Sugar Free
-
కడుపు నిండుగా.. షుగర్‌కు దూరంగా..!
ఏ రోజైనా వేరే ఏం తిన్నా, ఎంత తిన్నా.. కాసింత అన్నం కడుపులో పడితే తప్ప మనసున పట్టదు.. కూరలు ఏవైనా చేత్తో కలుపుకొంటూ ఇంత అన్నం తింటే ఉండే తృప్తే వేరు. కానీ మధుమేహం (షుగర్) వ్యాధి వచ్చి.. ఈ సంతృప్తి లేకుండా చేస్తోంది. అన్నం త్వరగా అరిగి, శరీరంలోకి వేగంగా గ్లూకోజ్ విడుదల కావడం.. రక్తంలో షుగర్ స్థాయిలు వేగంగా పెరిగిపోయే అవకాశం ఉండటమే దీనికి కారణం. దీనితో షుగర్‌తో బాధపడుతున్నవారు అన్నాన్ని చూస్తూనే నోరు కట్టేసుకుంటున్నారు. పెద్దగా అలవాటు లేకపోయినా, తినడానికి కాస్త ఇబ్బందిగా ఉన్నా.. గోధుమ, జొన్న రొట్టెలనో.. కొర్రలు, ఊదలతో చేసిన అన్నమో తింటున్నారు. కానీ షుగర్ బాధితులు పెద్దగా గాభరా అవసరం లేకుండా హాయిగా లాగించేయడానికి వీలైన బియ్యం రకమే.. ‘తెలంగాణ సోనా’. సాధారణ బియ్యంతో పోలిస్తే.. ఈ బియ్యం గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువని, రక్తంలో వేగంగా షుగర్ లెవల్స్ పెరిగే సమస్య తక్కువని తెలంగాణ వ్యవసాయ శాస్త్రవేత్తలు చెప్తున్నారు.మన వ్యవసాయ వర్సిటీలోనే అభివృద్ధి.. అన్నం తింటే రక్తంలో షుగర్ స్థాయి వేగంగా పెరుగుతుందన్న భయంతో నడి వయస్కులు కూడా ఆహార అలవాట్లను మార్చుకుంటున్నారు. షుగర్ వచ్చినవారు, యాభై ఏళ్లు దాటినవారైతే నోటికి తాళం వేసుకుంటున్నారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న దాదాపు అన్ని రకాల బియ్యంతోనూ ఇదే సమస్య. అదే ‘తెలంగాణ సోనా (ఆర్ఎన్ఆర్–15048)’రకంతో ఈ ఇబ్బంది ఉండదని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మిగతా రకాల బియ్యంతో పోలిస్తే.. ఈ రకం బియ్యం గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువని, మనకిష్టమైన అన్నం తింటూనే షుగర్‌ను నియంత్రణలో పెట్టుకోవచ్చని వివరిస్తున్నారు. ఈ తెలంగాణ సోనా బియ్యం ప్రత్యేకతలకు సంబంధించి అమెరికా ‘జర్నల్ ఆఫ్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్’లోనూ ఆర్టికల్ ప్రచురితమైందని చెబుతున్నారు. ఈ బియ్యం గ్లైసిమిక్ ఇండెక్స్ 51.5 మాత్రమే. ఈ రకాన్ని వ్యవసాయ వర్సిటీ శాస్త్రవేత్తలే అభివృద్ధి చేయడం గమనార్హం. సరిహద్దులు దాటిన తెలంగాణ సోనా ‘షుగర్ ఫ్రీ రైస్’గా పేరు తెచ్చుకున్న తెలంగాణ సోనా బియ్యానికి దేశంలోని వివిధ రాష్ట్రాలతోపాటు విదేశాల్లోనూ డిమాండ్ పెరుగుతోంది. దీంతో ఈ రకం వరిని పండించేందుకు వివిధ రాష్ట్రాల రైతులు మొగ్గుచూపుతున్నారు. మిగతా సన్నరకాల వరితో పోల్చితే పెట్టుబడి ఖర్చు తక్కువగా ఉండటం, తక్కువ కాలంలోనే పంట చేతికి రావడం, అన్ని కాలాల్లోనూ సాగుకు అనుకూలం కావడంతో.. ‘తెలంగాణ సోనా’రకం వరి సాగు విస్తీర్ణం పెరుగుతోంది. మూడేళ్ల క్రితం రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలకే పరిమితమైన తెలంగాణ సోనా సాగు.. ఇప్పుడు ఎనిమిది రాష్ట్రాలకు విస్తరించింది. తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌తోపాటు పలు ఉత్తరాది రాష్ట్రాల్లోనూ సాగు చేస్తున్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం లెక్కల ప్రకారం తెలంగాణలో రెండు సీజన్లలో కలిపి 20 లక్షల ఎకరాల్లో తెలంగాణ సోనా వరి సాగవుతోంది. ఇతర రాష్ట్రాల్లో మరో 30 లక్షల ఎకరాలు సాగు చేస్తున్నారు. సాధారణంగా ఇతర సన్నరకాల వడ్లను మిల్లింగ్ చేస్తే.. 50 నుంచి 60 కిలోల బియ్యమే వస్తాయి. నూకల శాతం ఎక్కువగా ఉంటుంది. తెలంగాణ సోనా రకమైతే 68 నుంచి 70 కిలోల వరకు బియ్యం వస్తున్నాయని.. ఈ రకం సాగు వ్యవధి మిగతా వాటి కంటే 20 రోజులు తక్కువకావడం వల్ల ఫెర్టిలైజర్ వాడకం కూడా తక్కువేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆన్లైన్లో భారీగా వ్యాపారం తెలంగాణ సోనా బియ్యానికి మార్కెట్లో డిమాండ్ పెరిగింది. షుగర్ బాధితులతోపాటు సాధారణ వ్యక్తులూ దీనిపై ఆసక్తి చూపిస్తున్నారు. దీనితో ఆన్లైన్లో ఈ బియ్యం వ్యాపారం పెరిగింది. అమెజాన్ వంటి ప్రముఖ ఈ–కామర్స్ సైట్లలోనూ తెలంగాణ సోనా విక్రయాలు సాగుతున్నాయి. ‘డయాబెటిక్ కంట్రోల్ వైట్ రైస్, డయాబెటిక్ కేర్ రైస్, షుగర్ కంట్రోల్ రైస్, డెక్కన్ ముద్ర లో జీఐ, గ్రెయిన్ స్పేస్ తెలంగాణ సోనా రైస్, డాక్టర్ రైస్ డయాబెటిక్ రైస్’తదితర పేర్లతో ఆన్లైన్లో లభ్యమవుతున్నాయి.అయితే ఈ పేరిట అమ్ముతున్నదంతా తెలంగాణ సోనా రకమేనా అన్నది తేల్చడం, పక్కాగా అదేనా, కాదా అని గుర్తుపట్టడం కష్టమేనని నిపుణులు చెప్తున్నారు. ఈ క్రమంలోనే ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ)తోపాటు పలు సంస్థలు, వ్యక్తులతో వ్యవసాయ విశ్వవిద్యాలయం తెలంగాణ సోనా బ్రాండింగ్‌పై అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. గ్లైసిమిక్ ఇండెక్స్ ఏంటి? దానితో సమస్యేమిటి? మనం తీసుకునే ఏ ఆహారమైనా ఎంత వేగంగా అరిగిపోయి, శరీరంలోకి ఎంత గ్లూకోజ్‌ను విడుదల చేస్తుందనే లెక్కను గ్లైసిమిక్ ఇండెక్స్(జీఐ)తో కొలుస్తారు. జీఐ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకుంటే.. రక్తంలో షుగర్ స్థాయిలు అంత వేగంగా పెరుగుతాయన్న మాట. ఇది మధుమేహ వ్యాధిగ్రస్తులకు తీవ్రమైన సమస్యగా మారుతుంది. బియ్యంతో చేసిన అన్నం ఎక్కువ. 1–55 మధ్య ఉంటే తక్కువగా అని.. 56–69 ఉంటే మధ్యస్థమని.. 70 శాతానికి పైగా ఉంటే అత్యధికమని చెబుతారు. సాధారణంగా బియ్యం గ్లైసిమిక్ ఇండెక్స్ 79.22 వరకు ఉంటుంది. అందుకే షుగర్ బాధితులు అన్నం తగ్గించి, ఇతర ఆహారం తీసుకుంటారు. అయితే తెలంగాణ సోనా గ్లైసిమిక్ ఇండెక్స్ 51.5 వరకే ఉంటుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అయితే హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ‘జాతీయ పోషకాహార సంస్థ (ఎన్ఐఎన్) మాత్రం తెలంగాణ సోనాలో మరీ అంత తక్కువగా గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండదని పేర్కొంది. ఓ మోతాదు మేరకు తినొచ్చుసాధారణ బియ్యంతో పోలిస్తే తెలంగాణ సోనా గ్లైసిమిక్ ఇండెక్స్ త క్కువని వ్యవసాయ విశ్వవిద్యాల యం శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ లెక్కన చూ స్తే ఇతర రకాల బియ్యం కంటే తెలంగాణ సోనాతో ప్రయోజనం ఉంటుందని చెప్పవచ్చు.మధుమే హం బాధితులు ఓ మోతాదు వరకు ఈ బియ్యంతో వండిన అన్నం తీసుకో వచ్చు. దక్షిణ భారతంలో వేల ఏళ్లుగా అన్నమే ప్రధాన ఆహారం. అన్నం తింటేనే కాస్త సంతృప్తి. అందువల్ల మధు మేహ బాధితులు వైద్యులను సంప్రదించి.. ఎంత మేరకు ఈ అన్నం తినవచ్చన్నది నిర్ధారించుకుని వాడితే మంచిది. – ప్రొఫెసర్ కిరణ్ మాదల, గాంధీ మెడికల్ కాలేజీ, హైదరాబాద్ బాధితులకు తెలంగాణ సోనాతో మేలు తెలంగాణ సోనా రకం బియ్యంతో వండిన అన్నాన్ని షుగర్ బాధితులు తీసుకో వచ్చు. ఇది మెల్లగా జీర్ణమవుతుంది. గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ కావడం వల్ల గ్లూకోజ్ లెవల్స్ వేగంగా పెరగవు. షుగర్ బాధితులేకాదు.. మిగతా వారంతా ఈ బియ్యాన్ని వాడటం వల్ల ప్రయోజనం ఉంటుంది. – డాక్టర్ ఆర్.జగదీశ్వర్, రిటైర్డ్ పరిశోధన సంచాలకుడు, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈ బియ్యంలో పిండి పదార్థాలు తక్కువ సాంబమసూరి, ఇతర వరి రకాలతో పోలిస్తే తెలంగాణ సోనా బియ్యంలో పిండి పదార్థాల శాతం తక్కువ. కాబట్టి ఇది షుగర్ బాధితులకు ఉపయోగపడుతుంది. వాస్తవంగా షుగర్ నియంత్రణ కోసం ఈ వరి వంగడాన్ని తయారు చేయలేదు. రూపొందించిన తర్వాత అందులో గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువని తేలింది. పలు పరిశోధనల తర్వాత వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 2015లో తెలంగాణ సోనాను అభివృద్ధి చేసింది. రకం సాగుతో రైతులకూ ప్రయోజనం. పెట్టుబడి తక్కువ. దిగుబడి ఎక్కువ. – డాక్టర్ వై.చంద్రమోహన్, ప్రిన్సిపల్ సైంటిస్ట్, రైస్బ్రీడర్, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం– సాక్షి, హైదరాబాద్Suh -
రైతులకు సిరులు కురిపిస్తున్న షుగర్ లెస్ వరి
-
ఈ చాక్లెట్లో షుగర్ ఉందా, 200 మంది డాక్టర్లతో చర్చలు చివరికి ఇలా
స్వీట్ అంటే ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు! ముంబై కుర్రాడు హర్ష్ కేడియకు ఇంకాస్త ఎక్కువ ఇష్టం. అయితే ఆ అమితమైన ఇష్టానికి డయాబెటిస్ బ్రేక్ వేసింది. పన్నెండేళ్ల వయసులో హర్ష్ డయాబెటిస్ బారిన పడ్డాడు. ఇక అప్పటి నుంచి జీవనశైలి, అలవాట్లను పూర్తిగా మార్చుకోవాల్సి వచ్చింది. పార్టీలకు... చెక్.. స్వీట్లకు... కట్ పార్టీలకు... చెక్..స్వీట్లకు.... కట్... ఇలా రకరకాల చెక్‌లతో జీవితం దుర్భరప్రాయంగా అనిపించింది. ఖైదీ జీవితానికి తన జీవితానికి తేడా ఏమిటి! అని కూడా అనిపించింది. నోరు కట్టేసుకోకుండా రుచి మొగ్గలను మళ్లీ హుషారెత్తించడానికి ఏదో ఒకటి చేయాలనుకున్నాడు. ‘అసలు ఈ డయాబెటిస్ ఏమిటి?’ అని దాని పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకోవడానికి భారీ కసరత్తే చేశాడు. చాక్లెట్లో షుగర్ ఎంత ఉందో తెలుసుకునేందుకు రెండు వందల మందికి పైగా వైద్యులను కలిసి ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు. టీవీల్లో టూత్ పేస్ట్ యాడ్ లా.. ఈ చాక్లెట్ లో షుగర్ ఉందా అని తెలుసుకునే ప్రయత్నం చేశాడు. ‘ఏ డయాబెటిక్ చెఫ్’ మార్కెట్టులో ‘షుగర్–ఫ్రీ’ పేరుతో అందుబాటులో ఉన్న చాలా చాక్లెట్లలో ఎంతో కొంత షుగర్ కూడా ఉన్నట్లు తెలుసుకోగలిగాడు. ఈ నేపథ్యంలోనే ‘డయాబెటిక్ ఫ్రెండ్లీ చాక్లెట్’ అనే ఐడియా మదిలో మెరిసింది.పేరుకి ‘షుగర్–ఫ్రీ’ అని కాకుండా 100 శాతం షుగర్–ఫ్రీ చాక్లెట్ తయారీ కోసం ఆలోచించాడు. ఎన్నో పుస్తకాలు తిరగేశాడు. అంతర్జాల సమాచార సముద్రంలో దూకాడు. డాక్టర్లు, న్యూట్రీషనిస్ట్లు, ఫుడ్సైంటిస్టులను కలిశాడు. తన నుంచి ఒక చెఫ్ బయటికి వచ్చాడు. ప్రయోగాల్లోనే కొన్ని సంవత్సరాలు గడిచాయి. ఎకనామిక్స్‌లో పట్టా పుచ్చుకున్న హర్ష్ రకరకాల కంపెనీలలో పనిచేసి బిజినెస్ స్కిల్స్‌ను ఒంటబట్టించుకున్నాడు. తాను చేసిన పరిశోధన, వ్యాపార నైపుణ్యాలు, తల్లిదండ్రుల ఆశీస్సులు...అలా ముంబై కేంద్రంగా ‘ఏ డయాబెటిక్ చెఫ్’ అనే కంపెనీ మొదలుపెట్టాడు. ‘ఈ వయసులో ఇదొక దుస్సాహాసం’ అన్నవారు కూడా లేకపోలేదు. ‘సాహాసానికి వయసుతో పనేమిటి’ అని వెన్నుతట్టిన వారు కూడా లేకపోలేదు. ‘యంగ్ ట్రెండ్‌సెట్టర్’ టాప్ క్వాలిటీ ఇన్‌గ్రేడియంట్స్‌తో, రుచితో రాజీ పడకుండా, అయిదు రకాల ఫ్లేవర్లతో తయారుచేసిన ‘ఏ డయాబెటిక్’ చెఫ్ ఉత్పత్తులకు మార్కెట్లో మంచి టాక్ వచ్చింది. 24 సంవత్సరాల హర్ష్ చిన్న వయసులోనే ఎంటర్‌ప్రెన్యూర్‌గా పేరు తెచ్చుకున్నాడు. అండర్ 30–ఫోర్బ్స్ ‘యంగ్ ట్రెండ్‌సెట్టర్’ జాబితాలో చోటు సంపాదించాడు. మోటివేషనల్ స్పీకర్‌గా కూడా మంచి పేరు తెచ్చుకున్న హర్ష్ కెడియ పేద డయాబెటిక్ పేషెంట్లకు ఆర్థిక సహాయం చేస్తున్నాడు. భవిష్యత్‌లో మరిన్ని సేవాకార్యక్రమాలు చేపట్టాలనుకుంటున్నాడు. మోటివేషనల్ స్పీకర్‌గా హర్ష్ కెడియ పుస్తకాలు చదువుతాడు. తన భావాలను కాగితాలపై పెడతాడు. రచన అతనికేమీ కొత్తకాదు.‘డయాబెటిస్ సమస్య నుంచి ఎంటర్‌ప్రెన్యూర్‌గా సాధించిన విజయం వరకు తన అనుభవాలకు పుస్తకరూపం ఇస్తే బాగుంటుంది కదా!’ అనేవాళ్లతో మనం కూడా గొంతు కలుపుదాం. ఒక ప్రాడక్ట్‌కు మార్కెట్లో మంచి టాక్ రావాలంటే...అది పేరుతోనే మొదలవుతుంది. ‘ఏ డయాబెటిక్ చెఫ్’ అనే పేరుతో తొలి అడుగులోనే మార్కులు కొట్టేసిన హర్ష్ కేడియ యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా యువతకు స్ఫూర్తిని ఇస్తున్నాడు. మోటివేషనల్ స్పీకర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. పేదరోగులకు సహాయం చేస్తూ మంచిమనసును చాటుకుంటున్నాడు. -
మీకు తెలుసా..? డయాబెటీస్ పేషెంట్లకు ప్రత్యేక మామిడి పండ్లు
మారుతున్న జీవన శైలి కారణంగా మనిషి శరీరం అనేక వ్యాధులకు నిలయంగా మారింది. ఈ వ్యాధులలో ఒకటి డయాబెటీస్. దీన్నే మధుమేహం, డయాబెటీస్, చక్కెర వ్యాధి అని అంటారు. డయాబెటీస్.. చాపకింద నీరులా సోకే వ్యాధి. ఇక డయాబెటిస్ ఉన్నవారు ఏవైనా పండ్లు తీసుకోవాలనుకుంటే.. ముఖ్యమైన మామిడి పండ్లను తినాలంటే చక్కెర స్థాయి అధికంగా ఉంటుందేమో అని ఆందోళన చెందుతారు. కానీ ప్రస్తుతం పాకిస్తాన్ మార్కెట్లో చక్కెర స్ఠాయిలు తక్కువగా ఉండే మామిడి పండ్లను విక్రయిసున్నారు. ఇస్లామాబాద్: పాకిస్తాన్‌కి చెందిన మామిడి పండ్ల నిపుణుడు గులాం సర్వర్ చక్కెర స్థాయిలు తక్కువగా ఉండే మామిడి పండ్లను కనుగొన్నారు. పాకిస్తాన్లో 'ఆమ్ ఆద్మీ' కోసం తక్కువ ధరలకు , ముఖ్యంగా డయాబెటీస్ పేషంట్స్ కోసం ఈ మామిడి పండ్లను విక్రయిసున్నారు. ప్రస్తుతం ఈ పండ్లు సోనారో, గ్లెన్, కీట్ పేర్లతో సింధ్ టాండో అల్లాహార్‌లోని ఎంహెచ్ పన్వర్ ఫార్మ్స్ అనే ప్రైవేట్ వ్యవసాయ క్షేత్రంలో పండిస్తున్నారు. పాకిస్తాన్ మార్కెట్లలో కిలో రూ.150 ‘‘సింధ్రీ, చౌన్సా వంటి రకాల్లో 12 నుంచి 15శాతం చక్కెర ఉండగా, పన్వర్ ఫార్మ్‌లో కొన్ని రకాలు కేవలం 4 నుంచి 5శాతం చక్కెర స్థాయిని కలిగి ఉన్నాయి. కీట్ రకంలో అత్యల్ప చక్కెర స్థాయి 4.7 శాతం వరకు ఉంది. సోనారో, గ్లెన్ చక్కెర స్థాయి వరుసగా 5.6శాతం, 6శాతం వరకు ఉన్నాయి. ప్రస్తుతం ఈ మామిడిపండ్లు పాకిస్తాన్ మార్కెట్లలో కిలో రూ.150కు లభిస్తున్నాయి." అని మామిడి పండ్ల నిపుణుడు గులాం సర్వర్ తెలిపారు. 300 ఎకరాల పొలంలో 44 రకాలు దీనిపై ఎంహెచ్ పన్వర్ మేనల్లుడు మాట్లాడుతూ.. ‘‘ మామిడి, అరటితో సహా ఇతర పండ్లకు సంబంధించిన పరిశోధనల కోసం పాకిస్తాన్ ప్రభుత్వం పన్వర్‌కు సీతారా-ఇ-ఇమ్తియాజ్‌ను ప్రదానం చేసంది. అతని మరణం తర్వాత, నేను ఆ పనిని కొనసాగిస్తున్నాను. ఇక ఇక్కడి వాతావరణం, మట్టిని పరీక్షించిన తరువాత వివిధ రకాల మామిడి సండ్లను దిగుమతి చేసుకుని మార్పులు చేశాం. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం లేకున్నా ప్రాజెక్టును వ్యక్తిగత ప్రాతిపదికన నడుపుతున్నామని, ప్రస్తుతం తమకు ఉన్న 300 ఎకరాల పొలంలో 44 రకాల మామిడి పండ్లు అందుబాటులో ఉన్నాయి.’’ అని తెలిపారు. చదవండి: లాడెన్ అమరవీరుడంటూ నోరు జారిన ఇమ్రాన్.. వరుస వివరణలు పుల్వామాలో ఉగ్రదాడి కలకలం -
స్వీట్ ఎక్స్పెరిమెంట్
ప్రతి సమస్యకూ ఓ పరిష్కారం ఉంటుంది. ఒక్కో సమస్య కొత్తదారిలో నడిపిస్తుంది కూడా. అలా ఆర్తి తనకు తానుగా వేసుకున్న కొత్త దారి చక్కెర అంత తియ్యగా ఉంది. చక్కెర తినలేని వాళ్ల కోసం చక్కెర లేని తీపి రుచులను అందిస్తోంది ఆర్తి. చక్కెర తినలేని తన జీవితాన్ని తియ్యగా మలుచుకుంది. చెవులకు ఏమైంది! ఆర్తి రస్తోగి బెంగళూరమ్మాయి. డయాబెటిస్ ఆ ఫ్యామిలీ హిస్టరీలోనే ఉంది. రకరకాల ఆహార నియమాలు పాటించక తప్పదు. ఇంటిల్లి పాదీ దేనినీ సంతోషంగా తినడానికి వీల్లేదు. ‘ఇది తింటే షుగర్ లెవెల్స్ పోతాయి, అది తింటే బరువు పెరిగి ఇతర సమస్యలకు కారణమవుతుంది...’ అంటూ నోరు కట్టుకుని రోజులు వెళ్లదీయడమే. ఇక చాక్లెట్లు, ఐస్ క్రీమ్‌లు అయితే దగ్గరగా చూడడానికి కూడా ఇష్టపడేవాళ్లు కాదు. పిల్లల దృష్టి వాటి మీద పడిందంటే వాటిని మనం తినకూడదని నచ్చచెప్పాలి, పిల్లల మనసు గాయపడుతుంది. అందుకే ఇంట్లో అవేవీ కనిపించడానికి వీల్లేనంత నియమానుసారంగా పెంచుకొచ్చారు అమ్మానాన్నలు. అలా ఆర్తి గాజు బొమ్మలా పెరిగిందని చెప్పాలి. అందరిలాగానే స్కూలుకెళ్లి చదువుకుంది. తినగలిగిందేదో తింటూ కాలేజ్ చదువు పూర్తి చేసింది. కారణం ఏమిటో తెలియదు, ఇరవ మూడేళ్ల వయసులో ఆమెకు వినికిడి తగ్గడం మొదలైంది. ఏ డాక్టరూ కారణం ఇదని తేల్చలేకపోయారు. డయాబెటిస్ కారణంగా ఎదురైన అనుబంధ సమస్యలుగానే గుర్తించారు. వినికిడి ఎనభై శాతం తగ్గిందని మాత్రం నిర్ధారించగలిగారు. ఉన్న ఇరవై శాతం వినికిడితోనే ఉద్యోగం తెచ్చుకుంది. మాటలు కనిపించేవి ఆర్తి సంపాదించింది మామూలు ఉద్యోగం కాదు. పెద్ద కంపెనీలో హెచ్ఆర్ విభాగంలో ఉద్యోగం. ఆమె ఆరోగ్యంతో ఎదురీది జీవితంలో నిలబడడంలో ఆమె వంతు లోపమేమీ లేదు. కానీ ఆర్తి ఆ ఉద్యోగం లో ఎక్కువ కాలం కొనసాగలేకపోయింది. తోటి ఉద్యోగులు చూసే చూపులను తట్టుకోవడం కష్టమైంది. ‘ఎన్నిసార్లు చెప్పాలి’ అనే చిరాకు వినిపించేది కాదు, కానీ వాళ్ల ముఖాల్లో కనిపించేది. ఆ ఒత్తిడిని తట్టుకోవడం కష్టమైంది. బాధను అదిమిపెట్టడానికి ఆమె ఎంచుకున్న మార్గం ఐస్‌క్రీమ్. నిజమే ఇంట్లోనే ఐస్‌క్రీమ్ తయారు చేసుకోగలిగిన చిన్న మెషీన్‌ని కొనుక్కుంది. ఉద్యోగానికి వెళ్లి ఇంటికి వచ్చిన తర్వాత ఐస్‌క్రీమ్‌తో ప్రయోగాలు చేయడం. తాను చేసుకున్న షుగర్ ఫ్రీ ఐస్‌క్రీమ్ తింటూ సహోద్యోగుల నుంచి ఎదురైన వివక్షను మర్చిపోవడానికి ప్రయత్నించేది. ఆ ప్రాక్టీస్ ఆమెను మరింతగా ప్రయోగాల్లోనే మునిగిపోయేటట్లు చేసింది. ఐస్‌క్రీమ్ పుస్తకాలను చదివింది. అక్కడితో ఆగిపోకుండా ‘ఇలా ఎందుకు చేయకూడదు, అలా ఎందుకు చేయకూడదు’ అనుకుంటూ షుగర్ ఫ్రీతోపాటు గ్లూటెన్ ఫ్రీ, కీటో ఫ్రెండ్లీ కుకీలు, చాక్లెట్లు, బ్రౌనీ, కేక్‌ల మీద ప్రయోగం చేసింది. తన ప్రయోగాలను ఫుడ్ రీసెర్చ్ అండ్ అనాలసిస్ డిపార్ట్మెంట్కు పరీక్షకు పంపించింది. సలహా బాగానే ఉంది ‘చాలా బాగా చేస్తున్నావ్, సర్టిఫికేట్ కూడా వచ్చేసింది. ఇక సొంతంగా స్టార్టప్ పెట్టెయ్’ అని తిన్నవాళ్లు ఓ సలహా ఇచ్చేసే వాళ్లు. ‘స్టార్టప్ పెట్టాలంటే బ్యాంకు తనకు లోన్ ఇస్తుందా?’ సమాధానం లేని ప్రశ్న. అన్నీ బాగున్న వాళ్లకే బ్యాంకులు అంత త్వరగా లోన్ ఇవ్వవు. స్టార్టప్ పెట్టాలనే ఆలోచన మానుకుని ఏదో ఓ ఉద్యోగం లో చేరేటట్లు చేస్తుంటాయి. అలాంటిది ఉద్యోగం లో కొనసాగ లేని వైకల్యం ఉన్న తనకు లోన్ ఎలా వస్తుంది? అనుకుని స్నేహితుల సూచనను పక్కన పెట్టేసింది. అయితే... ఓ బలహీన క్షణంలో ఈ ఉద్యోగం ఇక వద్దు అని నిర్ణయం తీసుకుంది. రాజీనామా చేసింది. అప్పుడు కుటుంబం ఆమెకు అండగా నిలిచింది. ఇంట్లో అందరూ చేయగలిగినంత సహాయం చేశారు. అలా 2019లో ఆమె తన స్టార్టప్‌ను ప్రారంభించింది. అప్పుడు ఆర్తికి నలభై ఏళ్లు. రెండేళ్లు గడిచాయి. ఫుడ్ బిజినెస్ లో భారీ నష్టాలైనా వస్తాయి లేదా త్వరగా బ్రేక్ ఈవెన్ వచ్చేస్తుంది. ఇప్పుడామె బెంగళూరులో పది బ్రాంచ్‌లను నిర్వహిస్తోంది. ఆన్లైన్లో పాతిక రాష్ట్రాల్లో తన ఉత్పత్తులను విక్రయిస్తోంది. ‘‘ఇండియా డయాబెటిక్ క్యాపిటల్ గా మారిపోతోంది. డయాబెటిక్ వాళ్లు రుచిని చంపుకుని బతకాల్సిన అగత్యం లేకుండా అన్ని రుచులనూ తినగలిగేటట్లు చేయడం సంతోషంగా ఉంది. వ్యాపారం కోసం వచ్చిన ఆలోచన కాదు. నా కష్టం నుంచి పుట్టుకొచ్చిన ఆలోచన’’ అంటున్నారు ఆర్తి. తీవ్రంగా గాయపడి ఉండడం వల్లనో ఏమో ఆర్తి తన అవుట్లెట్లలో వికలాంగులు, ఎల్జీబీటీలను ఉద్యోగంలో చేర్చుకుంది. -
సుగర్ ఫ్రీ రైస్ లేనే లేదు !
మార్టేరు (పెనుగొండ రూరల్): మార్కె ట్లో ప్రచారం జరుగుతున్నట్టుగా సుగర్ ఫ్రీ రైస్ అసలు లేనే లేదని మార్టేరు వరి పరిశోధన సంస్థ డెరైక్టర్ డాక్టర్ పాల డుగు వెంకట సత్యనారాయణ స్పష్టం చేశారు. మార్టేరులోని ఆంధ్రప్రదేశ్ వరి పరిశోధనా సంస్థలో గోదావరి మండ లం పరిశోధన, విస్తరణ సలహామండలి రెండవరోజు సమావేశంలో ఆ యన ప్రసంగించారు. ఆర్ఎన్ఆర్ 15048 రకాన్ని సుగర్ ఫ్రీ రకంగా ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. కానీ ఇది వాస్తవం కాదన్నారు. జీఐ(గ్లైసమిక్ సూచిక )లో ఇది మధ్యస్త రకం మాత్రమేనని పాలడుగు అన్నారు. మధుమేహ నియంత్రణ పరంగా వరి రకాలను మధ్యస్త, హెచ్చురకాలుగా విడదీశామన్నారు. ఈ సూచిక ప్రకారం ఆర్ఎన్ఆర్ కన్నా సాంబమసూరే సుగ ర్ రోగులకు మేలైనదన్నారు. ఆర్ఎన్ఆర్ 15048లో 57 శాతం జీఐ ఇండెక్స్ ఉంటే, బీపీటీ 5204 (సాంబ మసూరి)లో 52 శాతం, స్వర్ణ రకంలో 56 శా తం ఉందన్నారు. వరిలో సుగర్ ఫ్రీ రైస్ ఉండదన్నారు. చక్కెర తక్కువ శాతం ఉండే రకాలు మాత్రమే ఉంటాయన్నారు. తక్కువ చక్కెర శా తం రకాలపై ఎన్ఐఎన్ సహకారంతో పరిశోధనలు నిర్వహిస్తున్నామని తెలిపారు. సత్ఫలితాలు రావచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. శాస్త్రవేత్తలు ఎలుకల నివారణ, మధుమేహ వ్యాధిగ్రస్తుల ఆహారం, చిరుధాన్యాలపై ప్రజెంటేషన్ ఇచ్చారు. సాయిల్ మేనేజ్మెంట్ ప్రత్యేకాధికారి టి గిరిధర్, ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏడీఆర్ డాక్టర్ ఎన్ మల్లికార్జునరెడ్డి, వ్యవసాయ శాఖ ఉభయగోదావరి జిల్లా డీడీఏలు పద్మ, లక్ష్మణరావు, శాస్త్రవేత్తలు ఎంవీ రమ ణ, రత్నకుమారి, కె.శ్రీనివాసులు, సుధీర్, ఎం. శ్రీనివా స్, శిరీష, చాముండేశ్వరి పాల్గొన్నారు.