సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు తేజం, దివంగత ప్రధాని పాములపర్తి వెంకట నరసింహారావుకు ఎట్టకేలకు దేశ అత్యున్నత పౌర పురస్కారం లభించింది. సార్వత్రిక ఎన్నికల వేళ ఆయనకు కేంద్రం భారతరత్న ప్రకటించింది. మరో దివంగత ప్రధాని చౌదరి చరణ్‌సింగ్, హరిత విప్లవ పితామహుడు డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్‌లను కూడా ఈ అత్యున్నత పురస్కారంతో గౌరవించింది. ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ‘ఎక్స్’వేదికగా ఈ మేరకు వెల్లడించారు. ఆ ముగ్గురు దిగ్గజాలూ దేశానికి చేసిన సేవలు ఎనలేనివంటూ గుర్తు చేసుకున్నారు.
‘‘పీవీ ఆర్థిక సంస్కరణలు దేశానికి కొత్త దిశను, ఆర్థిక రంగానికి నూతన జవసత్వాలను ప్రసాదించాయి. ఇక చరణ్‌సింగ్ రైతు సంక్షేమానికి ఆజన్మాంతం పాటుపడ్డారు. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ ఆహార రంగంలో భారత్ స్వయంసమృద్ధి సాధించడంలో కీలకపాత్ర పోషించారు’’అంటూ ప్రధాని కొనియాడారు. తర్వాత కాసేపటికే ఈ ముగ్గురికీ భారతరత్న ఇస్తున్నట్లు రాష్ట్రపతి భవన్ నుంచి ప్రకటన వెలువడింది.
దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న వేళ ప్రధాని పదవి చేపట్టి ఆర్థిక సంస్కరణలతో ప్రగతి బాట పట్టించిన రాజనీతిజ్ఞుడు పీవీ. అంతర్గత భద్రత మొదలుకుని విదేశాంగ విధానం దాకా, ఆర్థిక రంగం నుంచి రైతు సంక్షేమం దాకా అన్ని అంశాల్లోనూ చెరగని ముద్ర వేసిన ఆయన 2004లో మరణించారు. ఇక చరణ్‌సింగ్ పశి్చమ ఉత్తరప్రదేశ్‌కు చెందిన జాట్ నేత. కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. రెండుసార్లు యూపీ సీఎంగా, అనంతరం కేంద్ర హోం మంత్రిగా రాణించారు. ఎమర్జెన్సీ కాలంలో జైలు జీవితం గడిపారు. 1979లో స్వల్పకాలం ప్రధానిగానూ చేశారు. 1987లో తుదిశ్వాస విడిచారు.
ఆయనదీ, పీవీదీ పూర్తిగా బీజేపీయేతర నేపథ్యమే కావడం గమనార్హం. వారికి భారతరత్న పురస్కారం రాజకీయంగా, సామాజికంగా ఎంతో ప్రభావం చూపగల నిర్ణయమంటున్నారు. ముఖ్యంగా రాజకీయ జీవితాన్నంతా కాంగ్రెస్‌కే ధారపోసిన పీవీకి ఆ పార్టీ సరైన గుర్తింపు, గౌరవం ఇవ్వలేదని ఆయన అభిమానులు ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. ఈ నేపథ్యంలో ఎన్నికల వేళ తెలుగు రాష్ట్రాల్లో దీని ప్రభావం గణనీయంగా ఉంటుందన్న భావన వ్యక్తమవుతోంది. ఇక యూపీలో గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఓడిన 16 స్థానాల్లో ఆరు చరణ్‌సింగ్ మనవడైన జయంత్ సింగ్ సారథ్యంలోని ఆర్‌ఎల్‌డీ ప్రాబల్యమున్నవే.
ఆయనను ఎన్డీఏలో చేర్చుకునేందుకు బీజేపీ కొంతకాలంగా గట్టిగా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో చరణ్‌సింగ్‌కు భారతరత్న ప్రకటించగానే జయంత్ ఎన్డీయేలో చేరుతున్నట్టు వెల్లడించడం విశేషం! ఇక మన్కోంబు సాంబశివన్ స్వామినాథన్ ప్రపంచ ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త. తన విశేష పరిశోధనలతో భారత్‌ను స్వయంసమృద్ధంగా తీర్చిదిద్ది కరువు మహమ్మారిని దేశం నుంచి తరిమికొట్టిన దార్శనికుడు. ఆయన 2023లో మృతి చెందారు. బిహార్ దివంగత ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్‌తో పాటు బీజేపీ సీనియర్ నేత ఎల్‌కే ఆడ్వాణీలకు కూడా ఇటీవలే భారతరత్న ప్రకటించడం తెలిసిందే.
దాంతో ఈ ఏడాది ఈ పురస్కార గ్రహాతల సంఖ్య ఐదుకు చేరింది. ఒకే ఏడాదిలో ఇంతమందికి భారతరత్న ఇవ్వడం ఇదే తొలిసారి. 1999లో అత్యధికంగా నలుగురికి ఈ గౌరవం దక్కింది. 1954 నుంచి ఇప్పటిదాకా మొత్తమ్మీద ఇప్పటిదాకా 53 మందికి భారతరత్న పురస్కారం అందజేశారు. ఈసారి ఈ అవార్డు ప్రకటించిన వారిలో అడ్వాణీ (96) మాత్రమే జీవించి ఉన్నారు.
సంస్కరణల రూపశిల్పి పీవీ...
మాజీ ప్రధాని పీవీని భారతరత్నతో సత్కరిస్తున్నందుకు సంతోíÙస్తున్నామని మోదీ పేర్కొన్నారు. ‘‘ఆయన విశిష్ట పండితుడు. గొప్ప రాజనీతిజు్ఞడు. పలు హోదాలలో దేశానికి అసమాన సేవలందించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, అనేక ఏళ్ల పాటు లోక్‌సభ, శాసనసభ సభ్యునిగా ఆయన చేసిన కృషి మరులేనిది. దేశ ఆరి్ధకాభివృధ్ధిలో దూరదృష్టితో కూడిన ఆయన నాయకత్వం అతి కీలకపాత్ర పోషించింది.
దేశ శ్రేయస్సుకు, అభివృద్ధికి బలమైన పునాది వేసింది. భారత మార్కెట్లను ప్రపంచానికి తెరుస్తూ ప్రధానిగా పీవీ తెచ్చిన సంస్కరణలు చాలా కీలకమైనవి. తద్వారా ఆర్థిక రంగంలో నూతన శకానికి తెర తీశారు పీవీ. విదేశాంగ విధానాన్ని సమూలంగా మార్చేయడమే గాక భాష, విద్య తదితర రంగాలెన్నింటిపైనో చెరగని ముద్ర వేశారు. క్లిష్ట పరిస్థితుల్లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టి దేశ సాంస్కృతిక, మేధో వారసత్వాన్ని సుసంపన్నం చేసిన బహుముఖ ప్రజ్ఞశాలి పీవీ’’అంటూ ప్రస్తుతించారు.
మార్గదర్శకుడు స్వామినాథన్...
వ్యవసాయ రంగానికి, రైతు సంక్షేమానికి స్వామినాథన్ చేసిన సేవలు మరవలేనివని మోదీ అన్నారు. ‘‘క్లిష్ట సమయంలో దేశం వ్యవసాయ స్వావలంబన సాధించడంలో ఆయనది కీలక పాత్ర. దేశ వ్యవసాయాన్ని ఆధునీకరించే దిశగా అద్భుతమైన ప్రయోగాలు చేశారు. స్వామినాథన్ దార్శనికత సాగు తీరుతెన్నులనే సమూలంగా మార్చడమే గాక దేశ ఆహార భద్రతకు, శ్రేయస్సుకు బాటలు పరిచింది. నాకాయన ఎంతగానో తెలుసు. ఆయన అంతర్ దృష్టిని నేనెప్పుడూ గౌరవిస్తాను. స్వామినాథన్ బాటలో యువతను, విద్యార్థులను పరిశోధనల దిశగా ప్రోత్సహిస్తున్నాం’’అని వివరించారు.
రైతు సంక్షేమానికి అంకితం...
దివంగత ప్రధాని చరణ్‌సింగ్‌ను భారతరత్నతో సత్కరించడం తమ ప్రభుత్వ అదృష్టమని మోదీ అన్నారు. ‘‘దేశానికి ఆయన చేసిన సాటిలేని కృషికి ఈ గౌరవం అంకితం. ఆయన జీవితమంతా రైతుల హక్కులు, సంక్షేమానికే అంకితం చేశారు. దేశ నిర్మాణంలో తనదైన ముద్ర వేశారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా నిలిచారు. ప్రజాస్వామ్యం పట్ల ఆయన నిబద్ధత యావత్ జాతికి స్ఫూర్తిదాయకం’’అంటూ కొనియాడారు.
స్వాగతించిన పార్టీలు
పీవీ, చరణ్‌సింగ్, ఎంఎస్‌లకు భారతరత్న ప్రకటించడంపై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నిర్ణయాన్ని పార్టీలకు అతీతంగా నేతలంతా స్వాగతించారు. వారు ముగ్గురూ ఎప్పటికీ భారతరత్నాలేనని కాంగ్రెస్ పేర్కొంది. కాంగ్రెస్ తరఫున ఈ నిర్ణయాన్ని పూర్తిగా స్వాగతిస్తున్నట్టు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎక్స్‌లో పోస్ట్ చేశారు. జాతి నిర్మాణానికి పీవీ చేసిన కృషి ఎనలేనిదని ప్రస్తుతించారు. ఆర్థికం, విదేశాంగం, వ్యవసాయం, అణు శక్తి మొదలుకుని లుక్ ఈస్ట్ పాలసీ దాకా ఆయన కృషిని ఒక్కొక్కటిగా ఖర్గే ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు.
మరోవైపు, పీవీకి భారతరత్న రావడంపై ఏమంటారని కాంగ్రెస్ అగ్ర నేత సోనియాగాందీని పార్లమెంటు బయట మీడియా ప్రత్యేకంగా ప్రశ్నించడం విశేషం. ‘‘నేను స్వాగతిస్తున్నా. కచ్చితంగా’’అంటూ ముక్తసరి స్పందనతో సరిపెట్టారామె. స్వామినాథన్‌కు భారతరత్న ప్రకటించిన మోదీ, ఆయన ఫార్ములా ఆధారంగా రూపొందిన కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడంపై మాత్రం మూగనోము పట్టారంటూ కాంగ్రెస్ విమర్శించింది.
ఇలాంటి నిర్ణయాల్లో బీజేపీ పార్టీ రాజకీయాలకు అతీతంగా వ్యవహరిస్తుందని మరోసారి రుజువైందని పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొన్నారు. వారికి ఎప్పుడో ఈ గౌరవం దక్కి ఉండాల్సిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అభిప్రాయపడ్డారు. పీవీకి భారతరత్న ఇవ్వడాన్ని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రస్తుతించారు.
Comments
Please login to add a commentAdd a comment