ఢిల్లీలో హారాహరీగా సాగుతున్న రైతు ఉద్యమంపై దివంగత వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ కుమార్తె మధుర స్వామినాథన్ స్పందించారు. వాళ్లు అన్నదాతలు..నేరస్థులు కాదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆందోళన చేస్తున్న రైతులను ఢిల్లీకి రాకుండా హర్యానా ప్రభుత్వం అడ్డుకుంటోందన్న వార్తలపై ఆమె స్పందించారు.
తన తండ్రికి భారతరత్న అవార్డును పురస్కరించుకుని పూసాలోని ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (ఐఏఆర్‌ఐ) నిర్వహించిన కార్యక్రమంలో ప్రసంగిస్తూ డెవలప్‌మెంటల్ ఎకనామిస్ట్ మధుర స్వామినాథన్ ఈ వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు దేశంలోని ప్రముఖ శాస్త్రవేత్తలంతా దీనికి పరిష్కారాన్ని కనుగొనాలని అభ్యర్థించారు. రైతులు.. అన్నదాతలు వారిని నేరస్తులుగా పరిగణించలేమన్నారు. అంతేకాదు మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ నవంబర్ 2021లో ఎంఎస్ స్వామినాథన్ చేసిన ప్రకటనను ట్విటర్‌లో షేర్ చేశారు.
రైతు సమస్యలపై కేంద్ర మంత్రుల బృందంతో చర్చల విఫలం తరువాత చేపట్టిన రైతన్నల ఛలో ఢిల్లీ కార్యక్రమం గత రెండురోజులుగా ఉధృతంగా సాగుతోంది. హర్యానా, పంజాబ్, యూపీ రైతులు దేశ రాజధానిలో ధర్నాలు, రాస్తారోకోలతో హోరెత్తిస్తున్నారు. అటు పోలీసులు ఈ ర్యాలీని అడ్డుకునేందుకు ఎక్కడికక్కడ బారికేడ్లను ఏర్పాటు చేశారు. హర్యానాలో వారి కోసం జైళ్లను సిద్ధం చేశారు. డ్రోన్ల ద్వారా బాష్పవాయువును ప్రయోగిస్తున్నారు. పోలీస్ నిర్బంధ కాండను చేధించుకుంటూ రైతులు వెనక్కి తగ్గకపోవడంతో సరిహద్దుల్లో హైటెన్షన్ నెలకొంది. ఢిల్లీ మార్చ్‌కి వచ్చిన వందలాది ట్రాక్టర్లు హైవేపై నిలిచిపోయాయి. ఢిల్లీకి 200 కిలో మీటర్ల దూరంలోనే రైతుల ర్యాలీ కొనసాగుతోంది.
కాగా అన్ని పంటలకు కనీసం మద్దతు ధర హామీ చట్టం, రుణ మాఫీ, రైతులకు పింఛన్లు తదితర డిమాండ్ల అమలు కోసం సంయుక్త కిషన్ మోర్చ, కిషన్ మజ్‌దూర్ మోర్చ ఛలో ఢిల్లీ నిరసనకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. వీరి డిమాండ్లలో ప్రధానమైంది ఎంఎస్ స్వామినాథన్ కమిషన్ నివేదిక ప్రకారం మద్దతు ధర అమలు చేయడం. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు 2004లో కేంద్రం ప్రభుత్వం ఎంఎస్ స్వామినాథన్ నేతృత్వంలో కమిషన్‌ను రూపొందించింది. ప్రభుత్వం పంటలపై కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి)ని సగటు ఉత్పత్తి వ్యయం కంటే కనీసం 50శాతం పెంచాలని ఈ కమిషన్ సిఫార్సు చేసింది.
Here is what M S Swaminathan said when the farm laws were repealed @mssrf https://t.co/HYSmSlSOve. https://t.co/dC3ejbsZ8F
— Madhura Swaminathan (@MadhuraFAS) February 13, 2024
ఇటీవల హరిత విప్లవ పితామహుడు, ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ (ఎంఎస్‌ఎస్‌ఆర్‌ఎఫ్) వ్యవస్థాపకుడు ఎంఎస్ స్వామినాథన్‌కు మరణానంతరం ఇటీవల భారత అత్యున్నత పురస్కారం భారతరత్నను ప్రకటించింవది. గతేడాది సెప్టెంబర్‌లో స్వామినాథన్ మరణించారు.
Comments
Please login to add a commentAdd a comment