ms Swaminathan
-
పీవీ, చరణ్ సింగ్ సహా నలుగురికి భారతరత్న ప్రదానం
సాక్షి, న్యూఢిల్లీ: మాజీ ప్రధాన మంత్రులు పీవీ నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్లకు మరణానంతరం దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’ను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శనివారం ప్రదానం చేశారు. పీవీ నరసింహారావు తరఫున ఆయన కుమారుడు పీవీ ప్రభాకర్‌రావు, చరణ్ సింగ్ తరఫున ఆయన మనవడు జయంత్ చౌదరి, ఎంఎస్ స్వామినాథన్ తరఫున ఆయన కుమార్తె నిత్యా రావు, కర్పూరీ ఠాకూర్ తరఫున కుమారుడు రాంనాథ్ ఠాకూర్ పురస్కారాన్ని అందుకున్నారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే హాజరయ్యారు. ఈ సందర్భంగా పీవీ సేవలను స్మరించుకుంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. బీజేపీ నేత ఎల్కే అద్వానీకి భారతరత్న పురస్కారాన్ని ఆదివారం ఆయన నివాసంలో రాష్ట్రపతి ప్రదానం చేయనున్నారు. -
పంట విక్రయంలో సాంకేతిక దన్ను
పీవీ నరసింహారావు హయాంలో 1994లో ‘స్మాల్ ఫార్మర్స్ అగ్రి–బిజినెస్ కన్సార్టియం’ (ఎస్‌ఎఫ్‌ఏసీ) ఏర్పాటుచేయడం అర్థవంతమైన విధానపరమైన జోక్యం. ఆ సంస్థే ఇప్పుడు వ్యవసాయం కోసం జాతీయ ఎలక్ట్రానిక్ మార్కెట్‌ను ఏర్పాటు చేసే బాధ్యత చూస్తోంది. దీని కారణంగా, 2016లో నరేంద్ర మోదీ ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్’ (ఈ–నామ్) పేరిట ఒక ‘ఫిజిటల్’ (ఫిజికల్ ప్లస్ డిజిటల్) మార్కెట్‌ను ప్రారంభించారు. దీనివల్ల 23 రాష్ట్రాలు, 4 కేంద్ర పాలిత ప్రాంతాలలోని 1.07 కోట్ల మంది రైతులకు వారి సొంత భాషలో, వారి మొబైల్ ఫోన్ లో లావాదేవీలు జరిపే స్వేచ్ఛ, సౌలభ్యం ఏర్పడ్డాయి. 2024 జనవరి నాటికి, ఈ–నామ్ వల్ల రూ. 3 లక్షల కోట్లకు పైగా వ్యాపారం జరిగింది. దీనికి మరింత ఊపునిచ్చేలా, ఇ–మార్కెట్ ప్లాట్ ఫామ్‌లను ఏర్పాటు చేయడానికిగానూ వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఒక్కో నియంత్రిత మండీకి నిధులు సమకూర్చింది. మాజీ ప్రధానులు చరణ్ సింగ్, పీవీ నరసింహారావు, శాస్త్రవేత్త–అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ లకు ఇటీవల భారతరత్న ప్రదానం చేయడం భారతీయ రైతు వ్యవస్థాపక స్ఫూర్తికి నివాళి అనే చెప్పాలి. ఈ ముగ్గురూ వ్యవసాయంతో పాటు రైతుల సంక్షేమం కోసం ఎంతో కృషి చేశారు. స్వామినాథన్ అందించిన తోడ్పాటు సుపరిచితమే కాదు, అది అందరూ గుర్తించిన విష యమే. అయితే హరిత విప్లవాన్ని విజయవంతం చేసిన రాజకీయ ఆర్థిక వ్యవస్థను అర్థం చేసుకోవడం కూడా అంతే ముఖ్యం. సోవియట్, చైనీస్ తరహా ‘సామూహిక వ్యవసాయం’లో ఉన్న ప్రమాదాలను నెహ్రూకి వివరించినది చరణ్ సింగ్. రైతులు రాటు దేలిపోయిన స్వతంత్ర సాగుదారులనీ, ప్రణాళికా సంఘం మెచ్చు కున్న ‘ల్యాండ్ పూలింగ్, సహకార వ్యవసాయం’ అనే కేంద్రీకృత ప్రణాళికను వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారనీ చరణ్ సింగ్ స్పష్టం చేశారు. దార్శనికుడి విధాన జోక్యం పీవీ నరసింహరావు హయాంలో భారతదేశం, ప్రపంచ వాణిజ్య సంస్థలో చేరి వ్యవసాయ ఒప్పందంపై సంతకం చేసింది. అప్పటి వరకు, భారతదేశ విధాన వ్యవస్థ దిగుమతులను పరిమితం చేసింది. పీవీ ఆధ్వర్యంలో, భారతదేశం వ్యవసాయ ఎగుమతులను ఒక ముఖ్యమైన విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించిపెట్టేదిగా చూసింది. ఏపీఈడీఏ (అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ)కి బడ్జెటరీ, సంస్థాగత మద్దతుతో, ఆయన భారతీయ వ్యవసాయాన్ని ప్రపంచవ్యాప్త పోటీదారుగా మార్చడంలో తోడ్పడ్డారు. అయినప్పటికీ దేశీయ వాణిజ్యం మాత్రం రైతుల కోసం కాకుండా, సేకరణ ఏజెన్సీలకూ, వ్యవసాయ పంటల మార్కెట్ కమిటీ (ఏపీఎంసీ)లలోని నమోదైన వ్యాపారులకూ అనుకూలంగా నిర్బంధ వాణిజ్య పద్ధతుల ద్వారా నిర్వహించబడుతూనే ఉంది. 1994లో ‘స్మాల్ ఫార్మర్స్ అగ్రి–బిజినెస్ కన్సార్టియం’ (ఎస్‌ఎఫ్‌ఏసీ) స్థాపన, పీవీ చేసిన అత్యంత అర్థవంతమైన విధాన పరమైన జోక్యం కావచ్చు. ఈ సంస్థకే వ్యవసాయం కోసం జాతీయ ఎలక్ట్రానిక్ మార్కెట్‌ను ఏర్పాటు చేసే బాధ్యతను అప్పగించారు. 2016 ఏప్రిల్ 14న ప్రధాని నరేంద్ర మోదీ ఎస్‌ఎఫ్‌ఏసీ మద్దతుతో ‘ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్’ (ఈ–నామ్) పేరిట ఒక ‘ఫిజిటల్’ (ఫిజికల్ ప్లస్ డిజిటల్) మార్కెట్‌ను ప్రారంభించారు. ఇది ఫిజికల్ బ్యాక్ ఎండ్‌తో కూడిన సింగిల్ విండో పోర్టల్. కార్యాచరణ సమాచారం, భౌతిక మౌలిక సదుపాయాలు, వాణిజ్య ఎంపికలు, చెల్లింపులపై ఎలక్ట్రానిక్ సెటిల్మెంట్లను ఇది అందిస్తుంది. నేడు, ఎస్‌ఎఫ్‌ఏసీ చేపట్టిన ఈ కార్యక్రమం వల్ల 23 రాష్ట్రాలు, 4 కేంద్ర పాలిత ప్రాంతాలలోని 1,389 నియంత్రిత హోల్‌సేల్ మార్కె ట్లలో, 1.07 కోట్ల మంది రైతులు వారి సొంత భాషలో, వారి మొబైల్ ఫోన్లలో లావాదేవీలు జరిపే స్వేచ్ఛ, సౌలభ్యం కలిగి ఉన్నారు. భాగస్వామ్య రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మరో 1.7 లక్షల ఇంటిగ్రేటెడ్ లైసెన్ ్సలను జారీ చేశారు. ఈ వేదికకు తమ మద్దతును ప్రతిబింబించేలా దాదాపు 3,500 రైతు ఉత్పత్తిదారులసంఘాలు (ఎఫ్పీఓలు) ఇందులో చురుకుగా పాల్గొనడం గమనార్హం. 2024 జనవరి నాటికి, ఈ–నామ్ వల్ల రూ. 3 లక్షల కోట్లకు పైగా వ్యాపారం జరిగింది. తగిన బాధ్యత ఈ విజయవంతమైన నేపథ్యాన్ని పంచుకోవడం అత్యవసరం. రైతుకు విపత్కరమైన అమ్మకాల నుండి రక్షణ కల్పించే ఉద్దేశంతో 1950వ దశకంలో ‘ఏపీఎంసీ’లను ప్రవేశపెట్టారు. ‘ధర ఆవిష్క రణ’ను నిర్ధారించడానికీ, కనీస మద్దతు ధర వ్యవస్థలో రాష్ట్ర ఏజెన్సీల ద్వారా సేకరణకు వేదికను అందించడానికీ ఇవి రూపొందాయి. అయితే, ఈ ప్రక్రియలో, వారు మధ్యవర్తుల ప్రత్యేక తరగతిని కూడా సృష్టించారు. నిర్దిష్ట మండీలో దాని అధికారికమైన కమాండ్ ఏరి యాతో లైసెన్ ్స కలిగి ఉన్న వ్యాపారిని స్థిరపరిచారు. అయితే, భారతదేశం ఐటీ సూపర్‌పవర్‌గా అవతరించడం, రైతు నుండి మార్కెట్ ఉత్పత్తి విధానంలోకి వ్యవసాయం మారడంతో, వాణిజ్య పరిమితి నిబంధనలను మార్చవలసిన అవసరం ఏర్పడింది. సాంకేతికతలు, ఆర్థిక సాధనాల ద్వారా సన్నకారు, చిన్న రైతులకు వాణిజ్య నిబంధనలను మెరుగుపరచడానికి ఎస్‌ఎఫ్‌ఏసీ వంటిసంస్థలు స్థాపితమయ్యాయి. వ్యవసాయ–వ్యాపార వ్యవస్థాపకులకు వెంచర్ క్యాపిటల్ నిధులను అందించడం నుండి మౌలిక సదుపాయాల కల్పన వరకు ఎస్‌ఎఫ్‌ఏసీ కొత్త పుంతలు తొక్కింది. అందుకే ఈ–నామ్ స్థాపన బాధ్యతను ఎస్ఎఫ్ఏసీకే అప్పగించడంలో ఆశ్చర్యం లేదు మరి. దీనికి మరింత ఊపునిచ్చేలా, ఇ–మార్కెట్ ప్లాట్ ఫామ్‌లను ఏర్పాటు చేయడానికిగానూ కంప్యూటర్ హార్డ్‌వేర్, ఇంటర్నెట్ సౌకర్యం, పరీక్షా పరికరాలు వంటి సామగ్రి లేదా మౌలిక సదుపాయాల కోసం వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఒక్కో నియంత్రిత మండీకి రూ. 30 లక్షలు మంజూరు చేసింది. క్లీనింగ్, గ్రేడింగ్, ప్యాకేజింగ్ సౌకర్యాలు, బయో–కంపోస్టింగ్ యూనిట్ వంటి అదనపు మౌలిక సదుపాయాల కల్పన కోసం ఈ మొత్తాన్ని 2017లో రూ.75 లక్షలకు పెంచారు. మొదటి మూడేళ్లలో దాదాపు 200 మండీలను దీని పరిధిలోకి తీసుకురాగా, 2020 మే నాటికి మరో 415 మండీలు జమయ్యాయి. 2022 జూలై నాటికి మరో 260మండీలు, 2023 మార్చి నాటికి మరో 101 మండీలు పెరిగాయి. గత సంవత్సరం ముగిసేనాటికి మరో 28 వీటికి కలిశాయి. ప్రతి త్రైమాసి కంలో ఈ సంఖ్య పెరుగుతూ వస్తోంది. మరింత పురోగమించేలా... విధాన రూపకల్పన అనేది సులభం. కానీ భౌతిక, ఐటీ మౌలిక సదుపాయాల కల్పనే కష్టం. ఇంకా కష్టతరమైనది క్షేత్రస్థాయిలో చేసే పని. ఈ–నామ్‌తో అనుసంధానమైన ప్రతి మండీకి ఒక ఏడాది పాటు ప్రారంభ శిక్షణ కోసం ఎస్‌ఎఫ్‌ఏసీ ఒక ఐటీ నిపుణుడిని (మండి విశ్లేషకుడు) గుర్తించి, మద్దతునిస్తుంది. వారు రాష్ట్ర సమన్వయ కర్త(ల)కు నివేదిస్తారు. ఈ సమన్వయకర్తలు ఒక్కొక్కరు 50 మండీల రోజువారీ సమన్వయాన్ని నిర్వహిస్తారు. ఈ–నామ్ విధానంలోని రైతులు, వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లు, మండి అధికారులందరికీ ఉచితంగా శిక్షణ ఇవ్వడం కూడా వీరి బాధ్యత. తర్వాత ఏమిటి? సాధించిన పురోగతితో ఆగకుండా, ఈ–నామ్ కొత్త, ఉన్నత ప్రమాణాలను ఏర్పరుస్తోంది. దీని సవరించిన ఆదేశంలో రైతులకు పోటీ ధరలను సాధ్యం చేయడం కోసం కృషి చేస్తుంది. ఏపీఎమ్‌సీ నియంత్రిత మార్కెట్ కమిటీ మండీలకు వెలుపల కూడా వేదికలను ఏర్పాటుచేయడం ద్వారా దీన్ని సాధిస్తుంది. ఈ–నామ్ ద్వారా గిడ్డంగి ఆధారిత విక్రయానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది.అంతిమంగా, ధరను కనుగొనడం, విక్రయించే స్వేచ్ఛ అనేవి రైతుకు ఎక్కువ మేలు చేస్తాయి. - వ్యాసకర్త లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ మాజీ డైరెక్టర్ (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) - సంజీవ్ చోప్రా -
మరణానంతర ప్రదానం మంచిదేనా?
ఇటీవల ప్రకటించిన భారతరత్న పురస్కారాల్లో ముగ్గురికి మరణానంతరం ఇచ్చారు. ఆ ముగ్గురూ దానికి పూర్తి అర్హులు. కానీ వీటిని వారు బతికి ఉన్నప్పుడే ఇచ్చివుంటే ఎంత బాగుండేది! 53 మంది ఇప్పటివరకు ‘భారతరత్న’తో అలంకృతులయ్యారు. వారిలో 18 మందికి మరణానంతరం ప్రకటించారు. మరణానంతర ప్రదానంలోని ఇబ్బంది ఏమిటంటే, ఫలానావాళ్లకు ఎందుకు ఇవ్వలేదనే ప్రశ్నకు సమాధానం ఉండదు. కర్పూరీ ఠాకూర్‌కు ఇచ్చినప్పుడు, అన్నాదురైకి ఎందుకు ఇవ్వకూడదు? మరి రాంమనోహర్ లోహియాను ఎలా విస్మరిస్తారు? మొదటి నుంచీ మరణానంతరం ఇవ్వడాన్ని ఒక నియమంగా కాక, ఒక మినహాయింపుగా మాత్రమే చూశారు. జీవించి ఉన్నప్పుడు ఇవ్వడమే భారతరత్నకు ప్రమాణంగా ఉండటం మంచిది. చౌధురీ చరణ్ సింగ్, పీవీ నరసింహారావు, ఎం.ఎస్. స్వామినాథన్ – ముగ్గురికీ మరణానంతరం ‘భారతరత్న’ పురస్కారం ప్రకటించడమే ఈ వ్యాసం రాయడానికి నన్ను పురిగొల్పింది. ఈ ముగ్గురూ దానికి పూర్తిగా అర్హులు, ప్రశంసించదగినవారు. వాస్తవానికి వీరికి అత్యున్నత పురస్కారం ప్రకటించడంపై ప్రతిపక్ష కాంగ్రెస్ కూడా ‘సెల్యూట్’ చేసింది. కానీ రెండు యూపీఏ (యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్) ప్రభుత్వాలూ లేదా రెండు ఎన్డీయే (నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్) ప్రభుత్వాలూ ఇన్నేళ్లుగా వీరిని ఈ రత్నాలతో ఎందుకు సత్కరించలేదనేది ప్రశ్న. నిజంగానే రత్నాలైన వీరిని దేశం కృతజ్ఞతతో అధికారికంగా కూడా అలాగే పరిగణిస్తుందనే విషయాన్ని వారి జీవితకాలంలోనే చెప్ప వలసింది కదా! అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ కుమార్తె ఇందిరా గాంధీ 1954 ఆగస్టు 15న మొదటి భారతరత్న సి. రాజగోపాలాచారికి ఇలా రాశారు: ‘మీరు మొదటి భారతరత్న అయినందుకు మేమంతా చాలా సంతోషిస్తున్నాము. చాలా ఏళ్లుగా భారత్‌కు ‘రత్నం’గా మీరు గుర్తింపు పొందారు. అది ఇప్పుడు అధికారికంగా ప్రకటించడం చాలా మంచి విషయం.’ 53 మంది ఇప్పటివరకు ‘భారతరత్న’తో అలంకృతులయ్యారు. వారిలో 18 మందికి మరణానంతరం ప్రకటించారు. నేను ‘ఇప్పటి వరకు’ అని నొక్కి చెబుతున్నాను. ఎందుకంటే గత కొన్ని రోజులుగా, ఈ గుర్తింపులు వెంటవెంటనే వచ్చేస్తున్నాయి. నేను ఈ అంశంపై మరింతగా చెప్పడానికి ముందు, కొన్ని గణాంకాలను చూద్దాం. భారతరత్న పురస్కారాలన్నింటినీ వరుస రాష్ట్రపతులే ప్రదానం చేశారు. అయినప్పటికీ ఈ విషయంలో దాదాపుగా దేశ ప్రధానులదే అధికారం. వీరిలో కొందరు ప్రధానులు తాము కూడా దీన్ని పొందారు. నెహ్రూ (1947–64) తనతో కలుపుకొని, 13 మందికి అవార్డును ప్రదానం చేశారు. గుల్జారీలాల్ నందా పరివర్తనా కాలపు బాధ్యత (1966)లో ఉన్నప్పుడు ఒక్క భారతరత్నను ఇచ్చారు. ఇందిరా గాంధీ తన మొదటి ప్రధానమంత్రి పదవీ కాలంలో (1965–77) తనకు ఒకటి, మూడు ఇతరులకు ప్రదానం చేశారు. ఆమె రెండోసారి ప్రధానిగా ఉన్నప్పుడు (1980–84) ఇద్దరికి ఇచ్చారు. రాజీవ్ గాంధీ (1984–89) ఇద్దరికీ, వీపీ సింగ్ (1989– 90) ఇద్దరికీ, పీవీ నరసింహారావు (1991– 96) ఆరుగురికీ, ఐకే గుజ్రాల్ (1997–98) నలుగురికీ, అటల్ బిహారీ వాజ్‌పేయి (1999–2004) ఏడుగురికీ, మన్మోహన్ సింగ్ (2004–14) ముగ్గురికీ ఇచ్చారు. నరేంద్ర మోదీ (2014–) హయాంలో పదిమందికి ప్రకటించారు. ఇప్పటివరకు అత్యధిక కాలం ప్రధానిగా ఉన్న నెహ్రూ తన పదవీ కాలంలో అత్యధిక సంఖ్యలో 13 భారతరత్నలను ప్రదానం చేశారు. నరేంద్ర మోదీ ఆ తర్వాత అత్యధిక సంఖ్యలో పదిమందికి ఇచ్చారు. భారత రత్నలు ప్రకటించడం 1954లో ఉనికిలోకి వచ్చిందని గుర్తుంచుకుంటే, ‘సాంద్రత’ పరంగా ఇద్దరు ప్రధానులూ సమానంగా పదేళ్లలో పది మందికి ఇచ్చారు. మరణానంతరం ప్రదానం చేసిన భారతరత్నల సంఖ్యలో మాత్రం మోదీ ముందున్నారు. మరణానంతరం ప్రకటించిన 18 భారతరత్నాలలో మోదీ స్కోరు ఏడు. తదుపరి అత్యధికం పీవీ నరసింహారావుది– మూడు. భారతరత్న అసలు ప్రకాశాన్ని రెండు పరిణామాలు ప్రభావితం చేశాయి: ఒకటి, మరణానంతరం బహూకరించడం. ముందుగా ఈ అంశాన్ని చేపడదాం. దీనిని 1955 జనవరి 15న, నాటి భారత ప్రభుత్వ గెజిట్ నంబర్ 222 ద్వారా ప్రారంభించారు. అయితే దీన్ని ఒక నియమంగా కాక, ఒక మినహాయింపుగా మాత్రమే చూశారు. ఈ ‘సడలింపు’ అమలులోకి రావడానికి పదేళ్లు పట్టింది. 1966 జనవరి 11న తాష్కెంట్లో అప్పటి ప్రధాని లాల్‌బహదూర్ శాస్త్రి మరణించిన కొన్ని గంటల్లోనే ఆయనకు రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ తొలి మరణానంతర భారతరత్నను ప్రకటించారు. రెండవ మరణానంతర భారతరత్నకు మరో పదేళ్లు పట్టింది. ప్రధాని ఇందిరాగాంధీ దాన్ని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు కె. కామరాజ్‌కు ప్రకటించారు. అయితే, ఆయన జీవించి ఉంటే, ఆయన జీవిత కాలంలో ఆమె ఆ గౌరవం ఇచ్చివుండేవారు కాదు. కాంగ్రెస్వాద మూలాలతో కూడిన మరణానంతర భారతరత్న కొనసాగుతోంది. అదే సమయంలో ‘జీవించి ఉండగా’ ఇవ్వడాన్ని అధిగమించింది. మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వాల హయాంలో ప్రదానం చేసిన పదింటిలో ఏడు మరణానంతరమైనవి. అయితే ‘అర్హత’కు సంబంధించిన ప్రశ్నలు అనివార్యంగా తలెత్తు తాయి. మరణానంతర గ్రహీతల్లో ప్రధానులు వీపీ సింగ్, చంద్రశేఖర్‌లను వదిలివేయవచ్చా? బిహార్ దివంగత ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్‌కు ఈ పురస్కారం లభించినందున, సీఎన్ అన్నాదురైనీ, సాటిలేని ఈఎంఎస్ నంబూద్రిపాద్నూ విస్మరించగలమా? మరి మన కాలానికి దగ్గరగా ఉండే ఎం.కరుణానిధి, జ్యోతి బసు సంగతి? ఆచార్య వినోబా భావే మరణానంతరం పొందారు. అలాంటప్పుడు జేబీ కృపలానీ, నరేంద్ర దేవ్ వంటి ఆచార్యులను మరచిపోగలమా? జయప్రకాశ్ నారాయణ్, నానాజీ దేశ్‌ముఖ్ వంటి రాజకీయ చింతనా పరులు మరణానంతరం పొందినప్పుడు, పెరియార్‌కు ఇవ్వకూడదా? కల్లోల తుఫాన్లను దాటి దూసుకొచ్చే సముద్ర పక్షి లాంటి అరుణా అసఫ్ అలీ భారతరత్నను పొందారు. మరింత ‘తుఫాను లాంటి’ కమలాదేవీ ఛటోపాధ్యాయను వదిలివేయవచ్చా? కాంగ్రెస్ వాళ్లు ఈ ఆలోచనంటేనే విరుచుకుపడతారేమోగానీ ఏ సోషలిస్టు, ప్రజాస్వామ్యవాది రాంమనోహర్ లోహియాను మరచిపోతారు? పున రాలోచన, అధికార రాజకీయ ప్రేరణలతో ఉండే ‘ఇబ్బంది’ ఇదీ! భారతరత్న ప్రకాశాన్ని ప్రభావితం చేసిన రెండవ పరిణామం ఏమిటంటే, దానిపై అహంభావపు స్పర్శ. నెహ్రూ, ఇందిరా గాంధీలు ఇద్దరూ తమ పదవీకాలంలో దానిని అంగీకరించకపోయి ఉంటే పురస్కార గొప్పదనాన్ని పెంచి, తమ గొప్పతనాన్నీ పెంచుకునేవారు. వారు దానిని పొందడం అంటే తమకు తామే దండలు మెడలో వేసు కున్నట్టు. మరణానంతర ప్రదానాలు లోపాలకు సంబంధించిన ప్రశ్నలను లేవనెత్తితే, అధికారంలో ఉన్నప్పుడు పొందే ప్రదానాలు వ్యవహారాలకు సంబంధించిన ప్రశ్నలను లేవనెత్తుతాయి. మౌలానా ఆజాద్‌కు కేబినెట్ మంత్రిగా ఉన్నప్పుడు భారతరత్నను ఆఫర్ చేసినప్పుడు ఆయన ఇలా చెప్పారని ప్రతీతి: ‘మేము ఇచ్చేవాళ్లలో ఉన్నాం, తీసు కునేవాళ్లలో కాదు.’ నేను ఇలా చెప్పడం ద్వారా ఈ వ్యాసాన్ని పూర్తి చేయాలని అనుకుంటున్నాను: జీవించి ఉన్నప్పుడు ఇవ్వడమే భారతరత్నకు ప్రమా ణంగా ఉండనివ్వండి. మరణానంతర ఎంపిక ఒక మినహాయింపుగా ఉండాలి. ఆమె లేదా అతను పదవిలో ఉండేవరకు ‘ఇచ్చేవారు’గానే ఉండాలి తప్ప, ‘గ్రహీత’లు కావాలని కలలు కనకూడదని ఆశిద్దాం. పదవిలో లేనట్టయితే పురస్కార విలువ పెరుగుతుంది. అంతర్జాతీయంగానూ, జాతీయ స్థాయిలోనూ గౌరవం పొందిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌ను ఇటీవల పార్లమెంటులో ప్రధాని మోదీ ప్రశంసించారు. బహుశా ఆయనకు భారతరత్నను ప్రతిపాదించి ఉండొచ్చు, సలక్షణమైన వినమ్రతతో ఆయన తిరస్కరించి ఉండొచ్చు. ఆయనను ‘రత్నం’గా చూసిన చాలామందికి అది అధికా రికం అయినప్పుడు ఒక సంతృప్తి ఉండదా? గోపాలకృష్ణ గాంధీ వ్యాసకర్త పశ్చిమ బెంగాల్ మాజీ గవర్నర్, మాజీ దౌత్యవేత్త (‘ది హిందుస్థాన్ టైమ్స్’ సౌజన్యంతో) -
వాళ్లేమీ నేరస్తులు కాదు: ఎంఎస్ స్వామినాథన్ కుమార్తె కీలక వ్యాఖ్యలు
ఢిల్లీలో హారాహరీగా సాగుతున్న రైతు ఉద్యమంపై దివంగత వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ కుమార్తె మధుర స్వామినాథన్ స్పందించారు. వాళ్లు అన్నదాతలు..నేరస్థులు కాదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళన చేస్తున్న రైతులను ఢిల్లీకి రాకుండా హర్యానా ప్రభుత్వం అడ్డుకుంటోందన్న వార్తలపై ఆమె స్పందించారు. తన తండ్రికి భారతరత్న అవార్డును పురస్కరించుకుని పూసాలోని ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఐఏఆర్ఐ) నిర్వహించిన కార్యక్రమంలో ప్రసంగిస్తూ డెవలప్మెంటల్ ఎకనామిస్ట్ మధుర స్వామినాథన్ ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు దేశంలోని ప్రముఖ శాస్త్రవేత్తలంతా దీనికి పరిష్కారాన్ని కనుగొనాలని అభ్యర్థించారు. రైతులు.. అన్నదాతలు వారిని నేరస్తులుగా పరిగణించలేమన్నారు. అంతేకాదు మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ నవంబర్ 2021లో ఎంఎస్ స్వామినాథన్ చేసిన ప్రకటనను ట్విటర్లో షేర్ చేశారు. రైతు సమస్యలపై కేంద్ర మంత్రుల బృందంతో చర్చల విఫలం తరువాత చేపట్టిన రైతన్నల ఛలో ఢిల్లీ కార్యక్రమం గత రెండురోజులుగా ఉధృతంగా సాగుతోంది. హర్యానా, పంజాబ్, యూపీ రైతులు దేశ రాజధానిలో ధర్నాలు, రాస్తారోకోలతో హోరెత్తిస్తున్నారు. అటు పోలీసులు ఈ ర్యాలీని అడ్డుకునేందుకు ఎక్కడికక్కడ బారికేడ్లను ఏర్పాటు చేశారు. హర్యానాలో వారి కోసం జైళ్లను సిద్ధం చేశారు. డ్రోన్ల ద్వారా బాష్పవాయువును ప్రయోగిస్తున్నారు. పోలీస్ నిర్బంధ కాండను చేధించుకుంటూ రైతులు వెనక్కి తగ్గకపోవడంతో సరిహద్దుల్లో హైటెన్షన్ నెలకొంది. ఢిల్లీ మార్చ్‌కి వచ్చిన వందలాది ట్రాక్టర్లు హైవేపై నిలిచిపోయాయి. ఢిల్లీకి 200 కిలో మీటర్ల దూరంలోనే రైతుల ర్యాలీ కొనసాగుతోంది. కాగా అన్ని పంటలకు కనీసం మద్దతు ధర హామీ చట్టం, రుణ మాఫీ, రైతులకు పింఛన్లు తదితర డిమాండ్ల అమలు కోసం సంయుక్త కిషన్ మోర్చ, కిషన్ మజ్దూర్ మోర్చ ఛలో ఢిల్లీ నిరసనకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. వీరి డిమాండ్లలో ప్రధానమైంది ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ నివేదిక ప్రకారం మద్దతు ధర అమలు చేయడం. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు 2004లో కేంద్రం ప్రభుత్వం ఎంఎస్ స్వామినాథన్ నేతృత్వంలో కమిషన్‌ను రూపొందించింది. ప్రభుత్వం పంటలపై కనీస మద్దతు ధర (ఎంఎస్పి)ని సగటు ఉత్పత్తి వ్యయం కంటే కనీసం 50శాతం పెంచాలని ఈ కమిషన్ సిఫార్సు చేసింది. Here is what M S Swaminathan said when the farm laws were repealed @mssrf https://t.co/HYSmSlSOve. https://t.co/dC3ejbsZ8F — Madhura Swaminathan (@MadhuraFAS) February 13, 2024 ఇటీవల హరిత విప్లవ పితామహుడు, ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఎంఎస్ఎస్ఆర్ఎఫ్) వ్యవస్థాపకుడు ఎంఎస్ స్వామినాథన్‌కు మరణానంతరం ఇటీవల భారత అత్యున్నత పురస్కారం భారతరత్నను ప్రకటించింవది. గతేడాది సెప్టెంబర్‌లో స్వామినాథన్ మరణించారు. -
ఒకేసారి ఐదుగురికి భారతరత్న.. మోదీ వ్యూహం అదేనా?
భారత మాజీ ప్రధాని పీవీ నరసింహరావుకు కేంద్ర ప్రభుత్వం భారత రత్న బిరుదు ఇవ్వడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అయింది. అదే సమయంలో నరేంద్ర మోదీ వ్యూహాత్మకంగా ఈ అవార్డులను ప్రకటిస్తున్నారన్న అభిప్రాయం కూడా ఏర్పడుతోంది. యూపీలో మరో మాజీ ప్రధాని చరణ్ సింగ్, బీహారులో మాజీ సీఎం కర్పూరి ఠాకూర్ కు, మాజీ ఉప ప్రధాని ఎల్.కె. అద్వానికి, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎమ్.ఎస్.స్వామినాదన్కు ఈ అవార్డులు ఇచ్చారు. వీరిలో ఎవరిపైన అభ్యంతరాలు లేవు. కాకపోతే ఎన్నికలు మరో రెండు నెలల్లో జరగనున్న తరుణంలో ఈ ప్రముఖులను ఎంపిక చేసుకున్న తీరు మాత్రం చర్చనీయాంశమే. బీహారులో జేడీయూ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఎన్డీఏ కూటమిలోకి మారిన నేపథ్యంలో అక్కడ ఉన్న బీసీ వర్గాలను ఆకట్టుకోవడానికి దివంగత నేత కర్పూరికి భారత రత్న ఇచ్చారు. మాజీ ఉప ప్రధాని అద్వానికి ఇవ్వడంలో బీజేపీ ఇంటరెస్టు ఉంటుంది. అద్వానికి సరైన ప్రాధాన్యత లభించడం లేదన్న భావన ప్రబలిన తరుణంలో ఆ వాదనను పూర్వపక్షం చేయడానికి ఇచ్చి ఉండవచ్చు. దివంగత నేత చరణ్ సింగ్‌కు భారతరత్న ఇవ్వడం ద్వారా యూపీలో జాట్ వర్గాన్ని ఆకట్టుకునే ప్లాన్ ఉండవచ్చు. దానికి తగినట్లే చరణ్ సింగ్ మనుమడు జయంత్ సమాజవాది పార్టీ కూటమి నుంచి ఎన్డీఏ.లోకి వచ్చేస్తున్నట్లు ప్రకటించారు. స్వామినాధన్ తమిళనాడుకు చెందినవారు. ఇటీవలికాలంలో ఆ రాష్ట్రంపై మోదీ ఫోకస్ పెట్టారు. ఇది కూడా ఒక కారణం కావచ్చు. ఇక ఇంకో దివంగత నేత పీవీ నరసింహారావు కాంగ్రెస్ ప్రధాన మంత్రిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన తీసుకు వచ్చిన ఆర్దిక సంస్కరణలు దేశ ప్రగతికి బాటలు వేశాయి. బహుభాషా కోవిదుడు అయిన పీవీ నరసింహారావు పట్ల అందరిలోను గౌరవ భావం ఉన్నప్పటికి, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని యూపీఎ ఇవ్వని భారత రత్న అవార్డును బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ. ఇవ్వడం కూడా ఆసక్తికర అంశమే. తెలంగాణలో పీవీ పట్ల ఉన్న అభిమానాన్ని దృష్టిలో ఉంచుకుని కూడా ఈ నిర్ణయం చేసి ఉండవచ్చు. వచ్చే పార్లమెంటు ఎన్నికలలో తెలంగాణ లో ఎక్కువ సీట్లు గెలవాలని ప్రయత్నిస్తున్న బీజేపీ దీనిని కూడా ఒక అస్త్రంగా వాడుకోవచ్చు. ఇక్కడ మరో కోణం ఏమిటంటే 1992లో బాబ్రిమసీదు కూల్చివేత ఘటనకు సంబంధించి అద్వానిపై అప్పట్లో కేసు నమోదు అయింది. ఆ మసీదు కూలుతున్నప్పుడు పీవీ నరసింహారావు గట్టి చర్య తీసుకోకుండా మౌనంగా ఉన్నారన్న విమర్శ ఉంది. వీరిద్దరికి ఒకేసారి భారతరత్న ఇవ్వడం గమనించదగ్గ అంశమే. పీవీ నరసింహారావు ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన సంస్కరణలను ఆ రోజుల్లో బీజేపీ, వామపక్షాలు వ్యతిరేకించేవి. నిరసనలు చేపట్టేవి. ఆ తర్వాత కాలంలో బీజేపీ కూడా వాటినే అనుసరించింది. కాని చిత్రంగా కాంగ్రెస్ లో పవర్ పుల్ ఉమన్ గా ఉన్న సోనియాగాంధీతో పీవీకి అప్పట్లో విబేధాలు వచ్చాయి. సోనియాగాందీ చేసిన కొన్ని డిమాండ్లను పీవీ అంగీకరించలేదని,దాంతో ఆయనపై కోపం పెంచుకున్నారని అంటారు. అందువల్లే పీవీ ఢిల్లీలో మరణిస్తే,కుటుంబ సభ్యులు కోరినా, దేశ రాజధానిలో అంత్యక్రియలకు అవకాశం ఇవ్వలేదని అంటారు. ప్రత్యేక ఘాట్‌ను ఏర్పాటు చేయలేదన్న భావన ఉంది.అంతేకాక ఏఐసీసీ కార్యాలయానికి ఆయన బౌతిక కాయాన్ని తీసుకు వెళ్లినప్పుడు లోపలికి తీసుకురాకుండా, గేటు బయటే ఉంచడం కూడా వివాదాస్పదం అయింది. ఆర్దిక సంస్కరణలకు ఆద్యుడు అయిన పీవీ 1996లో కాంగ్రెస్‌ను తిరిగి అధికారంలోకి తెప్పించలేకపోయారు. తెలుగుదేశం, జెఎమ్ఎమ్ వంటి పార్టీలను చీల్చి అధికారంలో ఐదేళ్లపాటు కొనసాగినా, పార్టీ సాదారణ ఎన్నికలలో ఓటమి పాలైంది. జెఎమ్ఎమ్కు లంచాలు ఇచ్చారన్న అబియోగానికి గురయ్యారు. ఇన్ని ఉన్నప్పటికీ దేశ ప్రయోజనాల రీత్యా ఆయన చేపట్టిన కార్యక్రమాలు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రిగా పెద్దగా సక్సెస్ కాలేకపోయిన పీవీ దేశ ప్రదానిగా సఫలం అయ్యారని చెప్పాలి. తెలుగువారిలో భారతరత్న అవార్డు పొందిన తొలి వ్యక్తిగా పీవీ కీర్తిప్రతిష్టలు పొందారు. తెలుగువారందరికి ఇది గర్వకారణమే. ఒకప్పుడు ప్రధానిగా మాత్రమే కాకుండా , ఏఐసీసీ అధ్యక్షుడుగా అధికారం చెలాయించిన పీవీ ఆ తర్వాత కాలంలో కాంగ్రెస్ లో దాదాపు ఒంటరి అయ్యారు. 1991 లో రాజకీయాల నుంచి దాదాపు విరమించుకుని హైదరాబాద్ వచ్చేసిన ఆయన అనూహ్యంగా దేశ ప్రధాని అయ్యారు. ప్రధాని పదవి నుంచి దిగిపోయిన తర్వాత మళ్లీ అదే రకమైన పరిస్థితిని ఆయన ఎదుర్కున్నారు. కాగా పీవీ మరణానంతరం ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మాత్రం హుస్సేన్ సాగర్ ఒడ్డున స్థలం కేటాయించి అంత్యక్రియలు జరిపించి ఆయన స్మృతివనంగా అభివృద్ది చేశారు. కాంగ్రెస్ అధిష్టానం అనుసరించిన వైఖరి నేపద్యంలో పీవీ కుటుంబం కూడా కాంగ్రెస్ కు దూరం అయింది. 2014లో తెలంగాణ ముఖ్యమంత్రి అయిన కెసిఆర్ ఆ పరిస్థితిని తనకు అనుకూలంగా మలచుకున్నారు. పీవీ బందువులకు ప్రాదాన్యం ఇవ్వడం, ఒకరికి మంత్రి పదవి ఇవ్వడం , పీవీ కుమార్తె అయిన వాణి కి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం వంటివి చేశారు. పీవీ శత జయంతి ఉత్సవాలను కూడా నిర్వహించారు. ఇప్పుడు పీవీకి భారత రత్న ఇవ్వడం ద్వారా తెలంగాణలో బీజేపీకి ఎంత మేర రాజకీయ లబ్ది చేకూరుతుందన్నది చూడాలి. బీఆర్ఎస్ కూడా ఈ విషయంలో పోటీ పడుతుంది. కాంగ్రెస్‌కు మాత్రం ఇది కొంత ఇబ్బందికరమైనదే. పీవీకి భారత ఇవ్వలేకపోయారన్న విమర్శను ఎదుర్కుంటోంది. పార్లమెంటు ఎన్నికలలో ఈ అంశం ఎంత ప్రభావం చూపుతుందన్నది అప్పుడే చెప్పలేం. కాగా మరో నేత , తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావుకు భారత రత్న ఇవ్వాలన్న డిమాండ్ రెండు దశాబ్దాలుగా ఉంది. వాజ్ పేయి ప్రధానిగా ఉన్నప్పుడు ఆయనకు భారత రత్న ఇవ్వడానికి దాదాపు నిర్ణయం అయిపోగా , అందుకు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులే అడ్డుకున్నారన్న అభిప్రాయం ఉంది. ఎన్టీఆర్ రెండో భార్య లక్ష్మీపార్వతి ఆ అవార్డును స్వీకరించే అవకాశం ఉండడంతో ,అది ఇష్టలేని కుటుంబ సభ్యులు బిరుదును అప్పట్లు ఇవ్వవద్దన్నారని చెబుతారు. ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రిగా, ఎన్డీఏ కన్వీనర్‌గా కూడా ఉండేవారు. అయినా ఎన్టీఆర్‌కు భారత రత్న రాలేదు. కాని ప్రతి మహానాడులోను ఎన్టీఆర్‌కు భారత రత్న ఇవ్వాలని తీర్మానం చేస్తుంటారు. దాంతో ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల చిత్తశుద్దిపై సందేహాలు ఏర్పడ్డాయి. 2014-2019 టర్మ్‌లో కూడా చంద్రబాబు నాయుడు ఎన్డీఏ.లో ఉన్నారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వంలో ఇద్దరు టిడిపి మంత్రులు కూడా ఉన్నారు. అయినా ఎన్టీఆర్‌కు మాత్రం భారతరత్న రాలేదు. 2018లో మోదీతో తగదా పడి బయటకు వచ్చారు. దాంతో కాస్తో,కూస్తో ఉన్న అవకాశం కూడా పోయినట్లయింది. అదేకనుక ఎన్టీఆర్‌కు కూడా భారతరత్న వచ్చి ఉంటే ఇద్దరు తెలుగువారు ఈ ఘనత సాధించినట్లయ్యేది. ప్రధాని మోదీ వ్యూహాత్మకంగానే పద్మ అవార్డులు ప్రకటిస్తుంటారు. ఉదాహరణకు యూపీ మాజీ ముఖ్యమంత్రి మూలాయం సింగ్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శరద్ పవార్ కు, కేంద్ర మాజీ మంత్రి గులాం నబీ అజాద్ వంటివారికి పద్మవిభూషణ్ అవార్డులు ఇచ్చారు. ఎన్నికల టైమ్‌లో ఐదుగురికి భారత రత్న అవార్డులు ఇవ్వడంతో రాజకీయంగా ప్రాముఖ్యత ఏర్పడింది. - కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
హరిత విప్లవ సారథి
మాన్‌కొంబు సదాశివన్ స్వామినాథన్.. సరిపడా పంటల ఉత్పత్తి లేక ఆకలితో అలమటిస్తున్న మన దేశానికి అన్నం పెట్టిన అరుదైన శాస్త్రవేత్త. హరిత విప్లవ పితామహుడికి కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించింది. దేశం ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకొనే స్థాయి నుంచి పంటల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించి, ఇప్పుడు విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగిందంటే అదంతా ఎంఎస్ స్వామినాథన్ చలవే అని చెప్పడం అతిశయోక్తి కాదు. హరిత విప్లవం, నూతన వంగడాలు, ఆధునిక వ్యవసాయ విధానాలతో దేశాన్ని అన్నపూర్ణగా మార్చారు. తన జీవితాన్ని హరిత విప్లవానికే అంకితం చేశారు. ప్రజలందరికీ పౌష్టికాహారం అందించాలని, ఆహార భద్రత కల్పించాలని అహర్నిశలూ తపించారు. ప్రపంచ ఆహార వ్యవస్థల స్థిరీకరణకు తన వంతు తోడ్పాటునందించారు. తన పరిశోధనల ద్వారా కోట్లాది మంది రైతుల జీవితాల్లో వెలుగులు నింపారు. ► ఎంఎస్ స్వామినాథన్ 1925 ఆగస్టు 7న తమిళనాడులోని కుంభకోణంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు పార్వతీ థంగమ్మై, డాక్టర్ ఎం.కె.సాంబశివన్. ► 15 ఏళ్ల నిండకుండానే తండ్రి మరణించడంతో తమ కుటుంబం ఆధ్వర్యంలోని ఆసుపత్రిని నిర్వహించడానికి వైద్య విద్య అభ్యసించాలని నిర్ణయించుకున్నారు. మెడిసిన్‌లో చేరారు. ► విద్యార్థిగా ఉన్నప్పుడు పశ్చిమ బెంగాల్లో కరువు పరిస్థితులను చూసి చలించిపోయారు. ఆకలితో ఎవరూ చనిపోయే పరిస్థితి రాకూడదని భావించారు. ► వైద్య విద్యను మధ్యలోనే వదిలేసి కోయంబత్తూరులోని వ్యవసాయ కళాశాలలో చేరారు. ► పీజీ పూర్తయ్యాక సివిల్ సర్విసు పరీక్ష రాశారు. ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. కానీ, అటువైపు మొగ్గు చూపకుండా హాలెండ్‌లో వ్యవసాయ శాస్త్రంలో ఉన్నత విద్య అభ్యసించారు. బంగాళదుంప జన్యు పరిణామంపై పరిశోధనలు సాగించారు. తర్వాత కేంబ్రిడ్జి యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ చేశారు. ► 1954లో ఒడిశాలోని కేంద్ర వరి పరిశోధన సంస్థలో చేరారు. అనంతరం భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థలో అడుగుపెట్టారు. ► ప్రపంచస్థాయి వ్యవసాయ సంస్థల్లో రెండు దశాబ్దాలపాటు పనిచేశారు. పరిశోధనతోపాటు పరిపాలనాపరమైన విధులు నిర్వర్తించారు. ► దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఆహార కొరత తీవ్రంగా ఉండేది. విదేశాల నుంచి ఆహార ధాన్యాలు దిగుమతి చేసుకుంటే తప్ప ఆకలి తీరని పరిస్థితి. అప్పట్లో పంటల దిగుబడి చాలా పరిమితంగా ఉండేది. ఈ పరిస్థితిని మార్చేయాలని స్వామినాథన్ నిర్ణయించుకున్నారు. హరిత విప్లవానికి శ్రీకారం చుట్టారు. ► అధిక దిగుబడినిచ్చే వంగడాలను ప్రవేశపెట్టారు. ఆధునిక వ్యవసాయ యంత్రాలు, పరికరాలను రైతులకు పరిచయం చేశారు. ప్రభుత్వ సహకారంతో సాగునీటి సౌకర్యం పెంచారు. ఎరువులు, పురుగు మందుల వాడకం పెంచారు. సాగు విస్తీర్ణం భారీగా పెంచేందుకు కృషి చేశారు. ఇవన్నీ సత్ఫలితాలు ఇచ్చాయి. ► ప్రధానంగా వరి, గోధుమ వంగడాల అభివృద్ధికి స్వామినాథన్ అధిక ప్రాధాన్యం ఇచ్చారు. హరిత విప్లవంతో దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. ► హరిత విప్లవం కారణంగా ఎరువులు, పురుగు మందుల వాడకం పెరిగి భూసారం క్షీణిస్తోందని విమర్శలు వచ్చాయి. వీటితో స్వామినాథన్ ఏకీభవించారు. స్థానికంగా ఉండే వంగడాలను కాపాడుకోవాలని, నీటి యాజమాన్య పద్ధతులు పాటించాలని, భూసారం కోల్పోయేలా రసాయనాలు వాడొద్దని సూచించారు. ► వ్యవసాయ రంగంలో పలు ప్రతిష్టాత్మక సంస్థలకు డైరెక్టర్‌గా, డైరెక్టర్ జనరల్‌గా పనిచేశారు. ► స్వామినాథన్‌ను ఎన్నో పురస్కారాలు వరించాయి. 1971లో రామన్ మెగసెసే, 1986లో వరల్డ్ సైన్స్, 1991లో ఎని్వరాన్మెంటల్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్నారు. ► 1967లో పద్మశ్రీ, 1972లో పద్మభూషణ్, 1989లో పద్మవిభూషణ్ పురస్కారాలు స్వీకరించారు. ► 20వ శతాబ్దంలో అత్యంత ప్రభావశీల వ్యక్తుల్లో ఒకరిగా స్వామినాథన్‌ను ప్రఖ్యాత టైమ్ మేగజైన్ గుర్తించింది. ► 1988లో ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. ఈ సంస్థ 1987లో తొలి ప్రపంచ ఆహార పురస్కారం అందుకుంది. ► 2007 నుంచి 2013 దాకా రాజ్యసభ సభ్యుడిగా సేవలందించారు. ► ప్రపంచవ్యాప్తంగా వివిధ విశ్వవిద్యాలయాల 84 గౌరవ డాక్టరేట్లను ఆయన ప్రదానం చేశాయి. ► 2023 సెప్టెంబర్ 28న 98 ఏళ్ల వయసులో చెన్నైలోని స్వగృహంలో స్వామినాథన్ కన్నుమూశారు. -
పీవీకి భారతరత్న
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు తేజం, దివంగత ప్రధాని పాములపర్తి వెంకట నరసింహారావుకు ఎట్టకేలకు దేశ అత్యున్నత పౌర పురస్కారం లభించింది. సార్వత్రిక ఎన్నికల వేళ ఆయనకు కేంద్రం భారతరత్న ప్రకటించింది. మరో దివంగత ప్రధాని చౌదరి చరణ్‌సింగ్, హరిత విప్లవ పితామహుడు డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్‌లను కూడా ఈ అత్యున్నత పురస్కారంతో గౌరవించింది. ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ‘ఎక్స్’వేదికగా ఈ మేరకు వెల్లడించారు. ఆ ముగ్గురు దిగ్గజాలూ దేశానికి చేసిన సేవలు ఎనలేనివంటూ గుర్తు చేసుకున్నారు. ‘‘పీవీ ఆర్థిక సంస్కరణలు దేశానికి కొత్త దిశను, ఆర్థిక రంగానికి నూతన జవసత్వాలను ప్రసాదించాయి. ఇక చరణ్‌సింగ్ రైతు సంక్షేమానికి ఆజన్మాంతం పాటుపడ్డారు. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ ఆహార రంగంలో భారత్ స్వయంసమృద్ధి సాధించడంలో కీలకపాత్ర పోషించారు’’అంటూ ప్రధాని కొనియాడారు. తర్వాత కాసేపటికే ఈ ముగ్గురికీ భారతరత్న ఇస్తున్నట్లు రాష్ట్రపతి భవన్ నుంచి ప్రకటన వెలువడింది. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న వేళ ప్రధాని పదవి చేపట్టి ఆర్థిక సంస్కరణలతో ప్రగతి బాట పట్టించిన రాజనీతిజ్ఞుడు పీవీ. అంతర్గత భద్రత మొదలుకుని విదేశాంగ విధానం దాకా, ఆర్థిక రంగం నుంచి రైతు సంక్షేమం దాకా అన్ని అంశాల్లోనూ చెరగని ముద్ర వేసిన ఆయన 2004లో మరణించారు. ఇక చరణ్‌సింగ్ పశి్చమ ఉత్తరప్రదేశ్‌కు చెందిన జాట్ నేత. కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. రెండుసార్లు యూపీ సీఎంగా, అనంతరం కేంద్ర హోం మంత్రిగా రాణించారు. ఎమర్జెన్సీ కాలంలో జైలు జీవితం గడిపారు. 1979లో స్వల్పకాలం ప్రధానిగానూ చేశారు. 1987లో తుదిశ్వాస విడిచారు. ఆయనదీ, పీవీదీ పూర్తిగా బీజేపీయేతర నేపథ్యమే కావడం గమనార్హం. వారికి భారతరత్న పురస్కారం రాజకీయంగా, సామాజికంగా ఎంతో ప్రభావం చూపగల నిర్ణయమంటున్నారు. ముఖ్యంగా రాజకీయ జీవితాన్నంతా కాంగ్రెస్‌కే ధారపోసిన పీవీకి ఆ పార్టీ సరైన గుర్తింపు, గౌరవం ఇవ్వలేదని ఆయన అభిమానులు ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. ఈ నేపథ్యంలో ఎన్నికల వేళ తెలుగు రాష్ట్రాల్లో దీని ప్రభావం గణనీయంగా ఉంటుందన్న భావన వ్యక్తమవుతోంది. ఇక యూపీలో గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఓడిన 16 స్థానాల్లో ఆరు చరణ్‌సింగ్ మనవడైన జయంత్ సింగ్ సారథ్యంలోని ఆర్ఎల్డీ ప్రాబల్యమున్నవే. ఆయనను ఎన్డీఏలో చేర్చుకునేందుకు బీజేపీ కొంతకాలంగా గట్టిగా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో చరణ్‌సింగ్‌కు భారతరత్న ప్రకటించగానే జయంత్ ఎన్డీయేలో చేరుతున్నట్టు వెల్లడించడం విశేషం! ఇక మన్‌కోంబు సాంబశివన్ స్వామినాథన్ ప్రపంచ ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త. తన విశేష పరిశోధనలతో భారత్‌ను స్వయంసమృద్ధంగా తీర్చిదిద్ది కరువు మహమ్మారిని దేశం నుంచి తరిమికొట్టిన దార్శనికుడు. ఆయన 2023లో మృతి చెందారు. బిహార్ దివంగత ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్‌తో పాటు బీజేపీ సీనియర్ నేత ఎల్కే ఆడ్వాణీలకు కూడా ఇటీవలే భారతరత్న ప్రకటించడం తెలిసిందే. దాంతో ఈ ఏడాది ఈ పురస్కార గ్రహాతల సంఖ్య ఐదుకు చేరింది. ఒకే ఏడాదిలో ఇంతమందికి భారతరత్న ఇవ్వడం ఇదే తొలిసారి. 1999లో అత్యధికంగా నలుగురికి ఈ గౌరవం దక్కింది. 1954 నుంచి ఇప్పటిదాకా మొత్తమ్మీద ఇప్పటిదాకా 53 మందికి భారతరత్న పురస్కారం అందజేశారు. ఈసారి ఈ అవార్డు ప్రకటించిన వారిలో అడ్వాణీ (96) మాత్రమే జీవించి ఉన్నారు. సంస్కరణల రూపశిల్పి పీవీ... మాజీ ప్రధాని పీవీని భారతరత్నతో సత్కరిస్తున్నందుకు సంతోíÙస్తున్నామని మోదీ పేర్కొన్నారు. ‘‘ఆయన విశిష్ట పండితుడు. గొప్ప రాజనీతిజు్ఞడు. పలు హోదాలలో దేశానికి అసమాన సేవలందించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, అనేక ఏళ్ల పాటు లోక్‌సభ, శాసనసభ సభ్యునిగా ఆయన చేసిన కృషి మరులేనిది. దేశ ఆరి్ధకాభివృధ్ధిలో దూరదృష్టితో కూడిన ఆయన నాయకత్వం అతి కీలకపాత్ర పోషించింది. దేశ శ్రేయస్సుకు, అభివృద్ధికి బలమైన పునాది వేసింది. భారత మార్కెట్లను ప్రపంచానికి తెరుస్తూ ప్రధానిగా పీవీ తెచ్చిన సంస్కరణలు చాలా కీలకమైనవి. తద్వారా ఆర్థిక రంగంలో నూతన శకానికి తెర తీశారు పీవీ. విదేశాంగ విధానాన్ని సమూలంగా మార్చేయడమే గాక భాష, విద్య తదితర రంగాలెన్నింటిపైనో చెరగని ముద్ర వేశారు. క్లిష్ట పరిస్థితుల్లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టి దేశ సాంస్కృతిక, మేధో వారసత్వాన్ని సుసంపన్నం చేసిన బహుముఖ ప్రజ్ఞశాలి పీవీ’’అంటూ ప్రస్తుతించారు. మార్గదర్శకుడు స్వామినాథన్... వ్యవసాయ రంగానికి, రైతు సంక్షేమానికి స్వామినాథన్ చేసిన సేవలు మరవలేనివని మోదీ అన్నారు. ‘‘క్లిష్ట సమయంలో దేశం వ్యవసాయ స్వావలంబన సాధించడంలో ఆయనది కీలక పాత్ర. దేశ వ్యవసాయాన్ని ఆధునీకరించే దిశగా అద్భుతమైన ప్రయోగాలు చేశారు. స్వామినాథన్ దార్శనికత సాగు తీరుతెన్నులనే సమూలంగా మార్చడమే గాక దేశ ఆహార భద్రతకు, శ్రేయస్సుకు బాటలు పరిచింది. నాకాయన ఎంతగానో తెలుసు. ఆయన అంతర్ దృష్టిని నేనెప్పుడూ గౌరవిస్తాను. స్వామినాథన్ బాటలో యువతను, విద్యార్థులను పరిశోధనల దిశగా ప్రోత్సహిస్తున్నాం’’అని వివరించారు. రైతు సంక్షేమానికి అంకితం... దివంగత ప్రధాని చరణ్‌సింగ్‌ను భారతరత్నతో సత్కరించడం తమ ప్రభుత్వ అదృష్టమని మోదీ అన్నారు. ‘‘దేశానికి ఆయన చేసిన సాటిలేని కృషికి ఈ గౌరవం అంకితం. ఆయన జీవితమంతా రైతుల హక్కులు, సంక్షేమానికే అంకితం చేశారు. దేశ నిర్మాణంలో తనదైన ముద్ర వేశారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా నిలిచారు. ప్రజాస్వామ్యం పట్ల ఆయన నిబద్ధత యావత్ జాతికి స్ఫూర్తిదాయకం’’అంటూ కొనియాడారు. స్వాగతించిన పార్టీలు పీవీ, చరణ్‌సింగ్, ఎంఎస్‌లకు భారతరత్న ప్రకటించడంపై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నిర్ణయాన్ని పార్టీలకు అతీతంగా నేతలంతా స్వాగతించారు. వారు ముగ్గురూ ఎప్పటికీ భారతరత్నాలేనని కాంగ్రెస్ పేర్కొంది. కాంగ్రెస్ తరఫున ఈ నిర్ణయాన్ని పూర్తిగా స్వాగతిస్తున్నట్టు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎక్స్‌లో పోస్ట్ చేశారు. జాతి నిర్మాణానికి పీవీ చేసిన కృషి ఎనలేనిదని ప్రస్తుతించారు. ఆర్థికం, విదేశాంగం, వ్యవసాయం, అణు శక్తి మొదలుకుని లుక్ ఈస్ట్ పాలసీ దాకా ఆయన కృషిని ఒక్కొక్కటిగా ఖర్గే ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు. మరోవైపు, పీవీకి భారతరత్న రావడంపై ఏమంటారని కాంగ్రెస్ అగ్ర నేత సోనియాగాందీని పార్లమెంటు బయట మీడియా ప్రత్యేకంగా ప్రశ్నించడం విశేషం. ‘‘నేను స్వాగతిస్తున్నా. కచ్చితంగా’’అంటూ ముక్తసరి స్పందనతో సరిపెట్టారామె. స్వామినాథన్‌కు భారతరత్న ప్రకటించిన మోదీ, ఆయన ఫార్ములా ఆధారంగా రూపొందిన కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడంపై మాత్రం మూగనోము పట్టారంటూ కాంగ్రెస్ విమర్శించింది. ఇలాంటి నిర్ణయాల్లో బీజేపీ పార్టీ రాజకీయాలకు అతీతంగా వ్యవహరిస్తుందని మరోసారి రుజువైందని పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొన్నారు. వారికి ఎప్పుడో ఈ గౌరవం దక్కి ఉండాల్సిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అభిప్రాయపడ్డారు. పీవీకి భారతరత్న ఇవ్వడాన్ని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రస్తుతించారు. -
భారతరత్న.. ఆ సంప్రదాయాన్ని తిరగరాసి మరీ..!
మునుపెన్నడూ లేని రీతిలో.. దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని ఈ ఏడాది ఏకంగా ఐదుగురికి ప్రకటించింది భారత ప్రభుత్వం. భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ.. మాజీ ప్రధానులైన పీవీ నరసింహరావు, చౌదరి చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్‌లకు ప్రకటించారు. అంతకు ముందు మరో ఇద్దరి పేర్లను ప్రధాని మోదీ స్వయంగానే ప్రకటించిన సంగతీ తెలిసిందే. సాధారణంగా భారతరత్న అవార్డులను ఒకరు, ఇద్దరు, గరిష్టంగా ముగ్గురికి ఇస్తూ వస్తోంది కేంద్రం. ఆ సంప్రదాయానికి 1999లో బ్రేక్ పడి.. ఏకంగా నలుగురికి ప్రకటించింది అప్పటి ప్రభుత్వం. ఆ తర్వాత మళ్లీ ఒకరు, ఇద్దరు, ముగ్గురికి ఇస్తూ వచ్చారు. అయితే ఈ ఏడాది మాత్రం ఏకంగా ఐదుగురికి ప్రకటించింది. ఈ ఏడాది.. బీజేపీ దిగ్గజం ఎల్కే అద్వానీకి, బీహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి థాకూర్‌కు భారతరత్నలకు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇవాళ మరో ముగ్గురికి ప్రకటించడంతో మొత్తం ఐదుగురికి ఇచ్చినట్లయ్యింది. ఐదుగురివి వేర్వేరు ప్రాంతాలు. ఇందులో స్వామినాథన్ మినహాయించి మిగిలిన నలుగురికి వేర్వేరు రాజకీయ నేపథ్యం ఉంది. దీంతో.. ఆయా ప్రాంతాల రాజకీయ నేతలు పార్టీలకతీతంగా తమ ప్రాంత దిగ్గజాలకు భారతరత్న దక్కడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. పీపీ నరసింహరావు పాములపర్తి వెంకట నరసింహారావు 1921 జూన్ 28న వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లిలో జన్మించారు. 1991 జూన్ 21 నుంచి 1996 మే 16 దాకా భారత దేశానికి ప్రధానిగా పని చేశారు. అంతకు ముందు.. కేంద్రంలో మాజీ ప్రధానులు ఇందిరా గాంధీ, రాజీవ్‌గాంధీ ప్రభుత్వాల్లో పనిచేశారు. దేశ హోం, రక్షణ, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖల బాధ్యతలు నిర్వర్తించారు. స్వాతంత్రోద్యమం సమయంలో దేశం కోసం పోరాడిన పీవీ.. ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. 1957-77 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ప్రాతినిధ్యం వహించిన ఆయన పలు మంత్రిపదవులు చేపట్టారు. 1971 నుంచి 1973 వరకు ఏపీ ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. ఇదీ చదవండి: తెలంగాణ బిడ్డ, మాజీ ప్రధాని పీవీకి భారత రత్న చరణ్ సింగ్.. ఉత్తర ప్రదేశ్ మీరట్‌లో పుట్టిన పెరిగిన చరణ్ సింగ్.. 1979 జులై 28వ తేదీ నుంచి 1980 జనవరి 14వ తేదీ దాకా దేశానికి ప్రధానిగా పని చేశారు. ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగానూ ఆయన రెండుసార్లు పని చేశారు. యూపీలో చెప్పుకోదగ్గ స్థాయిలో బలం,బలగం ఉన్న రాష్ట్రీయ లోక్‌దళ్(ఆర్ఎల్డీ.. చరణ్ సింగ్ వారసులు స్థాపించిన పార్టీ), విపక్ష శిబిరానికి షాక్ ఇచ్చి ఎన్డీయేలో చేరుతుందన్న ప్రచారం ఉన్న సమయంలోనే.. చరణ్ సింగ్‌కు అవార్డు ప్రకటించడం గమనార్హం. ఇదీ చదవండి: గ్రామీణ ప్రజాబంధు చరణ్ సింగ్ ఎం.ఎస్ స్వామినాథ్.. భారత దేశ హరితవిప్లవ పితామహుడిగా మాన్‌కోంబు సాంబశివన్ స్వామినాథ్ 1925 ఆగస్టు 7న తమిళనాడు రాష్ట్రంలో కావేరి డెల్టా ప్రాంతంలోని కుంభకోణం పట్టణంలో జన్మించారు. కొంతకాలం కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో పనిచేసిన స్వామినాథన్ 1954లో మళ్లీ భారత్‌లో అడుగు పెట్టారు. ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో శాస్త్రవేత్తగా పరిశోధనలపై దృష్టి పెట్టారు. 1972–79లో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్‌గా వ్యవహరించారు. 1979లో కేంద్ర ప్రభుత్వం ఆయనను వ్యవసాయ శాఖ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. 2007 నుంచి 2013 దాకా రాజ్యసభలో నామినేట్ ఎంపీగా సేవలను అందించారు. స్వామినాథన్ దేశ విదేశాల్లో ఎన్నో ప్రఖ్యాత సంస్థలకు నాయకత్వం వహించారు. కిందటి ఏడాది సెప్టెంబర్ 28వ తేదీన ఆయన కన్నమూశారు. ఇదీ చదవండి: ఆకలిపై పోరాటం జరిపిన శాస్త్రవేత్త కర్పూరి ఠాకూర్ బిహార్ మాజీ సీఎం, దివంగత నేత కర్పూరి ఠాకూర్ ఆయన శతజయంతి వేళ కేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న తో గౌరవించింది. బిహార్‌కు రెండు పర్యాయాలు (డిసెంబరు 1970 నుంచి జూన్ 1971 వరకు, డిసెంబరు 1977 నుంచి ఏప్రిల్ 1979 వరకు) సీఎంగా సేవలందించి.. తన పాలనా దక్షతతో జన నాయక్‌గా చెరగని ముద్ర వేసుకున్నారు. 1924 జనవరి 24న బిహార్‌లోని సమస్తీపూర్ జిల్లాలో జన్మించిన కర్పూరి ఠాకూర్.. అనునిత్యం పేద ప్రజల సంక్షేమం కోసం, సామాజిక మార్పు కోసం పనిచేశారు.జనం కోసం నిబద్ధతతో పనిచేసిన ఆయన్ను ‘జననాయక్ కర్పూరి ఠాకూర్’ అని అక్కడి ప్రజలు పిలుస్తారు. లాలూ ప్రసాద్ యాదవ్, నీతీశ్ కుమార్, రాం విలాస్ పాశవాన్ వంటి నేతలకు ఠాకూర్ రాజకీయ గురువు. తాను విశ్వసించిన సిద్ధాంతాలకు కట్టుబడి సుదీర్ఘకాలం పాటు బిహార్, దేశ రాజకీయాలను ప్రభావితం చేయడం ద్వారా గొప్ప రాజనీతిజ్ఞుడిగా గుర్తింపుపొందిన ఆయన 1988 ఫిబ్రవరి 17న తుదిశ్వాస విడిచారు. ఇదీ చదవండి: అరుదైన జననాయకుడు ఎల్కే అద్వానీ రాజకీయ కురువృద్ధుడు, బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీకి భారతరత్న గౌరవం దక్కింది. సంఘ్ భావజాలాన్ని అణువణువునా పుణికిపుచ్చుకుని.. అంచెలంచెలుగా రాజకీయ దిగ్గజంగా ఎదిగిన మేధావి. అద్వానీ.. 1927 నవంబరు 8న భారత్‌లోని కరాచీ (ప్రస్తుతం పాక్‌లో ఉంది)లో జన్మించారు. 1941లో తన పద్నాలుగేళ్ల వయసులో ఆయన ఆరెస్సెస్‌లో చేరారు.దేశ విభజన తర్వాత ముంబయిలో స్థిరపడ్డ అద్వానీ.. రాజస్థాన్‌లో సంఘ్ ప్రచారక్‌గా పనిచేశారు. 1970లో ఢిల్లీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా తొలిసారి ఎన్నికయ్యారు.1980లో అద్వానీ సహా కొంతమంది జన సంఘ్ నేతలు జనతా పార్టీని వీడారు. ఆ తర్వాత వాజ్పేయీతో కలిసి 1980 ఏప్రిల్ 6న భారతీయ జనతా పార్టీని స్థాపించారు. కాంగ్రెస్‌ను ఎదుర్కొనేందుకు నేషనల్ డెమొక్రటిక్ అలయెన్స్(ఎన్డీయే)కు రూపకల్పన చేసిన రాజనీతిజ్ఞుడు. 1999లో జరిగిన ఎన్నికల్లో గాంధీనగర్ లోక్‌సభ స్థానం నుంచి అద్వానీ గెలిచారు. లోక్‌సభలో సుదీర్ఘకాలం పాటు ప్రతిపక్ష నేతగా పనిచేశారు. ఉప ప్రధాని పదవిని సైతం ఆయన చేపట్టారు. 2019 నుంచి క్రియాశీల రాజకీయాలకు ఆయన దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇదీ చదవండి: గమ్యం చేరని రథ యాత్రికుడు -
ఆర్థిక సంస్కరణల సారథికి భారతరత్న.. ప్రధాన నిర్ణయాలు ఇవే..
కేంద్ర ప్రభుత్వం మరోసారి భారతరత్న పురస్కారాలను ప్రకటించింది. మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, చరణ్‌సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్‌ను అత్యున్నత పౌర పురస్కారంతో గౌరవించింది. ఈ మేరకు ప్రధాని నరేంద్రమోదీ ‘ఎక్స్’ వేదికగా తెలియజేశారు. భారత ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మకమైన సంస్కరణలకు బీజం వేసి కుంటుపడుతున్న ఎకానమీని తిరిగి పట్టాలెక్కించిన సంస్కరణ శీలి, బహుముఖ ప్రజ్ఞావంతుడు పీవీ నరసింహారావు. ఆయన హయాంలో ఆర్థిక వృద్ధి, ఎగుమతులు, అంతర్జాతీయ సంక్షోభాలకు ఎదురొడ్డి నిలవడం విదేశీ మారక ద్రవ్య నిల్వలు, సమాచార సాంకేతిక పురోగతి, స్టాక్ మార్కెట్లు, టెలీకమ్యూనికేషన్లు వంటి పలు రంగాల్లో ఆకాశమే హద్దుగా భారత్ చెలరేగింది. గతంలో ఆహారపదార్థాలు దిగుమతిలో అట్టడుగున ఉన్న భారత్ ఇవాళ అంతర్జాతీయ సమాజానికి పెద్ద ఎత్తున ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేసే దేశంగా ఆవిర్భవించిందంటే పీవీ సంస్కరణలే కారణమని నిపుణులు చెబుతున్నారు. టన్నుల కొద్ది బంగారం తాకట్టు పీవీ నరసింహారావు 1991 జూన్ నెలలో ప్రధానమంత్రి పీఠాన్ని అధిరోహించినప్పటికి భారత దేశంలో ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉండేవికావు. హరిత విప్లవం కారణంగా కొద్దిపాటి ఆహార స్వావలంబన సాధ్య పడినా, ఇతర రంగాలన్నీ దీనస్థితిలో ఉండటంతో దేశ స్థూల జాతీయోత్పత్తి మూడు శాతంగా కొనసాగుతుండేది. మరోవైపు ఇంటిని చక్కదిద్దుకునే దారి తెలియక 20 కోట్ల డాలర్ల రుణం కోసం 20 టన్నుల బంగారాన్ని యూనియన్ బ్యాంక్ ఆఫ్ స్విట్జర్లాండ్‌కు తాకట్టు పెట్టిన పరిస్థితి నెలకొంది. అప్పటికే పెరిగిన సంక్షోభం ఇందిరా గాంధీ 1966లోనే సంస్కరణల కోసం విఫల ప్రయత్నం చేశారు. రాజీవ్ గాంధీ కంప్యూటర్లు, కలర్ టీవీలను తీసుకువచ్చారు. కానీ అప్పటి పరిస్థితులు దృష్ట్యా ఆర్థిక సంస్కరణలపై ఎక్కువ దృష్టిసారించలేకపోయారు. ఇంతలో దేశ ఆర్థిక సమస్యలు పెరిగాయి. 1980ల్లో ఈ సమస్యలు మరింత రెట్టింపయ్యాయి. 1990 ఇవి తీవ్రరూపం దాల్చాయి. 1991 నాటికి భారతదేశం క్లోజ్డ్ ఎకానమీగా ఉండేది. అంటే ప్రతి నిర్ణయం ప్రభుత్వం చేతుల్లోనే ఉంటుంది. ఎంత ఉత్పత్తి చేయాలి, ఎంత ఖర్చు చేయాలి, ఎంతమంది వినియోగించాలి అనే అంశాలన్నీ ప్రభుత్వమే చూసుకుంటుంది. ఈ వ్యవస్థనే పర్మిట్ రాజ్ లేదంటే లైసెన్స్ రాజ్ అంటారు. ఇందుకు భిన్నంగా ఓపెన్ ఎకానమీలో ప్రభుత్వ పెట్టుబడులను తగ్గించి, ప్రైవేటు సంస్థలను ప్రోత్సహించారు. ఈ ఆర్థిక సంస్కరణలను ప్రకటిస్తూ అప్పటి ఆర్థికమంత్రి మన్మోహన్ సింగ్ జులై 24, 1991న బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఆనాటి బడ్జెట్ ముఖ్యాంశాలు దేశీయ మార్కెట్లో కంపెనీల మధ్య పోటీ పెంచుతామన్నారు. లైసెన్సింగ్ రాజ్ ముగిసింది. కంపెనీలకు నిబంధనలతో కూడిన పర్మిట్లు ఉండవని చెప్పారు. ఎగుమతులను ప్రోత్సహించడం, దిగుమతి లైసెన్సింగ్‌లో సడలింపులే లక్ష్యంగా బడ్జెట్లో పలు మార్పులు ప్రకటించారు. ఎగుమతులను ప్రోత్సహించడానికి ‘దిగుమతి-ఎగుమతి విధానం’లో విదేశీ పెట్టుబడులను స్వాగతించారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఉద్యోగాలు సృష్టిస్తాయని తెలిపారు. సాఫ్ట్వేర్ ఎగుమతి కోసం ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80 హెచ్హెచ్సి కింద పన్ను మినహాయింపు ఇచ్చారు. ఈ బడ్జెట్‌ను ఆధునిక భారతదేశ చరిత్రలో అతి పెద్ద నిర్ణయాల్లో ఒకటిగా పరిగణిస్తారు. విద్యాశాఖను మానవవనరుల అభివృద్ధి శాఖగా మార్చడం, జైళ్ల శాఖలో సంస్కరణలు తేవడం, నవోదయ పాఠశాలల ఏర్పాటు, గురుకుల విద్యకు నాంది వంటి పలు సంస్కరణలను ఆయన తీసుకువచ్చారు. అయితే ఆర్థిక సంస్కరణలపైన పేదరికం, నిరుద్యోగం, అసమానతల నిర్మూలనలో ఎన్నో మార్పులు తీసుకొచ్చారు. -
తెలంగాణ బిడ్డ, మాజీ ప్రధాని పీవీకి భారత రత్న
ఢిల్లీ: మాజీ ప్రధానమంత్రి దివంగత పీవీ నరసింహరావుకు భారతరత్న వరించింది. కేంద్ర ప్రభుత్వం పీవీకి భారతరత్నను శుక్రవారం ప్రకటించింది. పీవీతో పాటు మాజీ ప్రధాని చౌదరీ చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్‌కు కేంద్ర ప్రభుత్వం భారత తర్న ప్రకటించిన విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీటర్ వేదికగా వెల్లడించారు. Delighted to share that our former Prime Minister, Shri PV Narasimha Rao Garu, will be honoured with the Bharat Ratna. As a distinguished scholar and statesman, Narasimha Rao Garu served India extensively in various capacities. He is equally remembered for the work he did as… pic.twitter.com/lihdk2BzDU — Narendra Modi (@narendramodi) February 9, 2024 వరంగల్ జిల్లా నర్సింపేట (మ) లక్నేపల్లిలో 1921 జూన్ 28న జన్మించిన పీవీ నరసింహారావు 1991లో భారత ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడయ్యాయడు. ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించడంలో పీవీ కీలక పాత్ర పోషించారు. బహు భాషా కోవిదుడిగానూ పీవీ నరసింహారావుకు గుర్తింపు ఉంది. కాంగ్రెస్ ను కష్టకాలంలో ఆదుకున్న పీవీని ఆ తర్వాత కాంగ్రెస్ పట్టించుకోలేదన్న విమర్శలున్నాయి. It is a matter of immense joy that the Government of India is conferring the Bharat Ratna on Dr. MS Swaminathan Ji, in recognition of his monumental contributions to our nation in agriculture and farmers’ welfare. He played a pivotal role in helping India achieve self-reliance in… pic.twitter.com/OyxFxPeQjZ — Narendra Modi (@narendramodi) February 9, 2024 हमारी सरकार का यह सौभाग्य है कि देश के पूर्व प्रधानमंत्री चौधरी चरण सिंह जी को भारत रत्न से सम्मानित किया जा रहा है। यह सम्मान देश के लिए उनके अतुलनीय योगदान को समर्पित है। उन्होंने किसानों के अधिकार और उनके कल्याण के लिए अपना पूरा जीवन समर्पित कर दिया था। उत्तर प्रदेश के… pic.twitter.com/gB5LhaRkIv — Narendra Modi (@narendramodi) February 9, 2024 పీవీ ప్రస్థానం.. పాత కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని వంగరకు చెందిన పీవీ నరసింహారావు మంథని నియోజకవర్గం నుంచి తన రాజకీయ అడుగులు వేశారు. 1957లో మొదటిసారి కాంగ్రెస్ అభ్యర్థి గా పోటీచేసి విజయం సాధించారు. తర్వాత 1962, 67, 72లో వరుసగా విజయం సాధించారు. ఎమ్మెల్యేగా రెండోసారి గెలిచిన తర్వాత పీవీకి మంత్రిగా అవకాశం వచ్చింది. తొమ్మిది సంవత్సరాల పాటు ఆయన న్యాయ, సమాచార, వైద్య, దేవాదాయ శాఖల మంత్రిగా పనిచేశారు. 1971లో జరిగిన పరిణామాలతో పీవీని కాంగ్రెస్ అధిష్టానం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నియమించింది. రెండు సంవత్సరాల పాటు ఆ పదవిలో కొనసాగిన ఆయన తర్వాత రాష్ట్ర రాజకీయాలకు గుడ్‌బై చెప్పారు. 1977లో హనుమకొండ లోక్‌సభస్థానం నుంచి పోటీ చేసి కేంద్ర రాజకీయాల్లో అడుగుపెట్టారు. 1980లో జరిగిన ఎన్నికల్లో మరోసారి ఇదే నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత 1984, 89 సంవత్సరాల్లో మహారాష్ట్రలోని రాంటెక్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. కేంద్ర కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. 1991లో అనూహ్యంగా అత్యున్నతమైన ప్రధానమంత్రి పదవి వరించింది. 1996 వరకు ప్రధానమంత్రి పనిచేశారు. పీఎం పదవి చేపట్టిన తొలి తెలుగు వ్యక్తిగా, దక్షిణ భారతీయుడిగా చరిత్రలో నిలిచిపోయారు. ఈ ఏడాది ఐదుగురికి భారతరత్న భారత అత్యున్నత పురస్కారమైన భారతరత్నను ఈ ఏడాది ఐదుగురికి ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. బిహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్, బీజేపీ సీనియర్ నేత, మాజీ ఉప ప్రధాని ఎల్ కే అద్వానీలకు ఇటీవల భారతరత్న ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. తాజాగా పీవీ నరసింహారావు, చరణ్‌సింగ్, స్వామినాథన్‌లకు ఈ అత్యున్నత పురస్కరాన్ని ప్రకటించింది. ఎం.ఎస్ స్వామినాథ్ ప్రస్థానం.. మాన్‌కోంబు సాంబశివన్ స్వామినాథ్ 1925 ఆగస్టు 7న తమిళనాడు రాష్ట్రంలో కావేరి డెల్టా ప్రాంతంలోని కుంభకోణం పట్టణంలో జన్మిమంచారు. ఆయన తండ్రి డాక్టర్ ఎం.కె.సాంబశివన్ వైద్యుడు. తల్లి పార్వతీ తంగమ్మల్ గృహిణి. 11వ ఏట తండ్రిని కోల్పోయారు. తన మామయ్య సంరక్షణలో పెరిగిన స్వామినాథన్ కుంభకోణంలో మెట్రిక్యులేషన్, త్రివేండ్రంలో జంతుశాస్త్రంలో డిగ్రీ చేశారు. తర్వాత కోయంబత్తూరు అగ్రికల్చరల్ కాలేజీ నుంచి అండర్గ్రాడ్యుయేట్ డిగ్రీ సాధించారు. ఢిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధన సంస్థలో పీజీ పూర్తి చేశారు. స్వామినాథన్ 2004 నుంచి 2006 దాకా ‘నేషనల్ కమిషన్ ఆన్ ఫార్మర్స్’ అధినేతగా వ్యవహరించారు. పంటలకు కనీస మద్దతు ధరపై ప్రభుత్వానికి విలువైన ప్రతిపాదనలు చేశారు. పంటల ఉత్పత్తి వ్యయం కంటే కనీసం 50 శాతాన్ని కనీస మద్దతు ధరగా నిర్ణయించాలని సూచించారు. ఎన్నో పదవులు కొంతకాలం కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో పనిచేసిన స్వామినాథన్ 1954లో మళ్లీ భారత్‌లో అడుగు పెట్టారు. ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో శాస్త్రవేత్తగా పరిశోధనలపై దృష్టి పెట్టారు. 1972–79లో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్‌గా వ్యవహరించారు. 1979లో కేంద్ర ప్రభుత్వం ఆయనను వ్యవసాయ శాఖ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. 2007 నుంచి 2013 దాకా రాజ్యసభలో నామినేట్ ఎంపీగా సేవలను అందించారు. స్వామినాథన్ దేశ విదేశాల్లో ఎన్నో ప్రఖ్యాత సంస్థలకు నాయకత్వం వహించారు. ► 1981 నుంచి 1985 దాకా ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ కౌన్సిల్ స్వతంత్ర చైర్మన్ ► 1984 నుంచి 1990 దాకా ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రిసోర్సెస్ అధ్యక్షుడు ► 1982 నుంచి 1988 దాకా ఫిలిప్పీన్స్‌లోని ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ జనరల్ ► 1989 నుంచి 1996 దాకా వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్(ఇండియా) అధ్యక్షుడు ► ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐసీఏఆర్) డైరెక్టర్ జనరల్ వరించిన అవార్డులు ► 1967లో పద్మశ్రీ ► 1971లో రామన్ మెగసెసే ► 1972లో పద్మభూషణ్ ► 1987లో వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ► 1989లో పద్మవిభూషణ్ ► ప్రపంచవ్యాప్తంగా వివిధ యూనివర్సిటీల నుంచి 84 గౌరవ డాక్టరేట్లు మాజీ ప్రధాని చౌదరీ చరణ్ సింగ్ ప్రస్థానం... జమిండారీ విధానం రద్దు అయిన తరువాత అప్పటికి వాస్తవంగా భూమిని సాగుచేస్తూ ఉన్న కోట్లాది మంది కౌలుదారులకు, గ్రామీణ పేదలకు భూమిపైన హక్కు కల్గించిన రైతు బాంధవుడు చరణ్‌సింగ్. భారతీయ రైతాంగ సమస్యసల పరిష్కారంలో అద్వితీయ పాత్ర పోషించిన రైతుజన బాంధవుడు చౌదరి చరణ్‌సింగ్. జిల్లా స్థాయి నుంచి ప్రధానమంత్రి స్థాయికి ఎదిగిన క్రమంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి రైతు సంక్షేమానికి తుది వరకూ చిత్తశుద్ధితో ప్రయత్నించిన వారిలో అగ్రగణ్యులు చరణ్ సింగ్. సహకార వ్యవసాయం భారతీయ వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలో పడవేస్తుందన్న అభిప్రాయంతో, జవహర్లాల్ నెహ్రూ విధానాలనే చరణ్‌దిక్కరించిన ధీరుడు 1902లో డిసెంబర్ 23న పశ్చిమ యూపీలో మీరట్ జిల్లాలో భడోల్ అనే చిన్న గ్రామంలో మధ్య తరగతి రైతు కుటుంబంలో జన్మించిన చరణ్‌సింగ్.. 1923లో సైన్స్‌లో డిగ్రీని పొంది.. 1925లో ఆగ్రా యూనివర్శిటీ నుండి ఎంఏ, ఎంఎల్ పట్టాలను పొందారు. వృత్తిపరంగానే కాక గ్రామీణ ప్రజల సమస్యలను ప్రత్యేకంగా వ్యవసాయదారుల కష్టసుఖాలను క్షుణ్ణంగా అవగాహన చేసుకుని గ్రామీణ ప్రజానీకంతో మమేకం అయ్యేవారు. 1937-1974 వరకూ శాసనసభ్యుడిగా వరుసుగా ఎన్నిక అవుతూ వచ్చారు. యూపీ రాష్ట్రానికి రెండుసార్లు సీఎంగా, కేంద్రంలో జనతా ప్రభుత్వంలో ఆర్థికమంత్రి, ఉప ప్రధాని పదవులను నిర్వహించారు. 1979లో ప్రధాని అయిన చరణ్ సింగ్ 170 రోజులకే ఆ పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది. 1987, మే 29వ తేదీన ఆయన అసువులు బాశారు. -
వ్యవసాయ రంగ మేరు నగం
ప్రొఫెసర్ ఎం.ఎస్.స్వామినాథన్ కొన్ని రోజుల కిందట (సెప్టెంబర్ 28) మనకు దూరమయ్యారు. వ్యవసాయ రంగాన్ని విప్లవాత్మక మలుపు తిప్పిన ఓ దార్శనికుడిని మన దేశం కోల్పోయింది. భారతదేశానికి ఆ దిగ్గజం చేసిన సేవలు చరిత్రలో సువర్ణాక్షర లిఖితం. మాతృభూమిని అమితంగా ప్రేమించే స్వామినాథన్ మన దేశం సదా సుభిక్షంగా ఉండాలనీ, మన రైతులోకం సౌభాగ్యంతో వర్ధిల్లాలనీ ఆకాంక్షించారు. ఒక తెలివైన విద్యార్థిగా తన ఉజ్వల భవిష్యత్తుకు బాటవేసుకునే వీలున్నా 1943 నాటి బెంగాల్ క్షామం ఆయనను చలింపజేసింది. ఆ రోజుల్లో ఎంతగా ప్రభావితులయ్యారంటే– ఆరు నూరైనా వ్యవసాయ రంగమే తన భవిష్యత్తుగా ఆయన తిరుగులేని నిర్ణయం తీసుకున్నారు. వ్యవసాయ శాస్త్రంలో చదువు ముగించిన స్వామినాథన్‌కు తొలినాళ్లలోనే ప్రపంచ ప్రసిద్ధ వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ నార్మన్ బోర్లాగ్‌తో పరిచయం ఏర్పడింది. నాటి నుంచీ పూర్తిగా ఆయన అడుగుజాడల్లో నడుస్తూ పరిశోధనలను ముందుకు తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో 1950 లోనే అమెరికాలో అధ్యాపకుడిగా ఆయనకు అవకాశం వచ్చింది. కానీ, జన్మభూమి సేవలో తరించడమే తన ధ్యేయమంటూ దాన్ని తిరస్కరించారు. పెను సవాళ్లతో నిండిన అప్పటి పరిస్థితుల్లో... స్వామినాథన్ మన దేశాన్ని ఆత్మవిశ్వాసంతో స్వావలంబన వైపు నడిపించడాన్ని ఒకసారి ఊహించుకోవాల్సిందిగా కోరుతున్నాను. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత తొలి రెండు దశాబ్దాల్లో మనకు ఎదురైన సవాళ్లలో ఆహార కొరత ప్రధానమైనది. 1960వ దశకం తొలినాళ్లలో భారతదేశం కరువు కాటకాలు కమ్ముకుని అల్లాడుతోంది. అటువంటి గడ్డు పరిస్థితుల నడుమ స్వామినాథన్ మొక్కవోని పట్టుదల, నిబద్ధత, ముందుచూపుతో ఉజ్వల వ్యవసాయ శకానికి నాంది పలికారు. వ్యవసాయం రంగంలో, ముఖ్యంగా గోధుమ సాగు వంటి నిర్దిష్ట ఆహార పంటల సమృద్ధి దిశగా మార్గదర్శకుడై నిలిచారు. తద్వారా ఆహార కొరతతో అల్లాడిన భారత్ స్వయం సమృద్ధ దేశంగా రూపొందింది. వ్యవసాయ రంగంలో దేశం సాధించిన ఈ అద్భుత విజయమే ఆయనకు ‘భారత హరిత విప్లవ పితామహుడు’ బిరుదును ఆర్జించి పెట్టింది. ‘ఏదైనా సాధించగలం’ అనే భారత ఆత్మస్థైర్యానికి హరిత విప్లవం ఒక సమగ్ర ఉదాహరణగా నిలిచింది. మనకు లక్ష సవాళ్లున్నా, ఆవిష్కరణల ఆలంబనగా వాటిని అధిగమించగల పది లక్షల మేధావుల అండ ఉన్నదని రుజువైంది. హరిత విప్లవం శ్రీకారం చుట్టుకున్న ఐదు దశాబ్దాల తర్వాత నేడు భారత వ్యవసాయ రంగం అత్యధునాతనం, ప్రగతిశీలమైనదిగా మారిందంటే కారణం స్వామినాథన్ వేసిన పునాదులేననే వాస్తవాన్ని మరువలేం. దేశ ఆహార కొరతను అధిగమించడంలో విజయం తర్వాత, ఏళ్ల తరబడి బంగాళాదుంప పంటను దెబ్బతీస్తున్న పరాన్నజీవుల ప్రభావాన్ని అరికట్టే దిశగా ఆయన పరిశోధన చేపట్టి సఫలమయ్యారు. అంతేకాకుండా ఈ పంట చలి వాతావరణాన్ని కూడా తట్టుకోగలిగింది. ఇక ప్రపంచం నేడు చిరుధాన్యాలు లేదా ‘శ్రీఅన్న’ను అద్భుత ఆహార ధాన్యాలుగా పరిగణిస్తోంది. స్వామినాథన్ 1990లలోనే చిరుధాన్యాలపై చర్చను ముమ్మరం చేయడమేగాక వాటి సాగును ఇతోధికంగా ప్రోత్సహించారు. స్వామినాథన్‌తో నాకు వ్యక్తిగత సంబంధాలు ఉండేవి. 2001లో నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయనతో పరిచయం ఏర్పడింది. ఆ రోజుల్లో గుజరాత్ వ్యవసాయపరంగా పెద్దగా నైపుణ్యంగల రాష్ట్రం కాదు. దీనికితోడు వరుస కరువులు, తుపానులు, భూకంపం వంటివి రాష్ట్ర ప్రగతిని దెబ్బతీశాయి. ఈ నేపథ్యంలో మేం ప్రారంభించిన అనేక కార్యక్రమాలలో భూసార కార్డుల పథకం ఒకటి. ఇది భూసారాన్ని చక్కగా అర్థం చేసుకోవడంలో తోడ్పడింది. సమస్యలు తలెత్తినపుడు వాటిని సులువుగా పరిష్కరించడం సాధ్యమైంది. ఈ పథకం అమలు సమయంలోనే నేను స్వామినాథన్‌ను కలిశాను. ఆయన ఈ పథకాన్ని ఎంతగానో మెచ్చుకున్నారు. దాన్ని మరింత మెరుగుపరచడం కోసం విలువైన సూచనలు, సలహాలు ఇచ్చారు. ఏదైనా పథకంపై సందేహాలు వెలిబుచ్చేవారు స్వామినాథన్ మాటతో ఒక్కసారిగా ఏకాభిప్రాయానికి వచ్చేవారు. నేను ముఖ్యమంత్రిగా ఉన్నపుడు మాత్రమేగాక, ప్రధానమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టాక కూడా మా మధ్య సంబంధాలు కొనసాగాయి. 2016 నాటి అంతర్జాతీయ వ్యవసాయ–జీవవైవిధ్య మహాసభలలో ఆయనను కలిశాను. మరుసటేడాది 2017లో ఆయన రెండు భాగాలుగా రాసిన పుస్తకాన్ని నేనే ఆవిష్కరించాను. ప్రపంచాన్ని పరస్పరం అనుసంధానించే సూదితో ‘తిరుక్కురళ్’లోని ఒక ద్విపద రైతుల గురించి అభివర్ణిస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికీ అన్నదాత రైతే! ఈ సూక్తిని స్వామినాథన్ చక్కగా జీర్ణించుకున్నారు. కాబట్టే, ప్రజలు ఆయనను ‘వ్యవసాయ శాస్త్రవేత్త’గా పిలుస్తారు. కానీ, ఆయన ప్రతిభా వ్యుత్పత్తులు అంతకుమించినవని నా విశ్వాసం. ఆయన నిజమైన ‘రైతు శాస్త్రవేత్త’. ‘రైతుల శాస్త్రవేత్త’. ఆయన మెదడులో శాస్త్రవేత్త ఉంటే, హృదయంలో రైతు ఉన్నాడన్నది నా అభిప్రాయం. స్వామినాథన్ పరిశోధనలు కేవలం ఆయన విద్యా నైపుణ్యానికి పరిమితం కాదు; వాటి ప్రభావం ప్రయోగశాలల వెలుపలకు... వ్యవసాయ క్షేత్రాలు–పొలాలకు విస్తరించాయి. శాస్త్రీయ జ్ఞానం–ఆచరణాత్మక అనువర్తనాల మధ్య అంతరాన్ని ఆయన పనితీరు తగ్గించింది. వ్యవసాయం రంగంలో సుస్థిరత కోసం ఆయన సదా పాటుపడ్డారు. మానవ పురోగమనం, పర్యావరణ సుస్థిరత నడుమ సున్నిత సమతౌల్యాన్ని నొక్కిచెప్పారు. సన్న–చిన్నకారు రైతుల జీవితాలను మెరుగుపరచడం, ఆవిష్కరణల ఫలాలు వారికి అందించడంలో స్వామినాథన్ ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వడాన్ని నేను తప్పక ప్రస్తావించాలి. ముఖ్యంగా మహిళా రైతుల జీవితాల సాధికారతపై ఆయనెంతో శ్రద్ధాసక్తులు చూపారు. స్వామినాథన్‌లోని మరో విశిష్ట కోణం గురించి కూడా చెప్పాలి. ఆవిష్కరణల విషయంలోనే కాకుండా మార్గదర్శకత్వం వహించడంలోనూ ఆయనొక ఆదర్శమూర్తి. 1987లో ప్రతిష్ఠాత్మక ‘వరల్డ్ ఫుడ్ ప్రైజ్’ తొలి విజేతగా, దానికింద లభించిన సొమ్ముతో లాభాపేక్ష రహిత పరిశోధన కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ కేంద్రం ఇప్పటిదాకా వివిధ రంగాలలో విస్తృత, విశిష్ట పరిశోధనలు నిర్వహించింది. అలాగే ఆయన ఎందరో పరిశోధకులను తీర్చిదిద్దారు. అభ్యాసం, ఆవిష్కరణలపై ఎందరిలోనో శ్రద్ధాసక్తులు రగిలించారు. వేగంగా మారిపోతున్న నేటి ప్రపంచ పరిస్థితుల నడుమ విజ్ఞానం, మార్గదర్శకత్వం, ఆవిష్కరణలకు గల శక్తిసామర్థ్యాలను ఆయన జీవితం ప్రతిబింబిస్తుంది. ఆయన స్వయంగా ఓ సంస్థ స్థాపకులేగాక శక్తిమంతమైన పరిశోధనలు సాగిస్తున్న మరెన్నో సంస్థల స్థాపనకు ఊపిరి పోసినవారు. మనీలాలోని అంతర్జాతీయ వరి పరిశోధన కేంద్రం డైరెక్టర్‌గానూ ఆయన పనిచేయడం ఇందుకు నిదర్శనం. ఈ సంస్థ దక్షిణాసియా ప్రాంతీయ పరిశోధన కేంద్రం 2018లో వారణాసి నగరంలో ప్రారంభమైంది. డాక్టర్ స్వామినాథన్‌కు నివాళి అర్పిస్తున్న ఈ సందర్భంలో నేను మరో ద్విపదను ప్రస్తావించదలిచాను. ‘ప్రణాళిక రూపకర్త దృఢ మనస్కుడైతే... తానేది ఏ రీతిలో ఆకాంక్షించాడో ఆ రీతిలో దాన్ని సాధించగలడు’ అని ఈ ద్విపద చెబుతుంది. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయాలనీ, రైతులకు సేవలందించాలనీ చిరుప్రాయంలోనే నిర్ణయించుకున్న మహనీయుడాయన. ఆ విధంగానే వినూత్నంగా, ఆవిష్కరణాత్మకంగా, భావోద్వేగాలతో తాను నిర్దేశించుకున్న లక్ష్యం సాధించారు. వ్యవసాయ ఆవిష్కరణలు, సుస్థిరత దిశగా మన పయనంలో స్వామినాథన్ కృషి, పరిశ్రమ మనకు సదా స్ఫూర్తిదాయక మార్గనిర్దేశం చేస్తాయి. మనం కూడా ఆయనెంతో ప్రీతిగా అనుసరించిన సూత్రాల అమలుకు మన నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ ముందుకు సాగాలి. రైతుల సంక్షేమం ప్రాతిపదికగా శాస్త్రీయ ఆవిష్కరణల ఫలాలు మూలాలకు చేరేలా చూడాలి. తద్వారా భవిష్యత్తరాలను వృద్ధి, సుస్థిరత, సౌభాగ్యం వైపు ప్రోత్సహించాలి. - నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి -
ఆకలిపై పోరాటం జరిపిన శాస్త్రవేత్త
ఆయనను తరచుగా భారతదేశ హరిత విప్లవ పితామహుడిగా కీర్తిస్తారు. ఘనత వహించిన శాస్త్రవేత్త–వ్యవహర్త అయిన ప్రొఫెసర్ ఎం.ఎస్. స్వామినాథన్‌కు ‘వరల్డ్ ఫుడ్ ప్రైజ్’ తొలి అవార్డు వచ్చినప్పుడు, ఆయన్ని అప్పటి ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ కర్ట్ వాల్డ్‌హీమ్ ఒక లేఖలో ‘లివింగ్ లెజెండ్’ అని ప్రశంసించారు. స్వామినాథన్ మరణంతో ఒక శకం ముగిసింది. ‘ఓడ నుండి నోటికి’ అనే దుర్భర స్థితిలో ఉండిన దేశం ఆయన మార్గదర్శకత్వంలో వ్యవసాయంలో అద్భుతమైన విజయం సాధించింది. హరిత విప్లవ రూపశిల్పి అయినప్పటికీ ఎరువులు అధికంగా వాడితే కలిగే ప్రతికూల పరిణామాలు ఆయనకు తెలుసు. అలాగే రైతు క్షేమాన్నే ఎల్లవేళలా తలిచారు. ‘హరిత విప్లవ చరిత్ర వాస్తవానికి నాటి ప్రధాని ఇందిరా గాంధీతో కలిసి నేను చేసిన అరగంట కారు ప్రయాణంలో లిఖితమైంది,’ అని ఒకసారి స్వామినాథన్ నాతో చెప్పారు. వ్యవసాయ విప్లవానికి మద్దతు ఇవ్వడానికి కావలసిన రాజకీయ సంకల్పాన్ని పొందడం ఎంత కష్టమనే నా ప్రశ్నకు ఆయన జవాబిస్తూ, అప్పటి ప్రధాని ఇందిరా గాంధీతో కలిసి న్యూఢిల్లీలోని ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్‌గా పూసా కాంప్లెక్స్‌లో ఒక భవన ప్రారంభోత్సవానికి వెళ్లిన సంగతిని గుర్తు చేసుకున్నారు. దారిలో ప్రధాని ఆయన్ని అడిగారు: ‘‘స్వామీ, మీరు చెబుతున్న కొత్త గోధుమ పొట్టి వంగడాల రకాలకు నేను అనుమతిస్తాను. కానీ, కొన్నేళ్లలో ఒక కోటి టన్నుల మిగులు గోధుమలు చూపుతానని మీరు నాకు మాటివ్వగలరా? ఈ ‘బ్లడీ అమెరికన్ల’ హింస నాకు తప్పాలి.’’ స్వామినాథన్ మాటిచ్చారు, తర్వాతిదంతా చరిత్ర! ‘ఓడ నుండి నోటికి’ అనే దుర్భర స్థితిలో ఉండిన దేశం అనంతరం వ్యవసాయంలో అద్భుతమైన విజయం సాధించింది. భారతదేశాన్ని స్వయం సమృద్ధ దేశంగానే కాకుండా, నికర ఎగుమతిదారుగా మార్చింది. తగిన విధానాల ద్వారా మద్దతు లభ్యమైన హరిత విప్లవ వీరోచిత గాథ, ప్రధానంగా ఆకలి ఉచ్చు నుండి బయటపడే లక్ష్యంపై దృష్టి పెట్టింది. 1943 బెంగాల్ క్షామం తర్వాత కేవలం నాలుగు సంవత్సరాల లోపే స్వాతంత్య్రం రావడంతో, ఆకలిని అధిగమించే సవాలు అప్పటికి ఎదుర్కోలేదు. దశాబ్దాలుగా, ఉత్తర అమెరికా నుండి పీఎల్–480 పథకం కింద భారత్‌కు ఆహారం వస్తూ ఉండేది. 1970ల మధ్య నాటికి భారతదేశంలోని సగం జనాభా కబేళాలకు దారి తీస్తుందని కొందరు నిపుణులు అంచనా వేశారు. ఆ తర్వాత దేశ క్షుద్బాధపై పోరాడేందుకు స్వామినాథన్ చేసిన తీవ్రాతితీవ్ర ప్రయత్నం, ప్రపంచం వీక్షించిన అత్యంత ముఖ్యమైన ఆర్థిక పరిణామాలలో ఒకటిగా చరిత్రలో నిలిచిపోతుంది. ఇది దేశంలోని కోట్లాది ప్రజల జీవితాలను మార్చడమే కాకుండా, మిగిలిన ప్రపంచానికి కూడా స్ఫూర్తిగా నిలిచింది. హరిత విప్లవానికి రూపశిల్పిగా ఉన్నప్పటికి కూడా, స్వామినాథన్ కు వ్యవసాయంలో ఎరువులు అధికంగా వాడితే కలిగే ప్రతికూల పరిణామాల గురించి తెలుసు. ఆయన ప్రతి కోణంలోనూ దూరదృష్టి గలవారు. రాబోయే పరాజయం గురించి అనేకసార్లు ముందే హెచ్చరించారు. హరిత విప్లవం ప్రారంభమైన కొన్ని సంవత్సరాల తర్వాత, 1968 లోనే ఆయన ఇలా రాశారు: ‘‘నేల సారాన్ని, నేల నిర్మాణాన్ని పరిరక్షించకుండా భూమిపై తీవ్ర ఒత్తిడి కలిగించే సేద్యం చేయడం అంతిమంగా ఎడారుల పుట్టుకకు దారి తీస్తుంది. పురుగు మందులు, శిలీంద్ర (ఫంగస్) సంహారిణులు, కలుపు సంహారకాలను విచక్షణారహితంగా ఉపయోగించడం వలన ధాన్యాలు లేదా ఇతర తినదగిన భాగాలలో చేరే విషపూరిత అవశేషాల వల్ల క్యాన్సర్, ఇతర వ్యాధులకు సంబంధించిన ప్రతికూల మార్పులు సంభవించవచ్చు. భూగర్భ జలాలను అశాస్త్రీయంగా తోడిపారేయడం వల్ల ఈ అద్భుతమైన మూలధన వనరు వేగంగా తరిగిపోతుంది.’’ ఫిలిప్పీన్ ్సలోని అంతర్జాతీయ ధాన్య పరిశోధనా సంస్థ (ఐఆర్ఆర్ఐ) డైరెక్టర్ జనరల్‌గా స్వామినాథన్ ఉన్న సమయంలోనే ఇండోనేషియా అధ్యక్షుడు సుహార్తో నుంచి ఆయనకు అసాధారణ కబురు వచ్చింది. ఇండోనేషియా వరి పంటను బ్రౌన్ ప్లాంట్‌హాపర్ తెగులు నాశనం చేయడంతో, స్వామినాథన్ ఒక పరిష్కార మార్గాన్ని అందించాలని సుహార్తో కోరారు. ఇండోనేషియాకు వెళ్లిన శాస్త్రవేత్తల బృందాన్ని ఒకచోట చేర్చి, వారికి మరిన్ని శక్తిమంతమైన పురుగు మందులను ఉపయోగించాలని సూచించడానికి బదులుగా, వరి పంటపై ఉపయోగించే పురుగు మందులను నిషేధించాలని సుహార్తోకు స్వామినాథన్ సలహా ఇచ్చారు. అదే సమయంలో సమీకృత తెగులు నిర్వహణను ప్రారంభించాలని చెప్పారు. సుహార్తో అధ్యక్ష హోదాలో 57 పురుగు మందులను నిషేధించారు. ప్రొఫెసర్ స్వామినాథన్ టెక్నాలజీని గుడ్డిగా విశ్వసించేవారు కాదని చాలామందికి తెలియదు. జన్యుమార్పిడి పంటలకు వ్యతిరేకంగా ప్రచారం తారస్థాయికి చేరిన రోజుల్లో, బీటీ వంకాయల వాణిజ్యీకరణకు వ్యతిరేకంగా తాత్కాలిక నిషేధం విధించడంపై అప్పటి పర్యావరణ మంత్రి జైరాం రమేష్‌కు ఆయన ప్రతిస్పందన గమనించదగ్గది. చెన్నైలోని ఎం.ఎస్.స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్‌లో జరిగిన ఒక సమావేశంలో, ఆయన ఒక మునగకాయ స్లయిడ్‌ను ప్రదర్శించి, ఆ తర్వాత ‘విటమిన్ ఏ’ని కలిగిన జన్యుమార్పిడి బియ్యం ఆవశ్యకతపై ఒక ప్రశ్నను సంధించారు. అన్నంతోపాటు కలిపి వండిన మునగ ఆకులు మన సాంప్రదాయ ఆహారంలో భాగమనీ, ఇవి తమకు తాముగా విటమిన్ ఏ అందించగలవనీ ఆయన ఉద్దేశ్యం. స్వామినాథన్ పదే పదే లేవనెత్తిన పర్యావరణ పరమైన ఆందోళనలను విధాన నిర్ణేతలు తగిన విధంగా పరిష్కరించినట్లయితే, భారతీయ వ్యవసాయరంగం తీవ్రమైన సంక్షోభంలో చిక్కుకునేది కాదు. ఆయన అంతర్జాతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రాల కన్సార్టియంకు చెందిన మొక్కల జన్యు వనరులపై సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్‌కు కూడా నాయకత్వం వహించారు. నేను ఆ సమయంలో మేధా సంపత్తి హక్కులపై సీసీఐఏఆర్ సెంట్రల్ అడ్వైజరీ బోర్డు సభ్యుడిని. ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న మొక్కల జన్యు వనరులను ప్రైవేట్ కంపెనీలకు ఏకమొత్తంగా విక్రయించడాన్ని నిలువరించడంలో ఆయన పోషించిన పాత్ర గుర్తింపు పొందలేదు. ప్రపంచ జీవవైవిధ్యానికి చెందిన అపారమైన సంపదను ప్రైవేటీకరించడానికి జరిగిన ప్రతి ప్రయత్నాన్ని అడ్డుకోవడానికి ఆయన చేసిన తీవ్రమైన ప్రయత్నాలకు నేనే సాక్షిని. స్వామినాథన్ 2004లో జాతీయ రైతుల కమిషన్ చైర్పర్సన్ గా నియమితులైనప్పుడు, కమిషన్ నివేదికకి చెందిన జీరో డ్రాఫ్ట్‌ను రాయమని నన్ను ఆహ్వానించారు. ఆ తర్వాత దేశవ్యాప్తంగా దానిపై చర్చించి, తుది నిర్ణయం తీసుకోవాలి. రైతును కేంద్ర స్థానంలో ఉంచి, ఆపై అతని పరిస్థితిని ఎలా మెరుగుపరచవచ్చో చూడాలని నాకు ఆదేశం ఇచ్చారు. అయితే కేవలం రైతుపై మాత్రమే దృష్టి పెట్టడం కాకుండా, వివిధ వాటాదారులను కూడా అందులో చేర్చాలని తర్వాత చెప్పినప్పుడు, నేను క్షమాపణలు చెప్పాను. అయితే, ఆ మొత్తం కాలం రైతులకు ఆదాయ భద్రత కల్పించడంపై స్వామినాథన్ దృష్టి సారించారు. ఆహారోత్పత్తిని పెంచడంలో రైతులు పోషిస్తున్న పాత్రను ఆయన అభినందించేవారు. కానీ రైతు సమాజం దుఃస్థితికి ఎప్పుడూ బాధపడేవారు. 2004, 2006 మధ్య ఐదు భాగాలుగా సమర్పించిన స్వామినాథన్ కమిషన్ నివేదిక, భారతీయ వ్యవసాయంలో ఉత్పాదకత, లాభదాయకత, స్థిరత్వాన్ని పెంపొందించే లక్ష్యంతో రూపొందింది. ఇది దేశవ్యాప్తంగా రైతు సంఘాలకు కీలకమైన అంశంగా నిలుస్తోంది. సగటు(వెయిటెడ్ యావరేజ్) మీద 50 శాతం లాభం రైతులకు అందించాలన్న ఆయన సూచనను ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు పట్టించుకోలేదు. ఈ గొప్ప దార్శనికుడికి దేశం అర్పించే అత్యుత్తమ నివాళి ఏమిటంటే, స్వామినాథన్ కమిషన్ నివేదికను అక్షరమక్షరం అమలు చేయడమే! దేవీందర్ శర్మ వ్యాసకర్త ఆహార, వ్యవసాయ నిపుణులు -
పోలీసు లాంఛనాలతో స్వామినాథన్ అంత్యక్రియలు
సాక్షి, చెన్నై: హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ పారి్థవ దేహానికి శనివారం చెన్నైలో తమిళనాడు పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. వయో సంబంధ ఆరోగ్య సమస్యలతో స్వామినాథన్ (98) చెన్నైలో గురువారం కన్నుమూసిన విషయం తెలిసిందే. అదే రోజు రాత్రి తరమణిలోని ఎంఎస్ స్వామినాథన్ ఫౌండేషన్‌కు భౌతిక కాయాన్ని తరలించారు. శనివారం ఉదయం 11 గంటలకు తరమణి నుంచి ప్రత్యేక వాహనంలో పారి్థవదేహాన్ని బీసెంట్ నగర్ శ్మశాన వాటికకు తీసుకొచ్చారు. పోలీసులు మూడుసార్లు గాలిలోకి కాల్పులు జరిపిన అనంతరం స్వామినాథన్ పారి్థవ దేహాన్ని విద్యుత్ శ్మశాన వాటికలో దహనం చేశారు. -
ఇలా ఉన్నామంటే...అంతా ఆయన పుణ్యమే: ఆనంద్ మహీంద్ర నివాళులు
హరిత విప్లవ పితామహుడు, దిగ్గజ వ్యవసాయ శాస్త్రవేత్త డా.ఎం.ఎస్ స్వామినాథన్ మృతిపై వ్యాపారవేత్త ఎం అండ్ ఎం అధినేత ఆనంద్ మహీంద్ర సంతాపం ప్రకటించారు. ఈ రోజు భారతదేశంలో ఆహార భద్రత ఉందీ అంటే ఆయన పుణ్యమే.. దానికి మన అందరమూ రుణపడి ఉండాలి అంటూ ఆయనకు ఘన నివాళులర్పించారు. ఆయనతో కంపెనీకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. 2011లో మహీంద్రా సమృద్ధి అవార్డ్స్‌లో ఇయర్ అవార్డలు సందర్బంగా వ్యవసాయంతో సంస్థకున్న లోతైన సంబంధాల దృష్ట్యా, హరిత విప్లవ సారధిగా ఆయన అందించిన సేవలకు అగ్రి-ఐకాన్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో సత్కరించుకున్నాం. అదే రోజు డిన్నర్లో స్వామినాథన్ గారితో ముచ్చటించడం తన అద్భుత జ్ఞాపకాలలో ఒకటి అని వెల్లడించారు. అలాగే 2019లో, బలహీనంగా ఉన్నప్పటికీ, తమ కోసం ఒక వీడియో రికార్డు చేసి పంపించారంటూ గుర్తుచేసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా పోస్ట్ చేశారు. వ్యవసాయంలో అయనకున్న అపారమైన జ్ఞానం, వ్యవసాయం పట్ల మక్కువ 1.4 బిలియన్ల భారతీయుల జీవితాలను మరింత సురక్షితం చేసింది. కానీ ఆయన ఏ లోకాన ఉన్నా, ఆయన చుట్టూ ఉన్నపొలాలు మరింత సారవంతంగా ఉంటాయంటూ నివాళులర్పించారు. ఆయనకు భారత రత్న ఇవ్వాలి! దీంతో నెటిజన్లను కూడా ఎంఎస్ స్వామినాథన్‌కు నివాళలర్పించారు. నిజానికి దేశానికి ఆయనందించిన సేవలకు ప్రతిఫలంగా భారత రత్న ఇవ్వాలి.. ఇది మన దేశ పరిశోధకులు , శాస్త్రవేత్తల సంఘానికి పెద్ద ప్రోత్సాహాన్ని ఇస్తుందంటూ కమెంట్ చేశారు. కాగా 1925 ఆగస్టు 7న తమిళనాడులోని కుంభకోణంలో పుట్టిన మాంకోంబ్ సాంబశివన్ స్వామినాథన్ దేశీయ వ్యవసాయం రంగానికి ఎనలేని కృషి చేశారు. ముఖ్యంగా మేలు రకపు, ఎక్కువ దిగుబడినిచ్చే వరి వంగడాలను రైతులకు అందించింది. ముఖ్యంగా 1960- 70లలో భారతదేశం వ్యవసాయ రంగంలో ప్రవేశ పెట్టిన సమూల మార్పులు, అభివృద్ధికి ఆయనందించిన అపారమైన సేవలు, కృషి దేశీయ రైతుల జీవితాల్లో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలోనే భారతీయ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మశ్రీ, పద్మ భూషణ్, పద్మ విభూషణ్ అవార్డులు అందుకున్నారు. 98 ఏళ్ల వయసులో గురువారం సెప్టెంబరు 28న కన్నుమూసిన సంగతి తెలిసిందే. If we have food security in India today, then in large measure we owe it this man—M.S.Swaminathan, fondly known as the ‘Father of the Green Revolution.’ Given our deep links with agriculture, we presented him with the Agri-Icon of the year award at the Mahindra Samriddhi Awards… pic.twitter.com/1WAjQKt4CC — anand mahindra (@anandmahindra) September 30, 2023 -
తెలంగాణ వ్యవసాయ విధానాల్లో స్వామినాథన్ ముద్ర
సాక్షి, హైదరాబాద్: హరిత విప్లవ పితామహుడు డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ తెలంగాణ వ్యవసాయ విధానాల్లో తనదైన ముద్ర వేశారు. తెలంగాణ ప్రభుత్వం స్వామినాథన్ సిఫార్సులను దృష్టిలో ఉంచుకొని పలు నిర్ణయాలు చేసిందని వ్యవసాయశాఖ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. రైతులకు విరివిగా ప్రోత్సాహకాలు ఇవ్వాలనేది స్వామినాథన్ ఆలోచనల్లో ఒకటి. సీఎం కేసీఆర్ రైతుబంధుకు రూపకల్పన చేయడం రైతులకు అందిస్తున్న ప్రోత్సాహకాల్లో అత్యంత కీలకమైంది. రైతుబంధు, రైతుబీమా పథకాలను పలు సందర్భాల్లో స్వామినాథన్ ప్రశంసించారు. అంతేకాదు స్వామినాథన్ కీలక సిఫార్సుల్లో ఒకటైన కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) అమలు విషయంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ కేంద్రానికి పలు ప్రతిపాదనలు చేసింది. 2023–24 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ సీజన్లలో రైతులు పండించే పంటలకు ఎంతెంత ఎంఎస్పీ ఉండాలో స్వామినాథన్ సిఫార్సులను లెక్కలోకి తీసుకొని కేంద్రానికి ప్రతిపాదనలు పంపించింది. స్వామినాథన్ సిఫార్సులను పక్కన పెట్టిన కేంద్రం వివిధ పంటల సాగు ఖర్చుల ప్రకారం స్వామినాథన్ సిఫార్సులను అమలు చేయాలని తాము కోరితే కేంద్రం పెడచెవిన పెట్టిందని కూడా వ్యవసాయశాఖ వర్గాలు చెపుతున్నాయి. ఈ ప్రకారం రైతులు పండించిన పంటకు వచ్చేది నష్టమే తప్ప లాభం లేదని అంటున్నాయి. ఉదాహరణకు సీఏసీపీకి రాష్ట్ర వ్యవసాయశాఖ పంపిన నివేదికల ప్రకారం తెలంగాణలో క్వింటా వరి సాధారణ (కామన్) రకం ధాన్యానికి రూ.3,300, ఏ గ్రేడ్ ధాన్యం పండించాలంటే రూ. 3,400, పత్తికి రూ. 11 వేలు, మొక్కజొన్నకు రూ.2 వేలు, సోయా పంటకు రూ. 4,500 రైతు గతేడాది ఖర్చు చేశారు. ఈ ఖర్చులకు స్వామినాథన్ సిఫార్సుల ప్రకారం 50 శాతం అదనంగా కలపాలని రాష్ట్రం సూచించింది. ఆ ప్రకారం మద్దతు ధరలను ఖరారు చేయాలని కోరింది. ఉదాహరణకు పత్తి క్వింటాకు రూ. 11 వేలు ఖర్చు అయితే, స్వామినాధన్ సిఫార్సుల ప్రకారం అందులో 50 శాతం కలపాలి. ఆ ప్రకారం మద్దతు ధరగా రూ. 16,500 ప్రకటించాలని రాష్ట్రం కేంద్రానికి ప్రతిపాదించింది. కానీ కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించినట్లు ఎంఎస్పీ ఖరారు చేయలేదు. స్వామినాథన్ సిఫార్సులను పక్కన పెట్టినా వాస్తవ సాగు ఖర్చు ప్రకారమైనా మద్దతు ధర ప్రకటించలేదన్న విమర్శలు ఉన్నాయి. -
MS Swaminathan: ఆకలి లేని సమాజమే ఆయన కల
దేశానికి స్వాతంత్య్రం వచ్చిన(1947) తర్వాత దేశంలో వ్యవసాయ రంగం నిస్తేజంగా మారింది. బ్రిటిష్ వలస పాలనలో ఈ రంగంలో అభివృద్ధి నిలిచిపోయింది. వనరులు లేవు, ఆధునిక విధానాలు లేవు. తిండి గింజలకు కటకటలాడే పరిస్థితి. గోధుమలు, బియ్యం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటే తప్ప ప్రజలకు నాలుగు మెతుకులు అందించలేని దురవస్థ ఉండేది. ఇలాంటి తరుణంలో స్వామినాథన్ రంగ ప్రవేశం వేశారు. హరిత విప్లవానికి బీజం చేశారు. మొదట పంజాబ్, హరియాణా, పశి్చమ ఉత్తరప్రదేశ్‌లో ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడంపై దృష్టి పెట్టారు. రైతులకు నాణ్యమైన, అధిక దిగుబడినిచ్చే వంగడాలు సరఫరా చేశారు. ప్రభుత్వ సాయంతో తగిన సాగు నీటి వసతులు కలి్పంచారు. ఎరువులు అందించారు. కొద్ది కాలంలోనే సత్ఫలితాలు రావడం మొదలైంది. 1947లో దేశంలో గోధుమల ఉత్పత్తి ఏటా 60 లక్షల టన్నులు ఉండేది. 1962 నాటికి అది కోటి టన్నులకు చేరింది. 1964 నుంచి 1968 దాకా వార్షిక గోధుమల ఉత్పత్తి కోటి టన్నుల నుంచి 1.70 కోట్ల టన్నులకు ఎగబాకింది. దాంతో దేశ ప్రజల్లో ఆత్మవిశ్వాసం ఇనుమడించింది. మనకు అవసరమైన ఆహారాన్ని మనమే పండించుకోగలమన్న నమ్మకం పెరిగింది. గోధుమల తర్వాత స్వామినాథన్ నూతన వరి వంగడాలపై తన పరిశోధనలను కేంద్రీకరించారు. అమెరికాతోపాటు ఐరోపా దేశాల్లో విద్యాసంస్థలతో కలిసి పనిచేశారు. 1954లో కటక్‌లోని సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో చేరారు. నూతన వరి వంగడాలను సృష్టించారు. దేశీయ రకాలను సంకరీకరించి, కొత్త వంగడాలను అభివృద్ధి చేశారు. స్వామినాథన్ పలువురు మాజీ ప్రధానమంత్రులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కలిసి పనిచేశారు. హరిత విప్లవాన్ని విజయంతం చేయడానికి శ్రమించారు. గోధుమ వంగడాల అభివృద్ధి కోసం ప్రముఖ అమెరికా శాస్త్రవేత్త నార్మన్ బోర్లాగ్తోనూ స్వామినాథన్ కలిసి పనిచేశారు. సుస్థిర ఆహార భద్రత విషయంలో ప్రపంచ నాయకుడిగా గుర్తింపు పొందారు. సివిల్ సరీ్వసు వదులుకొని వ్యవసాయం వైపు.. మాన్‌కోంబు సాంబశివన్ స్వామినాథ్ 1925 ఆగస్టు 7న తమిళనాడు రాష్ట్రంలో కావేరి డెల్టా ప్రాంతంలోని కుంభకోణం పట్టణంలో జని్మంచారు. ఆయన తండ్రి డాక్టర్ ఎం.కె.సాంబశివన్ వైద్యుడు. తల్లి పార్వతీ తంగమ్మల్ గృహిణి. 11వ ఏట తండ్రిని కోల్పోయారు. తన మామయ్య సంరక్షణలో పెరిగిన స్వామినాథన్ కుంభకోణంలో మెట్రిక్యులేషన్, త్రివేండ్రంలో జంతుశాస్త్రంలో డిగ్రీ చేశారు. తర్వాత కోయంబత్తూరు అగ్రికల్చరల్ కాలేజీ నుంచి అండర్గ్రాడ్యుయేట్ డిగ్రీ సాధించారు. ఢిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధన సంస్థలో పీజీ పూర్తి చేశారు. యునెస్కో ఫెలోషిప్తో నెదర్లాండ్స్‌లోని అగ్రికల్చరల్ యూనివర్సిటీలో చేరి, బంగాళదుంప జన్యు పరిణామంపై అధ్యయనం చేశారు. వ్యవసాయ శాస్త్రవేత్తగా, జన్యు శాస్త్రవేత్తగా ఎదిగి, కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో చేరారు. స్వామినాథన్ తొలుత సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. కానీ, తండ్రి బాటలో వైద్య వృత్తిలో అడుగుపెట్టాలని భావించారు. అయితే, అప్పట్లో ఆకలి చావులను చలించిపోయారు. వ్యవసాయ పరిశోధనా రంగంలో అడుగుపెట్టారు. ఆకలి లేని సమాజాన్ని కలగన్నారు. ప్రజల ఆకలి తీర్చడమే కాదు, పౌష్టికాహారం అందించాలని సంకలి్పంచారు. కరువు పరిస్థితులు చూసి.. వ్యవసాయ రంగాన్ని ఎంచుకోవడానికి కారణాలను స్వామినాథన్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘1942–43లో బెంగాల్లో భయంకరమైన కరువు సంభవించింది. తిండి లేక దాదాపు 30 లక్షల మంది చనిపోయారు. దేశం కోసం నేనేమీ చేయలేనా? అని ఆలోచించా. ప్రజల ఆకలి బాధలు తీర్చాలంటే వ్యవసాయ రంగమే సరైందని నిర్ణయానికొచ్చా. మెడికల్ కాలేజీకి వెళ్లడానికి బదులు కోయంబత్తూరులో వ్యవసాయ కళాశాలలకు చేరిపోయా. వ్యవసాయ పరిశోధనలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టా. ఎక్కువ మందికి ఆహారం అందించాలంటే అధిక దిగుబడినిచ్చే వంగడాలు కావాలి. అందుకే జెనెటిక్స్, బ్రీడింగ్‌పై పరిశోధనలు చేశా. కరువు పరిస్థితులను తట్టుకొని అధిక దిగుబడినిచ్చే గోధుమ, వరి వంగడాలను సృష్టించా. వీటితో రైతులు లాభం పొందారు. ప్రజలకు తగినంత ఆహారం దొరికింది’ అని స్వామినాథన్ పేర్కొన్నారు. కనీస మద్దతు ధరపై కీలక సిఫార్సు స్వామినాథన్ 2004 నుంచి 2006 దాకా ‘నేషనల్ కమిషన్ ఆన్ ఫార్మర్స్’ అధినేతగా వ్యవహరించారు. పంటలకు కనీస మద్దతు ధరపై ప్రభుత్వానికి విలువైన ప్రతిపాదనలు చేశారు. పంటల ఉత్పత్తి వ్యయం కంటే కనీసం 50 శాతాన్ని కనీస మద్దతు ధరగా నిర్ణయించాలని సూచించారు. ఎన్నో పదవులు కొంతకాలం కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో పనిచేసిన స్వామినాథన్ 1954లో మళ్లీ భారత్‌లో అడుగు పెట్టారు. ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో శాస్త్రవేత్తగా పరిశోధనలపై దృష్టి పెట్టారు. 1972–79లో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్‌గా వ్యవహరించారు. 1979లో కేంద్ర ప్రభుత్వం ఆయనను వ్యవసాయ శాఖ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. 2007 నుంచి 2013 దాకా రాజ్యసభలో నామినేట్ ఎంపీగా సేవలను అందించారు. స్వామినాథన్ దేశ విదేశాల్లో ఎన్నో ప్రఖ్యాత సంస్థలకు నాయకత్వం వహించారు. ► 1981 నుంచి 1985 దాకా ఫుడ్ అండ్ అగ్రిక ల్చరల్ ఆర్గనైజేషన్ కౌన్సిల్ స్వతంత్ర చైర్మన్ ► 1984 నుంచి 1990 దాకా ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ ద కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రిసోర్సెస్ అధ్యక్షుడు ► 1982 నుంచి 1988 దాకా ఫిలిప్పీన్స్‌లోని ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ జనరల్ ► 1989 నుంచి 1996 దాకా వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్(ఇండియా) అధ్యక్షుడు ► ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐసీఏఆర్) డైరెక్టర్ జనరల్ వరించిన అవార్డులు ► 1967లో పద్మశ్రీ ► 1971లో రామన్ మెగసెసే ► 1972లో పద్మభూషణ్ ► 1987లో వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ► 1989లో పద్మవిభూషణ్ ► ప్రపంచవ్యాప్తంగా వివిధ యూనివర్సిటీల నుంచి 84 గౌరవ డాక్టరేట్లు నేల సారాన్ని కాపాడుకోకపోతే ఎడారే హరిత విప్లవం వల్ల లాభాలే కాదు, నష్టాలూ ఉన్నాయన్న విమర్శలు వెల్లువెత్తాయి. నూతన వంగడాలతో సంపన్న రైతులకే లబ్ధి చేకూరుతోందన్న వాదనలు వినిపించాయి. వీటితో నేల సారం దెబ్బతింటోందని, సంప్రదాయ దేశీయ వంగడాలు కనుమరుగైపోతున్నాయని నిపుణులు హెచ్చరించారు. పురుగు మందులు, ఎరువుల వాడకం మితిమీరుతుండడంపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. హరిత విప్లవం ప్రతికూలతలను స్వామినాథన్ 1968లోనే గుర్తించారు. ఆధునిక వంగడాలతోపాటు సంప్రదాయ వంగడాల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలని రైతులకు సూచించారు. నేల సారాన్ని కాపాడుకోకుండా విచ్చలవిడిగా పంటలు సాగుచేస్తే పొలాలు ఎడారులవుతాయని చెప్పారు. రసాయనిక ఎరువులు, పురుగు మందుల వాడకంపై నియంత్రణ ఉండాలన్నారు. అంతేకాకుండా భూగర్భ జలాల పరిరక్షణ ఆవశ్యకతను వివరించారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
వ్యవసాయ రంగం పెద్ద దిక్కును కోల్పోయింది
సాక్షి, హైదరాబాద్: దేశంలో హరిత విప్లవ పితామహుడు, ప్రపంచ ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత, పద్మ విభూషణ్ డాక్టర్ ఎం.ఎస్ స్వామినాథన్ మృతి పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. ఆయన మరణంతో దేశ వ్యవసాయ రంగం పెద్ద దిక్కును కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ ప్రజల ప్రధాన ఆహార వనరులైన వరి, గోధుమ పంటలపై స్వామినాథన్ చేసిన అద్భుతమైన ప్రయోగాలతో భారతదేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగి హరిత విప్లవాన్ని సాధించిందని కేసీఆర్ తెలిపారు. సాంప్రదాయ పద్ధతిలో సాగుతున్న దేశీయ వ్యవసాయాన్ని స్వామినాథన్ వినూత్న పద్ధతుల్లో గుణాత్మక దశకు చేర్చారని కొనియాడారు. ఆహారాభివృద్ధిలో భారత్ స్వయం సమృద్ధి సాధించిందంటే అది ఎంఎస్ స్వామినాథన్ కృషితోనే సాధ్యమైందన్నారు. దేశంలో రాష్ట్రాల వారీగా ప్రజలు పండిస్తున్న పంటలపై విస్తృత పరిశోధనలు చేసిన ఆయన ప్రతి భారత రైతు హృదయంలో స్థిరస్థాయిగా నిలిచిపోతారని సీఎం పేర్కొన్నారు. తెలంగాణ వ్యవసాయాభివృద్ధిని ప్రశంసించారు: మంత్రులు నిరంజన్‌రెడ్డి, హరీశ్‌రావు స్వామినాథన్ మరణం తీరని లోటుని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ఒక ప్రకటనలో సంతాపం వ్యక్తం చేశారు. ఇటీవల తాము చెన్నై వెళ్లి ఆయన్ను కలిసినప్పుడు తెలంగాణ వ్యవసాయాభివృద్ధిని ప్రశంసించారని గుర్తు చేశారు. ఎంఎస్ స్వామినాథన్ మృతి బాధాకరమని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు విచారం వెలిబుచ్చారు. ఆయన మరణం పరిశోధన రంగంతోపాటు యావత్ దేశ వ్యవసాయ రంగానికి తీరని లోటన్నారు. వ్యవసాయ పరిశోధనలకు మార్గదర్శి : కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి దేశ వ్యవసాయరంగంలో జరిగే పరిశోధలనకు ఓ మార్గదర్శిగా హరిత విప్లవ పితామహుడు డా.ఎంఎస్ స్వామినాథన్ నిలిచారని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి నివాళులర్పిం చారు. స్వామినాథన్ మృతిపట్ల ఓ ప్రకటనలో తీవ్రవిచారం వ్యక్తం చేశారు. ఎంఎస్ స్వామినాథన్ మరణం వ్యవసాయ రంగానికి తీరని లోటని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, పార్టీ తమిళనాడు సహ ఇన్చార్జి పొంగులేటి సుధాకరరెడ్డి వేర్వేరు ప్రకటనల్లో సంతాపం తెలిపారు. హరియాణా గవర్నర్ దత్తాత్రేయ సంతాపం ఎంఎస్ స్వామినాథన్ మృతి పట్ల హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ తమ ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. దేశ వ్యవసాయ రంగంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టి, వ్యవసాయ రంగంలో అభివృద్ధికి ఆయన ఎన్నో సేవలు అందించి తన పరిశోధనలకు దేశ అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు అందుకున్నారని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. భారత్‌ను వ్యవసాయరంగంలో ప్రపంచశక్తిగా డా.స్వామినాథన్ తీర్చిదిద్దారని మాజీ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ శ్రద్ధాంజలి ఘటించారు. దేశానికి తీరనిలోటు: పీసీసీ చీఫ్ రేవంత్ వ్యవసాయ అభివృద్ధి, రైతు సంక్షేమానికి నిరంతరం శ్రమించిన ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ మృతి అత్యంత బాధాకరమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సంతాపం ప్రకటించారు. దేశంలో మేలైన వరి వంగడాలను సృష్టి్టంచి.. హరిత విప్లవానికి నాంది పలికిన స్వామినాథన్ మరణం దేశంలో వ్యవసాయ రంగానికి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ ఆత్మగౌరవాన్ని కాపాడారు: మురళీ శర్మ, ఇక్రిశాట్ విశ్రాంత శాస్త్రవేత్త. ‘‘1960లలో మనం అమెరికా తదితర దేశాల నుంచి తిండిగింజలు దిగుమతి చేసుకునేవాళ్లం. ఇందుకు డబ్బులు చెల్లించినప్పటికీ మేము మీకు తిండి పెడుతున్నామన్నట్టుగా ఆయా దేశాలు మనల్ని చిన్నచూపు చూసేవి. అలాంటి పరిస్థితుల్లో డాక్టర్ స్వామినాథన్ దేశంలో హరిత విప్లవానికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం దేశ జనాభా 140 కోట్లకు పైగా ఉన్నప్పటికీ తిండి గింజల విషయంలో స్వయం సమృద్ధిని సాధించాం. ఒక రకంగా చెప్పాలంటే దేశం తన ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకు స్వామినాథన్ నేతృత్వంలో నడిచిన హరిత విప్లవం ఉపయోగపడింది’’అని ఇక్రిశాట్ విశ్రాంత శాస్త్రవేత్త మురళీశర్మ నివాళులర్పించారు. సాగుపై పూర్తి అవగాహన స్వామినాథన్‌కే సొంతం: జి.వి.రామాంజనేయులు ‘‘భారతీయ వ్యవసాయ రంగం బహుముఖీనతను అర్థం చేసుకునేందుకు డాక్టర్ స్వామినాథన్ నివేదికలు ఎంతో ఉపయోగపడతాయి. వ్యవసాయ శాస్త్రవేత్తల్లో సాగుకు సంబంధించిన సమగ్ర అవగాహన ఉన్న తొలి, చివరి వ్యక్తి కూడా డాక్టర్ స్వామినాథనే కావచ్చు.’’అని సెంటర్ ఫర్ సస్టెయినబుల్ అగ్రికల్చర్ వ్యవస్థాపకుడు జీవీ రామాంజనేయులు సంతాపం ప్రకటించారు. ఎం.ఎస్.స్వామినాథన్ భౌతికంగా లేకపోవచ్చు కానీ.. ఆయనిచ్చిన స్ఫూర్తి ఎప్పటికీ చెరిగిపోనిదని సీఎస్ఐఆర్ మాజీ డైరెక్టర్ జనరల్ రఘునాథ్ మషేల్కర్ పేర్కొన్నారు. వ్యవసాయరంగానికి తీరని లోటు: రైతు నేతలు వెంకట్, మల్లారెడ్డి ఎంఎస్పీ సాధన, ఆహార భద్రత చట్టం అమలు కోసం పోరాడడమే స్వామినాథన్‌కు అర్పించే నిజమైన నివాళి అని అఖిల భారత వ్యవసాయ కారి్మక సంఘం కార్యదర్శి బి.వెంకట్ పేర్కొన్నారు. స్వామినాధన్ హరిత విప్లవ మార్గదర్శకుడని అఖిల భారత కిసాన్ సభ సీనియర్ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి నివాళులర్పించారు. భూ సంస్కరణల అమలుకు కృషి చేశారు: తమ్మినేని స్వామినాథన్ మృతికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రగాఢ సంతాపం ప్రకటించారు. భూసంస్కరణల అమలుకు కృషి చేసిన ఆయన మరణం దేశానికి తీరని లోటని పేర్కొన్నారు. తెలంగాణను కొనియాడారు తెలంగాణలో వ్యవసాయరంగాభివృద్ధికి దిశగా రాష్ట్ర ప్రభుత్వ కార్యాచరణను ఎం ఎస్ స్వామినాథన్ పలుమార్లు కొనియాడిన విషయాలను, తనతో ఉన్న అనుబంధాన్ని సీఎం కేసీఆర్ గుర్తుచేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో రాష్ట్ర సచివాలయంలో ఆయనతో తాను సమావేశం కావడం మరిచిపోలేనని పేర్కొన్నారు. ఉచిత విద్యుత్, ఎత్తిపోతలతో సాగునీటి రంగాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వ కార్యాచరణను స్వామినాథన్ఎంతగానో ప్రశంసించారని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. వ్యవసాయ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యాచరణలో స్వామినాథన్ స్పూర్తి ఇమిడి ఉందని సీఎం తెలిపారు. వీలుచూసుకుని తెలంగాణ పర్యటనకు వస్తానని మాట ఇచ్చిన స్వామినాథన్ ఆ ఆకాంక్ష తీరకుండానే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం బాధను కలిగిస్తోందని విచారం వ్యక్తం చేశారు. ఆయన మన్ననలు పొందడం రైతుబిడ్డగా, ముఖ్యమంత్రిగా తనకెంతో గర్వకారణమంటూ స్వామినాథన్ కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. జీవితకాలం మొత్తం రైతుల సంక్షేమం కోసం పరితపించిన మహావ్యక్తి వ్యవసాయ శాస్త్రవేత్త ఎమ్మెస్ స్వామినాథన్ ఇక లేరు అని విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్ ఒక ప్రకటనలో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశంలో పంటల సమృద్ధి, ఆహార అభివృద్ధి, భద్రత, మహిళా రైతుల స్వయం సమృద్ధి కి విశేషంగా కృషి చేసిన స్వామినాథన్ మరణం పట్ల పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. కో ఫౌండర్..బ్రాండ్ అంబాసిడర్ ఇక్రిశాట్‌తో స్వామినాథన్‌కు అనుబంధం సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: దేశ హరితవిప్లవ పితామహుడు, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్‌తో సంగారెడ్డి జిల్లాలో ఉన్న అంతర్జాతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ(ఇక్రిశాట్)కు ప్రత్యేక అనుబంధముంది. 1972లో ఈ సంస్థ ఏర్పాటైంది. ఈ పరిశోధన సంస్థ స్థాపనలో స్వామినాథన్ కీలకపాత్ర పోషించారు. 1972 నుంచి 1980 వరకు ఆయన ఇక్రిశాట్ గవర్నింగ్ బోర్డ్ వైస్ చైర్మన్‌గా వ్యవహరించారు. అందరికీ పౌష్టికాహార భధ్రత కల్పించడమే లక్ష్యంగా ఉష్ణ మండల పాంత్రాల్లో సాగుకు యోగ్యంగా లేని భూముల్లో సైతం ఆహార పంటలు పండించేలా ఇక్రిశాట్ నూతన వంగడాలను అభివృద్ధి చేస్తోంది. ఈ సంస్థ మెట్ట పంటలపై, వాతావరణ మార్పుల ప్రభావంపై పరిశోధన చేస్తోంది. ప్రధానంగా జొన్న, వేరుశనగ, తృణధాన్యాల పంటలకు సంబంధించిన ఎన్నో వంగడాల ను అభివృద్ధి చేసింది. ప్రజల జీవన ప్రమాణాల పెంపు, పోషకాహార భద్రతను కల్పించడమే లక్ష్యంగా అంతర్జాతీయస్థాయిలో పరిశోధనలు చేస్తున్న ఇక్రిసాట్ 2013లో ప్రపంచవ్యాప్తంగా పలువురు ప్ర ముఖులను బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించుకుంది. బిల్‌గేట్స్, న్యూజిలాండ్ మాజీ ప్రధానమంత్రి జేమ్స్బొల్గర్, ఒలింపిక్ మెడలిస్ట్ సైనా నెహా్వల్, భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్‌కలాం తదితర ప్రముఖులతోపాటు స్వామినాథన్ కూడా ఇక్రిశాట్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. ‘‘వ్యవసాయం విఫలమైతే.. అన్ని రంగాలు విఫలమైనట్లే..’’అనే ఫ్రొఫెసర్ ఎం.ఎస్ స్వామినాథన్‌తో ఇక్రిశాట్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది. వ్యవసాయ రంగంపై చెరగని ముద్ర: ఇక్రిశాట్ వ్యవసాయ పరిశోధనల రంగంలో డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ చెరగని ముద్ర వేశారని, వ్యవసాయ రంగానికి ఆయన చేసిన సేవ ప్రపంచవ్యాప్తంగా ఎందరో శాస్త్రవేత్తలకు స్ఫూర్తినిచ్చిందని హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీ య మెట్ట ప్రాంతపంటల పరిశోధన కేంద్రం (ఇక్రిశాట్) తెలిపింది. ఇక్రిశాట్ సహ వ్యవస్థాపకుడుగా, 1972 – 80ల మధ్యకాలంలో సంసథ గవర్నింగ్ బాడీ ఉపాధ్యక్షులుగానూ డా క్టర్ స్వామినాథన్ పనిచేసిన విషయాన్ని గుర్తు చేసుకుంది. -
Father of Green Revolution: ఎం.ఎస్. స్వామినాథన్ కన్నుమూత
సాక్షి, చెన్నై: భారత హరిత విప్లవ పితామహుడు, ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త, పద్మవిభూషణ్ డాక్టర్ ఎం.ఎస్.స్వామినాథన్(98) అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. దేశంలో ఆకలితో అలమటించే అభాగ్యులు ఉండకూడదన్న లక్ష్యంతో జీవితాంతం పోరాటం సాగించిన మహా మనిషి తమిళనాడు రాజధాని చెన్నైలోని తన స్వగృహంలో గురువారం ఉదయం 11.15 గంటలకు శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. ఆయన కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు డాక్టర్ సౌమ్యా స్వామినాథన్, మధుర స్వామినాథన్, నిత్యా రాయ్ ఉన్నారు. భార్య మీనా స్వామినాథన్ గతంలోనే మృతిచెందారు. భారత్‌లో 1960వ దశకం నుంచి హరిత విప్లవానికి బాటలు వేసి, ఆహారం, పౌష్టికాహార భద్రత కోసం అలుపెరుగని కృషి చేసిన స్వామినాథన్‌ను ప్రతిష్టాత్మక పద్మవిభూషణ్, రామన్ మెగసెసే, మొట్టమొదటి వరల్డ్ ఫుడ్ ప్రైజ్ సహా ఎన్నెన్నో జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు వరించాయి. స్వామినాథన్ పారీ్థవదేహాన్ని చెన్నై తేనాంపేట రత్నానగర్‌లో ఉన్న నివాసం నుంచి గురువారం రాత్రి తరమణిలోని ఎం.ఎస్.స్వామినాథన్ ఫౌండేషన్‌కు తరలించారు. శుక్రవారం అప్తులు, ప్రముఖుల సందర్శనార్థం పారీ్థవ దేహాన్ని ఇక్కడే ఉంచుతారు. విదేశాల్లో ఉన్న కుమార్తె చెన్నైకి రావాల్సి ఉండడంతో శనివారం స్వామినాథన్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సన్నిహితులు చెప్పారు. ప్రధాని మోదీ దిగ్భ్రాంతి ఎం.ఎస్.స్వామినాథన్ మృతిపట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. దేశానికి ఆయన అందించిన సేవలను గుర్తుచేసుకున్నారు. మానవాళి కోసం భద్రమైన, ఆకలికి తావులేని భవిష్యత్తును అందించే దిశగా ప్రపంచాన్ని నడిపించడానికి మార్గదర్శిగా పనిచేశారని స్వామినాథన్‌పై రాష్ట్రపతి ముర్ము ప్రశంసల వర్షం కురిపించారు. ఘనమైన వారసత్వాన్ని మనకు వదిలి వెళ్లారని చెప్పారు. స్వామినాథన్ మరణం తనకు తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని ప్రధాని మోదీ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. మన దేశం సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన హరిత విప్లవానికి నాంది పలికారని, కోట్లాది మంది ఆకలి తీర్చారని, దేశంలో ఆహార భద్రతకు పునాది వేశారని కొనియాడారు. వ్యవసాయ రంగంలో స్వామినాథన్ కృషితో కోట్లాది మంది జీవితాలు మారాయని మోదీ గుర్తుచేశారు. మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు గురువారం స్వామినాథన్ పారీ్థవదేహానికి అంజలి ఘటించారు. ఆయన మరణం దేశానికి, రైతు ప్రపంచానికి తీరని లోటు అని పేర్కొన్నారు. స్వామినాథన్ మరణం పట్ల తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్.రవి, ముఖ్యమంత్రి స్టాలిన్, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, మాజీ ప్రధానమంత్రి హెచ్.డి.దేవెగౌడ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాం«దీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్, భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేశ్ తికాయత్ తదితరులు సంతాపం ప్రకటించారు. -
శిఖర సమానుడైన శాస్త్రవేత్త
భారతదేశ వ్యవసాయ రంగాన్ని తలుచుకోగానే స్ఫురించే మొదటిపేరు డాక్టర్ ఎం.ఎస్. స్వామినాథన్. వ్యవసాయంలో ఆధునిక విధానాలను ప్రవేశ పెట్టడం ద్వారా ఆహార భద్రతను పెంచి దేశానికి ఆయన హరిత విప్లవ పితామహులయ్యారు. ‘ఓడ నుంచి నోటికి’ అన్నట్టుగా ఉన్న కరువు పరిస్థితుల నుంచి, దేశాన్ని అన్నపూర్ణగా తీర్చిదిద్దడంలో ఆయన కృషి వెలగట్టలేనిది. అందుకు అనుగుణంగా ఎన్నో సంస్థల ఏర్పాటులో ఆయన కీలకపాత్ర పోషించారు. రైతుల జీవితాలను మెరుగు పరచడానికి చివరిదాకా పనిచేస్తూనే ఉన్నారు. అదే సమయంలో హరిత విప్లవ అనంతర దుష్ఫలితాలకు కూడా ఆయన బాధ్యత వహించాలన్న విమర్శలూ వచ్చాయి. ఏమైనా ఆయన లేకుండా భారతదేశ వ్యవసాయ రంగ మంచిచెడ్డలు లేవు. 1947 ఆగస్ట్ 16న అన్ని పత్రికల మొదటి పేజీలూ ప్రధాని నెహ్రూ ‘ట్రిస్ట్ విత్ డెస్టినీ’ ప్రసంగాన్ని కవర్ చేశాయి. రెండో పేజీలో రానున్న ఆహార సంక్షోభం గురించి ఎం.ఎస్. స్వామినాథన్ చేసిన హెచ్చరిక ఉంది. ఆహార భద్రత విషయంలో ఆయన దేశానికి మార్గదర్శనం చేశారు. – ప్రణవ్ ప్రతాప్ సింగ్, పొలిటికల్ కన్సల్టంట్ ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త డా. ఎం.ఎస్. స్వామినాథన్ గారు 98 సంవత్సరాల సంపూర్ణ జీవితం గడిపిన తర్వాత ఈ రోజు (సెప్టెంబర్ 28) చని పోయారు. భారత వ్యవసాయ రంగంలో అనేక కీలకమైన మలుపుల వెనుక అయన నిర్ణయాలు, ఆలోచనలు ఉన్నాయి. హరిత విప్లవం పేరుతో అధిక దిగుబడినిచ్చే వంగడాలు, రసాయనాలు, నీరు, మెషీన్లు వాడటం వంటివి తేవటంతో పాటు, వీటికి సహకారం అందించటానికి జాతీయ స్థాయిలో వ్యవసాయ విశ్వవిద్యాలయాలు, విస్తరణ వ్యవస్థ, రుణాలు అందించటానికి బ్యాంకుల జాతీయీకరణ, మద్దతు ధరలు, సేకరణ కోసం భారతీయ ఆహార సంస్థ, ఆహార భద్రత కోసం జాతీయ పంపిణీ వ్యవస్థ లాంటివి ఏర్పాటు చేయటంలో కీలక పాత్ర పోషించారు. భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి డైరెక్టర్ జనరల్, అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ డైరెక్టర్ వరకు అనేక కీలకమైన పదవులు కూడా అయన నిర్వహించారు. రైతుల హక్కుల కోసం... తర్వాతి కాలంలో జాతీయ రైతు కమిషన్ చైర్ పర్సన్‌గా – భారత వ్యవసాయ రంగం అభివృద్ధిని ఎంత దిగుబడులు పెంచాము అని కాకుండా, రైతుల ఆదాయం ఎంత పెంచాము అని ఆలోచించాలి అనీ, రైతులకు వచ్చే ధరలు ఉత్పత్తి ఖర్చులపై కనీసం యాభై శాతం ఉండాలి అనీ పేర్కొన్నారు. పార్లమెంట్ సభ్యులుగా ఉన్న సమయంలో వ్యవసాయ రంగంలో మహిళల ప్రాధాన్యం గుర్తించి, దానికి అనుగుణంగా విధానాలు ఉండాలి అని మహిళా రైతుల హక్కుల చట్టం ముసాయిదా తయారు చేసి పార్లమెంట్లో ప్రవేశ పెట్టారు. గ్రామాల్లోని ప్రజలు సొంతంగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితులు వచ్చినప్పుడే వ్యవసాయంలో మార్పులు వస్తాయన్న ఆలోచనతో గ్రామాల్లో క్లైమేట్ స్కూల్స్ లాంటివి స్థాపించడం జరిగింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయుల్లో వాతావరణంలో వస్తున్న మార్పుల ప్రభావం వ్యవసాయ రంగం మీద ఎలా ఉంటుంది, ఆ మార్పులను ఎదుర్కోవడానికి రైతులు ఏం చేయాల్సి ఉంటుంది, ప్రభుత్వ విధా నాలు ఎలా మారాల్సి ఉంటుంది అనే అంశాలపై పరిశోధన చేయడమే గాకుండా ఆ దిశగా ప్రభుత్వాలపై ఒత్తిడి తేగలిగారు. అయితే, వ్యవసాయ రంగంలో ఉన్న విభిన్న పరిస్థితులు, విభిన్న అవసరాలు, విభిన్న దృక్కోణాల మధ్యలో నిర్ణయాలు తీసుకునే విషయంలో ఎదురయ్యే అనేక వివాదాలు కూడా అయన చుట్టూ ఉన్నాయి. హరిత విప్లవం ద్వారా వచ్చిన దుష్ఫలితాలకు ఆయనే భాద్యులు అనీ, జాతీయ జీవ వైవిధ్యం కోల్పోవటం, విదేశాలకు తరలి పోవటంలో అయన పాత్ర ఉందనీ, అనేక ఆరోపణలు ఉన్నాయి. కానీ అయన జీవన ప్రయాణాన్ని దగ్గరగా చూసిన వాళ్ళు కాని, ఆయనతో ఒక్కసారి మాట్లాడిన వాళ్ళు కాని చెప్పే అనుభవాలు పూర్తిగా వేరుగా ఉంటాయి. తను కలిసిన ప్రతి వ్యక్తినీ పేరుతో గుర్తు పెట్టుకొని పలకరించే అలవాటు ఆయనకు ఉండేది. జాతీయ పరి శోధనా సంస్థలో ఆయన పని చేసినప్పుడు పొలంలో పనిచేసిన కూలీ లను... ఆ తర్వాత ఆయన జాతీయ పరిశోధనా మండలి డైరెక్టర్ జనరల్ అయినప్పుడు కూడా పేరుతో పలకరించేవాడని చెప్పేవారు. నేను భారతీయ పరిశోధనా సంస్థలో పీహెచ్డీ చేస్తున్న సమయంలో ఒక విద్యార్థి తన పరిశోధనా పత్రం కోసం ఆయనని ఇంటర్వ్యూ చేస్తూ – ‘నాయకత్వ లక్షణాలు ఎలా వుండాలి?’ అని అడిగితే, ‘ఎట్టి పరిస్థితులలో నైనా కోపం తెచ్చుకోకుండా ఉండటమే నాయకత్వ లక్షణం’ అని చెప్పారు. 2005లో జాతీయ నాలెడ్జ్ కమిషన్ ఉప కమిటిలో సభ్యునిగా ఆయనని కలవటం, చర్చించటం... ఆ తర్వాతి కాలంలో మేము సుస్థిర వ్యవసాయంపై చేసిన ప్రయోగాలు, ఫలితాలు, రైతులకు ఆదాయ భద్రత కల్పించాలి అనే విషయం మీద చేసిన సూచనల విషయంలోనూ అయన స్పందించి, తన ఆలోచనలు పంచుకోవటమే కాకుండా, వాటి గురించి రాసి సహకరించారు. విధానాలను మార్చేలా... జీవవైవిధ్యాన్ని కాపాడటం కోసం జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చేసిన ప్రయత్నాల వెనుక స్వామినాథన్ ప్రయత్నాలు ఉన్నాయి. జీవవైవిధ్య చట్టం, బయోడైవర్సిటీ ఇంటర్నేషనల్, నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ స్థాపనలో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు. మన హైదరాబాద్‌లోని ఇక్రిశాట్ సంస్థ ఏర్పాటు కూడా ఆయన ప్రయత్నాలతో జరిగినదే. భారత దేశంలో ప్రపంచ వాణిజ్య సంస్థ నిర్ణయాల మేరకు మేధా సంపత్తి హక్కుల గురించి చర్చలు జరిగి చట్టం చేసినప్పుడు,అందులో రైతులకు హక్కులు ఉండాలని పోరాడి, వాటిని కూడా చట్టంలోకి చేర్చేలా ప్రభుత్వాన్ని ఒప్పించారు. భారతదేశంలో అనేక ప్రాంతాల్లో రైతులు కాపాడుతూ వస్తున్న జీవ వైవిధ్యాన్ని డాక్యుమెంట్ చేసి, దానికి చట్టబద్ధమైన హక్కులు కల్పించే దిశగా తన స్వామినాథన్ ఫౌండేషన్ ద్వారా కృషి చేశారు. వ్యవసాయ సమస్యలపై, పరిష్కారాలపై ఆయన మాట్లాడినంత, రాసినంత ఏ ఇతర వ్యవసాయ శాస్త్రవేత్త కూడా ఈ రోజు వరకు చేయలేదు. ప్రభుత్వాలు చెప్పిందే చేయటం కాకుండా, ప్రభుత్వాలు ఏమి చేయాలో చెప్పి వారి చేత ఒప్పించి అనేక మార్పులు చేయటం అయన చేయగలిగారు. 1972లో జాతీయ వ్యవసాయ పరిశోధనా మండలి డైరెక్టర్ జనరల్‌గా నియమించబడిన ఆయన, 1979లో ప్రిన్సిపాల్ సెక్రటరీగా కూడా నియమించబడ్డారు. బహుశా అలాంటి గుర్తింపు పొందిన ఏకైక శాస్త్రవేత్త డా‘‘ స్వామినాథన్. ఇండియన్ పోలీస్ సర్వీస్‌కి ఎంపిక అయినా, వ్యవసాయ సమస్యలు పరిష్కరించాలని వ్యవసాయ రంగంలోకి రావటమే కాకుండా, జాతీయంగా, అంతర్జాతీయంగా అనేక సంస్థలను స్థాపించారు. సొంతంగా ఎం.ఎస్. స్వామినాథన్ ఫౌండేషన్ స్థాపించి అనేక కార్యక్రమాలు చేపట్టారు. తన సొంత ఆస్తిలో చాలా భాగం భూదాన ఉద్యమంలో ఇచ్చివేసిన మనిషి కూడా. ఆయన జీవితం ఎందరికో ప్రేరణ, స్ఫూర్తి. రైతుల తరఫున, వ్యవసాయ విద్యార్థులు, శాస్త్రవేత్తల తరఫునా ఆయనకు ఘన నివాళి. డా‘‘ జి.వి.రామాంజనేయులు వ్యాసకర్త వ్యవసాయ శాస్త్రవేత్త, కృష్ణ సుధా అకాడమీ ఫర్ ఆగ్రో ఎకాలజీ, సుస్థిర వ్యవసాయ కేంద్రం -
చెన్నైలో తుదిశ్వాస విడిచిన స్వామినాథన్
-
ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త MS స్వామినాథన్ కన్నుమూత
-
ఎంఎస్ స్వామినాథన్ కన్నుమూత
-
ఎంఎస్ స్వామినాథన్ మృతి పట్ల సీఎం జగన్ సంతాపం
సాక్షి, తాడేపల్లి: హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ మృతిపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ‘‘వ్యవసాయ శాస్త్రవేత్త అయిన స్వామినాథన్ గ్రామీణ రూపురేఖలను సమూలంగా మార్చారు. పద్మవిభూషణ్, మెగసెసె అవార్డు గ్రహీత ఎంఎస్ స్వామినాథన్ వ్యవసాయ రంగానికి ఆయన చేసిన కృషి అభినందనీయం. స్వామినాథన్ కృషి దేశాన్ని ఆహారోత్పత్తిలో బలోపేతం చేసి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను సుసంపన్నం చేసింది’’ అని సీఎం జగన్ ట్వీట్ చేశారు. భారత హరిత విప్లవ పితామహుడిగా ప్రఖ్యాతిగాంచిన ఎమ్.ఎస్ స్వామినాథన్(98) కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో పోరాడుతున్న ఆయన.. చెన్నైలో తుదిశ్వాస విడిచారు. ఆహారాభివృద్ధిలో భారత్ స్వయం సమృద్ధి సాధించేందుకు స్వామినాథన్ ఎనలేని సేవ చేశారు. దేశంలో ఆహార కొరతను ఎదుర్కొనడానికి మేలైన వరి వంగడాలను స్వామినాథన్ సృష్టించారు.1960 నుంచి 1970ల్లో స్వామినాథన్ చేసిన కృషి భారత వ్యవసాయ రంగాన్ని విప్లవాత్మకంగా మార్చింది. కరువు కోరల్లో చిక్కుకున్న భారత వ్యవసాయ రంగాన్ని స్వయం సమృద్ధివైపుకు మరలించారు. అధిక దిగుబడినిచ్చే గోధుమ, వరి వంగడాలను సృష్టించి వ్యవసాయ ఉత్పాదకతను అమాంతం పెంచారు. I am deeply saddened to hear of the demise of Dr MS Swaminathan garu, the father of India’s Green Revolution. His dedication and commitment to feeding the nation transformed agriculture in India. In current times, when the thrust needs to be on increasing production to meet… — YS Jagan Mohan Reddy (@ysjagan) September 28, 2023 -
MS Swaminathan: ఎమ్.ఎస్ స్వామినాథన్ కన్నుమూత
ఢిల్లీ: భారత వ్యవసాయ రంగంలో ఓ శకం ముగిసింది. భారత హరిత విప్లవ పితామహుడిగా ప్రఖ్యాతిగాంచిన ఎమ్.ఎస్ స్వామినాథన్(98) కన్నుమూశారు. గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో పోరాడుతున్న ఆయన.. చెన్నైలో తుదిశ్వాస విడిచారు. ఆహారాభివృద్ధిలో భారత్ స్వయం సమృద్ధి సాధించేందుకు స్వామినాథన్ ఎనలేని సేవ చేశారు. దేశంలో ఆహార కొరతను ఎదుర్కొనడానికి మేలైన వరి వంగడాలను స్వామినాథన్ సృష్టించారు.1960 నుంచి 1970ల్లో స్వామినాథన్ చేసిన కృషి భారత వ్యవసాయ రంగాన్ని విప్లవాత్మకంగా మార్చింది. కరువు కోరల్లో చిక్కుకున్న భారత వ్యవసాయ రంగాన్ని స్వయం సమృద్ధివైపుకు మరలించారు. అధిక దిగుబడినిచ్చే గోధుమ, వరి వంగడాలను సృష్టించి వ్యవసాయ ఉత్పాదకతను అమాంతం పెంచారు. వ్యవసాయ రంగంలో వినూత్న విధానాలతో స్థానిక పరిస్థితులపై లోతైన అవగాహనతో ఆధునిక శాస్త్రీయ పద్ధతులను మిళితం చేశారు స్వామినాథన్. దీంతో ఎంతో మంది తక్కువ ఆదాయ రైతులు దేశాభివృద్ధికి గణనీయంగా తోడ్పాటునిచ్చారు. స్వామినాథన్ చేసిన సేవలకు గాను 1987లో మొదటి వరల్డ్ ఫుడ్ ప్రైజ్‌ను అందుకున్నారు. ఆ డబ్బుతో ఆయన చెన్నైలో ఎమ్.ఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్‌ను స్థాపించారు. 1971లో స్వామినాథన్‌కు రామన్‌మెగసెసే అవార్డు, 1986లో అల్బర్ట్ ఐన్‌స్టీన్ సైన్స్ అవార్డ్‌లతో సత్కరించారు. పద్మ విభూషన్, పద్మ శ్రీ అవార్డులు కూడా ఆయన్ను వరించాయి. బాల్యంలోనే నిర్ణయం.. 1925 ఆగష్టు 7న తమిళనాడులోని కుంభకోణంలో స్వామినాథన్ జన్మించారు. డా.ఎం.కె. సాంబశివన్, పార్వతి దంపతులకు రెండవ కుమారుడు. ఆయన 11 యేట తండ్రి మరణంచగా.. ఆయన మామయ్య సంరక్షణలో చదువు కొనసాగించారు. కుంభకోణంలో మెట్రిక్యులేషన్ పూర్తి చేశారు. 1943 నాటి బెంగాల్ కరువు పరిస్థితులను స్వయంగా చూసిన ఆయన.. ఆ దుర్భర పరిస్థితులను దేశం నుంచి పారదోలాలని నిర్ణయించుకున్నారు. మొదట జంతుశాస్త్రంలో డిగ్రీ పూర్తి చేసిన ఆయన మద్రాసు వ్యవసాయ కళాశాల నుంచి డిగ్రీ పట్టా పొందారు. అనంతరం వ్యవసాయ శాస్త్రవేత్త, జన్యుశాస్త్రవేత్తగా ఎదిగారు. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో చదివే రోజుల్లో స్వామినాథన్‌కు పరిచయమైన మీనాతో ఆయన వివాహం అయింది. వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. Father of India's Green Revolution, MS Swaminathan passes away in Chennai, Tamil Nadu. (Pic: MS Swaminathan Research Foundation) pic.twitter.com/KS4KIFtaP2 — ANI (@ANI) September 28, 2023 ఎన్నో బాధ్యతలు.. 1972 నుంచి 1979 వరకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ సంస్థకు జనరల్ డైరెక్టర్‌గా స్వామినాథన్ పనిచేశారు. 1979 నుంచి 1980 వరకు భారత వ్యవసాయ మంత్రిత్వశాఖకు ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థకు 1982 నుంచి 1988 వరకు డైరెక్టర్ జనరల్‌గా సేవలందించారు. ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ద కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ నేచురల్ రీసోర్స్ సంస్థకు కూడా ఆయన తన సేవలను అందించారు. 2014 వరకు నేషనల్ కమిషన్ ఆన్ ఫార్మర్కు ఛైర్మన్‌గా వ్యవహరించారు. #WATCH | Dr Soumya Swaminathan, former Chief Scientist and former Deputy Director General at the WHO and daughter of MS Swaminathan, says, "...He was not keeping well for the last few days... His end came very peacefully this morning... Till the end, he was committed to the… https://t.co/n8B313Q2et pic.twitter.com/0BKDqqXbse — ANI (@ANI) September 28, 2023 భారత్‌లో చేసిన సేవల కంటే స్వామినాథన్ ప్రపంచ వేదికపై ఎంతో ప్రభావవంతమైన వ్యక్తిగా గుర్తింపు పొందారు. వివిధ అంతర్జాతీయ వ్యవసాయ, పర్యావరణ కార్యక్రమాలకు ఆయన మేధస్సును అందించారు. టైమ్ మ్యాగజైన్ 20వ శతాబ్దపు అత్యంత ప్రభావవంతమైన 20 మంది ఆసియన్లలో ఒకరిగా ఆయనకు స్థానం దక్కింది. ఇదీ చదవండి: భారత్-కెనడా వివాదం: జైశంకర్, బ్లింకెన్ కీలక సమావేశం -
నిత్య హరిత విప్లవం అభిలషణీయం
మన జనాభాలో దాదాపుగా మూడింట రెండొంతుల మందికి వ్యవసాయమే జీవిత విధానంగా, ప్రధాన జీవనాధారంగా ఉంటోంది. వ్యవసాయంలో స్తబ్ధత కొనసాగినట్లయితే మనం పురోగతి సాధించలేమన్నది స్పష్టమే. 1960ల మొదట్లో ప్రదర్శించిన చిత్తశుద్ధిని నేడు మళ్లీ చూపించాలి. తృణధాన్యాలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. పోషకాహార విలువలు కలిగిన స్థానిక పంటలను ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగం చేయాలి. పర్యావరణ, ఆర్థిక ప్రాతిపదికన సేంద్రియ వ్యవసాయం, పంటలు, పశువుల సమీకృత విధానాన్ని ప్రోత్సహించాలి. కనీస మద్దతు ధరతో పాటు సమర్థమైన రైతు కేంద్రకమైన మార్కెటింగ్ వ్యవస్థను ఉనికిలోకి తేవాలి. సగటు ఆహార భద్రత నుంచి వ్యక్తుల్లో పోషకాల భద్రత వైపు మన ప్రాధాన్యతలు మారాల్సి ఉంది. దేశమంతా అలుముకుంటున్న వ్యవసాయ రంగ సంక్షోభం వ్యవసాయదారుల సమస్య లను పరిష్కరించాల్సిన అవసరాన్ని ఎత్తి చూపింది. 1960ల మొదట్లో ప్రదర్శించిన అదే చిత్తశుద్ధిని వ్యవసాయం పట్ల నేడు మళ్లీ చూపించా ల్సిన అవసరం ఉంది. అనేక అంచనాల ప్రకారం, వ్యవసాయం ఇప్పుడు ఫలదాయకం కాదు. ఏదైనా అవకాశం ఉంటే, 40 శాతం మంది రైతులు వ్యవసాయాన్ని వదులుకోవాలని అనుకుంటున్నారు. మన జనాభాలో దాదాపుగా మూడింట రెండొంతుల మందికి వ్యవసాయమే జీవిత విధానంగా, ప్రధాన జీవనాధారంగా ఉంటోంది. వ్యవసాయంలో స్తబ్ధత కొనసాగినట్లయితే మనం పురో గతి సాధించలేమన్నది స్పష్టమే. హరిత విప్లవం అనేది ఉత్పాదకత పెంపుదల ప్రక్రియ కోసం కనుగొన్న పదబంధం. 1960లు, 70లలో ఆవిర్భవించిన హరిత విప్లవం గోధుమ, వరి, జొన్న ఇతర పంటలకు సంబంధించిన కొత్త జన్యు వంగడాల అభివృద్ధి, విస్తరణలపై ఆధారపడింది. నీటిని, సూర్యకాంతిని, మొక్కల పోషకాలను సమర్థంగా వినియోగించుకుని వాటిని ధాన్యాలుగా మార్చడంలోని సామర్థ్యమే ఈ హరిత విప్లవం ప్రాతిపదిక. వాయవ్య భారత్‌లోని నీటి లభ్యత గల ప్రాంతాలకు మాత్రమే ఈ హరిత విప్లవం పరిమితమైంది. అయితే, ఇక్కడ కూడా, తీవ్రమైన పర్యావరణ, ఆర్థిక కారణాల వల్ల వ్యవసాయం గిట్టుబాటు కాకుండా పోతోంది. దీనికి తోడు రైతుల రుణభారం కూడా పెరిగిపోతోంది. ఇప్పుడు సవాలు ఏమిటంటే, హరిత విప్లవాన్ని దాని కేంద్రంలోనే విఫలం కానివ్వకుండా అధిగమించడానికి పోరాడటమే. అటు రుతుపవనాలు, ఇటు మార్కెట్‌తో మన వ్యవసాయం రెండు రకాలుగా జూదంలా మారిపోయింది. నీటిపారుదలపై ప్రభుత్వ వ్యయం పడిపోతోంది కానీ, భారత్ నిర్మాణ్ ప్రోగ్రాం ద్వారా దీన్ని మార్చేయవచ్చని ఆశ కలుగుతోంది. నీటి అవసరం తక్కువగా ఉండే తృణధాన్యాలు, నూనె గింజలు, ఇతర అధిక విలువ కలిగిన పంటలు పండే మెట్టభూముల్లో ఉత్పాదకతను పెంచవలసిన అవసరం ఉంది. అయితే వీటిలో చాలా భాగం మనం దిగుమతి చేసుకుంటున్నాం. బీటీ కాటన్ వంటి వ్యయభరితమైన టెక్నాలజీలను ఈ ప్రాంతాలకు వర్తింపజేస్తే సన్నకారు రైతులకు నష్టదాయకం అవుతుంది. ఎందుకంటే వ్యవసాయ ఖర్చులకోసం భారీ రుణాలను వీరు తీసుకోవలసి ఉంటుంది. పైగా పంట విఫలమైతే తట్టుకునే సామర్థ్యం వీరికి ఉండదు. రాగి, సజ్జ లాంటి తృణధాన్యాలు, పశుదాణా లాంటి సంప్ర దాయ పంటలను విత్తనాల మార్పిడి కోసం ప్రధానమంత్రి ప్యాకేజీలో భాగంగా పునరుద్ధరించి, ప్రోత్సహించవలసిన అవసరం ఉంది. పర్యావరణ, ఆర్థిక ప్రాతిపదికన సేంద్రియ వ్యవసాయం, పంటలు, పశువుల సమీకృత విధానాన్ని ప్రోత్సహించాల్సి ఉంది. అయితే ఇది సరిపోదు. ఇలాంటి మెట్ట ప్రాంతాల్లోని రైతులకు అత్యవసరమైనది ఏమిటంటే, కనీస మద్దతు ధర. దాంతోపాటు సమర్థమైన రైతు కేంద్రకమైన మార్కెటింగ్ వ్యవస్థను ఉనికిలోకి తీసుకురావడం. ధాన్యాలు, తృణధాన్యాలు వంటి పోషకాహార విలువలు కలిగిన స్థానిక పంటలను ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగం చేయాలి. దిగుమతి చేసుకున్న పంటలపై కాకుండా, స్థానికంగా పెంచిన పంటలపై మన ఆహార భద్రతా వ్యవస్థ ఆధారపడి ఉండాలి. పర్యావరణానికి హాని కలిగించకుండానే పంటల ఉత్పాదకతను మెరుగుపర్చడానికి ఉద్దేశించిన నిత్య హరిత విప్లవం కోసం టెక్నాలజీని, పబ్లిక్ పాలసీని వృద్ధి చేయవలసిన అవసరం గురించి నేను 15 సంవత్సరాల క్రితం నొక్కి చెప్పాను. సేంద్రియ వ్యవ సాయం, హరిత వ్యవసాయం, పర్యావరణ హిత వ్యవసాయం, మైక్రో ఆర్గానిజంపై ఆధారపడిన వ్యవసాయం వంటి విభిన్న స్వావ లంబనా వ్యవసాయ విధానాలను తగిన విధంగా అమలు పర్చడంపై ఆధారపడినదే నిత్య హరిత విప్లవం. సేంద్రియ వ్యవసాయం అనేది ఖనిజ ఎరువులు, రసాయనిక పురుగు మందుల ఉపయోగాన్ని మినహాయించాలి. జన్యుపరంగా మెరుగుపర్చిన పంటలు, సమీకృత చీడ, పోషకాల నిర్వహణ సూత్రంపై ఆధారపడి చైనాలో విస్తృతంగా చేస్తున్న హరిత వ్యవసాయాన్ని అమలు చేయాలి. దీంతోపాటు సహజ వనరుల వినియోగం, పెంపుదలను సమీకృతం చేయాలి. వర్షాధార, సాగునీటి ప్రాంతాలు రెండింటిలోనూ విభిన్న వ్యవసాయ–పర్యా వరణ, సామాజిక వాతావరణాలకు అనువైన వైవిధ్యపూరితమైన స్వావలంబనా వ్యవసాయ పద్ధతులను మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పర్యావరణపరంగా స్వావలంబనతో కూడిన వ్యవసాయ సాంకేతికతలు అందుబాటులో ఉండే ‘డూ–ఎకాలజీ’ వైఖరిని మనం చేపట్టాల్సి ఉంది. ఉదాహరణకు, తప్పనిసరిగా వర్షపునీటిని నిల్వ చేయడం, మూడు సంవత్సరాల రొటేష¯Œ పద్ధతి ఈ ‘డూ–ఎకాలజీ’ పద్ధతిలో ఉంటుంది. ఈ మూడేళ్ల పద్ధతిలో ఖరీఫ్, రబీ సీజన్లు రెండింట్లోనూ చిక్కుళ్లను పండిస్తారు. దీనివల్ల రైతు కుటుంబాలకు, దేశానికి కూడా విజయం కలిగేలా ఇది తోడ్పడుతుంది. ఆహార భద్రతలో మూడు ప్రధానమైన కోణాలు ఉంటున్నాయి. తగినంత కొనుగోలు శక్తి లేకపోవడంతో దీర్ఘకాలికంగా క్షుద్భాధ; ఆహారంలో విటమిన్ ఏ, ఐరన్, అయోడిన్, జింక్ వంటి సూక్ష్మ పోషకాల కొరత వల్ల శరీరంలో దాగి ఉండే ఆకలి; క్షామం, వరదలు, తుపానులు, ఇతర పర్యావరణమైన మార్పుల కారణంగా విచ్ఛిన్నత ద్వారా కలిగే నిరంతర క్షుద్బాధ. ఆకలిని తగ్గించే ఏ వ్యూహమైనా ఈ మూడు అంశాలనూ తప్పకుండా పరిష్కరించాల్సి ఉంది. సగటు ఆహార భద్రత నుంచి వ్యక్తుల్లో పోషకాల భద్రత వైపు మన ప్రాధాన్యతలు మారాల్సి ఉంది. సమతుల్య ఆహారాన్ని శారీరక పరంగా, ఆర్థికపరంగా, పర్యావరణపరంగా, సామాజికంగా అందు బాటులో ఉంచడమే పోషకాల భద్రతకు ఉత్తమ నిర్వచనంగా ఉంటుంది. రక్షిత మంచి నీరు, పర్యావరణ పరమైన పారిశుధ్యం, ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ, ప్రాథమిక విద్య అనేవి కూడా దీంట్లో భాగమే. పోషకాల భద్రతలో ఆహారం, ఆహారేతర అంశాలకు కూడా సమ ప్రాధాన్యం కల్పించాల్సిన అవసరాన్ని ఇది సూచిస్తుంది. మన దేశంలోని ప్రతి పంచాయతీ కూడా తనదైన సామాజికార్థిక, సాంస్కృతిక, పర్యావరణ పరిస్థితులకు అనుగుణమైన లక్ష్యాలను సాధించడానికి సొంత ప్రణాళికను అభివృద్ధి చేసుకోవలసి ఉంది. పోషకాహార లేమిని అధిగమించాలంటే అత్యంత సమర్థవంతమైన పద్ధతి ఏదంటే, వ్యవసాయాన్ని పోషణ, ఆరోగ్యంతో మేళవించడమే. పోషణ కోణాన్ని జోడిస్తూ తమ సాంప్రదాయిక వ్యవసాయ వ్యవస్థ లను పునర్నిర్మించుకోవడంలో రైతులు శిక్షణ పొందాలి. రెండు దశల్లో దీన్ని చేయవచ్చు. ఒకటి: అవసరమైన సూక్ష్మ పోషక విలువలు, మాంసకృత్తులను అందించే మొక్కలను రైతులకు అందించేలా, జీవరక్షణ మొక్కలతో కూడిన జెనెటిక్ గార్డె¯Œ ని ఏర్పర్చాలి. విటమిన్ ఏ కొరతను పరిష్కరించే ఆరెంజ్ స్వీట్ పొటాటో (చిలగడదుంప లాంటిది) వంటివి వీటిలో కొన్ని. రెండు: స్థానిక సమాజాల సభ్యు లకు సమాజ ఆకలి వ్యతిరేక యోధుల్లా శిక్షణ అందించాలి. వీరికి ఆ ప్రాంత పోషకాహార సమస్యలను అధిగమించే పద్ధతులను గురించి క్షుణ్ణంగా అవగాహన కలిగించాలి. ఈరోజు మన రైతులు ప్రాణరక్షణ మద్దతు కోసం విలపి స్తున్నారు. కొద్ది సంవత్సరాల తర్వాత ఫలాలను అందించే పథకాలను మాత్రమే వారు కోరుకోవడం లేదు. బలమైన, ఉజ్వలమైన, సంపద్వంతమైన వ్యవసాయ దేశంగా మారడంలోనే భారత్ భవి ష్యత్తు ఆధారపడి ఉంది. ఎం.ఎస్. స్వామినాథన్ వ్యాసకర్త వ్యవసాయ శాస్త్రవేత్త (‘బిజినెస్ లైన్’ సౌజన్యంతో)