![Technology in crop marketing - Sakshi](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2024/03/2/tech.jpg.webp?itok=6Va-Sbl-)
పీవీ నరసింహారావు హయాంలో 1994లో ‘స్మాల్ ఫార్మర్స్ అగ్రి–బిజినెస్ కన్సార్టియం’ (ఎస్‌ఎఫ్‌ఏసీ) ఏర్పాటుచేయడం అర్థవంతమైన విధానపరమైన జోక్యం. ఆ సంస్థే ఇప్పుడు వ్యవసాయం కోసం జాతీయ ఎలక్ట్రానిక్ మార్కెట్‌ను ఏర్పాటు చేసే బాధ్యత చూస్తోంది. దీని కారణంగా, 2016లో నరేంద్ర మోదీ ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్’ (ఈ–నామ్) పేరిట ఒక ‘ఫిజిటల్’ (ఫిజికల్ ప్లస్ డిజిటల్) మార్కెట్‌ను ప్రారంభించారు.
దీనివల్ల 23 రాష్ట్రాలు, 4 కేంద్ర పాలిత ప్రాంతాలలోని 1.07 కోట్ల మంది రైతులకు వారి సొంత భాషలో, వారి మొబైల్ ఫోన్ లో లావాదేవీలు జరిపే స్వేచ్ఛ, సౌలభ్యం ఏర్పడ్డాయి. 2024 జనవరి నాటికి, ఈ–నామ్ వల్ల రూ. 3 లక్షల కోట్లకు పైగా వ్యాపారం జరిగింది. దీనికి మరింత ఊపునిచ్చేలా, ఇ–మార్కెట్ ప్లాట్ ఫామ్‌లను ఏర్పాటు చేయడానికిగానూ వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఒక్కో నియంత్రిత మండీకి నిధులు సమకూర్చింది.
మాజీ ప్రధానులు చరణ్ సింగ్, పీవీ నరసింహారావు, శాస్త్రవేత్త–అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ లకు ఇటీవల భారతరత్న ప్రదానం చేయడం భారతీయ రైతు వ్యవస్థాపక స్ఫూర్తికి నివాళి అనే చెప్పాలి. ఈ ముగ్గురూ వ్యవసాయంతో పాటు రైతుల సంక్షేమం కోసం ఎంతో కృషి చేశారు. స్వామినాథన్ అందించిన తోడ్పాటు సుపరిచితమే కాదు, అది అందరూ గుర్తించిన విష యమే.
అయితే హరిత విప్లవాన్ని విజయవంతం చేసిన రాజకీయ ఆర్థిక వ్యవస్థను అర్థం చేసుకోవడం కూడా అంతే ముఖ్యం. సోవియట్, చైనీస్ తరహా ‘సామూహిక వ్యవసాయం’లో ఉన్న ప్రమాదాలను నెహ్రూకి వివరించినది చరణ్ సింగ్. రైతులు రాటు దేలిపోయిన స్వతంత్ర సాగుదారులనీ, ప్రణాళికా సంఘం మెచ్చు కున్న ‘ల్యాండ్ పూలింగ్, సహకార వ్యవసాయం’ అనే కేంద్రీకృత ప్రణాళికను వారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారనీ చరణ్ సింగ్ స్పష్టం చేశారు.
దార్శనికుడి విధాన జోక్యం
పీవీ నరసింహరావు హయాంలో భారతదేశం, ప్రపంచ వాణిజ్య సంస్థలో చేరి వ్యవసాయ ఒప్పందంపై సంతకం చేసింది. అప్పటి వరకు, భారతదేశ విధాన వ్యవస్థ దిగుమతులను పరిమితం చేసింది. పీవీ ఆధ్వర్యంలో, భారతదేశం వ్యవసాయ ఎగుమతులను ఒక ముఖ్యమైన విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించిపెట్టేదిగా చూసింది. ఏపీఈడీఏ (అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ డెవలప్‌మెంట్ అథారిటీ)కి బడ్జెటరీ, సంస్థాగత మద్దతుతో, ఆయన భారతీయ వ్యవసాయాన్ని ప్రపంచవ్యాప్త పోటీదారుగా మార్చడంలో తోడ్పడ్డారు.
అయినప్పటికీ దేశీయ వాణిజ్యం మాత్రం రైతుల కోసం కాకుండా, సేకరణ ఏజెన్సీలకూ, వ్యవసాయ పంటల మార్కెట్ కమిటీ (ఏపీఎంసీ)లలోని నమోదైన వ్యాపారులకూ అనుకూలంగా నిర్బంధ వాణిజ్య పద్ధతుల ద్వారా నిర్వహించబడుతూనే ఉంది. 1994లో ‘స్మాల్ ఫార్మర్స్ అగ్రి–బిజినెస్ కన్సార్టియం’ (ఎస్‌ఎఫ్‌ఏసీ) స్థాపన, పీవీ చేసిన అత్యంత అర్థవంతమైన విధాన పరమైన జోక్యం కావచ్చు. ఈ సంస్థకే వ్యవసాయం కోసం జాతీయ ఎలక్ట్రానిక్ మార్కెట్‌ను ఏర్పాటు చేసే బాధ్యతను అప్పగించారు.
2016 ఏప్రిల్ 14న ప్రధాని నరేంద్ర మోదీ ఎస్‌ఎఫ్‌ఏసీ మద్దతుతో ‘ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్’ (ఈ–నామ్) పేరిట ఒక ‘ఫిజిటల్’ (ఫిజికల్ ప్లస్ డిజిటల్) మార్కెట్‌ను ప్రారంభించారు. ఇది ఫిజికల్ బ్యాక్ ఎండ్‌తో కూడిన సింగిల్ విండో పోర్టల్. కార్యాచరణ సమాచారం, భౌతిక మౌలిక సదుపాయాలు, వాణిజ్య ఎంపికలు, చెల్లింపులపై ఎలక్ట్రానిక్ సెటిల్‌మెంట్లను ఇది అందిస్తుంది.
నేడు, ఎస్‌ఎఫ్‌ఏసీ చేపట్టిన ఈ కార్యక్రమం వల్ల 23 రాష్ట్రాలు, 4 కేంద్ర పాలిత ప్రాంతాలలోని 1,389 నియంత్రిత హోల్‌సేల్ మార్కె ట్‌లలో, 1.07 కోట్ల మంది రైతులు వారి సొంత భాషలో, వారి మొబైల్ ఫోన్‌లలో లావాదేవీలు జరిపే స్వేచ్ఛ, సౌలభ్యం కలిగి ఉన్నారు. భాగస్వామ్య రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మరో 1.7 లక్షల ఇంటిగ్రేటెడ్ లైసెన్ ్సలను జారీ చేశారు. ఈ వేదికకు తమ మద్దతును ప్రతిబింబించేలా దాదాపు 3,500 రైతు ఉత్పత్తిదారులసంఘాలు (ఎఫ్‌పీఓలు) ఇందులో చురుకుగా పాల్గొనడం గమనార్హం. 2024 జనవరి నాటికి, ఈ–నామ్ వల్ల రూ. 3 లక్షల కోట్లకు పైగా వ్యాపారం జరిగింది.
తగిన బాధ్యత
ఈ విజయవంతమైన నేపథ్యాన్ని పంచుకోవడం అత్యవసరం. రైతుకు విపత్కరమైన అమ్మకాల నుండి రక్షణ కల్పించే ఉద్దేశంతో 1950వ దశకంలో ‘ఏపీఎంసీ’లను ప్రవేశపెట్టారు. ‘ధర ఆవిష్క రణ’ను నిర్ధారించడానికీ, కనీస మద్దతు ధర వ్యవస్థలో రాష్ట్ర ఏజెన్సీల ద్వారా సేకరణకు వేదికను అందించడానికీ ఇవి రూపొందాయి. అయితే, ఈ ప్రక్రియలో, వారు మధ్యవర్తుల ప్రత్యేక తరగతిని కూడా సృష్టించారు. నిర్దిష్ట మండీలో దాని అధికారికమైన కమాండ్ ఏరి యాతో లైసెన్ ్స కలిగి ఉన్న వ్యాపారిని స్థిరపరిచారు.
అయితే, భారతదేశం ఐటీ సూపర్‌పవర్‌గా అవతరించడం, రైతు నుండి మార్కెట్ ఉత్పత్తి విధానంలోకి వ్యవసాయం మారడంతో, వాణిజ్య పరిమితి నిబంధనలను మార్చవలసిన అవసరం ఏర్పడింది. సాంకేతికతలు, ఆర్థిక సాధనాల ద్వారా సన్నకారు, చిన్న రైతులకు వాణిజ్య నిబంధనలను మెరుగుపరచడానికి ఎస్‌ఎఫ్‌ఏసీ వంటిసంస్థలు స్థాపితమయ్యాయి. వ్యవసాయ–వ్యాపార వ్యవస్థాపకులకు వెంచర్ క్యాపిటల్ నిధులను అందించడం నుండి మౌలిక సదుపాయాల కల్పన వరకు ఎస్‌ఎఫ్‌ఏసీ కొత్త పుంతలు తొక్కింది. అందుకే ఈ–నామ్ స్థాపన బాధ్యతను ఎస్‌ఎఫ్‌ఏసీకే అప్పగించడంలో ఆశ్చర్యం లేదు మరి.
దీనికి మరింత ఊపునిచ్చేలా, ఇ–మార్కెట్ ప్లాట్ ఫామ్‌లను ఏర్పాటు చేయడానికిగానూ కంప్యూటర్ హార్డ్‌వేర్, ఇంటర్నెట్ సౌకర్యం, పరీక్షా పరికరాలు వంటి సామగ్రి లేదా మౌలిక సదుపాయాల కోసం వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఒక్కో నియంత్రిత మండీకి రూ. 30 లక్షలు మంజూరు చేసింది. క్లీనింగ్, గ్రేడింగ్, ప్యాకేజింగ్ సౌకర్యాలు, బయో–కంపోస్టింగ్ యూనిట్ వంటి అదనపు మౌలిక సదుపాయాల కల్పన కోసం ఈ మొత్తాన్ని 2017లో రూ.75 లక్షలకు పెంచారు.
మొదటి మూడేళ్లలో దాదాపు 200 మండీలను దీని పరిధిలోకి తీసుకురాగా, 2020 మే నాటికి మరో 415 మండీలు జమయ్యాయి. 2022 జూలై నాటికి మరో 260మండీలు, 2023 మార్చి నాటికి మరో 101 మండీలు పెరిగాయి. గత సంవత్సరం ముగిసేనాటికి మరో 28 వీటికి కలిశాయి. ప్రతి త్రైమాసి కంలో ఈ సంఖ్య పెరుగుతూ వస్తోంది.
మరింత పురోగమించేలా...
విధాన రూపకల్పన అనేది సులభం. కానీ భౌతిక, ఐటీ మౌలిక సదుపాయాల కల్పనే కష్టం. ఇంకా కష్టతరమైనది క్షేత్రస్థాయిలో చేసే పని. ఈ–నామ్‌తో అనుసంధానమైన ప్రతి మండీకి ఒక ఏడాది పాటు ప్రారంభ శిక్షణ కోసం ఎస్‌ఎఫ్‌ఏసీ ఒక ఐటీ నిపుణుడిని (మండి విశ్లేషకుడు) గుర్తించి, మద్దతునిస్తుంది. వారు రాష్ట్ర సమన్వయ కర్త(ల)కు నివేదిస్తారు. ఈ సమన్వయకర్తలు ఒక్కొక్కరు 50 మండీల రోజువారీ సమన్వయాన్ని నిర్వహిస్తారు. ఈ–నామ్ విధానంలోని రైతులు, వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లు, మండి అధికారులందరికీ ఉచితంగా శిక్షణ ఇవ్వడం కూడా వీరి బాధ్యత.
తర్వాత ఏమిటి? సాధించిన పురోగతితో ఆగకుండా, ఈ–నామ్ కొత్త, ఉన్నత ప్రమాణాలను ఏర్పరుస్తోంది. దీని సవరించిన ఆదేశంలో రైతులకు పోటీ ధరలను సాధ్యం చేయడం కోసం కృషి చేస్తుంది. ఏపీఎమ్‌సీ నియంత్రిత మార్కెట్ కమిటీ మండీలకు వెలుపల కూడా వేదికలను ఏర్పాటుచేయడం ద్వారా దీన్ని సాధిస్తుంది. ఈ–నామ్ ద్వారా గిడ్డంగి ఆధారిత విక్రయానికి ఎక్కువ ప్రాధాన్యత ఉంది.అంతిమంగా, ధరను కనుగొనడం, విక్రయించే స్వేచ్ఛ అనేవి రైతుకు ఎక్కువ మేలు చేస్తాయి.
- వ్యాసకర్త లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ మాజీ డైరెక్టర్ (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)
- సంజీవ్ చోప్రా
Comments
Please login to add a commentAdd a comment