ఈ పాపం వారిదే.. | United Federation of Teacher First Education state Mahasabha | Sakshi
Sakshi News home page

ఈ పాపం వారిదే..

Published Sun, Dec 21 2014 2:05 AM | Last Updated on Thu, Jul 11 2019 5:12 PM

ఈ పాపం వారిదే.. - Sakshi

ఈ పాపం వారిదే..

* గత పాలకుల వల్లే విద్యావ్యవస్థ నిర్వీర్యం
* ఆదర్శవంతమైన విద్యావ్యవస్థను ఏర్పాటు చేస్తాం
*టీచర్లు.. ప్రొఫెసర్ జయశంకర్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలి
* విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి

సంగారెడ్డి మున్సిపాలిటీ: గత పాలకుల అసమర్థత వల్లే విద్యావ్యవస్థ నిర్వీర్యమైందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డి అన్నారు. సంగారెడ్డిలోని ఐటీఐ ప్రాంగణంలో శనివారం నిర్వహించిన ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ప్రథమ విద్యా రాష్ట్ర మహాసభకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జిల్లాలో 46 మండలాలుంటే 42 మండల విద్యాశాఖ అధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, ఈ పరిస్థితుల్లోప్రభుత్వ పాఠశాలలు ఎలా బలోపేతం అవుతాయని ప్రశ్నించారు. ఇందుకు గత ప్రభుత్వాల అసమర్థతే ప్రధాన కారణమని స్పష్టం చేశారు.

అందువల్లే విద్యావ్యవస్థను పటిష్టం చేసేందుకు తెలంగాణ సర్కార్ కృషి చేస్తోందన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో కేజీ నుంచి పీజీ వరకు మెరుగైన విద్యనందించేందుకు సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. విద్యా ప్రమాణాల పెంపుకోసం ఉపాధ్యాయులు కూడా కృషి చేయాలన్నారు. విద్యార్థులను సొంత బిడ్డలుగా భావించి బోధన చేసినప్పుడే వారు రాణించి వృద్ధిలోకి వస్తారన్నారు. అప్పుడే సర్కార్ బడుల్లో విద్యార్థుల సంఖ్య పెరిగి ప్రైవేటు బడులు కనుమరుగవుతాయన్నారు.

హైదరాబాద్‌లోని తిలక్‌నగర్ ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు తన విద్యార్థులను సొంతపిల్లలుగా భావించి బోధన చేయడం వల్ల ఆ పాఠశాలలో విద్యా ప్రమాణాలు పెరిగాయని, దీంతో ఆ ప్రాంతంలో ప్రైవేట్ పాఠశాలలు ఉనికి కోల్పోయాయన్నారు. విద్యాహక్కు చట్ట ప్రకారం జిల్లాలో 3 లక్షల 41 వేల మంది విద్యార్థులకు 12,225 మంది టీచర్లు పనిచేస్తున్నారని తెలిపారు. ఈ లెక్కన చూస్తే జిల్లాలో విద్యార్థుల సంఖ్యకు మించి ఉపాధ్యాయులున్నారన్నారు. అయినప్పటికీ విద్యార్థులు విద్యలో వెనుకబడి ఉన్నారంటే విద్యావ్యవస్థలోని లోపాలను సవరించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.

చాలా మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపుతున్నారని, దీని ద్వారా సర్కార్ బడుల్లో మెరుగైన విద్య అందదనే సంకేతం ప్రజలకు వెళ్తోందన్నారు. సర్కార్ ఎన్ని చర్యలు తీసుకున్నా, ఉపాధ్యాయుల సహకారం లేకపోతే విద్యావ్యవస్థలో మార్పులు తీసుకురాలేమన్నారు. మాసాయిపేట సంఘటన వెనుక కూడా విద్యావ్యవస్థ పాత్ర ఉందన్నారు. స్థానికంగా ఉన్న సర్కార్ బడుల్లో మెరుగైన విద్యనందించగలిగి ఉంటే, ఆ పిల్లలు మరో ఊళ్లో ఉన్న ప్రైవేటు పాఠశాలలకు వెళ్లే వారు కాదని, అప్పుడు మాసాయిపేట సంఘటనే జరిగి ఉండేది కాదన్నారు.

అందువల్ల ఉపాధ్యాయులు తమ ఉద్యోగాన్ని జీతం కోసం కాకుండా పలువురి జీవితాలు తీర్చిదిద్దేందుగా భావించాలన్నారు. గ్రేడ్-2లో  నియామకమైన ఉపాధ్యాయులు ప్రొఫెసర్ జయశంకర్‌ను స్ఫూర్తిగా తీసుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణ సర్కార్ మెరుగైన విద్యనందించేందుకే ప్రాధ్యానం ఇస్తుందన్నారు. అందులో భాగంగానే  సీఎం కేసీఆర్‌ప్రామాణాలు పాటించని ఇంజనీరింగ్ కళాశాలల గుర్తింపును రద్దు చేయించామన్నారు. రద్దయిన వాటిలో మంత్రులు, ఎమ్మెల్యేలకు సంబంధించిన కళాశాలల కూడా ఉన్నాయన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లోని ఇంజనీరింగ్ కళాశాలల్లో చదివి 90 శాతం మార్కులు సాధించిన వారికి ఉద్యోగాలు రావడం లేదని, అయితే పట్టణ ప్రాంతాల్లోని ఇంజనీరింగ్ కళాశాలల్లో చదివిన కేవలం 60 శాతం మార్కులతో పాసైన వారు మంచిమంచి ఉద్యోగాలు దక్కించుకుంటున్నారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ఇంజనీరింగ్ కళాశాలలు నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడమే ఇందుకు కారణమన్నారు. విద్యావ్యవస్థలో ఉన్న లోపాలను సరిదిద్దితే ఎల్‌కేజీ నంచి పీజీ వరకు ఉచిత విద్య సాధ్యమవుతుందన్నారు. సమావేశంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ సుధాకర్‌రెడ్డి, అదనపు సంయుక్త కలెక్టర్ బీవీఎస్ మూర్తి, జిల్లా విద్యాశాఖ అధికారి రాజేశ్వర్‌రావు, ఆర్వీఎం పీఓ యాస్మిన్ బాషా, ఉపాధ్యాయ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు ముఖర్జీ, రాష్ట్ర అధ్యక్షులు నర్సిరెడ్డి, జిల్లా అధ్యక్షులు లకా్ష్మరెడ్డి, ప్రధాన కార్యదర్శి సాయిలు, స్థానిక శాసనసభ్యులు చింతా ప్రభాకర్‌తో పాటు వివిధ జిల్లాల నుంచి వచ్చిన సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.
 
విద్య కాషాయీకరణకు కేంద్రం కుట్ర
సిలబస్ మార్పుల పేరిట మతపరమైన అంశాలను పాఠ్యపుస్తకాలలో చొప్పించి విద్యను కాషాయీకరణ చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని టీచర్స్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు అభిజిత్ ముఖర్జీ ఆరోపించారు. విద్యరంగం పట్ల ప్రభుత్వాలు అవలంభిస్తున్న వైఖరికి వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.  అనంతరం టీచర్స్ ఫెడరేషన్ జాతీయ ఉపాధ్యక్షురాలు అర్జీత ముఖర్జీ కూడా మాట్లాడారు.  

ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు నర్సిరెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏ ప్రాంతంలోని ఉపాధ్యాయులను ఆ ప్రాంతానికి పంపేలా చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డిని కోరారు. అంతకుముందు తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర ప్రథమ విద్యా మహాసభల సందర్భంగా శనివారం పట్టణంలోని ఐటీఐ నుంచిపాత బస్టాండ్ వరకు ఉపాధ్యాయులు భారీ ర్యాలీ నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement