Issued a ruling
-
పెన్షనర్లకు కరువుభృతి పెంపు
జనవరి నుంచే వర్తింపు సాక్షి, హైదరాబాద్: పెన్షనర్లకు కరువు భృతిని (డీఆర్) పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెన్షనర్లకు ప్రస్తుతం 15.196 శాతం డీఆర్ అమల్లో ఉండగా దీనికి అదనంగా 3.144 శాతం కలిపి 18.340 శాతం డీఆర్ చెల్లించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. 2016 జనవరి నుంచి ఈ పెంపు వర్తిస్తుంది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు గురువారం ఉత్తర్వులు (జీవో నంబర్ 112) జారీ చేశారు. ప్రభుత్వోద్యోగులకు ఇటీవల కరువు భత్యం పెంచిన తరహాలోనే పెన్షనర్లకు ప్రభుత్వం డీఆర్‌ను వర్తింపజేసింది. జనవరి నుంచి చెల్లించాల్సిన బకాయిలను సెప్టెంబర్ పెన్షన్‌తో కలిపి చెల్లించనుంది. అక్టోబర్ 1న బకాయిలతోపాటు పెరిగిన డీఆర్తో కూడిన పెన్షన్ పెన్షనర్లకు అందనుంది. 2013 జూలై 1 తర్వాత రిటైరైన వారితోపాటు అప్పటికే రిటైరై పెన్షన్ అందుకుంటున్న వారందరికీ డీఆర్ వర్తిస్తుంది. ఈ ఉత్తర్వుల ఆధారంగా ట్రెజరీ అధికారులు, పెన్షన్ పేమెంట్ అధికారులు వచ్చే నెల బిల్లుల చెల్లింపులు చేయాలని ఆర్థికశాఖ అన్ని ట్రెజరీలు, పే అండ్ అకౌంట్స్ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. -
మరో ఆరు మార్కెట్ కమిటీలు
ఇప్పటివరకు 51 కమిటీలకు నియామకం సాక్షి, హైదరాబాద్: ఆరు వ్యవసాయ మార్కెట్ కమిటీలకు పాలక మండళ్లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. నల్లగొండ జిల్లా తిరుమలగిరి (పాశం విజయ), ఆలేరు (కాలే సుమలత), కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట (గుండ సరోజన), మానకొండూరు (మల్లగల్ల నగేశ్) కమిటీలకు పాలక మండళ్లను నామినేట్ చేశారు. రంగారెడ్డి జిల్లా సర్దార్‌నగర్ కమిటీ చైర్మన్‌గా శేరిగూడెం వెంకటయ్య, మెదక్ జిల్లా నంగునూరు కమిటీ చైర్మన్‌గా సంగు పురేందర్ నియమితులయ్యారు. 179 వ్యవసాయ మార్కెట్ కమిటీలకు గాను 11 కమిటీలకు పీసా చట్టం కింద గిరిజనులకు కేటాయించారు. మిగిలిన 168 కమిటీలకుగాను 51 కమిటీలకు పాలక మండళ్లను నియమించారు. అత్యధికంగా కరీంనగర్ జిల్లాకు సంబంధించి 21 మార్కెట్ కమిటీలకు పాలక మండళ్లను నామినేట్ చేయగా.. ఆదిలాబాద్, ఖమ్మం, హైదరాబాద్, వరంగల్ జిల్లాలకు ఒక్క కమిటీని కూడా నియమించలేదు. మార్కెట్ కమిటీల్లో చోటు కల్పించాలంటూ టీఆర్ఎస్ నాయకులు, క్రియాశీల కార్యకర్తల నుంచి ఒత్తిడి పెరుగుతుండటంతో ప్రతిపాదనలపై నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. ఓ వైపు అసంతృప్తులను బుజ్జగిస్తూ, మరోవైపు తమకు అనుకూలంగా ఉండే వారిని రిజర్వేషన్ కోటాకు అనుగుణంగా ప్రతిపాదిస్తున్నారు.పాలక మండళ్ల పదవీ కాల పరిమితి ఏడాదిగా నిర్ణయించడంతో తర్వాతి పాలక మండలిలో చోటు కల్పిస్తామంటూ సర్దిచెప్తున్నారు. నెలాఖరులోగా భర్తీ: మంత్రి హరీశ్ వ్యవసాయ మార్కెట్ కమిటీల నియామక ప్రక్రియకు సంబంధించిన ప్రతిపాదనలకు వెంటనే ఆమోదం తెలుపుతున్నాం. మిగతా కమిటీలకు సంబంధించి నియామక ప్రక్రియపై కసరత్తు సాగుతోంది. నెలాఖరులోగా కమిటీలకు పాలక మండళ్ల నియామక ప్రక్రియ పూర్తి చేసే యోచనలో ఉన్నాం. సమర్థులను ఎంపిక చేయడం ద్వారా మార్కెట్ యార్డుల కార్యకలాపాలను రైతులకు మరింత చేరువ చేస్తాం. దేశంలోనే తొలిసారిగా రిజర్వేషన్ విధానాన్ని ప్రవేశపెట్టడంతో పాటు.. మహిళలకూ పెద్దపీట వేస్తున్నాం. -
ఏపీపీఎస్సీ కార్యదర్శిగా గిరిధర్!
* ఈ నెల 1 నుంచి సెలవులో ఉన్న గిరిధర్ * రాజధాని పనుల్లో ప్రభుత్వ విధానాలు నచ్చక కినుక సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శి ఎ. గిరిధర్‌ను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శిగా గిరిధర్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్.కృష్ణారావు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. నూతన రాజధాని విషయంలో రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు అనుసరిస్తున్న విధానాలు, తీరు నచ్చక గిరిధర్ ఈ నెల 1 నుంచి సెలవులో ఉన్నారు. తనను మున్సిపల్ శాఖ బాధ్యతల నుంచి తప్పించాల్సిందిగా ఆయనే స్వయంగా రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పారు. కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖలో కీలక పోస్టులో ఉన్న గిరిధర్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన కార్యాలయ ముఖ్యకార్యదర్శిగా తొలుత నియమించుకున్న విషయం తెలిసిందే. రాష్ట్ర విభజన తొలి రోజుల్లో సీఎం కార్యాలయం ముఖ్యకార్యదర్శిగా గిరిధర్ అలుపెరగక రాత్రింబగళ్లు పనిచేశారు. కష్టపడి పనిచేసినప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొంత మంది వందిమాగధుల చెప్పుడు మాటలను విని గిరిధర్‌ను సీఎం కార్యాలయం నుంచి మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శిగా బదిలీ చేశారు. కొత్త రాజధాని నిర్మాణం, సింగపూర్ కంపెనీలతో మాస్టర్ ప్రణాళిక రూపకల్పన అంశాల్లో గిరిధర్ కీలక భూమిక పోషించారు. మాస్టర్ ప్రణాళికలోని అంశాలపైన, మాస్టర్ డెవలపర్ ఎంపిక, స్విస్ చాలెంజ్‌పై ప్రభుత్వ విధానాలు గిరిధర్‌కు ఏ మాత్రం నచ్చలేదు. దీంతో ఆయన ఈ నెల 1 నుంచే సెలవులో ఉన్నారు. గిరిధర్‌ను బదిలీ చేసినప్పటికీ మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శిగా ఎవరినీ నియమించలేదు. ప్రస్తుతం ఆ బాధ్యతలను మున్సిపల్ శాఖ కార్యదర్శి జయలక్ష్మి చూస్తున్నారు. పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా కరికాల వలవన్ యువజన సర్వీసుల ముఖ్యకార్యదర్శిగా పని చేస్తున్న కరికాల వలవన్‌ను పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. తూనికలు, కొలతల శాఖ కంట్రోలర్‌గా కూడా అదనపు బాధ్యతలు ఇచ్చారు. ఇదివరకు పౌరసరఫరాల కమిషనర్‌గా ఉన్న బి.రాజశేఖర్ ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లిన విషయం తెలిసిందే. రెండు రోజుల క్రితమే పి.ఎస్. గిరీష్‌ను అనంతపురం జిల్లా పెనుకొండ సబ్ కలెక్టర్‌గా నియమిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను సవరించి ఆయనకు నెల్లూరు జిల్లా గూడూరు సబ్ కలెక్టర్‌గా నియమిం చింది.డిప్యుటేషన్‌పై వచ్చిన ఐఆర్ఎస్ అధికారి గోపీనాధ్‌ను రాష్ట్ర మౌలిక వైద్య సదుపాయాల అభివృద్ధి సంస్థ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్‌గా నియమిస్తూ ఉత్తర్వుల జారీ చేశారు. -
గల్లాపెట్టెకు తాళం..
45 రోజులుగా ఫ్రీజింగ్ - నిలిచిన ‘కల్యాణలక్ష్మి, షాదిముబారక్’ - బీసీ, ఎస్సీ కార్పొరేషన్లలోనూ అదే పరిస్థితి - పెండింగ్‌లో సుమారు రూ.10 కోట్ల చెల్లింపులు - జిల్లా ట్రెజరీ ఆఫీస్ చుట్టూ లబ్ధిదారుల ప్రదక్షిణలు - ప్రభుత్వ ఔట్సోర్సింగ్ ఉద్యోగులకూ తప్పని తిప్పలు నక్కలగుట్ట : జిల్లా ఖజానా పెట్టెకు రాష్ట్ర ప్రభుత్వం తాళం వేసింది. జూన్ నుంచి తాత్కాలిక ఫ్రీజింగ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో జిల్లాలో పలు పథకాల అమలుకు బ్రేక్ పడింది. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతోపాటు ఎస్సీ, బీసీ కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి పథకాల చెల్లింపులు నిలిచిపోయాయి. ఫలితంగా లబ్ధిదారులు జిల్లా ట్రెజరీ కార్యాలయం, దళిత, గిరిజన అభివృద్ధి శాఖలు, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతోపాటు వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేసే ఉద్యోగుల జీతాల బిల్లులు కూడా ట్రెజరీలో చెల్లింపులకు నోచుకోకుండా పడి ఉన్నాయి. లబ్ధిదారులకు దాదాపుగా రూ.9.92 కోట్లు పెండింగ్‌లో పడ్డాయి. సుమారు 45 రోజులు కావొస్తున్నా.. ప్రభుత్వం ఫ్రీజింగ్ ఎత్తివేయకపోవడంతో వివిధ సంక్షేమ పథకాల లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ‘కల్యాణలక్ష్మి’లో... దళిత అభివృద్ధి శాఖ : జిల్లా దళిత అభిృృద్ధి శాఖ ద్వారా కల్యాణలకిృ్ష్మ పథకంలో మొత్తం 389 మంది లబ్ధిదారులకు ఆర్థికసాయం మంజూరైనా.. ఫ్రీజింగ్ కారణంగా బిల్లులు జిల్లా ట్రెజరీ కార్యాలయంలోనే నిలిచిపోయాయి. ఈ శాఖ ద్వారా మొదటి విడతలో 285, రెండో విడత 104 కల్యాణలక్ష్మి బిల్లులు దాఖలయ్యాయి. ఇవన్నీ ట్రెజరీలో పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో లబ్ధిదారులు జిల్లా దళిత అభివృద్ధి శాఖ జిల్లా కార్యాలయంృ ఏఎస్డబ్ల్యూఓ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. గిరిజన సంక్షేమశాఖ : జిల్లా గిరిజన సంక్షేమశాఖ ద్వారా కల్యాణలక్ష్మి పథకంలో 410 మంది దరఖాస్తు చేసుకున్నారు. లబ్ధిదారుల విచారణ పూర్తయి, ట్రెజరీలో బిల్లులు దాఖలు చేసినా... ఫ్రీజింగ్ అమలు కారణంగా చెల్లింపులకు నోచుకోకుండా నిలిచిపోయాయని జిల్లా గిరిజన సంక్షేమ శాఖాధికారి సీహెచ్.రాంమూర్తి తెలిపారు. రెండు శాఖలు కలిపి 799 మందికి సుమారు రూ.4 కోట్లు చెల్లించాల్సి ఉంది. ‘షాదిముబారక్’ అంతే.. ముస్లిం నిరుపేద కుటుంబాల్లోని అవివాహిత యువతుల వివాహానికి ఆర్థికసాయం అందించడానికి తెలంగాణ ప్రభుత్వం అమలుచేస్తున్న షాదిముబారక్ పథకం పరిస్థితి కూడా కల్యాణలక్ష్మిలాగే తయారైంది. ఫ్రీజింగ్ కారణంగా చెల్లింపులు నిలిచిపోయాయి. 2014-15లో షాదిముబారక్లో 333 మంది లబ్ధిదారులు దరఖాస్తు చేసుకుంటే.. 332 మందికి సర్కారు బిల్లులు మంజూరు చేసింది. 2015-16లో 570 మంది షాది ముబారక్ పథకం కింద దరఖాస్తు చేసుకోగా.. 394 మందికి మాత్రమే బిల్లులు చెల్లించారు. ఇంకా 169 మంది లబ్దిదారులకు ఫ్రీజింగ్ కారణంగా బిల్లులు చెల్లించలేదు. షాదిముబారక్ కింద లబ్ధిదారులకు చెల్లించాల్సిన సుమారు రూ.86 లక్షలు పెండింగ్‌లో పడ్డాయి. ఎస్సీ కార్పొరేషన్లో... జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 2014-15 ఆర్థిక సంవత్సరంలో రుణాల కోసం దరఖాస్తు చేసుకున్న 400 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం సబ్సిడీ అందజేసింది. ఫ్రీజింగ్ అమలు కారణంగా మరో 170 మంది లబ్ధిదారులకు సబ్సిడీ చెల్లించలేదు. లబ్ధిదారులకు సుమారు రూ.1.79 కోట్లు చెల్లించాల్సి ఉంది. బీసీ కార్పొరేషన్లో... జిల్లా బీసీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి పథకాలకు ఎంపికైన 830 మంది లబ్ధిదారులకు బ్యాంకులు రుణాల చెల్లిస్తే, బీసీ కార్పొరేషన్ సబ్సిడీ మంజూరు చేయాల్సి ఉంది. నిధుల లేమి కారణంగా బీసీ కార్పొరేషన్ నిధులు కేటాయించకపోవడంతో అటు రుణాలు, ఇటు సబ్సిడీ విడుదల కాక లబ్ధిదారులు బీసీ కార్యాలయంచుట్టు ప్రదక్షణలు చేస్తున్నారు. లబ్ధిదారులకు సుమారు రూ.2 కోట్లు చెల్లించాలి. ప్రభుత్వ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు కూడా.. జిల్లాలోని వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులుగా పనిచేస్తున్న వారి జీతాల బిల్లులు కూడా ఫ్రీజింగ్ కారణంగా ట్రెజరీలో నిలిపివేశారు. దీంతో చాలీచాలని జీతాలతో పనిచేస్తున్న వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక్క కలెక్టరేట్లో ప్రభుత్వ విభాగాల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ కార్మికులు 1,500 మంది ఉన్నట్లు అంచనా. ఈ లెక్కన వారికి సుమారు రూ.1.27 కోట్లు చెల్లించాలి. -
ఆర్థిక శాఖలో 13 కొత్త పోస్టులు
సాక్షి, హైదరాబాద్: ఆర్థిక శాఖలో 13 పోస్టులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. వివిధ కేటగిరీల్లో 6 రెగ్యులర్ పోస్టులు, 7 సూపర్ న్యూమరరీ పోస్టులు మంజూరు చేస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త వాటిలో రెండు జాయింట్ సెక్రటరీ, ఒక డిప్యూటీ సెక్రటరీ, రెండు అసిస్టెంట్ సెక్రటరీ, పీఎస్ టు సెక్రటరీ పోస్టులున్నాయి. వీటితో పాటు సూపర్ న్యూమరరీ జాబితాలో నాలుగు ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు, రికార్డు అసిస్టెంట్, జమేదార్, డ్రైవర్ పోస్టులు ఒక్కోటి చొప్పున ఉన్నాయి. -
బదిలీల జాతర
- నెలాఖరు లోగా పూర్తి చేయాలని ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం - కీలక పోస్టుల్లో మార్పులు ఖాయం - మళ్లీ మొదలైన పైరవీలు సాక్షి, విశాఖపట్నం : బదిలీల జాతర నేటి నుంచి ప్రారంభం కానుంది. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన ఈ బదిలీలు ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని ప్రభుత్వం శనివారం రాత్రి ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. మే 15వ తేదీ నుంచి 30వ తేదీలోగా ఈ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉండగా, జూన్ 2న నవనిర్మాణ దీక్ష 3 నుంచి 8 వరకు జరిగిన ‘జన్మభూమి-మావూరు’ వంటి కార్యక్రమాల నేపథ్యంలో బదిలీలకు ప్రభుత్వమే తొలుత బ్రేకులేసింది. జూన్ 9 నుంచి 15వ తేదీ లోపు బదిలీ తంతు ముగించాలని ఆదేశించగా, ఈలోగా జిల్లాలోని రెండు ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ ప్రకటించడంతో ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. దీంతో బదిలీలకు మళ్లీ బ్రేకుపడింది.షెడ్యూల్ ప్రకారం జూలై-7వ తేదీ వరకు కోడ్ ఉన్నప్పటికీ జిల్లాలో రెండు స్థానాలు ఏకగ్రీవం కావడంతో కోడ్ ఉపసంహరిస్తూ శనివారం రాత్రే ఎన్నికల సంఘం ప్రకటన చేసింది. ఆ వెంటనే బదిలీల ప్రకియను నెలాఖరులోగా పూర్తిచేయాలంటూ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి హేమముని వెంకటప్ప ఉత్తర్వులు జారీచేశారు. గతంలో ఇచ్చిన నిబంధనల మేరకే ఒకేచోట మూడేళ్లకు మించి పనిచేసిన వారికి తప్పనిసరిగా స్థానచలనం కల్పించాలని, ఆ తర్వాత రిక్వస్ట్ ట్రాన్సఫర్స్తో పాటు పరిపాలనా సౌలభ్యంతో అవసరమైన మేరకు బదిలీలు చేసుకోవాలని గతంలో జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇప్పటివరకు అందిన జాబితాల ప్రకారం జిల్లా పరిధిలో 41ప్రభుత్వ శాఖల్లో అన్ని క్యాడర్లలో కలిపి 6150 వివిధ పనిచేస్తుంటే.. వారిలో ఇప్పటి వరకు తప్పనిసరిగా బదిలీలకు గురయ్యే వారు 2,554 మంది ఉన్నట్టుగా లెక్క తేల్చారు. వీటిలో ప్రధానంగా రెవెన్యూలో 1500 మంది సిబ్బంది ఉండగా వారిలో అత్యధికంగా 985 మంది బదిలీలకు గురయ్యే వారిలో ఉన్నారు. వీరిలో 750 మంది వరకు వీఆర్వోలున్నారు. ఆ తర్వాత వ్యవసాయశాఖలో 290, జెడ్పీలో 252, పశుసంవర్ధకశాఖలో 235, పంచాయతీ డిపార్టుమెంట్లో 180, డీఆర్డీఎలో 170, బీసీ వెల్ఫేర్ లో154, సోషల్ వెల్పేర్‌లో 167, అగ్నిమాపక శాఖలో 233, పంచాయతీరాజ్‌శాఖలో 95, హౌసింగ్ కార్పొరేషన్లో 80, ఆయుష్‌లో 70, జిల్లా గ్రంథాలయసంస్థలో 50, మైన్స్‌లో 37 మంది బదిలీలకు గురయ్యేవారి జాబితాల్లో ఉన్నారు. ఇక మిగిలిన శాఖల్లో 10 నుంచి 25 మంది లోపు సిబ్బంది ఉండగా వారిలో మూడోవంతుకు స్థానచలనం కలుగనుంది. జిల్లా వైద్య ఆరోగ్య, విద్య శాఖలతో పాటు పోలీస్, ఎక్సైజ్ వంటి శాఖలకు వేర్వేరుగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. ముఖ్యంగా వైద్య ఆరోగ్యం, విద్యాశాఖల్లో బదిలీలన్నీ వెబ్‌కౌన్సిలింగ్ ద్వారా చేపట్టాలని గతంలోనే ఉత్తర్వులు జారీ చేశారు. ఒకపక్క విద్యాసంవత్సరం ప్రారంభం కావడంతో ఈ సమయంలో బదిలీలకు గురికావాల్సి రావడంతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. ఏళ్లతరబడి పాతు కుపోయిన వారికి స్థానచలం తప్పదని తేలిపోవడంతో వారుఉన్న చోటే కొనసాగడం లేదా.. కోరు కున్న పోస్టులను దక్కించుకునే లక్ష్యంతో పైరవీలు మొదలుపెట్టారు. బదిలీల విషయమై ఇన్చార్జి మంత్రికి తుదినిర్ణయం కట్టబెట్టడంతో జిల్లా మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేల ద్వారా జిల్లా ఇన్చార్జి మంత్రిపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేలు..పార్టీ ఇన్చార్జిల సిఫారసు లేఖలకు ఎక్కడా లేని గిరాకీ ఏర్పడింది. రేపటి నుంచి బదిలీల ప్రక్రియ ఊపందుకోనుంది. ఇకకేవలం తొమ్మిది రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో ఈలోగా బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలన్న తలంపుతో జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. -
పోలీస్ కమిషనర్‌గా సుధీర్‌బాబు
- జనవరిలో ఏర్పాటైన కమిషనరేట్ - తాజాగా కమిషనర్ నియామకం - త్వరలో మొదలుకానున్న పాలన - మామునూరుకు తరలనున్న రూరల్ విభాగం - ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం - మూడు రోజుల్లో విధుల్లో చేరుతా : సుధీర్‌బాబు సాక్షి, హన్మకొండ : వరంగల్ నగర పోలీస్ కమిషనర్‌గా సుధీర్‌బాబును నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. వరంగల్ పోలీస్ కమిషనర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టబోతున్న సుధీర్‌బాబు 2001 బ్యాచ్‌కు చెందిన అధికారి. హైదరాబాద్ నార్త్‌జోన్ డీసీపీగా ఇప్పటి వరకు పని చేశారు. ఆయనకు డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా పదోన్నతి కల్పిస్తూ వరంగల్ కమిషనర్‌గా నియమిస్తున్నట్లు ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పోలీస్ శాఖ పరంగా వరంగల్ అర్భన్ జిల్లా ఉన్న ప్రాంతాన్ని వరంగల్ పోలీస్ కమిషరేట్‌గా వ్యవహరిస్తు రాష్ట్ర ప్రభుత్వం 2015 జనవరిలో ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవలే న్యాయపరమైన కార్యక్రమాలు పూర్తికావడంతో వరంగల్ నగర పోలీస్ కమిషనర్‌గా సుధీర్‌బాబును నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కొది రోజుల్లోనే వరంగల్ నగరంలో కమిషనరేట్ అమల్లోకి రానుంది. తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్, సైబరాబాద్‌ల తర్వాత మూడో పోలీస్ కమిషనరేట్‌గా వరంగల్ నగరం ఏర్పాటు కానుంది. త్వరలో కమిషనరేట్ ఏర్పాటు కానుండటంతో ఇప్పటివరకు పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో కొనసాగిన వరంగల్ రూరల్ పోలీస్ విభాగం మామూనూరు బెటాలియన్‌కు మారుతుంది. వరంగల్ పోలీస్ కమిషనర్‌గా సుధీర్‌బాబును నియమించడంతో త్వరలోనే కమిషనరేట్ పరిపాలన మొదలుకానుంది. -
‘ఉత్తర్వుల’ రాజకీయం
- దొంగోడి ఆస్తులకు కాపలాకాస్తారా అంటూ అధికారులు, పోలీసులపై మండిపాటు - గేటెక్కి లోపలికి వెళ్లేందుకు యత్నించిన రైతులు - సీతానగరం తహశీల్దార్ నిర్బంధం - చెరుకు బకాయిల కోసం ఉద్యమం ఉద్ధృతం చేస్తామన్న రైతు నేతలు - నేడు నాటుబళ్లతో రహదారుల దిగ్బంధానికి పిలుపు సాక్షి ప్రతినిధి, విజయనగరం : డీఆర్డీఎ పీడీగా పనిచేసిన జ్యోతిని వెనక్కి పంపించేయాలని జూలై 31న అటవీ శాఖాధికారులు రీపేట్రియేట్ ఉత్తర్వులు జారీ చేశారు. కానీ ఆఉత్వర్వులు అమలు కాలేదు. దీంతో రీపేట్రియేట్ ఉత్తర్వులు నిలి చిపోయాయని అంతా భావించారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 22న జ్యోతి ని రిలీవ్ చేయాలని సెర్ఫ్ అధికారులు వేరేగా ఉత్తర్వులు జారీ చేశారు. అదే ఉత్తర్వుల్లో ఇక్కడ అడిషనల్ పీడీగా పనిచేస్తున్న బి.సుధాకర్‌కు ఎఫ్ఏసీ ఇవ్వాలని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన 24న బాధ్యతలు స్వీకరించారు. ఆ బాధ్యతలు చేపట్టిన మూడు రోజుల్లోనే ఆయన నియామక ఉత్తర్వులను రద్దు చేసి అదే శాఖలో మరో అడిషనల్ పీడీగా పనిచేస్తున్న పెద్దిరాజుకు అప్పగిస్తూ సెర్ఫ్ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖలో వ్యవహారం మరింత రసవత్తరంగా సాగింది. పంచాయతీరాజ్ ఇన్ఛార్జ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న కె.శ్రీనివాస్‌కుమార్‌ను గతనెల 12న ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తొలగిస్తూ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ చీఫ్ సీవీఎస్ రామ్మూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. ఇదే శ్రీనివాస్ ఈఈ హోదాలో అవుట్ సోర్సింగ్ టెక్నికల్ అసిస్టెంట్ల సర్వీసు పొడిగింపు ఉత్తర్వులపై సంతకాలు చేశారు. అయితే, ఆ ఉత్తర్వులు చెల్లవని, ఈఈ బాధ్యతల్ని విడిచిపెట్టాక వచ్చి పాత తేదీతో సంతకాలు పెట్టారని పేర్కొంటూ ఆయనపై విచారణ చేయడమే కాకుండా టెక్నికల్ అసిస్టెంట్ల పొడిగింపు ఉత్తర్వులను రద్దు చేశారు. ఇదేదో అయ్యిందనుకుంటే తాజాగా అదే డీఈఈ శ్రీనివాస్‌కుమార్‌కు పీఏ టూ ఎస్ఈ పోస్టింగ్ ఇస్తూ ఇంజనీరింగ్ చీఫ్ ఉత్తర్వులిచ్చారు. ఆ ఉత్తర్వులొచ్చిన నాలుగు రోజుల్లోనే వాటిని రద్దు చేస్తూ మరో ఉత్తర్వు జారీ చేశారు. దీన్ని బట్టి ఆ రెండు శాఖల్లో ఎంత గందరగోళం నెలకుందో అర్థం చేసుకోవచ్చు. దేన్ని అనుసరించాలో తెలి యక ఆ శాఖల్లోని ఉద్యోగులు తికమకకు గురయ్యారు. దీనికంతటికీ సంబంధిత అధికారులో, ఆ శాఖ ఉన్నతాధికారులో కారణమనుకుంటే పప్పులో కాలేసినట్టే. అభిప్రాయ బేధాలతో కత్తులునూరుకుంటున్న టీడీపీ నాయకులే ప్రధాన కారణమని పరిస్థితులు స్పష్టంగా తెలియజేస్తున్నాయి. కావల్సిన అధికారులను కొనసాగించాలనో, నచ్చని అధికారులను పంపించాలనో, కాసులకు కక్కుర్తిపడో తెలియదు గాని ఒకరు అవునంటే మరొకరు కాదని లోపాయికారీగా చేస్తున్న యత్నాలతో ఈ పరిస్థితులు దాపురిస్తున్నాయి. డీఆర్డీఏ పరిణామాలను తీసుకుంటే పీడీగా పనిచేసిన జ్యోతి... తనకు విలువ ఇవ్వలేదని, తాను నమ్మిన వ్యక్తి సన్నిహిత ఉద్యోగులను ఇబ్బంది పెట్టారన్న ఏకైక కారణంతో సా గనంపేందుకు ఓనేత విశ్వప్రయత్నాలు చేశా రు. జ్యోతి మాతృశాఖలోని ఉన్నతాధికారుల తో ఉన్న సంబంధాలను వినియోగించుకుని రీ పేట్రియేట్ ఉత్తర్వులు జారీ చేయించారు. ఈ నేపథ్యంలో జ్యోతికి ఓ టీడీపీ ఎమ్మెల్యే అండ గా నిలిచారని తెలిసింది. ఆఉత్తర్వులను ఆపేం దుకు ఆ ఎమ్మెల్యే తెగ ప్రయత్నించారు. కానీ ఆమాజీ మంత్రి...తనకే సవాల్ విసురుతారా అని మరింతగా పట్టుబిగించారు. ప్రభుత్వంలో ఉన్న పెద్దల సాయంతో సెర్ఫ్ అధికారులపై ఒత్తిడి పెంచారు. దీంతో ఎందుకొచ్చిన తల నొప్పి జ్యోతిని రిలీవ్ చేయాలంటూ సెర్ఫ్ అధికారులు యుద్ధ ప్రాతిపదికన ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో మాజీ మంత్రి లక్ష్యం మేరకు జ్యోతిని సాగనంపారు. ఇదంతా ఒక ఎత్తు అయితే పీడీ ఇన్ఛార్జ్ బాధ్యతల విషయంలో కూడా రాజకీయం చోటు చేసుకుంది. జ్యోతిని రిలీవ్ చేయాలని జారీ చేసిన ఉత్తర్వుల్లోనే అడిషనల్ పీడీగా పని చేసిన బి.సుధాకర్‌కు ఎఫ్ఎసీ బాధ్యతలను అ ప్పగించాలని సెర్ఫ్ అధికారులు పేర్కొన్నారు. అయితే, ఆయన కన్నా మరో సీనియర్ అడిషనల్ పీడీగా ఉన్న పెద్దిరాజును కాదని సుధాకర్ కు ఎలా బాధ్యతలు అప్పగిస్తారని ఓ వర్గం ఫి ర్యాదులకు దిగింది. ఆ వర్గానికి అండగా టీడీపీకి చెందిన కొందరు నేతలు నిలిచారు. తప్పో ఒప్పో పక్కనపెడితే సెర్ఫ్ అధికారులు తన ని ర్ణయాన్ని మార్చుకుని పెద్దిరాజుకు ఎఫ్ఏసీ ఇ వ్వాలని ఉత్తర్వులిచ్చారు. ఏ నిర్ణయమైనా ఆ లోచించి తీసుకోవల్సిన ఉన్నతాధికారులు జి ల్లా నుంచి వచ్చిన ఒత్తిళ్లతో రోజుల వ్యవధిలో నే పాత వాటిని రద్దుచేసి కొత్త ఉత్తర్వులిస్తున్నా రు. దీంతో ఉద్యోగులు గందరగోళానికి గురవుతున్నారు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ పరిస్థితి కూడా అంతే. పలువురు టీడీపీ ఎమ్మెల్యేల భరోసాతో డీఈఈ శ్రీనివాస్‌కుమార్ జెడ్పీ చైర్పర్సన్ శోభా స్వాతిరాణికి సవాల్ విసిరారు. అప్పటికే డీఈఈైపై కన్నెర్రతో ఉన్న కేంద్రమం త్రి అశోక్ గజపతిరాజును ఆశ్రయించి చైర్పర్స న్ తన లక్ష్యాన్ని నెరవేర్చుకున్నారు. తొలుత ఈ ఈ బాధ్యతల్ని తొలగించేలా తెరవెనుక పావు లు కదిపిన చైర్పర్సన్ ఆనక శ్రీనివాస్‌కుమార్ చేసిన టెక్నికల్ అసిస్టెంట్ల సర్వీసు పొడిగింపు ఉత్తర్వులను వెలుగులోకి తెచ్చి కఠిన చర్యలు తీసుకునేలా పథక రచన చేశారు. ఎమ్మెల్యేల అండతోనే డీఈఈ ఇష్టారీతిన వ్యవహరిస్తారని చివరికీ అశోక్ దృష్టికి తీసుకెళ్లకలిగారు. దీంతో టెక్నికల్ అసిస్టెంట్ల ఉత్తర్వులను రద్దు చేయించారు. అయితే, అందుకు ప్రతి సవాల్‌గా డీఈ ఈ శ్రీనివాస్‌కుమార్ ఏకంగా పీఏ టూ ఎస్ఈ పోస్టింగ్ ఉత్తర్వులను తెప్పించుకోగలిగారు. ఆయనకున్న ఎమ్మెల్యే అండదండలే పై స్థాయి లో సహకరించాయనే వాదనలు విన్పించాయి. దీంతో చిర్రెత్తిపోయిన చైర్పర్సన్ తనను ఓవర్ టేక్ చేసి, తనను చిన్నబోయేలా చేసిన డీఈఈ శ్రీనివాస్‌కు వేసిన పీఎ టూ ఎస్ఈ ఉత్తర్వులను రద్దు చేయించేలా కేంద్రమంత్రి ద్వారా ఉన్నత స్థాయిలో పావులు కదిపారు. ఆమేరకు రద్దు ఉత్తర్వులొచ్చాయి. ఇదంతా నవ్వులాటగా మారిపోయింది. -
వ్యవసాయ మార్కెట్ కమిటీల రద్దు
ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం హైదరాబాద్: రాష్ట్రంలో వ్యవసాయ మార్కెట్ కమిటీలను రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో ఆయా కమిటీ చైర్మన్లు, వైస్-ైచైర్మన్లు, సభ్యులంతా తమ పదవులను కోల్పోయారు. ఆ కమిటీలకు తక్షణమే పర్సన్ ఇన్చార్జీలను నియమించాలని వ్యవసాయ మార్కెటింగ్ కమిషనర్‌ను సర్కార్ ఆదేశించింది. కొత్త కమిటీలు ఏర్పాటయ్యే వరకు పర్సన్ ఇన్చార్జులే వాటిపై అధికారాలు కలిగి ఉంటారని ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. రాష్ట్రంలో 220 మార్కెట్లు ఉంటే... వాటిల్లో 150 మార్కెట్లకు గత ప్రభుత్వం కమిటీలను ఏర్పాటు చేసింది. వారంతా కాంగ్రెస్‌కు చెందినవారే. ఆదాయాన్ని బట్టి మార్కెట్లను ఎ, బి, సి కేటగిరీగా విభజించారు. ఇదిలాఉండగా, మార్కెట్ కమిటీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల ప్రకటించిన నేపథ్యంలో ఆయా సామాజిక వర్గాల వారికి గణనీయంగా పదవులు లభిస్తాయి. ఇప్పటికే మార్కెట్ కమిటీ పదవులపై పలువురు టీఆర్ఎస్ నాయకులు ఆశలు పెట్టుకున్నారు. కొందరు ముఖ్య నేతలకు ఈమేరకు హామీ కూడా లభించింది. పాత కమిటీలు రద్దయినందున ఆ పదవులను దక్కించుకునేందుకు పైరవీలు మొదలుకానున్నాయి. -
క్రీడాకారులకు తెలంగాణ ప్రభుత్వ నజరానా రూ. 29.6 కోట్లు
- నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు - సైనా, సింధుల పాత బకాయిలు కూడా చెల్లింపు సాక్షి, హైదరాబాద్: దాదాపు రెండేళ్లుగా వివిధ అంతర్జాతీయ ఈవెంట్లలో పతకాలు సాధించిన క్రీడాకారుల ఎదురు చూపులు ఫలించాయి. ఇటీవల కామన్వెల్త్ గేమ్స్‌లో పతకాలు సాధించిన వారితో పాటు... గతంలో పతకాలు సాధించిన వారికి కూడా తెలంగాణ ప్రభుత్వం నజారానా ప్రకటించింది. వీళ్లందరికీ చెల్లించేందుకు గాను రూ. 29.6 కోట్లు విడుదల చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. 2012లో లండన్ ఒలింపిక్స్‌లో క్వార్టర్ ఫైనల్‌కు చేరిన కశ్యప్‌కు రూ. 25 లక్షలు, 2013లో వరల్డ్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో పతకానికిగాను సింధుకు రూ.25 లక్షలు ఇవ్వనున్నారు. అలాగే ఈ ఏడాది ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్‌లో టైటిల్ గెలిచిన సైనా నెహ్వాల్‌కు రూ. 20 లక్షలు ఇస్తారు. ఆగస్టు 15వ తేదీన చెల్లింపునకు వీలుగా నిధులను విడుదల చేస్తూ యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. -
జయశంకర్ వ్యవసాయ వర్సిటీ ఏర్పాటు
ఉత్తర్వులు జారీచేసిన ప్రభుత్వం హైదరాబాద్: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు తెలంగాణ గెజిట్‌లో ప్రచురించింది. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం చట్టం-1963 (తెలంగాణ అడాప్షన్)గా దీన్ని పేర్కొంది. ఇది ఈ ఏడాది జూన్ రెండో తేదీ నుంచే అమల్లోకి వచ్చినట్టు తెలిపింది. ఇక నుంచి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విద్యాలయంగానే దీన్ని పిలుస్తారు. ఇప్పటివరకు యూనివర్సిటీకి సంబంధించి ‘ఆంధ్రప్రదేశ్’ అని ప్రస్తావించే ప్రతీచోట ‘తెలంగాణ’ అని పిలవడమో, రాయడమో చేయాలి. ఇప్పటివరకు ఎన్జీ రంగా వర్సిటీ కింద తెలంగాణలో ఉన్న వ్యవసాయ కళాశాలలు, పరిశోధనా సంస్థలు ఇతరత్రా అన్నీ జయశంకర్ వ్యవసాయ వర్సిటీ పరిధిలోకే వస్తాయి. వాటికింద ఉన్న ఆస్తులను కూడా దీని కిందకు బదలాయించారు. ఉద్యోగుల విభజన మొత్తం కూడా విభజన చట్టం ప్రకారమే జరుగుతుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వారి సర్వీసు, ఇంక్రిమెంట్లు, పెన్షన్లు, సెలవులు, పీఎఫ్, గ్రాట్యుటీ తదితరాలన్నీ విభజన మార్గదర్శకాల ప్రకారమే ఉంటాయని స్పష్టంచేశారు. విద్యార్థుల కోర్సు కాలం, పరీక్షలకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వ్యవస్థీకృత ఏర్పాట్లు జరుగుతాయని అందులో వివరించారు. వరంగల్‌లో జయశంకర్ స్మృతివనం వరంగల్ : తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ స్మృతి వనాన్ని వరంగల్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేస్తున్నారు. హన్మకొండలో 2.30 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఏకశిలా పార్క్‌ను రూ.1.70 కోట్లతో కొద్ది నెలల్లోనే జయశంకర్ స్మృతి వనంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు వరంగల్ జిల్లా కలెక్టర్ జి.కిషన్ తెలిపారు. జయశంకర్ 2011లో పరమపదించినప్పుడు ప్రజల సందర్శనార్థం ఆయన పార్థివ దేహాన్ని ఏకశిలా పార్క్‌లోనే ఉంచారు. జయశంకర్ 80వ జయంతిని పురస్కరించుకుని ఏకశిలా పార్కులో ‘సార్’ నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని బుధవారం ఆవిష్కరించనున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.