మాన్‌కొంబు సదాశివన్ స్వామినాథన్.. సరిపడా పంటల ఉత్పత్తి లేక ఆకలితో అలమటిస్తున్న మన దేశానికి అన్నం పెట్టిన అరుదైన శాస్త్రవేత్త. హరిత విప్లవ పితామహుడికి కేంద్ర ప్రభుత్వం భారతరత్న పురస్కారం ప్రకటించింది. దేశం ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకొనే స్థాయి నుంచి పంటల ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించి, ఇప్పుడు విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదిగిందంటే అదంతా ఎంఎస్ స్వామినాథన్ చలవే అని చెప్పడం అతిశయోక్తి కాదు. హరిత విప్లవం, నూతన వంగడాలు, ఆధునిక వ్యవసాయ విధానాలతో దేశాన్ని అన్నపూర్ణగా మార్చారు. తన జీవితాన్ని హరిత విప్లవానికే అంకితం చేశారు. ప్రజలందరికీ పౌష్టికాహారం అందించాలని, ఆహార భద్రత కల్పించాలని అహర్నిశలూ తపించారు. ప్రపంచ ఆహార వ్యవస్థల స్థిరీకరణకు తన వంతు తోడ్పాటునందించారు. తన పరిశోధనల ద్వారా కోట్లాది మంది రైతుల జీవితాల్లో వెలుగులు నింపారు.
► ఎంఎస్ స్వామినాథన్ 1925 ఆగస్టు 7న తమిళనాడులోని కుంభకోణంలో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు పార్వతీ థంగమ్మై, డాక్టర్ ఎం.కె.సాంబశివన్.
► 15 ఏళ్ల నిండకుండానే తండ్రి మరణించడంతో తమ కుటుంబం ఆధ్వర్యంలోని ఆసుపత్రిని నిర్వహించడానికి వైద్య విద్య అభ్యసించాలని నిర్ణయించుకున్నారు. మెడిసిన్‌లో చేరారు.
► విద్యార్థిగా ఉన్నప్పుడు పశ్చిమ బెంగాల్‌లో కరువు పరిస్థితులను చూసి చలించిపోయారు. ఆకలితో ఎవరూ చనిపోయే పరిస్థితి రాకూడదని భావించారు.
► వైద్య విద్యను మధ్యలోనే వదిలేసి కోయంబత్తూరులోని వ్యవసాయ కళాశాలలో చేరారు.
► పీజీ పూర్తయ్యాక సివిల్ సర్విసు పరీక్ష రాశారు. ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. కానీ, అటువైపు మొగ్గు చూపకుండా హాలెండ్‌లో వ్యవసాయ శాస్త్రంలో ఉన్నత విద్య అభ్యసించారు. బంగాళదుంప జన్యు పరిణామంపై పరిశోధనలు సాగించారు. తర్వాత కేంబ్రిడ్జి యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ చేశారు.
► 1954లో ఒడిశాలోని కేంద్ర వరి పరిశోధన సంస్థలో చేరారు. అనంతరం భారతీయ వ్యవసాయ పరిశోధన సంస్థలో అడుగుపెట్టారు.
► ప్రపంచస్థాయి వ్యవసాయ సంస్థల్లో రెండు దశాబ్దాలపాటు పనిచేశారు. పరిశోధనతోపాటు పరిపాలనాపరమైన విధులు నిర్వర్తించారు.
► దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఆహార కొరత తీవ్రంగా ఉండేది. విదేశాల నుంచి ఆహార ధాన్యాలు దిగుమతి చేసుకుంటే తప్ప ఆకలి తీరని పరిస్థితి. అప్పట్లో పంటల దిగుబడి చాలా పరిమితంగా ఉండేది. ఈ పరిస్థితిని మార్చేయాలని స్వామినాథన్ నిర్ణయించుకున్నారు. హరిత విప్లవానికి శ్రీకారం చుట్టారు.
► అధిక దిగుబడినిచ్చే వంగడాలను ప్రవేశపెట్టారు. ఆధునిక వ్యవసాయ యంత్రాలు, పరికరాలను రైతులకు పరిచయం చేశారు. ప్రభుత్వ సహకారంతో సాగునీటి సౌకర్యం పెంచారు. ఎరువులు, పురుగు మందుల వాడకం పెంచారు. సాగు విస్తీర్ణం భారీగా పెంచేందుకు కృషి చేశారు. ఇవన్నీ సత్ఫలితాలు ఇచ్చాయి.
► ప్రధానంగా వరి, గోధుమ వంగడాల అభివృద్ధికి స్వామినాథన్ అధిక ప్రాధాన్యం ఇచ్చారు. హరిత విప్లవంతో దేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది.
► హరిత విప్లవం కారణంగా ఎరువులు, పురుగు మందుల వాడకం పెరిగి భూసారం క్షీణిస్తోందని విమర్శలు వచ్చాయి. వీటితో స్వామినాథన్ ఏకీభవించారు. స్థానికంగా ఉండే వంగడాలను కాపాడుకోవాలని, నీటి యాజమాన్య పద్ధతులు పాటించాలని, భూసారం కోల్పోయేలా రసాయనాలు వాడొద్దని సూచించారు.
► వ్యవసాయ రంగంలో పలు ప్రతిష్టాత్మక సంస్థలకు డైరెక్టర్‌గా, డైరెక్టర్ జనరల్‌గా పనిచేశారు.
► స్వామినాథన్‌ను ఎన్నో పురస్కారాలు వరించాయి. 1971లో రామన్ మెగసెసే, 1986లో వరల్డ్ సైన్స్, 1991లో ఎని్వరాన్‌మెంటల్ అచీవ్‌మెంట్ అవార్డు అందుకున్నారు.
► 1967లో పద్మశ్రీ, 1972లో పద్మభూషణ్, 1989లో పద్మవిభూషణ్ పురస్కారాలు స్వీకరించారు.
► 20వ శతాబ్దంలో అత్యంత ప్రభావశీల వ్యక్తుల్లో ఒకరిగా స్వామినాథన్‌ను ప్రఖ్యాత టైమ్ మేగజైన్ గుర్తించింది.
► 1988లో ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ ఏర్పాటు చేశారు. ఈ సంస్థ 1987లో తొలి ప్రపంచ ఆహార పురస్కారం అందుకుంది.
► 2007 నుంచి 2013 దాకా రాజ్యసభ సభ్యుడిగా సేవలందించారు.
► ప్రపంచవ్యాప్తంగా వివిధ విశ్వవిద్యాలయాల 84 గౌరవ డాక్టరేట్లను ఆయన ప్రదానం చేశాయి.
► 2023 సెప్టెంబర్ 28న 98 ఏళ్ల వయసులో చెన్నైలోని స్వగృహంలో స్వామినాథన్ కన్నుమూశారు.
Comments
Please login to add a commentAdd a comment