Sitharaman
-
వడ్డీ రేట్లు భారమే..
ముంబై: ప్రస్తుత వడ్డీ రేట్లను ప్రజలు భారంగా భావిస్తున్నారని, కనుక వాటిని అందుబాటు స్థాయికి తీసుకురావాలంటూ బ్యాంక్‌లకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. ఎస్బీఐ నిర్వహించిన వార్షిక వ్యాపార సదస్సులో భాగంగా ఆమె మాట్లాడారు. ప్రస్తుతం భారతీయ పరిశ్రమలు కొత్త సామర్థ్యాలపై పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉందంటూ.. వడ్డీ రేట్లను తగ్గించడం వికసిత్ భారత్ ఆకాంక్షను సాధించడంలో సాయపడుతుందన్నారు. ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చేందుకు వీలుగా ఆర్బీఐ వడ్డీ రేట్లను తగ్గించాలని, ఈ విషయంలో ఆహారపరమైన ద్రవ్యోల్బణాన్ని అవరోధంగా చూడడం సరికాదంటూ కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ సైతం వ్యాఖ్యానించడం తెలిసిందే. అక్టోబర్ నెలకు రిటైల్ ద్రవ్యోల్బణం 6.2 శాతానికి చేరడంతో ఆర్బీఐ ఇప్పట్లో వడ్డీరేట్లు తగ్గించకపోవచ్చన్న అంచనాలు నెలకొన్నాయి. సామాన్యులపై ద్రవ్యోల్బణ భారం: ద్రవ్యోల్బణానికి ప్రధానంగా మూడు లేదా నాలుగు కమోడిటీలు కారణమవుతున్నాయని మంత్రి సీతారామన్ పేర్కొన్నారు. మిగిలిన ప్రధాన ఐటమ్స్ అన్నీ కూడా మూడు లేదా నాలుగు శాతం ద్రవ్యోల్బణం స్థాయిలోనే ఉన్నట్టు చెప్పారు. ద్రవ్యోల్బణం సూచీ లేదా ఆర్బీఐ వడ్డీ రేట్ల తగ్గింపునకు ఆహార ధరలను పరిగణనలోకి తీసుకోవాలా? లేదా అన్న చర్చలోకి తాను వెళ్లాలనుకోవడం లేదన్నారు. ద్రవ్యోల్బణం ఎంతో సంక్లిష్టమైనదని, సామాన్యులపై భారం మోపుతుందంటూ.. సరఫరా వైపు చర్యలపై ప్రభుత్వం దృష్టి సారించినట్టు చెప్పారు. వృద్ధి మందగమనంపై ఆందోళనలు అక్కర్లేదన్నారు. క్షేత్రస్థాయిలో కార్యకలాపాలు బలంగా ఉన్నట్టు కొన్ని సంకేతాలు తెలియజేస్తున్నట్టు పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థ వృద్ధి ప్రభుత్వానికి ముఖ్యమని స్పష్టం చేశారు. బ్యాంక్‌లు ప్రధానంగా రుణ వితరణ కార్యకలాపాలకే పరిమితం కావాలని, బీమా తదితర ఉత్పత్తులను తప్పుడు మార్గాల్లో కస్టమర్లకు అంటగట్టొద్దని, ఇది రుణాలను భారంగా మారుస్తుందని పేర్కొన్నారు. బ్యాంకింగ్ రంగంపై ప్రజల విశ్వాసాన్ని పెంచుకోవడంలో ఇది చాలా కీలకమని సీతారామన్ స్పష్టం చేశారు. ఎంఎస్ఎంఈలకు 2025–26లో రూ.6.12 లక్షల కోట్లు, 2026–27లో రూ.7 లక్షల కోట్ల మేర రుణ వితరణ లక్ష్యాలను నిర్దేశించినట్టు ఆమె తెలిపారు. అనైతిక విధానాలను అరికట్టండి: దాస్ముంబై: సరైన కేవైసీ ధ్రువీకరణ లేకుండా ఖాతాలు తెరవడం, అబద్ధాలు చెప్పి ఉత్పత్తులను అంటగట్టడం వంటి అనైతిక విధానాలకు అడ్డుకట్ట వేసే దిశగా బ్యాంకులు గట్టి చర్యలు తీసుకోవాలని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ సూచించారు. ఇందుకోసం అంతర్గత గవర్నెన్స్ వ్యవస్థను పటిష్టం చేసుకోవాలని పేర్కొన్నారు. తమ పోర్ట్‌ఫోలియోలను క్రియాశీలకంగా సమీక్షించుకుంటూ ఉండాలని చెప్పారు. పరిశ్రమల్లో విప్లవాత్మకమైన మార్పుల వల్ల తలెత్తే ముప్పులు.. సవాళ్లను ముందస్తుగా గుర్తించి, నివారించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రైవేట్ రంగ బ్యాంకుల డైరెక్టర్ల సదస్సులో కీలకోపన్యాసం చేసిన సందర్భంగా దాస్ ఈ విషయాలు తెలిపారు. -
దేశాభివృద్ధిలో భాగస్వామ్యం అవుతాయ్
న్యూఢిల్లీ: కార్పొరేట్ ప్రపంచం దేశాభివృద్ధి లక్ష్యాలతో మమేకం అవుతుందన్న విశ్వాసమున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. తద్వారా అభివృద్ధి చెందిన దేశంగా భారత్ ఆవిర్భవించడంలో భాగస్వాములవుతాయని తెలియజేశారు. వెరసి శత వసంత స్వాతంత్య్ర దినోత్సవ (2047) సమయానికల్లా వికసిత్ భారత్‌గా ఆవిర్భవించే వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. భవిష్యత్ తరాలకు అత్యుత్తమ భారత్‌ను అందించే బాటలో ప్రధాని నరేంద్ర మోదీ వికసిత్ భారత్‌ను సాధించేందుకు స్పష్టమైన లక్ష్యాలను నిర్దేశించినట్లు పేర్కొన్నారు. ‘వికసిత్ భారత్ ః 2047: వికసిత్ భారత్– ఇండస్ట్రీ’ పేరుతో ఫిక్కీ నిర్వహించిన సదస్సులో ఆమె ప్రసంగించారు. 2047కల్లా లక్ష్యాలను సాధించడంలో పారిశ్రామిక రంగం పాత్ర కీలకమన్నారు. -
సీఎం జగన్‌కు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ధన్యవాదాలు తెలిపారు
-
పెట్టుబడిదారులు కంగారు పడక్కర్లేదు..
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం 2024లో ‘మంచి మెజారిటీ’తో మళ్లీ అధికారంలోకి రానుందని, ప్రపంచ పెట్టుబడిదారులు ‘చింతించాల్సిన అవసరం లేదు’అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. వృద్ధి వేగాన్ని పెంచేందుకు వ్యవస్థాగత సంస్కరణలకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కూడా ఆమె ఇండియా గ్లోబల్ ఫోరమ్ నిర్వహించిన కార్యక్రమాన్ని ఉద్దేశించి చేసిన ఒక వెర్చువల్ చర్చాగోష్టిలో చెప్పారు. భారత్ ఆర్థిక వ్యవస్థను, రాజకీయ వాతావరణాన్ని, క్రింది స్థాయిలో వాస్తవాలను గమనించే ఎవ్వరికైనా ప్రధాని మోదీ మళ్లీ మంచి మెజారిటీతో తిరిగి వస్తున్నారని అర్థమవుతుందని ఆమె ఉద్ఘాటించారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రతి భారతీయుడి జీవితాన్ని మార్చే వివిధ కార్యక్రమాలను చేపట్టిందని, అలాగే కేంద్రం తీసుకున్న పలు చర్యల వల్ల వ్యాపార వాతావరణం మెరుగుపడిందని అన్నారు. రోజ్‌గార్ మేళా ద్వారా ఈ ఏడాది డిసెంబర్ నాటికి దేశంలో 10 లక్షల మంది యువతకు ఉపాధి కల్పించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. ఇప్పటికే 8 లక్షల ఉపాధి అవకాశాలు కల్పించడం జరిగిందన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోందన్నారు. ఇండియా–మిడిల్ ఈస్ట్–యూరోప్ కనెక్టివిటీ కారిడార్ (ఐఎంఈసీ)పై ఇజ్రాయెల్ –గాజాలో కొనసాగుతున్న సంఘర్షణ ప్రభావం గురించి అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం చెబుతూ ‘‘అది దీర్ఘకాలిక ప్రాజెక్ట్. ఒకటి లేదా మరొక సంఘటన ఏదీ దీనిని ప్రభావితం చేయబోదు’’ అని స్పష్టం చేశారు. -
బడ్జెట్లో టంగ్ స్లిప్ అయిన నిర్మలమ్మ..ఓహ్ !సారీ అంటూ...
లోక్‌సభలో 2023-24 బడ్జెట్ ప్రసంగం చేస్తూ.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆసక్తికరమైన పొరపాటు చేశారు. ఆమె అనుకోకుండా టంగ్ స్లిప్ అయ్యి అన్న మాటతో అక్కడ ఒక్కసారిగా లోక్‌సభలో నవ్వులు విరబూశాయి. వెహికల్ రీప్లేస్మెంట్ గురించి మాట్లాడుతూ ఆమే ఓల్డ్ పొల్యూషన్ వెహికల్స్ బదులుగా ఓల్డ్ పాలిటిక్స్ అన్నారు. దీంతో అక్కడ అర్థమే మారిపోయిందంటే పాత రాజకీయాలను తొలగించటం అన్నట్లు అర్థం వచ్చింది. దీంతో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సభ్యుల ముఖాలు నవ్వులతో వెలిగిపోయాయి. అయితే ప్రతి పక్షాల సభ్యుల ముఖాలు ఎలాంలి భావాన్ని వ్యక్తం చేయాలేదు. ఐదే ఈ తప్పిదాన్ని నిర్మలమ్మ వెంటనే గమనించి చిరునవ్వుతో..ఓహ్ సారీ అంటూ సరైన వివరణ ఇచ్చారు. పర్యావరణ పరిరక్షణ విధానంలో భాగంగా పాత కాలుష్య వాహనాలను మార్చడం అని పలుమార్లు తప్పిదాన్ని సరిచేస్తూ చెప్పారు. అంతేగాదు పాత కాలుష్య వాహనాలను మార్చడం మన ఆర్థిక వ్యవవస్థను పచ్చగా మార్చడంలో ముఖ్యమైన భాగం అని నిర్మలమ్మ చెప్పారు. అలాగే బడ్జెట్ 2021-22లో పేర్కొన్న వెహికల్ స్క్రాపింగ్ పాలసీని కొనసాగించడంలో రాష్ల్రాలకు కూడా మద్దతు ఉంటుందని నిర్మలా సీతారామన్ అన్నారు. (చదవండి: పీఎం విశ్వ కర్మ కౌశల్ సమ్మాన్: బడ్జెట్ చరిత్రలో.. తొలిసారిగా వాళ్ల కోసం ప్యాకేజీ) -
ఈపీఎఫ్ఓ వడ్డీ రేటుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నిర్మలా సీతారామన్..!
ఉద్యోగుల భవిష్య నిధి డిపాజిపై ప్రతిపాదిత 8.1 శాతం వడ్డీ రేటు ఇతర చిన్న పొదుపు పథకాలు అందించే వడ్డీ రేట్ల కంటే మెరుగ్గా ఉందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ప్రస్తుత కాలపు వాస్తవికతలను బట్టి, త్వరలో వడ్డీ రేటును సవరించనున్నట్లు ఆమె స్పష్టం చేశారు. ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్ల వడ్డీ రేటుపై ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డు నిర్ణయం తీసుకుంటుందని, 2021-22 ఆర్థిక సంవత్సరానికి పీఎఫ్ రేటును 8.1 శాతానికి తగ్గించాలని బోర్డు ప్రతిపాదించిందని ఆమె రాజ్యసభలో అప్రాప్రియేషన్ బిల్లులపై చర్చకు సమాధానంగా చెప్పారు. "ఈపీఎఫ్ఓకు ఒక సెంట్రల్ బోర్డు ఉంది, చందాదారులకు ఎంత రేటు ఇవ్వాలనే దానిపై బోర్డు నిర్ణయం తీసుకుంటుంది. వారు కొంతకాలంగా వడ్డీ రేటును మార్చలేదు.. ఇప్పుడు దానిని 8.1 శాతానికి మార్చారు" అని ఆమె పేర్కొన్నారు. ఇది ఈపీఎఫ్ఓ సెంట్రల్ బోర్డు తీసుకున్న నిర్ణయం.. బోర్డులో విస్తృత శ్రేణి ప్రతినిధులు ఉన్నారు. సుకన్య సమృద్ధి యోజన(7.6 శాతం), సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (7.4 శాతం), పీపీఎఫ్ (7.1 శాతం) వంటి ఇతర పథకాలు అందించే రేట్లు చాలా తక్కువగా ఉండగా, ఈ వడ్డీ రేటును 8.1 శాతంగా ఉంచాలని ఈపీఎఫ్ఓ పేర్కొంది. "వాస్తవంగా ఈ రోజు అమలులో ఉన్న ఈపీఎఫ్ఓ వడ్డీ రేటు మిగిలిన వాటి కంటే ఇంకా ఎక్కువగా ఉంది" అని ఆర్థిక మంత్రి అన్నారు. ఈ సవరణ ఇప్పుడు "నేటి వాస్తవాలను" ప్రతిబింబిస్తోందని అన్నారు. ప్రావిడెంట్ ఫండ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 2020-21లో ఉన్న 8.5 శాతం నుంచి 2021-22 నాటికి 8.1 శాతానికి తగ్గించాలని ఈపీఎఫ్ఓ ప్రతిపాదించింది. (చదవండి: టాటా చేతికి ఎయిరిండియా..! భారీ డీల్‌కు సిద్ధమైన యూరప్ కంపెనీ..!) -
2.74 లక్షల కోట్లకు చేరిన ద్రవ్యలోటు
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2021–22) జూన్ ముగిసే నాటికి రూ.2,74,245 కోట్లకు చేరింది. 2021–22లో మొత్తం రూ.15,06,812 కోట్ల ద్రవ్యలోటు (ప్రస్తుత ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి–జీడీపీ అంచనాల్లో ఇది 6.8 శాతం) ఉంటుందన్నది ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ అంచనా.ఈ లెక్కన ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం ముగిసే నాటికి లక్ష్యంలో 18.2 శాతానికి ద్రవ్యలోటు చేరిందన్నమాట. కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) శుక్రవారం ఈ గణాంకాలను విడుదల చేసింది. తాజా గణాంకాలు ఇలా... ►జూన్ ముగిసే నాటికి ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం రూ.5.47 లక్షల కోట్లు (బడ్జెట్ మొత్తం అంచనాల్లో 27.7 శాతం). ఇందులో రూ.4.12 లక్షల కోట్లు పన్ను ఆదాయాలు. రూ.1.27 లక్షల కోట్లు పన్నుయేతర ఆదాయాలు. రూ.7,402 కోట్లు నాన్ డెట్ క్యాపిటల్ రిసిట్స్. నాన్ డెట్ క్యాపిటల్ రిసిట్స్‌లో రూ.3,406 కోట్ల రుణ రికవరీలు, రూ.3,996 కోట్లు పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా లభించినవి ఉన్నాయి. ►ఇక ఇదే సమయంలో వ్యయాలు రూ.8.21 లక్షల కోట్లు (2021–22 బడ్జెట్లో 23.6 శాతం) వీటిలో రెవెన్యూ అకౌంట్ నుంచి రూ.7.10 లక్షల కోట్లు వ్యయమవగా, రూ.1.11 లక్షల కోట్లు క్యాపిటల్ అకౌంట్ నుంచి వ్యయం అయ్యాయి. రెవెన్యూ వ్యయాల్లో రూ.1.84 లక్షల కోట్లు వడ్డీ చెల్లింపులుకాగా, రూ. లక్ష కోట్లు సబ్సిడీలకు వ్యయమయ్యాయి. ►వెరసి వాణిజ్యలోటు 2.74 లక్షల కోట్లుగా ఉంది. -
చిన్న పరిశ్రమలకు డబ్బు కొరత రానీయం!
న్యూఢిల్లీ: చిన్న లఘు మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈ) నిధుల కొరత రాకుండా తగిన అన్ని చర్యలనూ కేంద్రం తీసుకుంటుందని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. వస్తు, సేవల సరఫరాలకు సంబంధించి వివిధ మంత్రిత్వశాఖలు, విభాగాల నుంచి ఎంఎస్ఎంఈలకు రూ.40,000 కోట్ల బకాయిలను ఇప్పటికే చెల్లించడం జరిగిందని ఆర్థికమంత్రి వెల్లడించారు. న్యాయపరమైన అంశాల్లో చిక్కుకోని మిగిలిన బకాయిలను అక్టోబర్ మొదటి వారం లోపు చెల్లించేయడం జరుగుతుందని ఆర్థికమంత్రి స్పష్ట చేశారు. ఎంఎస్ఎంఈలకు చెల్లించాల్సిన మొత్తం దాదాపు రూ.60,000 కోట్లనీ ఆమె ఈ సందర్భంగా తెలిపారు. మూలధన పెట్టుబడులపై 21 కీలక మౌలిక పరిశ్రమ విభాగాల ఉన్నత అధికారులతో సీతారామన్ శుక్రవారం సమావేశమయ్యారు. అనంతర ప్రకటనలో ముఖ్యాంశాలు.. ఆర్థికాభివృద్ధికి తగిన అన్ని చర్యలనూ కేంద్రం తీసుకుంటోంది. ముఖ్యంగా ప్రభుత్వ వ్యయాల పెంపుద్వారా వృద్ధికి ఊతం ఇవ్వాలన్నది ప్రభుత్వ వ్యూహం. ఇందులో భాగంగా వచ్చే నాలుగు త్రైమాసికాలకు సంబంధించిన సమగ్ర వ్యయ ప్రణాళికలను సమర్పించాలని వివిధ మంత్రిత్వశాఖలు, ఆయా విభాగాలను కోరడం జరిగింది. చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకుండా ఉండాలని ప్రభుత్వం ఎంతమాత్రం కోరుకోదు. వివిధ శాఖలకు చేసిన సేవలు, వస్తు సరఫరాలకు సంబంధించి ఎటువంటి బకాయిలు ఉండకూడదనే ఆర్థికశాఖ భావిస్తోంది. ఇందుకు తగిన చర్యలు తీసుకుంటోంది. బడ్జెట్ అంచనాల మేర మూలధన వ్యయాలకు కేంద్రం కట్టుబడి ఉంది. అందుకు తగిన బాటలోనే కొనసాగుతోంది. బడ్జెట్ అంచనాలను అందుకుంటామనడంలో ఎటువంటి సందేహాలూ అక్కర్లేదు.వినియోగం పెరగాలి. రుణ వృద్ధీ జరగాలి. తద్వారా గణనీయమైన ఆర్థిక పురోగతి సాధ్యపడుతుంది. పెట్టుబడులకు ప్రాధాన్యత ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆగస్టు వరకూ చూస్తే, మౌలిక రంగానికి చెందిన పలు మంత్రిత్వశాఖలు తమ మూలధన పెట్టుబడుల ప్రణాళికలు విషయంలో దాదాపు 50 శాతం లక్ష్యా లను సాధించాయని వ్యయ వ్యవహారాల కార్యదర్శి జీసీ ముర్మూ ఈ సందర్భంగా తెలిపారు. 2019–20 బడ్జెట్ ప్రకారం– కేంద్రం వ్యయ లక్ష్యాలు రూ.27.86 లక్షల కోట్లు. ఇందులో ఒక్క మూలధన వ్యయాల మొత్తం రూ.3.38 లక్షల కోట్లు. దీనితోపాటు గ్రాంట్ ఇన్ ఎయిడ్ (జీఏఐ)గా మంత్రిత్వ శాఖలు, విభాగాలకు మరో రూ.2.07 లక్షల కోట్లను క్యాపిటల్ అసెట్స్ సృష్టికి చెల్లించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఆర్థిక పరిస్థితిపై ఎఫ్ఎస్డీసీ సబ్ కమిటీ సమీక్ష ఇదిలావుండగా, ప్రస్తుత దేశ ఆర్థిక పరిస్థితిపై ఆర్థిక స్థిరత్వ, అభివృద్ధి మండలి (ఎఫ్ఎస్డీసీ) సబ్ కమిటీ 23వ సమీక్ష సమావేశం జరిపింది. వ్యవస్థలో నిధుల కొరత (లిక్విడిటీ) రానీయకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చ సమావేశ అంశాల్లో కీలకమైనది. ఆర్థికమంత్రి నేతృత్వం వహిస్తుండగా, ఎఫ్ఎస్డీసీ సబ్ కమిటీకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ నేతృత్వం వహిస్తారు. శుక్రవారం ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అధ్యక్షతన జరిగిన సమావేశం ఫైనాన్షియల్ మార్కెట్ల స్థిరత్వం, ఇందుకు సంబంధించిన చర్యలపై కూడా సమీక్ష జరిపినట్లు ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ఎఫ్ఎస్డీసీలో వివిధ నియంత్రణా సంస్థల ప్రతినిధులు, ఆర్థికశాఖ విభాగాల చీఫ్‌లు ప్రాతినిధ్యం వహిస్తారు. శుక్రవారం నాటి సమావేశంలో జాతీయ, అంతర్జాతీయ ఆర్థిక అంశాలపై చర్చ జరిగింది. -
ఆపిల్ ప్లాన్స్‌కు అడుగడుగునా అడ్డంకులే
న్యూఢిల్లీ : భారత్ లో తయారీ ప్లాంట్ ఏర్పాటుచేయాలని టెక్ దిగ్గజం ఆపిల్ వేస్తున్న ప్లాన్స్ కు అడుగడుగులా అడ్డంకులే ఎదురవుతున్నాయి. ఇటీవలే ఆపిల్ డిమాండ్లను ఆర్థికమంత్రిత్వ శాఖ తిరస్కరించింది. అనంతరం వాణిజ్య,పరిశ్రమల మంత్రిత్వ శాఖ కూడా జీఎస్టీ అమలు తర్వాతనే ఆపిల్ డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకుంటుందని చెబుతోంది. ఆపిల్ కోరుతున్న పన్ను ప్రోత్సహకాలను, ఇతర డిమాండ్లను, ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న జీఎస్టీ తర్వాతనే చూస్తుందని వాణిజ్య, పరిశ్రమల శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ''జీఎస్టీ బిల్లు తర్వలోనే అమలుకాబోతుంది. ఆపిల్ కోరుతున్న పన్నులకు సంబంధించిన ప్రోత్సహకాలను ఇక వేరే కోణంలో చూడాల్సి ఉంది'' అని సీతారామన్ సోమవారం పేర్కొన్నారు. ఐఫోన్ తయారీదారి ఆపిల్ అడిగే చాలా డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించడం లేదని ఆమె చెప్పారు. ఆపిల్ ఈ ఏడాదే బెంగళూరులో ఐఫోన్ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటుచేయాలని ప్లాన్ వేసింది. కానీ ఆపిల్ అడిగే పలు డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించడం లేదు. దీంతో ఆపిల్ ప్లాంట్ కు అడుగడుగునా అడ్డంకులే ఎదురవుతున్నాయి. ప్రస్తుతం ఆపిల్ చైనా, బ్రెజిల్ లో తన తయారీ ప్లాంట్లను ఏర్పాటుచేసింది. పన్ను ప్రోత్సహకాలతో పాటు తప్పనిసరిగా 30 శాతం స్థానిక వనరులే ఉండాలనే నిబంధనన నుంచి తమకు మినహాయింపు ఇవ్వాలని ఆపిల్ కోరుతోంది.దేశంలో పూర్తిగా తన రిటైల్ అవుట్‌లెట్స్ ను ప్రారంభించాలనీ ఆపిల్ ప్లాన్ చేస్తోంది. ఐఫోన్ల తయారీకి ఆపిల్ తయారుచేసిన బ్లూప్రింట్ కు ప్రభుత్వం సముఖత వ్యక్తంచేసినట్టు ఆపిల్ జనవరిలో సంకేతాలు ఇచ్చింది. కానీ తాజాగా ఆపిల్ కోరుతున్న డిమాండ్లను ఆర్థికమంత్రిత్వ శాఖ తిరస్కరించింది. -
స్థానికం వేగవంతం
► రంగంలోకి ఎన్నికల అధికారులు ► 31 జిల్లాలకు నియామకం ► త్వరలో మోగనున్న నగారా స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లు వేగవంతం అయ్యాయి. రంగంలోకి ఎన్నికల అధికారులు దిగారు. 31 జిల్లాలకు ఎన్నికల అధికారుల్ని నియమిస్తూ రాష్ట్ర ఎన్నికల అధికారి సీతారామన్ ఆదేశాల మేరకు కార్యదర్శి రాజశేఖర్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. సాక్షి, చెన్నై: రాష్ట్రంలో చెన్నై, తిరుచ్చి, మదురై, కోయంబత్తూరు, వేలూరు, తిరునల్వేలి, దిండుగల్, తంజావూరులతో పాటు పన్నెండు కార్పొరేషన్లు, 123 మున్సిపాలిటీలు, 529 పట్టణ పంచాయతీలు, 12 వేల గ్రామ పంచాయతీలు జిల్లా పరిషత్, జిల్లాకు ఐదారు చొప్పున యూనియన్ పంచాయతీలు ఉన్నాయి. వీటిలోని లక్షా 30 వేలకు పైగా స్థానిక సంస్థల ప్రతినిధుల పదవీ కాలం గత ఏడాదితో ముగిసింది. ఎన్నికల నిర్వహణలో చోటుచేసుకున్న గందరగోళం, రిజర్వేషన్ల వర్తింపు వ్యవహారంపై హైకోర్టు తీవ్రంగానే స్పందించడంతో ఓ సారి విడుదల చేసిన నోటిఫికేషన్ రద్దు అయింది. ప్రస్తుతం మే పదిహేనులోపు ఎన్నికల్ని పూర్తి చేయాలని మద్రాసు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో ఆగమేఘాలపై ఏర్పాట్లను రాష్ట్ర ఎన్నికల అధికారులు చేస్తున్నారు. చెన్నై కోయంబేడులోని రాష్ట్ర కార్యాలయంలో ఎన్నికల అధికారి సీతారామన్ ఇందుకు తగ్గ కసరత్తుల్లో పడ్డారు. ఈ పరిస్థితుల్లో జిల్లాల వారీగా ఎన్నికల అధికారుల్ని ప్రత్యేకంగా రంగంలోకి దించుతూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఆయా జిల్లాల కలెక్టర్ల పర్యవేక్షణలో స్థానిక ఎన్నికల కసరత్తులు ఇప్పటికే సాగాయి. అయితే, ఎన్నికల అధికారుల పర్యవేక్షణలో పూర్తి స్థాయి కసరత్తులకు సీతారామన్ ఆదేశాలు జారీ చేశారు. చెన్నై మినహా తక్కిన 31 జిల్లాలకు ఎన్నికల అధికారుల్ని రంగంలోకి దించారు. ఈ అధికారులు తుది ఓటర్ల జాబితా, గ్రామ, పట్టణ, యూనియన్, జిల్లా పరిషత్ కౌన్సిలర్లు, అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు తగ్గ జాబితాల రూపకల్పన, తదితర పనులపై దృష్టి కేంద్రీకరించనుంది. ఆయా జిల్లాలకు నియమించిన ఎన్నికల అధికారుల వివరాలను సీతారామన్ ఆదేశాల మేరకు ఆయన కార్యదర్శి రాజశేఖర్ విడుదల చేయడంతో, పనుల వేగం మరింతగా పెంచే పనిలో జిల్లాల్లోని అధికారులు నిమగ్నమయ్యారు. వారంలోపు అన్ని పనుల్ని పూర్తి చేసి ఆయా జిల్లాల నుంచి రాష్ట్ర కార్యాలయానికి నివేదిక సమర్పించేందుకు తగ్గ కార్యాచరణతో ప్రత్యేక ఎన్నికల అధికారులు రంగంలోకి దిగడంతో, మరి కొద్ది రోజుల్లో స్థానిక నగారా మోగే అవకాశాలు ఉన్నట్టు ఎన్నికల వర్గాలు పేర్కొంటున్నాయి.