
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికిగాను కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. భారతదేశం అంతటా రైతులకు ఉత్పాదకత, సుస్థిరత, మార్కెట్ సౌలభ్యాన్ని పెంచడంపై బడ్జెట్ దృష్టి పెడుతుందన్నారు. బడ్జెట్‌లో ప్రధానంగా వ్యవసాయంపై ఫోకస్ పెడుతున్నట్లు పేర్కొన్నారు.
ధన్ ధాన్య కృషి యోజన
తక్కువ ఉత్పాదకత, సగటు కంటే తక్కువ రుణ పారామితులు ఉన్న 100 జిల్లాలను లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం ధన్ ధాన్య కృషి యోజనను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. సుస్థిర వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం ద్వారా, రుణ సౌలభ్యాన్ని మెరుగుపరచడం ద్వారా 1.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూర్చడం ఈ పథకం లక్ష్యమని చెప్పారు.
రీసెర్చ్ లింక్డ్ ఇన్సెంటివ్ (ఆర్ఎల్ఐ) పథకం
వ్యవసాయంలో ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి, విజయవంతమైన పరిశోధనలు, వాటి అభివృద్ధి ఫలితాల కోసం ఆర్థిక ప్రోత్సాహకాలను అందించేందుకు రీసెర్చ్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్‌ను బడ్జెట్‌లో ప్రవేశపెట్టారు. అధిక దిగుబడినిచ్చే, వాతావరణాన్ని తట్టుకునే పంటల అభివృద్ధిని వేగవంతం చేయడమే ఈ పథకం లక్ష్యం.

ఏకీకృత విత్తన నమోదు ప్రక్రియ
విత్తన నమోదు కోసం వన్ నేషన్, వన్ లైసెన్స్ విధానాన్ని బడ్జెట్ ప్రతిపాదిస్తుంది. ఈ ప్రక్రియను క్రమబద్ధీకరించేందుకు, రైతులకు అధిక నాణ్యమైన విత్తనాలు సకాలంలో అందుబాటులో ఉండేలా చూసేందుకు ఈ విధానం ఎంతో ఉపయోగమని నిర్మాలా సీతారామన్ చెప్పారు.
వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) సరళీకరణ
వ్యవసాయ పెట్టుబడులకు జీఎస్టీ ఫ్రేమ్ వర్క్‌ను సరళతరం చేయడం, నిత్యావసర వస్తువులను మరింత చౌకగా, సుస్థిరంగా మార్చడానికి బడ్జెట్‌లో చర్యలు సాగనున్నాయి.
భారతదేశ వ్యవసాయ విస్తరణలో కీలక చోదకాలుగా ఉన్న ఉద్యానవన, పశుసంపద, చేపల పెంపకం వంటి అధిక విలువ ఆధారిత రంగాల వృద్ధికి బడ్జెట్ ప్రాధాన్యత ఇస్తుందన్నారు.
ఇదీ చదవండి: కేంద్ర బడ్జెట్ 2025 హైలైట్స్
ప్రభావం ఇలా..
2025-26 కేంద్ర బడ్జెట్‌లో పేర్కొన్న కార్యక్రమాలు వ్యవసాయ ఉత్పాదకతను గణనీయంగా పెంచుతాయని, మార్కెట్ ప్రాప్యతను మెరుగుపరుస్తాయని, వ్యవసాయ పద్ధతుల సుస్థిరతను నిర్ధారిస్తాయని భావిస్తున్నారు. సృజనాత్మకత, పరిశోధన, క్రమబద్ధీకరించిన ప్రక్రియలపై దృష్టి పెట్టడం ద్వారా వ్యవసాయ రంగానికి మేలు చేకూరుతుందని అంచనా వేస్తున్నారు.