరగతి వరకు సాంఘిక శాస్త్రాల్లోని జాగ్రఫీలో చేర్చారు. ♦ పదో తరగతి విద్యార్థులకు ఎన్నికల అంశాలపై అవగాహన ఉండాలన్న ఉద్దేశంతో ఎన్నికల సంస్కరణలపై ప్రత్యేకంగా పాఠం పెట్టారు. ♦ 7, 8, 9 సోషల్ స్టడీస్‌లో జెండర్ సెన్సి టివిటీ, సెక్యువల్ అబ్యూజ్‌పై పాఠాలను, చేర్చారు. 3, 4, 5 తరగతుల ఇన్విరాన్ మెంటల్ స్టడీస్తోపాటు ఒకటి నుంచి పదో తరగతి వరకు ఇంగ్లిషు రీడర్లోనూ జెండర్ సెన్సిటివిటీపై పాఠాలు రానున్నాయి. -
సకల హంగులతో కాళోజీ కళా కేంద్రం
హన్మకొండ : తెలంగాణ భావజాలాన్ని వ్యాపింపచేసేందుకు కృషిచేసిన కాళోజీ నారాయణరావు, ప్రొఫెసర్ జయశంకర్లకు ప్రభుత్వం ప్రత్యేక గుర్తింపు ఇచ్చిందని రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పేర్వారం రాములు అన్నారు. హన్మకొండలో జరుగుతున్న కాళోజీ కళా కేంద్రం నిర్మాణ పనులను ఆదివారం ఆయన పరిశీలించారు. కాళోజీ కళా కేంద్రం ఆవరణ, హరిత కాకతీయ హోటల్ ఆవరణల్లో మొక్కలు నాటారు. ఈసందర్భంగా హరిత కాకతీయ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పేర్వారం రాములు మాట్లాడారు. కాళోజీ కళా కేంద్రం, ప్రొఫెసర్ జయశంకర్ స్మృతివనంలను సర్కారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోందన్నారు. రూ.50 కోట్ల వ్యయంతో నాలుగు ఎకరాల విస్తీర్ణంలో కాళోజీ కళా కేంద్రం నిర్మాణం జరుగుతోందన్నారు. తెలంగాణ కళా వైభవాన్ని ప్రతిబింబించేలా దీన్ని తీర్చిదిద్దుతామన్నారు. కేంద్ర ప్రభుత్వం స్వదేశీ దర్శన్ పథకం కింద రూ.84.40 కోట్లు మంజూరు చేసిందన్నారు. ఈ నిధులతో ములుగు గట్టమ్మ దేవాలయం వద్ద రెస్టారెంట్, పార్కింగ్, సోలార్ లైటింగ్ పనులు చేపడతామన్నారు. లక్నవరం, మేడారం, తాడ్వాయి, మల్లూరు, బొగతా జలపాతం వద్ద పర్యాటకుల సౌకర్యార్ధం ఏర్పాట్లు చేస్తామన్నారు. కృష్ణా పుష్కరాలు ఆగస్టు 12 నుంచి 23 వరకు జరుగుతాయన్నారు. దీనికి వెళ్లేవారి కోసం తాము టూరిజం ప్యాకేజీలను ఏర్పాటు చేశామన్నారు. వరంగల్ నుంచి మహబూబ్‌నగర్ జిల్లా బీచ్పల్లి పుష్కరఘాట్‌కు ప్యాకేజీని రూపొందించామన్నారు. సమావేశంలో పర్యాటకాభివృద్ధి సంస్థ జిల్లా మేనేజర్ కత్తి నాథన్, డీఈ సామేల్, ఏఈ రామకృష్ణ, హరిత కాకతీయ హోటల్ యూనిట్ మేనేజర్ సురేష్,తదితరులు పాల్గొన్నారు. -
‘తెలంగాణ సోన’పై చెన్నైలో పరీక్షలు
♦ మధుమేహాన్ని నియంత్రించే ఆర్ఎన్ఆర్-15048 రకం వరికి పెరుగుతున్న ఆదరణ ♦ ఈనెల 13న కేంద్ర విత్తన కమిటీ గుర్తింపు లభించే అవకాశం సాక్షి, హైదరాబాద్: ‘తెలంగాణ సోన’ పేరుతో గత అక్టోబర్‌లో విడుదల చేసిన మధుమేహాన్ని నియంత్రించే ఆర్ఎన్ఆర్-15048 రకం వరిపై జాతీయ స్థాయిలో మరోసారి పరీక్షలు చేయించాలని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం నిర్ణయించింది. ఇందులో గైసీమిక్ ఇండెక్స్ తక్కువ ఉండటంతో మధుమేహ రోగులకు వరప్రదాయినిగా ఉంటుందని వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీంతో ఈ బియ్యానికి క్రేజ్ పెరిగింది. మరింత కచ్చితత్వం కోసం చెన్నైలోని ‘మద్రాస్ డయాబెటిస్ రీసెర్చ్ ఫౌండేషన్’లో మరోసారి పరీక్షలు చేయించాలని నిర్ణయించినట్లు తెలంగాణ సోనను కనుగొన్న జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని వరి పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ సురేందర్‌రాజు ‘సాక్షి’కి తెలిపారు. చెన్నైలో ఈ పరీక్ష చేయడానికి రూ. 3.5 లక్షల ఖర్చు అవుతుందన్నారు. సాధారణ పద్ధతిలో బియ్యాన్ని ఒకసారి వండి గైసీమిక్ ఇండెక్స్‌పై పరీక్షిస్తారని... ఆ తర్వాత వారు ధ్రువీకరణ పత్రం ఇస్తారని వెల్లడించారు. ఇప్పటికే హైదరాబాద్ లేబరేటరీల్లో పరీక్షలు చేయించడంతో అందులో గైసీమిక్ ఇండెక్స్ తక్కువ ఉందని తేలిందని ఆయన పేర్కొన్నారు. ఇది మధుమేహ రోగులకు, స్థూలకాయులకు మరింత ప్రయోజనమన్నారు. గైసీమిక్ ఇండెక్స్ సూచిక 51.6 మాత్రమే సాధారణ రకం బియ్యాల్లో గైసీమిక్ ఇండెక్స్ సూచిక 55 పైనే ఉంటుందని... ‘తెలంగాణ సోన’గా పేరుపొందిన మధుమేహా నియంత్రణ బియ్యంలో ఈ సూచిక 51.6 మాత్రమే ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందువల్ల మధుమేహ రోగులు ఎన్నిసార్లు ఈ బియ్యంతో వండిన అన్నం తిన్నా ఇబ్బంది ఉండదని అంటున్నారు. సహజంగా మధుమేహ రోగులు మధ్యాహ్నం అన్నం, రాత్రివేళల్లో రొట్టెలు ఆహారంగా తీసుకుంటారు. కానీ తెలంగాణ సోన బియ్యంలో గైసీమిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్నందున... మధుమేహా రోగుల్లో గ్లూకోజ్ స్థాయిలను వేగంగా పెంచకుండా చేస్తుందని... కాబట్టి రోజుకు మూడు నాలుగుసార్లు ఈ బియ్యంతో వండిన అన్నం తిన్నా ఎటువంటి ఇబ్బంది ఉండబోదని వారు స్పష్టం చేస్తున్నారు. ఈ రకం వరికి, బియ్యానికి కర్ణాటకలో అధిక డిమాండ్ ఉందని చెబుతున్నారు. తక్కువ కాల పరిమితి, తక్కువ పెట్టుబడుల కారణంగా రైతులు కూడా ఈ పంట సాగు పట్ల ఆసక్తి చూపుతున్నారు. ఇదిలావుంటే తెలంగాణ సోనకు ఈ నెల 13వ తేదీన కేంద్ర విత్తన కమిటీ గుర్తింపు లభించనుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జాతీయ విత్తన కమిటీ గుర్తింపు లభిస్తే దేశవ్యాప్తంగా మార్కెట్లో విక్రయించుకోవడానికి అనుమతి లభించినట్లేనని అంటున్నారు. ఇప్పటికే ఈ వరి రకాన్ని రాష్ట్రంలో 1.25 లక్షల ఎకరాల్లో సాగు చేపట్టారు. పంట కాల వ్యవధి 125 రోజులే ఉండటం... సాధారణ వరి కంటే ఎకరాకు 8 క్వింటాళ్లు అధిక దిగుబడి ఉండటంతో రైతులు దీనిపట్ల ఆసక్తి ప్రదర్శిస్తున్నారని విశ్వవిద్యాలయం వర్గాలు చెబుతున్నాయి. వచ్చే ఖరీఫ్‌లో కనీసం 5 లక్షల ఎకరాల్లో తెలంగాణ సోనను రైతులు సాగు చేసే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందరూ తినవచ్చు రాష్ట్రంలో ఈ రకం సాగుపై రైతుల్లో ఆసక్తి పెరిగింది. తెలంగాణ సోన బియ్యంతో వండిన అన్నాన్ని మధుమేహ రోగులు, స్థూలకాయులు ఎన్నిసార్లైనా తినవచ్చు. ఇది అందరికీ మంచి పోషకాహారం. - డాక్టర్ దామోదర్‌రాజు, సీనియర్ శాస్త్రవేత్త, వరి పరిశోధన కేంద్రం, హైదరాబాద్ -
ఈ పాపం వారిదే..
* గత పాలకుల వల్లే విద్యావ్యవస్థ నిర్వీర్యం * ఆదర్శవంతమైన విద్యావ్యవస్థను ఏర్పాటు చేస్తాం *టీచర్లు.. ప్రొఫెసర్ జయశంకర్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలి * విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి సంగారెడ్డి మున్సిపాలిటీ: గత పాలకుల అసమర్థత వల్లే విద్యావ్యవస్థ నిర్వీర్యమైందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి అన్నారు. సంగారెడ్డిలోని ఐటీఐ ప్రాంగణంలో శనివారం నిర్వహించిన ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ప్రథమ విద్యా రాష్ట్ర మహాసభకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జిల్లాలో 46 మండలాలుంటే 42 మండల విద్యాశాఖ అధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఈ పరిస్థితుల్లోప్రభుత్వ పాఠశాలలు ఎలా బలోపేతం అవుతాయని ప్రశ్నించారు. ఇందుకు గత ప్రభుత్వాల అసమర్థతే ప్రధాన కారణమని స్పష్టం చేశారు. అందువల్లే విద్యావ్యవస్థను పటిష్టం చేసేందుకు తెలంగాణ సర్కార్ కృషి చేస్తోందన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో కేజీ నుంచి పీజీ వరకు మెరుగైన విద్యనందించేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. విద్యా ప్రమాణాల పెంపుకోసం ఉపాధ్యాయులు కూడా కృషి చేయాలన్నారు. విద్యార్థులను సొంత బిడ్డలుగా భావించి బోధన చేసినప్పుడే వారు రాణించి వృద్ధిలోకి వస్తారన్నారు. అప్పుడే సర్కార్ బడుల్లో విద్యార్థుల సంఖ్య పెరిగి ప్రైవేటు బడులు కనుమరుగవుతాయన్నారు. హైదరాబాద్‌లోని తిలక్‌నగర్ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు తన విద్యార్థులను సొంతపిల్లలుగా భావించి బోధన చేయడం వల్ల ఆ పాఠశాలలో విద్యా ప్రమాణాలు పెరిగాయని, దీంతో ఆ ప్రాంతంలో ప్రైవేట్ పాఠశాలలు ఉనికి కోల్పోయాయన్నారు. విద్యాహక్కు చట్ట ప్రకారం జిల్లాలో 3 లక్షల 41 వేల మంది విద్యార్థులకు 12,225 మంది టీచర్లు పనిచేస్తున్నారని తెలిపారు. ఈ లెక్కన చూస్తే జిల్లాలో విద్యార్థుల సంఖ్యకు మించి ఉపాధ్యాయులున్నారన్నారు. అయినప్పటికీ విద్యార్థులు విద్యలో వెనుకబడి ఉన్నారంటే విద్యావ్యవస్థలోని లోపాలను సవరించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. చాలా మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపుతున్నారని, దీని ద్వారా సర్కార్ బడుల్లో మెరుగైన విద్య అందదనే సంకేతం ప్రజలకు వెళ్తోందన్నారు. సర్కార్ ఎన్ని చర్యలు తీసుకున్నా, ఉపాధ్యాయుల సహకారం లేకపోతే విద్యావ్యవస్థలో మార్పులు తీసుకురాలేమన్నారు. మాసాయిపేట సంఘటన వెనుక కూడా విద్యావ్యవస్థ పాత్ర ఉందన్నారు. స్థానికంగా ఉన్న సర్కార్ బడుల్లో మెరుగైన విద్యనందించగలిగి ఉంటే, ఆ పిల్లలు మరో ఊళ్లో ఉన్న ప్రైవేటు పాఠశాలలకు వెళ్లే వారు కాదని, అప్పుడు మాసాయిపేట సంఘటనే జరిగి ఉండేది కాదన్నారు. అందువల్ల ఉపాధ్యాయులు తమ ఉద్యోగాన్ని జీతం కోసం కాకుండా పలువురి జీవితాలు తీర్చిదిద్దేందుగా భావించాలన్నారు. గ్రేడ్-2లో నియామకమైన ఉపాధ్యాయులు ప్రొఫెసర్ జయశంకర్‌ను స్ఫూర్తిగా తీసుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ సర్కార్ మెరుగైన విద్యనందించేందుకే ప్రాధ్యానం ఇస్తుందన్నారు. అందులో భాగంగానే సీఎం కేసీఆర్‌ప్రామాణాలు పాటించని ఇంజనీరింగ్ కళాశాలల గుర్తింపును రద్దు చేయించామన్నారు. రద్దయిన వాటిలో మంత్రులు, ఎమ్మెల్యేలకు సంబంధించిన కళాశాలల కూడా ఉన్నాయన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ఇంజనీరింగ్ కళాశాలల్లో చదివి 90 శాతం మార్కులు సాధించిన వారికి ఉద్యోగాలు రావడం లేదని, అయితే పట్టణ ప్రాంతాల్లోని ఇంజనీరింగ్ కళాశాలల్లో చదివిన కేవలం 60 శాతం మార్కులతో పాసైన వారు మంచిమంచి ఉద్యోగాలు దక్కించుకుంటున్నారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ఇంజనీరింగ్ కళాశాలలు నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడమే ఇందుకు కారణమన్నారు. విద్యావ్యవస్థలో ఉన్న లోపాలను సరిదిద్దితే ఎల్కేజీ నంచి పీజీ వరకు ఉచిత విద్య సాధ్యమవుతుందన్నారు. సమావేశంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి, అదనపు సంయుక్త కలెక్టర్ బీవీఎస్ మూర్తి, జిల్లా విద్యాశాఖ అధికారి రాజేశ్వర్‌రావు, ఆర్వీఎం పీఓ యాస్మిన్ బాషా, ఉపాధ్యాయ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు ముఖర్జీ, రాష్ట్ర అధ్యక్షులు నర్సిరెడ్డి, జిల్లా అధ్యక్షులు లకా్ష్మరెడ్డి, ప్రధాన కార్యదర్శి సాయిలు, స్థానిక శాసనసభ్యులు చింతా ప్రభాకర్‌తో పాటు వివిధ జిల్లాల నుంచి వచ్చిన సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు. విద్య కాషాయీకరణకు కేంద్రం కుట్ర సిలబస్ మార్పుల పేరిట మతపరమైన అంశాలను పాఠ్యపుస్తకాలలో చొప్పించి విద్యను కాషాయీకరణ చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని టీచర్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు అభిజిత్ ముఖర్జీ ఆరోపించారు. విద్యరంగం పట్ల ప్రభుత్వాలు అవలంభిస్తున్న వైఖరికి వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అనంతరం టీచర్స్ ఫెడరేషన్ జాతీయ ఉపాధ్యక్షురాలు అర్జీత ముఖర్జీ కూడా మాట్లాడారు. ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు నర్సిరెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏ ప్రాంతంలోని ఉపాధ్యాయులను ఆ ప్రాంతానికి పంపేలా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డిని కోరారు. అంతకుముందు తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర ప్రథమ విద్యా మహాసభల సందర్భంగా శనివారం పట్టణంలోని ఐటీఐ నుంచిపాత బస్టాండ్ వరకు ఉపాధ్యాయులు భారీ ర్యాలీ నిర్వహించారు. -
జయశంకర్ వ్యవసాయ వర్సిటీ ఏర్పాటు
ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం హైదరాబాద్: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు తెలంగాణ గెజిట్‌లో ప్రచురించింది. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం చట్టం-1963 (తెలంగాణ అడాప్షన్)గా దీన్ని పేర్కొంది. ఇది ఈ ఏడాది జూన్ రెండో తేదీ నుంచే అమల్లోకి వచ్చినట్టు తెలిపింది. ఇక నుంచి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విద్యాలయంగానే దీన్ని పిలుస్తారు. ఇప్పటివరకు యూనివర్సిటీకి సంబంధించి ‘ఆంధ్రప్రదేశ్’ అని ప్రస్తావించే ప్రతీచోట ‘తెలంగాణ’ అని పిలవడమో, రాయడమో చేయాలి. ఇప్పటివరకు ఎన్జీ రంగా వర్సిటీ కింద తెలంగాణలో ఉన్న వ్యవసాయ కళాశాలలు, పరిశోధనా సంస్థలు ఇతరత్రా అన్నీ జయశంకర్ వ్యవసాయ వర్సిటీ పరిధిలోకే వస్తాయి. వాటికింద ఉన్న ఆస్తులను కూడా దీని కిందకు బదలాయించారు. ఉద్యోగుల విభజన మొత్తం కూడా విభజన చట్టం ప్రకారమే జరుగుతుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వారి సర్వీసు, ఇంక్రిమెంట్లు, పెన్షన్లు, సెలవులు, పీఎఫ్, గ్రాట్యుటీ తదితరాలన్నీ విభజన మార్గదర్శకాల ప్రకారమే ఉంటాయని స్పష్టంచేశారు. విద్యార్థుల కోర్సు కాలం, పరీక్షలకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వ్యవస్థీకృత ఏర్పాట్లు జరుగుతాయని అందులో వివరించారు. వరంగల్‌లో జయశంకర్ స్మృతివనం వరంగల్ : తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ స్మృతి వనాన్ని వరంగల్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేస్తున్నారు. హన్మకొండలో 2.30 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఏకశిలా పార్క్‌ను రూ.1.70 కోట్లతో కొద్ది నెలల్లోనే జయశంకర్ స్మృతి వనంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు వరంగల్ జిల్లా కలెక్టర్ జి.కిషన్ తెలిపారు. జయశంకర్ 2011లో పరమపదించినప్పుడు ప్రజల సందర్శనార్థం ఆయన పార్థివ దేహాన్ని ఏకశిలా పార్క్‌లోనే ఉంచారు. జయశంకర్ 80వ జయంతిని పురస్కరించుకుని ఏకశిలా పార్కులో ‘సార్’ నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని బుధవారం ఆవిష్కరించనున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.