ప్రతి సమస్యకూ ఓ పరిష్కారం ఉంటుంది. ఒక్కో సమస్య కొత్తదారిలో నడిపిస్తుంది కూడా. అలా ఆర్తి తనకు తానుగా వేసుకున్న కొత్త దారి చక్కెర అంత తియ్యగా ఉంది. చక్కెర తినలేని వాళ్ల కోసం చక్కెర లేని తీపి రుచులను అందిస్తోంది ఆర్తి. చక్కెర తినలేని తన జీవితాన్ని తియ్యగా మలుచుకుంది.
చెవులకు ఏమైంది!
ఆర్తి రస్తోగి బెంగళూరమ్మాయి. డయాబెటిస్ ఆ ఫ్యామిలీ హిస్టరీలోనే ఉంది. రకరకాల ఆహార నియమాలు పాటించక తప్పదు. ఇంటిల్లి పాదీ దేనినీ సంతోషంగా తినడానికి వీల్లేదు. ‘ఇది తింటే షుగర్ లెవెల్స్ పోతాయి, అది తింటే బరువు పెరిగి ఇతర సమస్యలకు కారణమవుతుంది...’ అంటూ నోరు కట్టుకుని రోజులు వెళ్లదీయడమే. ఇక చాక్‌లెట్‌లు, ఐస్ క్రీమ్‌లు అయితే దగ్గరగా చూడడానికి కూడా ఇష్టపడేవాళ్లు కాదు. పిల్లల దృష్టి వాటి మీద పడిందంటే వాటిని మనం తినకూడదని నచ్చచెప్పాలి, పిల్లల మనసు గాయపడుతుంది. అందుకే ఇంట్లో అవేవీ కనిపించడానికి వీల్లేనంత నియమానుసారంగా పెంచుకొచ్చారు అమ్మానాన్నలు. అలా ఆర్తి గాజు బొమ్మలా పెరిగిందని చెప్పాలి. అందరిలాగానే స్కూలుకెళ్లి చదువుకుంది. తినగలిగిందేదో తింటూ కాలేజ్ చదువు పూర్తి చేసింది. కారణం ఏమిటో తెలియదు, ఇరవ మూడేళ్ల వయసులో ఆమెకు వినికిడి తగ్గడం మొదలైంది. ఏ డాక్టరూ కారణం ఇదని తేల్చలేకపోయారు. డయాబెటిస్ కారణంగా ఎదురైన అనుబంధ సమస్యలుగానే గుర్తించారు. వినికిడి ఎనభై శాతం తగ్గిందని మాత్రం నిర్ధారించగలిగారు. ఉన్న ఇరవై శాతం వినికిడితోనే ఉద్యోగం తెచ్చుకుంది.
మాటలు కనిపించేవి
ఆర్తి సంపాదించింది మామూలు ఉద్యోగం కాదు. పెద్ద కంపెనీలో హెచ్‌ఆర్ విభాగంలో ఉద్యోగం. ఆమె ఆరోగ్యంతో ఎదురీది జీవితంలో నిలబడడంలో ఆమె వంతు లోపమేమీ లేదు. కానీ ఆర్తి ఆ ఉద్యోగం లో ఎక్కువ కాలం కొనసాగలేకపోయింది. తోటి ఉద్యోగులు చూసే చూపులను తట్టుకోవడం కష్టమైంది. ‘ఎన్నిసార్లు చెప్పాలి’ అనే చిరాకు వినిపించేది కాదు, కానీ వాళ్ల ముఖాల్లో కనిపించేది. ఆ ఒత్తిడిని తట్టుకోవడం కష్టమైంది. బాధను అదిమిపెట్టడానికి ఆమె ఎంచుకున్న మార్గం ఐస్‌క్రీమ్. నిజమే ఇంట్లోనే ఐస్‌క్రీమ్ తయారు చేసుకోగలిగిన చిన్న మెషీన్‌ని కొనుక్కుంది. ఉద్యోగానికి వెళ్లి ఇంటికి వచ్చిన తర్వాత ఐస్‌క్రీమ్‌తో ప్రయోగాలు చేయడం. తాను చేసుకున్న షుగర్ ఫ్రీ ఐస్‌క్రీమ్ తింటూ సహోద్యోగుల నుంచి ఎదురైన వివక్షను మర్చిపోవడానికి ప్రయత్నించేది. ఆ ప్రాక్టీస్ ఆమెను మరింతగా ప్రయోగాల్లోనే మునిగిపోయేటట్లు చేసింది. ఐస్‌క్రీమ్ పుస్తకాలను చదివింది. అక్కడితో ఆగిపోకుండా ‘ఇలా ఎందుకు చేయకూడదు, అలా ఎందుకు చేయకూడదు’ అనుకుంటూ షుగర్ ఫ్రీతోపాటు గ్లూటెన్ ఫ్రీ, కీటో ఫ్రెండ్లీ కుకీలు, చాక్‌లెట్‌లు, బ్రౌనీ, కేక్‌ల మీద ప్రయోగం చేసింది. తన ప్రయోగాలను ఫుడ్ రీసెర్చ్ అండ్ అనాలసిస్ డిపార్ట్‌మెంట్‌కు పరీక్షకు పంపించింది.
సలహా బాగానే ఉంది
‘చాలా బాగా చేస్తున్నావ్, సర్టిఫికేట్ కూడా వచ్చేసింది. ఇక సొంతంగా స్టార్టప్ పెట్టెయ్’ అని తిన్నవాళ్లు ఓ సలహా ఇచ్చేసే వాళ్లు. ‘స్టార్టప్ పెట్టాలంటే బ్యాంకు తనకు లోన్ ఇస్తుందా?’ సమాధానం లేని ప్రశ్న. అన్నీ బాగున్న వాళ్లకే బ్యాంకులు అంత త్వరగా లోన్ ఇవ్వవు. స్టార్టప్ పెట్టాలనే ఆలోచన మానుకుని ఏదో ఓ ఉద్యోగం లో చేరేటట్లు చేస్తుంటాయి. అలాంటిది ఉద్యోగం లో కొనసాగ లేని వైకల్యం ఉన్న తనకు లోన్ ఎలా వస్తుంది? అనుకుని స్నేహితుల సూచనను పక్కన పెట్టేసింది. అయితే... ఓ బలహీన క్షణంలో ఈ ఉద్యోగం ఇక వద్దు అని నిర్ణయం తీసుకుంది. రాజీనామా చేసింది. అప్పుడు కుటుంబం ఆమెకు అండగా నిలిచింది. ఇంట్లో అందరూ చేయగలిగినంత సహాయం చేశారు.
అలా 2019లో ఆమె తన స్టార్టప్‌ను ప్రారంభించింది. అప్పుడు ఆర్తికి నలభై ఏళ్లు. రెండేళ్లు గడిచాయి. ఫుడ్ బిజినెస్ లో భారీ నష్టాలైనా వస్తాయి లేదా త్వరగా బ్రేక్ ఈవెన్ వచ్చేస్తుంది. ఇప్పుడామె బెంగళూరులో పది బ్రాంచ్‌లను నిర్వహిస్తోంది. ఆన్‌లైన్‌లో పాతిక రాష్ట్రాల్లో తన ఉత్పత్తులను విక్రయిస్తోంది. ‘‘ఇండియా డయాబెటిక్ క్యాపిటల్ గా మారిపోతోంది. డయాబెటిక్ వాళ్లు రుచిని చంపుకుని బతకాల్సిన అగత్యం లేకుండా అన్ని రుచులనూ తినగలిగేటట్లు చేయడం సంతోషంగా ఉంది. వ్యాపారం కోసం వచ్చిన ఆలోచన కాదు. నా కష్టం నుంచి పుట్టుకొచ్చిన ఆలోచన’’ అంటున్నారు ఆర్తి. తీవ్రంగా గాయపడి ఉండడం వల్లనో ఏమో ఆర్తి తన అవుట్‌లెట్‌లలో వికలాంగులు, ఎల్‌జీబీటీలను ఉద్యోగంలో చేర్చుకుంది.
Comments
Please login to add a commentAdd a comment