సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ధాన్యం సేకరణపై భారత ఆహార సంస్థ కొత్త కొర్రీలు పెడుతోంది. దేశవ్యాప్తంగా పచ్చిబియ్యం (రా రైస్)కు డిమాండ్ పెరుగుతున్న దృష్ట్యా ఇకపై దాన్ని మాత్రమే సేకరిస్తామని అంటోంది. వానాకాలం, యాసంగి సీజన్‌లలోనూ ఇకపై పచ్చిబియ్యం మాత్రమే తమకు అందించాలని లేని పక్షంలో తామేమీ చేయలేమని చేతులెత్తేస్తోంది. ఈ వానాకాలానికి సంబంధించి 48 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించేందుకు ముందుకు వచ్చి న ఎఫ్‌సీఐ పూర్తి పచ్చిబియ్యాన్ని మాత్రమే తీసుకోనుంది.
పచ్చి బియ్యమే.. పరమాన్నం
రాష్ట్రం నుంచి అధికంగా ఉప్పుడు బియ్యాన్ని సేకరించి పొరుగు రాష్ట్రాలకు సరఫరా చేసే ఎఫ్‌సీఐ... గతేడాది యాసంగి నుంచి తన విధానాన్ని మార్చుకుంటూ వస్తోంది. బాయిల్డ్ రైస్ వినియోగం అధికంగా ఉండే తమిళనాడు, కేరళ నుంచి డిమాండ్ తగ్గడం, వినియోగం లేక ఎఫ్‌సీఐ వద్ద నిల్వలు పెరుగుతుండటంతో డిమాండ్ అధికంగా ఉన్న రా రైస్ ఇవ్వాలని ఎఫ్‌సీఐ షరతులు పెట్టింది. గత యాసంగిలో 1.32 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి రాగా ఇందులో 80.88 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఎఫ్‌సీఐ సేకరించింది.
ఈ ధాన్యాన్ని మర పట్టించడం ద్వారా 55లక్షల మె ట్రిక్ టన్నుల బియ్యం ఉత్పత్తి ఉంటుందని అంచనా వేసిం ది. మర పట్టించి ఇచ్చిన బియ్యంలో ఏటా 95 శాతం వరకు ఉప్పుడు బియ్యాన్నే ఎఫ్‌సీఐ సేకరిస్తూ రాగా గత సీజన్‌లో రా రైస్ మాత్రమే ఇవ్వాలని పట్టుబట్టింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర రైతులకు నష్టం జరిగే అవకాశం ఉన్న దృష్ట్యా 80 శాతం బాయిల్డ్ రైస్, 20 శాతం రా రైస్ తీసుకోవాలని ఎఫ్‌సీఐని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. అయినప్పటికీ దాన్ని పట్టించుకోని ఎఫ్‌సీఐ 60 శాతం మేర రా రైస్ ఇవ్వాలని కోరింది.
55 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యంలో 24.75 లక్షల మెట్రిక్ టన్నులే బాయిల్డ్ కింద ఇవ్వాలని మిగతా 30.25 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని రా రైస్‌గా ఇవ్వాలని స్పష్టం చేసింది. ప్రస్తుతం 24.75 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్‌లో 15 లక్షల టన్నుల సేకరణ పూర్తి చేసింది. మిగతా సేకరణ ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తంగా 24.75 లక్షల టన్నుల బాయిల్డ్ సేకరణ తర్వాత మిగతా బియ్యాన్ని సేకరిస్తుందా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఎఫ్‌సీఐ సేకరించని పక్షంలో రాష్ట్రానికి ఇక్కట్లు తప్పేలా లేవు. ఇక ప్రస్తుత వానాకాలం సీజన్‌కు సంబంధించి ప్రభుత్వం 80 లక్షల మెట్రిక్ టన్నుల మేర ధాన్యం సేకరణ అవసరం ఉంటుందని అంచనా వేస్తుండగా ఇందులో గత సీజన్‌లను అనుసరించి 48 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేస్తామని అంటోంది.
దీనికి సంబంధించి పూర్తిగా పచ్చి బియ్యాన్ని ఇవ్వాలని కోరింది. అయితే రాష్ట్రంలో ప్రస్తుత సీజన్‌లోనూ దొడ్డు రకాల సాగు ఎక్కువగా జరిగిన నేపథ్యంలో పచ్చి బియ్యం ఎలా ఇవ్వగలమన్నది ప్రశ్నగా మారింది. ఎఫ్‌సీఐ కొర్రీల దృష్ట్యానే సన్న రకాల సాగు పెంచాలని ప్రభుత్వం కోరినా గిట్టుబాటు ధరలు రాని దృష్ట్యా ఈ సీజన్‌లో దొడ్డు రకాల సాగు ఎక్కువగా జరిగింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment