ఆపిల్ ప్లాన్స్కు అడుగడుగునా అడ్డంకులే
ఆపిల్ ప్లాన్స్కు అడుగడుగునా అడ్డంకులే
Published Mon, Mar 27 2017 5:24 PM | Last Updated on Tue, Oct 9 2018 4:06 PM
న్యూఢిల్లీ : భారత్ లో తయారీ ప్లాంట్ ఏర్పాటుచేయాలని టెక్ దిగ్గజం ఆపిల్ వేస్తున్న ప్లాన్స్ కు అడుగడుగులా అడ్డంకులే ఎదురవుతున్నాయి. ఇటీవలే ఆపిల్ డిమాండ్లను ఆర్థికమంత్రిత్వ శాఖ తిరస్కరించింది. అనంతరం వాణిజ్య,పరిశ్రమల మంత్రిత్వ శాఖ కూడా జీఎస్టీ అమలు తర్వాతనే ఆపిల్ డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకుంటుందని చెబుతోంది. ఆపిల్ కోరుతున్న పన్ను ప్రోత్సహకాలను, ఇతర డిమాండ్లను, ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న జీఎస్టీ తర్వాతనే చూస్తుందని వాణిజ్య, పరిశ్రమల శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ''జీఎస్టీ బిల్లు తర్వలోనే అమలుకాబోతుంది. ఆపిల్ కోరుతున్న పన్నులకు సంబంధించిన ప్రోత్సహకాలను ఇక వేరే కోణంలో చూడాల్సి ఉంది'' అని సీతారామన్ సోమవారం పేర్కొన్నారు.
ఐఫోన్ తయారీదారి ఆపిల్ అడిగే చాలా డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించడం లేదని ఆమె చెప్పారు. ఆపిల్ ఈ ఏడాదే బెంగళూరులో ఐఫోన్ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటుచేయాలని ప్లాన్ వేసింది. కానీ ఆపిల్ అడిగే పలు డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించడం లేదు. దీంతో ఆపిల్ ప్లాంట్ కు అడుగడుగునా అడ్డంకులే ఎదురవుతున్నాయి. ప్రస్తుతం ఆపిల్ చైనా, బ్రెజిల్ లో తన తయారీ ప్లాంట్లను ఏర్పాటుచేసింది. పన్ను ప్రోత్సహకాలతో పాటు తప్పనిసరిగా 30 శాతం స్థానిక వనరులే ఉండాలనే నిబంధనన నుంచి తమకు మినహాయింపు ఇవ్వాలని ఆపిల్ కోరుతోంది.దేశంలో పూర్తిగా తన రిటైల్ అవుట్లెట్స్ ను ప్రారంభించాలనీ ఆపిల్ ప్లాన్ చేస్తోంది. ఐఫోన్ల తయారీకి ఆపిల్ తయారుచేసిన బ్లూప్రింట్ కు ప్రభుత్వం సముఖత వ్యక్తంచేసినట్టు ఆపిల్ జనవరిలో సంకేతాలు ఇచ్చింది. కానీ తాజాగా ఆపిల్ కోరుతున్న డిమాండ్లను ఆర్థికమంత్రిత్వ శాఖ తిరస్కరించింది.
Advertisement