ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది.
ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం
హైదరాబాద్: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు తెలంగాణ గెజిట్‌లో ప్రచురించింది. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం చట్టం-1963 (తెలంగాణ అడాప్షన్)గా దీన్ని పేర్కొంది. ఇది ఈ ఏడాది జూన్ రెండో తేదీ నుంచే అమల్లోకి వచ్చినట్టు తెలిపింది. ఇక నుంచి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విద్యాలయంగానే దీన్ని పిలుస్తారు. ఇప్పటివరకు యూనివర్సిటీకి సంబంధించి ‘ఆంధ్రప్రదేశ్’ అని ప్రస్తావించే ప్రతీచోట ‘తెలంగాణ’ అని పిలవడమో, రాయడమో చేయాలి.
ఇప్పటివరకు ఎన్జీ రంగా వర్సిటీ కింద తెలంగాణలో ఉన్న వ్యవసాయ కళాశాలలు, పరిశోధనా సంస్థలు ఇతరత్రా అన్నీ జయశంకర్ వ్యవసాయ వర్సిటీ పరిధిలోకే వస్తాయి. వాటికింద ఉన్న ఆస్తులను కూడా దీని కిందకు బదలాయించారు. ఉద్యోగుల విభజన మొత్తం కూడా విభజన చట్టం ప్రకారమే జరుగుతుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వారి సర్వీసు, ఇంక్రిమెంట్లు, పెన్షన్లు, సెలవులు, పీఎఫ్, గ్రాట్యుటీ తదితరాలన్నీ విభజన మార్గదర్శకాల ప్రకారమే ఉంటాయని స్పష్టంచేశారు. విద్యార్థుల కోర్సు కాలం, పరీక్షలకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వ్యవస్థీకృత ఏర్పాట్లు జరుగుతాయని అందులో వివరించారు.
వరంగల్‌లో జయశంకర్ స్మృతివనం
వరంగల్ : తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ స్మృతి వనాన్ని వరంగల్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేస్తున్నారు. హన్మకొండలో 2.30 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఏకశిలా పార్క్‌ను రూ.1.70 కోట్లతో కొద్ది నెలల్లోనే జయశంకర్ స్మృతి వనంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు వరంగల్ జిల్లా కలెక్టర్ జి.కిషన్ తెలిపారు. జయశంకర్ 2011లో పరమపదించినప్పుడు ప్రజల సందర్శనార్థం ఆయన పార్థివ దేహాన్ని ఏకశిలా పార్క్‌లోనే ఉంచారు. జయశంకర్ 80వ జయంతిని పురస్కరించుకుని ఏకశిలా పార్కులో ‘సార్’ నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని బుధవారం ఆవిష్కరించనున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.