ఆర్థిక సంస్కరణల సారథికి భారతరత్న.. ప్రధాన నిర్ణయాలు ఇవే.. | Major Economic Revolutions Adopted By PV Narasimha Rao | Sakshi
Sakshi News home page

ఆర్థిక సంస్కరణల సారథికి భారతరత్న.. ప్రధాన నిర్ణయాలు ఇవే..

Published Fri, Feb 9 2024 1:31 PM | Last Updated on Fri, Feb 9 2024 2:45 PM

Major Economic Revolutions Adopted By PV Narasimha Rao - Sakshi

కేంద్ర ప్రభుత్వం మరోసారి భారతరత్న పురస్కారాలను ప్రకటించింది. మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, చరణ్‌సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్‌ స్వామినాథన్‌ను అత్యున్నత పౌర పురస్కారంతో గౌరవించింది. ఈ మేరకు ప్రధాని నరేంద్రమోదీ ‘ఎక్స్‌’ వేదికగా తెలియజేశారు.

భారత ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మకమైన సంస్కరణలకు బీజం వేసి కుంటుపడుతున్న ఎకానమీని తిరిగి పట్టాలెక్కించిన సంస్కరణ శీలి, బహుముఖ ప్రజ్ఞావంతుడు పీవీ నరసింహారావు. ఆయన హయాంలో ఆర్థిక వృద్ధి, ఎగుమతులు, అంతర్జాతీయ సంక్షోభాలకు ఎదురొడ్డి నిలవడం విదేశీ మారక ద్రవ్య నిల్వలు, సమాచార సాంకేతిక పురోగతి, స్టాక్ మార్కెట్లు, టెలీకమ్యూనికేషన్లు వంటి పలు రంగాల్లో ఆకాశమే హద్దుగా భారత్‌ చెలరేగింది. గతంలో ఆహారపదార్థాలు దిగుమతిలో అట్టడుగున ఉన్న భారత్ ఇవాళ అంతర్జాతీయ సమాజానికి పెద్ద ఎత్తున ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేసే దేశంగా ఆవిర్భవించిందంటే పీవీ సంస్కరణలే కారణమని నిపుణులు చెబుతున్నారు. 

టన్నుల కొద్ది బంగారం తాకట్టు

పీవీ నరసింహారావు 1991 జూన్ నెలలో ప్రధానమంత్రి పీఠాన్ని అధిరోహించినప్పటికి భారత దేశంలో ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉండేవికావు. హరిత విప్లవం కారణంగా కొద్దిపాటి ఆహార స్వావలంబన సాధ్య పడినా, ఇతర రంగాలన్నీ దీనస్థితిలో ఉండటంతో దేశ స్థూల జాతీయోత్పత్తి మూడు శాతంగా కొనసాగుతుండేది. మరోవైపు ఇంటిని చక్కదిద్దుకునే దారి తెలియక 20 కోట్ల డాలర్ల రుణం కోసం 20 టన్నుల బంగారాన్ని యూనియన్ బ్యాంక్ ఆఫ్ స్విట్జర్లాండ్‌కు తాకట్టు పెట్టిన పరిస్థితి నెలకొంది. 

అప్పటికే పెరిగిన సంక్షోభం

ఇందిరా గాంధీ 1966లోనే సంస్కరణల కోసం విఫల ప్రయత్నం చేశారు. రాజీవ్ గాంధీ కంప్యూటర్లు, కలర్ టీవీలను తీసుకువచ్చారు. కానీ అప్పటి పరిస్థితులు దృష్ట్యా ఆర్థిక సంస్కరణలపై ఎక్కువ దృష్టిసారించలేకపోయారు. ఇంతలో దేశ ఆర్థిక సమస్యలు పెరిగాయి. 1980ల్లో ఈ సమస్యలు మరింత రెట్టింపయ్యాయి. 1990 ఇవి తీవ్రరూపం దాల్చాయి. 

1991 నాటికి భారతదేశం క్లోజ్డ్ ఎకానమీగా ఉండేది. అంటే ప్రతి నిర్ణయం ప్రభుత్వం చేతుల్లోనే ఉంటుంది. ఎంత ఉత్పత్తి చేయాలి, ఎంత ఖర్చు చేయాలి, ఎంతమంది వినియోగించాలి అనే అంశాలన్నీ ప్రభుత్వమే చూసుకుంటుంది. ఈ వ్యవస్థనే పర్మిట్‌ రాజ్ లేదంటే లైసెన్స్ రాజ్ అంటారు. ఇందుకు భిన్నంగా ఓపెన్ ఎకానమీలో ప్రభుత్వ పెట్టుబడులను తగ్గించి, ప్రైవేటు సంస్థలను ప్రోత్సహించారు. ఈ ఆర్థిక సంస్కరణలను ప్రకటిస్తూ అప్పటి ఆర్థికమంత్రి మన్మోహన్ సింగ్ జులై 24, 1991న బడ్జెట్ ప్రవేశపెట్టారు.

ఆనాటి బడ్జెట్ ముఖ్యాంశాలు

దేశీయ మార్కెట్లో కంపెనీల మధ్య పోటీ పెంచుతామన్నారు. లైసెన్సింగ్ రాజ్ ముగిసింది. కంపెనీలకు నిబంధనలతో కూడిన పర్మిట్లు ఉండవని చెప్పారు. ఎగుమతులను ప్రోత్సహించడం, దిగుమతి లైసెన్సింగ్‌లో సడలింపులే లక్ష్యంగా బడ్జెట్‌లో పలు మార్పులు ప్రకటించారు. ఎగుమతులను ప్రోత్సహించడానికి ‘దిగుమతి-ఎగుమతి విధానం’లో విదేశీ పెట్టుబడులను స్వాగతించారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఉద్యోగాలు సృష్టిస్తాయని తెలిపారు. సాఫ్ట్‌వేర్ ఎగుమతి కోసం ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80 హెచ్‌హెచ్‌సి కింద పన్ను మినహాయింపు ఇచ్చారు. ఈ బడ్జెట్‌ను ఆధునిక భారతదేశ చరిత్రలో అతి పెద్ద నిర్ణయాల్లో ఒకటిగా పరిగణిస్తారు.

విద్యాశాఖను మానవవనరుల అభివృద్ధి శాఖగా మార్చడం, జైళ్ల శాఖలో సంస్కరణలు తేవడం, నవోదయ పాఠశాలల ఏర్పాటు, గురుకుల విద్యకు నాంది వంటి పలు సంస్కరణలను ఆయన తీసుకువచ్చారు. అయితే ఆర్థిక సంస్కరణలపైన పేదరికం, నిరుద్యోగం, అసమానతల నిర్మూలనలో ఎన్నో మార్పులు తీసుకొచ్చారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement