chaudhary charan singh
-
పీవీ, చరణ్ సింగ్ సహా నలుగురికి భారతరత్న ప్రదానం
సాక్షి, న్యూఢిల్లీ: మాజీ ప్రధాన మంత్రులు పీవీ నరసింహారావు, చౌదరి చరణ్ సింగ్, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్, బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్లకు మరణానంతరం దేశ అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’ను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శనివారం ప్రదానం చేశారు. పీవీ నరసింహారావు తరఫున ఆయన కుమారుడు పీవీ ప్రభాకర్‌రావు, చరణ్ సింగ్ తరఫున ఆయన మనవడు జయంత్ చౌదరి, ఎంఎస్ స్వామినాథన్ తరఫున ఆయన కుమార్తె నిత్యా రావు, కర్పూరీ ఠాకూర్ తరఫున కుమారుడు రాంనాథ్ ఠాకూర్ పురస్కారాన్ని అందుకున్నారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే హాజరయ్యారు. ఈ సందర్భంగా పీవీ సేవలను స్మరించుకుంటూ ప్రధాని నరేంద్ర మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. బీజేపీ నేత ఎల్కే అద్వానీకి భారతరత్న పురస్కారాన్ని ఆదివారం ఆయన నివాసంలో రాష్ట్రపతి ప్రదానం చేయనున్నారు. -
పీవీకి భారతరత్న
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు తేజం, దివంగత ప్రధాని పాములపర్తి వెంకట నరసింహారావుకు ఎట్టకేలకు దేశ అత్యున్నత పౌర పురస్కారం లభించింది. సార్వత్రిక ఎన్నికల వేళ ఆయనకు కేంద్రం భారతరత్న ప్రకటించింది. మరో దివంగత ప్రధాని చౌదరి చరణ్‌సింగ్, హరిత విప్లవ పితామహుడు డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్‌లను కూడా ఈ అత్యున్నత పురస్కారంతో గౌరవించింది. ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ‘ఎక్స్’వేదికగా ఈ మేరకు వెల్లడించారు. ఆ ముగ్గురు దిగ్గజాలూ దేశానికి చేసిన సేవలు ఎనలేనివంటూ గుర్తు చేసుకున్నారు. ‘‘పీవీ ఆర్థిక సంస్కరణలు దేశానికి కొత్త దిశను, ఆర్థిక రంగానికి నూతన జవసత్వాలను ప్రసాదించాయి. ఇక చరణ్‌సింగ్ రైతు సంక్షేమానికి ఆజన్మాంతం పాటుపడ్డారు. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ ఆహార రంగంలో భారత్ స్వయంసమృద్ధి సాధించడంలో కీలకపాత్ర పోషించారు’’అంటూ ప్రధాని కొనియాడారు. తర్వాత కాసేపటికే ఈ ముగ్గురికీ భారతరత్న ఇస్తున్నట్లు రాష్ట్రపతి భవన్ నుంచి ప్రకటన వెలువడింది. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న వేళ ప్రధాని పదవి చేపట్టి ఆర్థిక సంస్కరణలతో ప్రగతి బాట పట్టించిన రాజనీతిజ్ఞుడు పీవీ. అంతర్గత భద్రత మొదలుకుని విదేశాంగ విధానం దాకా, ఆర్థిక రంగం నుంచి రైతు సంక్షేమం దాకా అన్ని అంశాల్లోనూ చెరగని ముద్ర వేసిన ఆయన 2004లో మరణించారు. ఇక చరణ్‌సింగ్ పశి్చమ ఉత్తరప్రదేశ్‌కు చెందిన జాట్ నేత. కాంగ్రెస్ వ్యతిరేక రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. రెండుసార్లు యూపీ సీఎంగా, అనంతరం కేంద్ర హోం మంత్రిగా రాణించారు. ఎమర్జెన్సీ కాలంలో జైలు జీవితం గడిపారు. 1979లో స్వల్పకాలం ప్రధానిగానూ చేశారు. 1987లో తుదిశ్వాస విడిచారు. ఆయనదీ, పీవీదీ పూర్తిగా బీజేపీయేతర నేపథ్యమే కావడం గమనార్హం. వారికి భారతరత్న పురస్కారం రాజకీయంగా, సామాజికంగా ఎంతో ప్రభావం చూపగల నిర్ణయమంటున్నారు. ముఖ్యంగా రాజకీయ జీవితాన్నంతా కాంగ్రెస్‌కే ధారపోసిన పీవీకి ఆ పార్టీ సరైన గుర్తింపు, గౌరవం ఇవ్వలేదని ఆయన అభిమానులు ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. ఈ నేపథ్యంలో ఎన్నికల వేళ తెలుగు రాష్ట్రాల్లో దీని ప్రభావం గణనీయంగా ఉంటుందన్న భావన వ్యక్తమవుతోంది. ఇక యూపీలో గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఓడిన 16 స్థానాల్లో ఆరు చరణ్‌సింగ్ మనవడైన జయంత్ సింగ్ సారథ్యంలోని ఆర్ఎల్డీ ప్రాబల్యమున్నవే. ఆయనను ఎన్డీఏలో చేర్చుకునేందుకు బీజేపీ కొంతకాలంగా గట్టిగా ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో చరణ్‌సింగ్‌కు భారతరత్న ప్రకటించగానే జయంత్ ఎన్డీయేలో చేరుతున్నట్టు వెల్లడించడం విశేషం! ఇక మన్‌కోంబు సాంబశివన్ స్వామినాథన్ ప్రపంచ ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త. తన విశేష పరిశోధనలతో భారత్‌ను స్వయంసమృద్ధంగా తీర్చిదిద్ది కరువు మహమ్మారిని దేశం నుంచి తరిమికొట్టిన దార్శనికుడు. ఆయన 2023లో మృతి చెందారు. బిహార్ దివంగత ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్‌తో పాటు బీజేపీ సీనియర్ నేత ఎల్కే ఆడ్వాణీలకు కూడా ఇటీవలే భారతరత్న ప్రకటించడం తెలిసిందే. దాంతో ఈ ఏడాది ఈ పురస్కార గ్రహాతల సంఖ్య ఐదుకు చేరింది. ఒకే ఏడాదిలో ఇంతమందికి భారతరత్న ఇవ్వడం ఇదే తొలిసారి. 1999లో అత్యధికంగా నలుగురికి ఈ గౌరవం దక్కింది. 1954 నుంచి ఇప్పటిదాకా మొత్తమ్మీద ఇప్పటిదాకా 53 మందికి భారతరత్న పురస్కారం అందజేశారు. ఈసారి ఈ అవార్డు ప్రకటించిన వారిలో అడ్వాణీ (96) మాత్రమే జీవించి ఉన్నారు. సంస్కరణల రూపశిల్పి పీవీ... మాజీ ప్రధాని పీవీని భారతరత్నతో సత్కరిస్తున్నందుకు సంతోíÙస్తున్నామని మోదీ పేర్కొన్నారు. ‘‘ఆయన విశిష్ట పండితుడు. గొప్ప రాజనీతిజు్ఞడు. పలు హోదాలలో దేశానికి అసమాన సేవలందించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, కేంద్ర మంత్రిగా, అనేక ఏళ్ల పాటు లోక్‌సభ, శాసనసభ సభ్యునిగా ఆయన చేసిన కృషి మరులేనిది. దేశ ఆరి్ధకాభివృధ్ధిలో దూరదృష్టితో కూడిన ఆయన నాయకత్వం అతి కీలకపాత్ర పోషించింది. దేశ శ్రేయస్సుకు, అభివృద్ధికి బలమైన పునాది వేసింది. భారత మార్కెట్లను ప్రపంచానికి తెరుస్తూ ప్రధానిగా పీవీ తెచ్చిన సంస్కరణలు చాలా కీలకమైనవి. తద్వారా ఆర్థిక రంగంలో నూతన శకానికి తెర తీశారు పీవీ. విదేశాంగ విధానాన్ని సమూలంగా మార్చేయడమే గాక భాష, విద్య తదితర రంగాలెన్నింటిపైనో చెరగని ముద్ర వేశారు. క్లిష్ట పరిస్థితుల్లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టి దేశ సాంస్కృతిక, మేధో వారసత్వాన్ని సుసంపన్నం చేసిన బహుముఖ ప్రజ్ఞశాలి పీవీ’’అంటూ ప్రస్తుతించారు. మార్గదర్శకుడు స్వామినాథన్... వ్యవసాయ రంగానికి, రైతు సంక్షేమానికి స్వామినాథన్ చేసిన సేవలు మరవలేనివని మోదీ అన్నారు. ‘‘క్లిష్ట సమయంలో దేశం వ్యవసాయ స్వావలంబన సాధించడంలో ఆయనది కీలక పాత్ర. దేశ వ్యవసాయాన్ని ఆధునీకరించే దిశగా అద్భుతమైన ప్రయోగాలు చేశారు. స్వామినాథన్ దార్శనికత సాగు తీరుతెన్నులనే సమూలంగా మార్చడమే గాక దేశ ఆహార భద్రతకు, శ్రేయస్సుకు బాటలు పరిచింది. నాకాయన ఎంతగానో తెలుసు. ఆయన అంతర్ దృష్టిని నేనెప్పుడూ గౌరవిస్తాను. స్వామినాథన్ బాటలో యువతను, విద్యార్థులను పరిశోధనల దిశగా ప్రోత్సహిస్తున్నాం’’అని వివరించారు. రైతు సంక్షేమానికి అంకితం... దివంగత ప్రధాని చరణ్‌సింగ్‌ను భారతరత్నతో సత్కరించడం తమ ప్రభుత్వ అదృష్టమని మోదీ అన్నారు. ‘‘దేశానికి ఆయన చేసిన సాటిలేని కృషికి ఈ గౌరవం అంకితం. ఆయన జీవితమంతా రైతుల హక్కులు, సంక్షేమానికే అంకితం చేశారు. దేశ నిర్మాణంలో తనదైన ముద్ర వేశారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా నిలిచారు. ప్రజాస్వామ్యం పట్ల ఆయన నిబద్ధత యావత్ జాతికి స్ఫూర్తిదాయకం’’అంటూ కొనియాడారు. స్వాగతించిన పార్టీలు పీవీ, చరణ్‌సింగ్, ఎంఎస్‌లకు భారతరత్న ప్రకటించడంపై దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నిర్ణయాన్ని పార్టీలకు అతీతంగా నేతలంతా స్వాగతించారు. వారు ముగ్గురూ ఎప్పటికీ భారతరత్నాలేనని కాంగ్రెస్ పేర్కొంది. కాంగ్రెస్ తరఫున ఈ నిర్ణయాన్ని పూర్తిగా స్వాగతిస్తున్నట్టు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎక్స్‌లో పోస్ట్ చేశారు. జాతి నిర్మాణానికి పీవీ చేసిన కృషి ఎనలేనిదని ప్రస్తుతించారు. ఆర్థికం, విదేశాంగం, వ్యవసాయం, అణు శక్తి మొదలుకుని లుక్ ఈస్ట్ పాలసీ దాకా ఆయన కృషిని ఒక్కొక్కటిగా ఖర్గే ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు. మరోవైపు, పీవీకి భారతరత్న రావడంపై ఏమంటారని కాంగ్రెస్ అగ్ర నేత సోనియాగాందీని పార్లమెంటు బయట మీడియా ప్రత్యేకంగా ప్రశ్నించడం విశేషం. ‘‘నేను స్వాగతిస్తున్నా. కచ్చితంగా’’అంటూ ముక్తసరి స్పందనతో సరిపెట్టారామె. స్వామినాథన్‌కు భారతరత్న ప్రకటించిన మోదీ, ఆయన ఫార్ములా ఆధారంగా రూపొందిన కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడంపై మాత్రం మూగనోము పట్టారంటూ కాంగ్రెస్ విమర్శించింది. ఇలాంటి నిర్ణయాల్లో బీజేపీ పార్టీ రాజకీయాలకు అతీతంగా వ్యవహరిస్తుందని మరోసారి రుజువైందని పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొన్నారు. వారికి ఎప్పుడో ఈ గౌరవం దక్కి ఉండాల్సిందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అభిప్రాయపడ్డారు. పీవీకి భారతరత్న ఇవ్వడాన్ని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రస్తుతించారు. -
స్కార్ఫ్‌లపై యూనివర్సిటీ సంచలన నిర్ణయం
మీరట్ : చౌదరి చరణ్ సింగ్ విశ్వవిద్యాలయం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. ఇక మీదట కాలేజీ విద్యార్ధినులు స్కార్ఫ్ ధరించి యూనివర్సిటీలో ప్రవేశించకూడదనే నిబంధనను తీసుకువచ్చింది. యూనివర్సిటీకి చెందని వారిని క్యాంపస్‌లోకి రాకుండా నియంత్రించడానికే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు యూనివర్సిటీ అధికారులు ప్రకటించారు. అయితే విశ్వవిద్యాలయాల్లో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇదే ప్రథమం. ఈ వియషం గురించి యూనివర్సిటీ అధికారులు ‘గత కొద్ది రోజులుగా యూనివర్సిటీకి చెందని యువతులు అనేక మంది కాలేజీ పరిసారాల్లో కనిపిస్తున్నారు. వారిని తమ ఐడెంటీని చూపించమని అడిగినప్పుడు ఎవరి దగ్గర సరైన ఆధారాలు లేవు. అమ్మాయిలు స్కార్ఫ్ ధరించి యూనివర్సిటీలోకి ప్రవేశించడం వలన క్యాంపస్‌కు చెందిన అమ్మాయిలా లేకా బయటి వారా అనే విషయం గుర్తించడం కష్టమవుతుంది. అందువల్లే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. దీని వల్ల క్యాంపస్ విద్యార్ధినులకు కలిగే నష్టం ఏం లేదు ’అని తెలిపారు. అయితే యూనివర్సిటీ నిర్ణయం పట్ల మిశ్రమ స్పందన వ్యక్తమవుతుంది. కొందరు విద్యార్ధులు దీన్ని సమర్ధించగా మరి కొందరు మాత్రం ‘కాలేజిలోకి బయటి వారిని రాకుండా నియంత్రించాల్సిన బాధ్యత యూనివర్సిటీది. వారు ఈ బాధ్యతను సక్రమంగా నిర్వహించలేక ఇలాంటి నిర్ణాయాన్ని తీసుకున్నారు. దీనివల్ల క్యాంపస్ వాతావరణం దెబ్బతింటుంద’ని విమర్శించారు. -
గ్రామీణ ప్రజాబంధు చరణ్ సింగ్
అభిప్రాయం జమిందారీ విధానం రద్దు అయిన తరువాత అప్పటికి వాస్తవంగా భూమిని సాగుచేస్తూ ఉన్న కోట్లాది మంది కౌలుదారులకు, గ్రామీణ పేదలకు భూమిపైన హక్కు కల్గించిన రైతు బాంధవుడు చరణ్‌సింగ్. భారతీయ రైతాంగ సమస్యల పరిష్కారంలో అద్వితీయ పాత్ర పోషించిన రైతుజన బాంధవుడు చౌదరి చరణ్‌సింగ్. జిల్లా స్థాయి నుంచి ప్రధానమంత్రి స్థాయికి ఎది గిన క్రమంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి, రైతు సంక్షేమానికి తుదివరకు చిత్తశుద్ధితో ప్రయత్నించిన వారిలో అగ్రగణ్యులు చరణ్ సింగ్. సహకార వ్యవసాయం భారతీయ వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలో పడవేస్తుందన్న అభిప్రాయంతో, జవహర్లాల్ నెహ్రూ విధానాలనే ధిక్కరిం చిన ధీరుడు చరణ్‌సింగ్. 1902 డిసెంబర్ 23న పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ జిల్లాలో భడోల్ అనే చిన్న గ్రామంలో మధ్య తరగతి రైతు కుటుంబంలో జన్మించిన చౌదరి చరణ్ సింగ్ 1923లో సైన్స్‌లో డిగ్రీని పొంది 1925లో ఆగ్రా యూనివర్సిటీ నుండి ఎం.ఏ., ఎం.ఎల్. పట్టాలను పొందారు. వృత్తిపరంగానేకాక గ్రామీణ ప్రజల సమస్యలను ప్రత్యేకంగా వ్యవసాయదారుల కష్టసుఖాలను క్షుణ్ణంగా అవగాహన చేసుకొని గ్రామీణ ప్రజానీకంతో మమేకం అయ్యేవారు. ఈ క్రమంలో 1931లోనే జిల్లా బోర్డు సభ్యునిగా ఎన్నికయ్యారు, ఛాప్రౌలీ శాసనసభా నియోజకవర్గం నుంచి 1937–1974 దాకా శాసన సభ్యుడిగా వరుసగా ఎన్నికవుతూ వచ్చారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి రెండుసార్లు ముఖ్యమంత్రిగా, కేంద్రంలో జనతా ప్రభుత్వంలో ఆర్థికమంత్రి, ఉప ప్రధాని పదవులను నిర్వహించారు. 6 నెల లకే ప్రధాని పదవి నుంచి వైదొలగవలసి వచ్చిన చరణ్‌సింగ్ 29 మే 1987న అసువులు బాశారు. స్వతహాగా రైతు కుటుంబంలో నుంచి వచ్చిన చరణ్‌సింగ్ వ్యవసాయ రంగంలో రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు, కుమ్మరి, కమ్మరి, వడ్రంగి, చేనేత మున్నగు చేతివృత్తుల వారి మధ్య సంబంధాలను, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బాగా అవగాహన చేసుకొన్న వ్యక్తి. జవహర్లాల్ నెహ్రూ సహకార వ్యవసాయాన్ని చేపట్టాలని నాగపూర్ కాంగ్రెస్‌లో తీర్మానం చేయించిన సందర్భంలో ఆచార్య ఎన్జీరంగా వలనే చరణ్‌సింగ్ కూడా దాన్ని తీవ్రంగా వ్యతిరేకిం చారు. సహకార వ్యవసాయంతో వ్యవసాయ రంగం సంక్షోభంలో పడుతుందని, దీర్ఘకాలంలో వ్యవసాయ ఉత్పత్తికి దెబ్బ తగులుతుందని చెబుతూ వివరణాత్మక పుస్తకాలను రచించి, ప్రచారం కూడా చేశారు. జమిందారీ విధానం రద్దు అయిన తరువాత అప్పటికి వాస్తవంగా భూమిని సాగుచేస్తూ ఉన్న కోట్లాదిమందికి కౌలుదారులు, గ్రామీణ పేదలకు భూమిపైన హక్కు కల్గించిన గొప్ప వ్యక్తి చరణ్‌సింగ్. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే దళారుల దోపిడీ నుంచి సన్నకారు, చిన్న రైతుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు వ్యవసాయ మార్కెటింగ్ బిల్లును విధాన సభలో ప్రవేశ పెట్టారు. పలు రాష్ట్రాలలో ఈ బిల్లును అనుసరించి చట్టాలు రూపొందాయి. కుటీర పరిశ్రమలకు ప్రాధాన్యాన్ని, మద్దతును ఇవ్వటం ద్వారా కోట్లాది మంది స్వయం వృత్తిదారులకు ఉపాధి అవకాశములను మెరుగుపరుస్తూ, దేశ ప్రజానీకానికి అవసరమైన వస్తువుల ఉత్పత్తిని భారీ ఎత్తున మూలధన పెట్టుబడుల అవసరము లేకుండానే సాధించవచ్చునని మహాత్మాగాంధీ ప్రబోధించిన సిద్ధాంతంపట్ల చరణ్ సింగ్‌కు పూర్తి విశ్వాసం ఉంది. భారత రాజకీయవేత్తలలో ఈ అంశాలపై అత్యంత లోతైన పరిశోధనలు జరిపి, గ్రంథ రచనలను చేసిన వ్యక్తి చరణ్‌సింగ్. మన దేశంలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉద్యోగుల వలన పొగాకు పంటను పండించే లక్షలాది మంది రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను, కష్టనష్టాలను వారి దృష్టికి తీసుకువెళ్లినప్పుడు ఒక్క కలం పోటుతో వారి ఇబ్బందులను తొలగించిన ఘనత చరణ్సింగ్దే. అప్పట్లో విజయవాడ, గుంటూరు, హైదరాబాద్ మున్నగు నగరాలు, పట్టణాల పరిధిలో పశుపోషణ కొరకు పారాగ్రాసు, నేపియార్ గ్రాసు, పచ్చగడ్డి మున్నగు వాటిని పండిస్తూ ఉన్న భూముల్ని అర్బన్ లాడ్ సీలింగ్ చట్టం ప్రకారం ఖాళీ స్థలాలుగా ప్రక టించారు. నాటి ప్రధాని చరణ్ సింగ్ దృష్టికి దీన్ని తీసుకెళ్లగా సదరు భూములను వ్యవసాయ భూములుగానే పరిగణించాలని ఆదేశించారు. భారతదేశ రైతాంగానికి, వ్యవసాయ రంగానికి, గ్రామీణ ప్రజానీకానికి చరణ్‌సింగ్ చేసిన విశిష్ట సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం నవంబర్ 23వ తేదీని ‘కిసాన్ దివస్’గా నిర్వహించటం ముదావహం. మన భారతదేశంలో గత రెండు దశాబ్దాలలో దాదాపు 3 లక్షలమంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడి, వ్యవసాయం తీవ్ర సంక్షోభంగా మారిన నేపథ్యంలో మహా త్మాగాంధీ, ఆచార్య రంగా, చౌదరీ చరణ్‌సింగ్‌లు కోరి నట్లు వ్యవసాయానికి ప్రప్రథమ ప్రాధాన్యతను కుటీర, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు రెండవ ప్రాధాన్యతను ఇవ్వటమేగాక అందుకు తగిన విధంగా విధివిధానాలను రూపకల్పన చేయటం, నిధులను కేటాయించి భారతదేశ సత్వర అభివృద్ధికి, ఆ అభివృద్ధి ఫలాలు, విశాల జన బాహుళ్యానికి అందేటట్లు చేయడానికి ప్రయత్నించటం చరణ్ సింగ్‌నకు సరైన నివాళి అవుతుంది. (నేడు చౌదరి చరణ్ సింగ్ జయంతి సందర్భంగా) (వ్యాసకర్త : వడ్డే శోభనాద్రీశ్వరరావు మాజీ మంత్రి, మాజీ ఎంపీ ఈ–మెయిల్ : vaddesrao@yahoo.com )