కడుపు నిండుగా.. షుగర్‌కు దూరంగా..! | Telangana Sona rice is a huge market online business | Sakshi
Sakshi News home page

కడుపు నిండుగా.. షుగర్‌కు దూరంగా..!

Published Mon, Oct 28 2024 3:37 AM | Last Updated on Mon, Oct 28 2024 3:58 PM

Telangana Sona rice is a huge market online business

‘తెలంగాణ సోనా’బియ్యంతో మేలు అంటున్న వ్యవసాయ వర్సిటీ శాస్త్రవేత్తలు 

మధుమేహ బాధితులు ధైర్యంగా తీసుకోవచ్చని సూచన

సాధారణ బియ్యం గ్లైసిమిక్‌ ఇండెక్స్‌ 79.22.. తెలంగాణ సోనా ఇండెక్స్‌ 51.5 మాత్రమేనని వెల్లడి 

‘షుగర్‌ ఫ్రీ బియ్యం’గా పేరు పొందడంతో పెరుగుతున్న డిమాండ్‌ 

ఈ బియ్యానికి మంచి డిమాండ్‌.. ఆన్‌లైన్‌లోనూ భారీగా వ్యాపారం 

తెలంగాణలో 20 లక్షల ఎకరాల్లో సాగు.. దేశవ్యాప్తంగా మరో 30 లక్షల ఎకరాల్లో పంట 

తమిళనాడు, కర్ణాటక సహా ఉత్తరాది రాష్ట్రాలకు చేరిన తెలంగాణ సోనా 

యూరప్, అమెరికా దేశాలకూ బియ్యం ఎగుమతి

ఏ రోజైనా వేరే ఏం తిన్నా, ఎంత తిన్నా.. కాసింత అన్నం కడుపులో పడితే తప్ప మనసున పట్టదు.. కూరలు ఏవైనా చేత్తో కలుపుకొంటూ ఇంత అన్నం తింటే ఉండే తృప్తే వేరు. కానీ మధుమేహం (షుగర్‌) వ్యాధి వచ్చి.. ఈ సంతృప్తి లేకుండా చేస్తోంది. అన్నం త్వరగా అరిగి, శరీరంలోకి వేగంగా గ్లూకోజ్‌ విడుదల కావడం.. రక్తంలో షుగర్‌ స్థాయిలు వేగంగా పెరిగిపోయే అవకాశం ఉండటమే దీనికి కారణం. దీనితో షుగర్‌తో బాధపడుతున్నవారు అన్నాన్ని చూస్తూనే నోరు కట్టేసుకుంటున్నారు. 

పెద్దగా అలవాటు లేకపోయినా, తినడానికి కాస్త ఇబ్బందిగా ఉన్నా.. గోధుమ, జొన్న రొట్టెలనో.. కొర్రలు, ఊదలతో చేసిన అన్నమో తింటున్నారు. కానీ షుగర్‌ బాధితులు పెద్దగా గాభరా అవసరం లేకుండా హాయిగా లాగించేయడానికి వీలైన బియ్యం రకమే.. ‘తెలంగాణ సోనా’. సాధారణ బియ్యంతో పోలిస్తే.. ఈ బియ్యం గ్లైసిమిక్‌ ఇండెక్స్‌ తక్కువని, రక్తంలో వేగంగా షుగర్‌ లెవల్స్‌ పెరిగే సమస్య తక్కువని తెలంగాణ వ్యవసాయ శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

మన వ్యవసాయ వర్సిటీలోనే అభివృద్ధి.. 
అన్నం తింటే రక్తంలో షుగర్‌ స్థాయి వేగంగా పెరుగుతుందన్న భయంతో నడి వయస్కులు కూడా ఆహార అలవాట్లను మార్చుకుంటున్నారు. షుగర్‌ వచ్చినవారు, యాభై ఏళ్లు దాటినవారైతే నోటికి తాళం వేసుకుంటున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న దాదాపు అన్ని రకాల బియ్యంతోనూ ఇదే సమస్య. అదే ‘తెలంగాణ సోనా (ఆర్‌ఎన్‌ఆర్‌–15048)’రకంతో ఈ ఇబ్బంది ఉండదని ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు చెప్తున్నారు. 

మిగతా రకాల బియ్యంతో పోలిస్తే.. ఈ రకం బియ్యం గ్లైసిమిక్‌ ఇండెక్స్‌ తక్కువని, మనకిష్టమైన అన్నం తింటూనే షుగర్‌ను నియంత్రణలో పెట్టుకోవచ్చని వివరిస్తున్నారు. ఈ తెలంగాణ సోనా బియ్యం ప్రత్యేకతలకు సంబంధించి అమెరికా ‘జర్నల్‌ ఆఫ్‌ ఫుడ్‌ అండ్‌ న్యూట్రిషన్‌’లోనూ ఆర్టికల్‌ ప్రచురితమైందని చెబుతున్నారు. ఈ బియ్యం గ్లైసిమిక్‌ ఇండెక్స్‌ 51.5 మాత్రమే. ఈ రకాన్ని వ్యవసాయ వర్సిటీ శాస్త్రవేత్తలే అభివృద్ధి చేయడం గమనార్హం. 

సరిహద్దులు దాటిన తెలంగాణ సోనా 
‘షుగర్‌ ఫ్రీ రైస్‌’గా పేరు తెచ్చుకున్న తెలంగాణ సోనా బియ్యానికి దేశంలోని వివిధ రాష్ట్రాలతోపాటు విదేశాల్లోనూ డిమాండ్‌ పెరుగుతోంది. దీంతో ఈ రకం వరిని పండించేందుకు వివిధ రాష్ట్రాల రైతులు మొగ్గుచూపుతున్నారు. మిగతా సన్నరకాల వరితో పోల్చితే పెట్టుబడి ఖర్చు తక్కువగా ఉండటం, తక్కువ కాలంలోనే పంట చేతికి రావడం, అన్ని కాలాల్లోనూ సాగుకు అనుకూలం కావడంతో.. ‘తెలంగాణ సోనా’రకం వరి సాగు విస్తీర్ణం పెరుగుతోంది. 

మూడేళ్ల క్రితం రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలకే పరిమితమైన తెలంగాణ సోనా సాగు.. ఇప్పుడు ఎనిమిది రాష్ట్రాలకు విస్తరించింది. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌తోపాటు పలు ఉత్తరాది రాష్ట్రాల్లోనూ సాగు చేస్తున్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం లెక్కల ప్రకారం తెలంగాణలో రెండు సీజన్లలో కలిపి 20 లక్షల ఎకరాల్లో తెలంగాణ సోనా వరి సాగవుతోంది. ఇతర రాష్ట్రాల్లో మరో 30 లక్షల ఎకరాలు సాగు చేస్తున్నారు. 

సాధారణంగా ఇతర సన్నరకాల వడ్లను మిల్లింగ్‌ చేస్తే.. 50 నుంచి 60 కిలోల బియ్యమే వస్తాయి. నూకల శాతం ఎక్కువగా ఉంటుంది. తెలంగాణ సోనా రకమైతే 68 నుంచి 70 కిలోల వరకు బియ్యం వస్తున్నాయని.. ఈ రకం సాగు వ్యవధి మిగతా వాటి కంటే 20 రోజులు తక్కువకావడం వల్ల ఫెర్టిలైజర్‌ వాడకం కూడా తక్కువేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 

ఆన్‌లైన్‌లో భారీగా వ్యాపారం 
తెలంగాణ సోనా బియ్యానికి మార్కెట్లో డిమాండ్‌ పెరిగింది. షుగర్‌ బాధితులతోపాటు సాధారణ వ్యక్తులూ దీనిపై ఆసక్తి చూపిస్తున్నారు. దీనితో ఆన్‌లైన్‌లో ఈ బియ్యం వ్యాపారం పెరిగింది. అమెజాన్‌ వంటి ప్రముఖ ఈ–కామర్స్‌ సైట్లలోనూ తెలంగాణ సోనా విక్రయాలు సాగుతున్నాయి. ‘డయాబెటిక్‌ కంట్రోల్‌ వైట్‌ రైస్, డయాబెటిక్‌ కేర్‌ రైస్, షుగర్‌ కంట్రోల్‌ రైస్, డెక్కన్‌ ముద్ర లో జీఐ, గ్రెయిన్‌ స్పేస్‌ తెలంగాణ సోనా రైస్, డాక్టర్‌ రైస్‌ డయాబెటిక్‌ రైస్‌’తదితర పేర్లతో ఆన్‌లైన్‌లో లభ్యమవుతున్నాయి.

అయితే ఈ పేరిట అమ్ముతున్నదంతా తెలంగాణ సోనా రకమేనా అన్నది తేల్చడం, పక్కాగా అదేనా, కాదా అని గుర్తుపట్టడం కష్టమేనని నిపుణులు చెప్తున్నారు. ఈ క్రమంలోనే ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ)తోపాటు పలు సంస్థలు, వ్యక్తులతో వ్యవసాయ విశ్వవిద్యాలయం తెలంగాణ సోనా బ్రాండింగ్‌పై అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. 

గ్లైసిమిక్‌ ఇండెక్స్‌ ఏంటి? దానితో సమస్యేమిటి? 
మనం తీసుకునే ఏ ఆహారమైనా ఎంత వేగంగా అరిగిపోయి, శరీరంలోకి ఎంత గ్లూకోజ్‌ను విడుదల చేస్తుందనే లెక్కను గ్లైసిమిక్‌ ఇండెక్స్‌(జీఐ)తో కొలుస్తారు. జీఐ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకుంటే.. రక్తంలో షుగర్‌ స్థాయిలు అంత వేగంగా పెరుగుతాయన్న మాట. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు తీవ్రమైన సమస్యగా మారుతుంది. 

బియ్యంతో చేసిన అన్నం ఎక్కువ. 1–55 మధ్య ఉంటే తక్కువగా అని.. 56–69 ఉంటే మధ్యస్థమని.. 70 శాతానికి పైగా ఉంటే అత్యధికమని చెబుతారు. సాధారణంగా బియ్యం గ్లైసిమిక్‌ ఇండెక్స్‌ 79.22 వరకు ఉంటుంది. అందుకే షుగర్‌ బాధితులు అన్నం తగ్గించి, ఇతర ఆహారం తీసుకుంటారు. 

అయితే తెలంగాణ సోనా గ్లైసిమిక్‌ ఇండెక్స్‌ 51.5 వరకే ఉంటుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అయితే హైదరాబాద్‌ కేంద్రంగా ఉన్న ‘జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్‌) మాత్రం తెలంగాణ సోనాలో మరీ అంత తక్కువగా  గ్లైసిమిక్‌ ఇండెక్స్‌ ఉండదని పేర్కొంది. 

ఓ మోతాదు మేరకు తినొచ్చు
సాధారణ బియ్యంతో పోలిస్తే తెలంగాణ సోనా గ్లైసిమిక్‌ ఇండెక్స్‌ త క్కువని వ్యవసాయ విశ్వవిద్యాల యం శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ లెక్కన చూ స్తే ఇతర రకాల బియ్యం కంటే తెలంగాణ సోనాతో ప్రయోజనం ఉంటుందని చెప్పవచ్చు.

మధుమే హం బాధితులు ఓ మోతాదు వరకు ఈ బియ్యంతో వండిన అన్నం తీసుకో వచ్చు. దక్షిణ భారతంలో వేల ఏళ్లుగా అన్నమే ప్రధాన ఆహారం. అన్నం తింటేనే కాస్త సంతృప్తి. అందువల్ల మధు మేహ బాధితులు వైద్యులను సంప్రదించి.. ఎంత మేరకు ఈ అన్నం తినవచ్చన్నది నిర్ధారించుకుని వాడితే మంచిది. 
– ప్రొఫెసర్‌ కిరణ్‌ మాదల,  గాంధీ మెడికల్‌ కాలేజీ, హైదరాబాద్‌ 

బాధితులకు తెలంగాణ సోనాతో మేలు 
తెలంగాణ సోనా రకం బియ్యంతో వండిన అన్నాన్ని షుగర్‌ బాధితులు తీసుకో వచ్చు. ఇది మెల్లగా జీర్ణమవుతుంది. గ్లైసిమిక్‌ ఇండెక్స్‌ తక్కువ కావడం వల్ల గ్లూకోజ్‌ లెవల్స్‌ వేగంగా పెరగవు. షుగర్‌ బాధితులేకాదు.. మిగతా వారంతా ఈ బియ్యాన్ని వాడటం వల్ల ప్రయోజనం ఉంటుంది.  
– డాక్టర్‌ ఆర్‌.జగదీశ్వర్, రిటైర్డ్‌ పరిశోధన సంచాలకుడు, ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం 

ఈ బియ్యంలో పిండి పదార్థాలు తక్కువ 
సాంబమసూరి, ఇతర వరి రకాలతో పోలిస్తే తెలంగాణ సోనా బియ్యంలో పిండి పదార్థాల శాతం తక్కువ. కాబట్టి ఇది షుగర్‌ బాధితులకు ఉపయోగపడుతుంది. వాస్తవంగా షుగర్‌ నియంత్రణ కోసం ఈ వరి వంగడాన్ని తయారు చేయలేదు. రూపొందించిన తర్వాత అందులో గ్లైసిమిక్‌ ఇండెక్స్‌ తక్కువని తేలింది. పలు పరిశోధనల తర్వాత వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 2015లో తెలంగాణ సోనాను అభివృద్ధి చేసింది. రకం సాగుతో రైతులకూ ప్రయోజనం. పెట్టుబడి తక్కువ. దిగుబడి ఎక్కువ. 
 – డాక్టర్‌ వై.చంద్రమోహన్, ప్రిన్సిపల్‌ సైంటిస్ట్, రైస్‌బ్రీడర్, ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం


– సాక్షి, హైదరాబాద్‌Suh

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement