భరించే స్థాయికి తగ్గించాలి
బీమా తదితర ఉత్పత్తులను తప్పుడు మార్గాల్లో కస్టమర్లకు అంటగట్టొద్దు...
బ్యాంక్‌లకు ఆర్థిక మంత్రి సీతారామన్ సూచన
ముంబై: ప్రస్తుత వడ్డీ రేట్లను ప్రజలు భారంగా భావిస్తున్నారని, కనుక వాటిని అందుబాటు స్థాయికి తీసుకురావాలంటూ బ్యాంక్‌లకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. ఎస్‌బీఐ నిర్వహించిన వార్షిక వ్యాపార సదస్సులో భాగంగా ఆమె మాట్లాడారు. ప్రస్తుతం భారతీయ పరిశ్రమలు కొత్త సామర్థ్యాలపై పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉందంటూ.. వడ్డీ రేట్లను తగ్గించడం వికసిత్ భారత్ ఆకాంక్షను సాధించడంలో సాయపడుతుందన్నారు. ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చేందుకు వీలుగా ఆర్‌బీఐ వడ్డీ రేట్లను తగ్గించాలని, ఈ విషయంలో ఆహారపరమైన ద్రవ్యోల్బణాన్ని అవరోధంగా చూడడం సరికాదంటూ కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ సైతం వ్యాఖ్యానించడం తెలిసిందే. అక్టోబర్ నెలకు రిటైల్ ద్రవ్యోల్బణం 6.2 శాతానికి చేరడంతో ఆర్‌బీఐ ఇప్పట్లో వడ్డీరేట్లు తగ్గించకపోవచ్చన్న అంచనాలు నెలకొన్నాయి.
సామాన్యులపై ద్రవ్యోల్బణ భారం: ద్రవ్యోల్బణానికి ప్రధానంగా మూడు లేదా నాలుగు కమోడిటీలు కారణమవుతున్నాయని మంత్రి సీతారామన్ పేర్కొన్నారు. మిగిలిన ప్రధాన ఐటమ్స్ అన్నీ కూడా మూడు లేదా నాలుగు శాతం ద్రవ్యోల్బణం స్థాయిలోనే ఉన్నట్టు చెప్పారు. ద్రవ్యోల్బణం సూచీ లేదా ఆర్‌బీఐ వడ్డీ రేట్ల తగ్గింపునకు ఆహార ధరలను పరిగణనలోకి తీసుకోవాలా? లేదా అన్న చర్చలోకి తాను వెళ్లాలనుకోవడం లేదన్నారు. ద్రవ్యోల్బణం ఎంతో సంక్లిష్టమైనదని, సామాన్యులపై భారం మోపుతుందంటూ.. సరఫరా వైపు చర్యలపై ప్రభుత్వం దృష్టి సారించినట్టు చెప్పారు.
వృద్ధి మందగమనంపై ఆందోళనలు అక్కర్లేదన్నారు. క్షేత్రస్థాయిలో కార్యకలాపాలు బలంగా ఉన్నట్టు కొన్ని సంకేతాలు తెలియజేస్తున్నట్టు పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థ వృద్ధి ప్రభుత్వానికి ముఖ్యమని స్పష్టం చేశారు. బ్యాంక్‌లు ప్రధానంగా రుణ వితరణ కార్యకలాపాలకే పరిమితం కావాలని, బీమా తదితర ఉత్పత్తులను తప్పుడు మార్గాల్లో కస్టమర్లకు అంటగట్టొద్దని, ఇది రుణాలను భారంగా మారుస్తుందని పేర్కొన్నారు. బ్యాంకింగ్ రంగంపై ప్రజల విశ్వాసాన్ని పెంచుకోవడంలో ఇది చాలా కీలకమని సీతారామన్ స్పష్టం చేశారు. ఎంఎస్‌ఎంఈలకు 2025–26లో రూ.6.12 లక్షల కోట్లు, 2026–27లో రూ.7 లక్షల కోట్ల మేర రుణ వితరణ లక్ష్యాలను నిర్దేశించినట్టు ఆమె తెలిపారు.
అనైతిక విధానాలను అరికట్టండి: దాస్
ముంబై: సరైన కేవైసీ ధ్రువీకరణ లేకుండా ఖాతాలు తెరవడం, అబద్ధాలు చెప్పి ఉత్పత్తులను అంటగట్టడం వంటి అనైతిక విధానాలకు అడ్డుకట్ట వేసే దిశగా బ్యాంకులు గట్టి చర్యలు తీసుకోవాలని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ సూచించారు. ఇందుకోసం అంతర్గత గవర్నెన్స్ వ్యవస్థను పటిష్టం చేసుకోవాలని పేర్కొన్నారు. తమ పోర్ట్‌ఫోలియోలను క్రియాశీలకంగా సమీక్షించుకుంటూ ఉండాలని చెప్పారు. పరిశ్రమల్లో విప్లవాత్మకమైన మార్పుల వల్ల తలెత్తే ముప్పులు.. సవాళ్లను ముందస్తుగా గుర్తించి, నివారించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రైవేట్ రంగ బ్యాంకుల డైరెక్టర్ల సదస్సులో కీలకోపన్యాసం చేసిన సందర్భంగా దాస్ ఈ విషయాలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment