సాక్షి, హైదరాబాద్: హరిత విప్లవ పితామహుడు డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ తెలంగాణ వ్యవసాయ విధానాల్లో తనదైన ముద్ర వేశారు. తెలంగాణ ప్రభుత్వం స్వామినాథన్ సిఫార్సులను దృష్టిలో ఉంచుకొని పలు నిర్ణయాలు చేసిందని వ్యవసాయశాఖ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. రైతులకు విరివిగా ప్రోత్సాహకాలు ఇవ్వాలనేది స్వామినాథన్ ఆలోచనల్లో ఒకటి. సీఎం కేసీఆర్ రైతుబంధుకు రూపకల్పన చేయడం రైతులకు అందిస్తున్న ప్రోత్సాహకాల్లో అత్యంత కీలకమైంది.
రైతుబంధు, రైతుబీమా పథకాలను పలు సందర్భాల్లో స్వామినాథన్ ప్రశంసించారు. అంతేకాదు స్వామినాథన్ కీలక సిఫార్సుల్లో ఒకటైన కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) అమలు విషయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ కేంద్రానికి పలు ప్రతిపాదనలు చేసింది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ సీజన్లలో రైతులు పండించే పంటలకు ఎంతెంత ఎంఎస్‌పీ ఉండాలో స్వామినాథన్ సిఫార్సులను లెక్కలోకి తీసుకొని కేంద్రానికి ప్రతిపాదనలు పంపించింది.
స్వామినాథన్ సిఫార్సులను పక్కన పెట్టిన కేంద్రం
వివిధ పంటల సాగు ఖర్చుల ప్రకారం స్వామినాథన్ సిఫార్సులను అమలు చేయాలని తాము కోరితే కేంద్రం పెడచెవిన పెట్టిందని కూడా వ్యవసాయశాఖ వర్గాలు చెపుతున్నాయి. ఈ ప్రకారం రైతులు పండించిన పంటకు వచ్చేది నష్టమే తప్ప లాభం లేదని అంటున్నాయి. ఉదాహరణకు సీఏసీపీకి రాష్ట్ర వ్యవసాయశాఖ పంపిన నివేదికల ప్రకారం తెలంగాణలో క్వింటా వరి సాధారణ (కామన్) రకం ధాన్యానికి రూ.3,300, ఏ గ్రేడ్ ధాన్యం పండించాలంటే రూ. 3,400, పత్తికి రూ. 11 వేలు, మొక్కజొన్నకు రూ.2 వేలు, సోయా పంటకు రూ. 4,500 రైతు గతేడాది ఖర్చు చేశారు.
ఈ ఖర్చులకు స్వామినాథన్ సిఫార్సుల ప్రకారం 50 శాతం అదనంగా కలపాలని రాష్ట్రం సూచించింది. ఆ ప్రకారం మద్దతు ధరలను ఖరారు చేయాలని కోరింది. ఉదాహరణకు పత్తి క్వింటాకు రూ. 11 వేలు ఖర్చు అయితే, స్వామినాధన్ సిఫార్సుల ప్రకారం అందులో 50 శాతం కలపాలి. ఆ ప్రకారం మద్దతు ధరగా రూ. 16,500 ప్రకటించాలని రాష్ట్రం కేంద్రానికి ప్రతిపాదించింది. కానీ కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినట్లు ఎంఎస్‌పీ ఖరారు చేయలేదు. స్వామినాథన్ సిఫార్సులను పక్కన పెట్టినా వాస్తవ సాగు ఖర్చు ప్రకారమైనా మద్దతు ధర ప్రకటించలేదన్న విమర్శలు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment