సకల హంగులతో కాళోజీ కళా కేంద్రం
సకల హంగులతో కాళోజీ కళా కేంద్రం
Published Mon, Aug 1 2016 12:15 AM | Last Updated on Mon, Sep 4 2017 7:13 AM
హన్మకొండ : తెలంగాణ భావజాలాన్ని వ్యాపింపచేసేందుకు కృషిచేసిన కాళోజీ నారాయణరావు, ప్రొఫెసర్ జయశంకర్‌లకు ప్రభుత్వం ప్రత్యేక గుర్తింపు ఇచ్చిందని రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ చైర్మన్ పేర్వారం రాములు అన్నారు. హన్మకొండలో జరుగుతున్న కాళోజీ కళా కేంద్రం నిర్మాణ పనులను ఆదివారం ఆయన పరిశీలించారు. కాళోజీ కళా కేంద్రం ఆవరణ, హరిత కాకతీయ హోటల్ ఆవరణల్లో మొక్కలు నాటారు. ఈసందర్భంగా హరిత కాకతీయ హోటల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పేర్వారం రాములు మాట్లాడారు. కాళోజీ కళా కేంద్రం, ప్రొఫెసర్ జయశంకర్ స్మృతివనంలను సర్కారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోందన్నారు. రూ.50 కోట్ల వ్యయంతో నాలుగు ఎకరాల విస్తీర్ణంలో కాళోజీ కళా కేంద్రం నిర్మాణం జరుగుతోందన్నారు. తెలంగాణ కళా వైభవాన్ని ప్రతిబింబించేలా దీన్ని తీర్చిదిద్దుతామన్నారు. కేంద్ర ప్రభుత్వం స్వదేశీ దర్శన్ పథకం కింద రూ.84.40 కోట్లు మంజూరు చేసిందన్నారు. ఈ నిధులతో ములుగు గట్టమ్మ దేవాలయం వద్ద రెస్టారెంట్, పార్కింగ్, సోలార్ లైటింగ్ పనులు చేపడతామన్నారు. లక్నవరం, మేడారం, తాడ్వాయి, మల్లూరు, బొగతా జలపాతం వద్ద పర్యాటకుల సౌకర్యార్ధం ఏర్పాట్లు చేస్తామన్నారు. కృష్ణా పుష్కరాలు ఆగస్టు 12 నుంచి 23 వరకు జరుగుతాయన్నారు. దీనికి వెళ్లేవారి కోసం తాము టూరిజం ప్యాకేజీలను ఏర్పాటు చేశామన్నారు. వరంగల్ నుంచి మహబూబ్‌నగర్ జిల్లా బీచ్‌పల్లి పుష్కరఘాట్‌కు ప్యాకేజీని రూపొందించామన్నారు. సమావేశంలో పర్యాటకాభివృద్ధి సంస్థ జిల్లా మేనేజర్ కత్తి నాథన్, డీఈ సామేల్, ఏఈ రామకృష్ణ, హరిత కాకతీయ హోటల్ యూనిట్ మేనేజర్ సురేష్,తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement