గ్రామీణ ప్రజాబంధు చరణ్‌ సింగ్‌ | opinion on chaudhary charan singh by vadde sobhanadreeswara rao | Sakshi
Sakshi News home page

గ్రామీణ ప్రజాబంధు చరణ్‌ సింగ్‌

Published Fri, Dec 23 2016 1:36 AM | Last Updated on Mon, Sep 4 2017 11:22 PM

గ్రామీణ ప్రజాబంధు చరణ్‌ సింగ్‌

గ్రామీణ ప్రజాబంధు చరణ్‌ సింగ్‌

అభిప్రాయం
జమిందారీ విధానం రద్దు అయిన తరువాత అప్పటికి వాస్తవంగా భూమిని సాగుచేస్తూ ఉన్న కోట్లాది మంది కౌలుదారులకు, గ్రామీణ పేదలకు భూమిపైన హక్కు కల్గించిన రైతు బాంధవుడు చరణ్‌సింగ్‌.

భారతీయ రైతాంగ సమస్యల పరిష్కారంలో అద్వితీయ పాత్ర పోషించిన రైతుజన బాంధవుడు చౌదరి చరణ్‌సింగ్‌. జిల్లా స్థాయి నుంచి ప్రధానమంత్రి స్థాయికి ఎది గిన క్రమంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి, రైతు సంక్షేమానికి తుదివరకు చిత్తశుద్ధితో ప్రయత్నించిన వారిలో అగ్రగణ్యులు చరణ్‌ సింగ్‌. సహకార వ్యవసాయం భారతీయ వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలో పడవేస్తుందన్న అభిప్రాయంతో, జవహర్‌లాల్‌ నెహ్రూ విధానాలనే ధిక్కరిం చిన ధీరుడు చరణ్‌సింగ్‌.

1902 డిసెంబర్‌ 23న పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌ జిల్లాలో భడోల్‌ అనే చిన్న గ్రామంలో మధ్య తరగతి రైతు కుటుంబంలో జన్మించిన చౌదరి చరణ్‌ సింగ్‌ 1923లో సైన్స్‌లో డిగ్రీని పొంది 1925లో ఆగ్రా యూనివర్సిటీ నుండి ఎం.ఏ., ఎం.ఎల్‌. పట్టాలను పొందారు. వృత్తిపరంగానేకాక గ్రామీణ ప్రజల సమస్యలను ప్రత్యేకంగా వ్యవసాయదారుల కష్టసుఖాలను క్షుణ్ణంగా అవగాహన చేసుకొని గ్రామీణ ప్రజానీకంతో మమేకం అయ్యేవారు. ఈ క్రమంలో 1931లోనే జిల్లా బోర్డు సభ్యునిగా ఎన్నికయ్యారు, ఛాప్రౌలీ శాసనసభా నియోజకవర్గం నుంచి 1937–1974 దాకా శాసన సభ్యుడిగా వరుసగా ఎన్నికవుతూ వచ్చారు. ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రానికి రెండుసార్లు ముఖ్యమంత్రిగా, కేంద్రంలో జనతా ప్రభుత్వంలో ఆర్థికమంత్రి, ఉప ప్రధాని పదవులను నిర్వహించారు. 6 నెల లకే ప్రధాని పదవి నుంచి వైదొలగవలసి వచ్చిన చరణ్‌సింగ్‌  29 మే 1987న అసువులు బాశారు.

స్వతహాగా రైతు కుటుంబంలో నుంచి వచ్చిన చరణ్‌సింగ్‌ వ్యవసాయ రంగంలో రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు, కుమ్మరి, కమ్మరి, వడ్రంగి, చేనేత మున్నగు చేతివృత్తుల వారి మధ్య సంబంధాలను, గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బాగా అవగాహన చేసుకొన్న వ్యక్తి.  జవహర్‌లాల్‌ నెహ్రూ సహకార వ్యవసాయాన్ని చేపట్టాలని నాగపూర్‌ కాంగ్రెస్‌లో తీర్మానం చేయించిన సందర్భంలో ఆచార్య ఎన్జీరంగా వలనే చరణ్‌సింగ్‌ కూడా దాన్ని తీవ్రంగా వ్యతిరేకిం చారు. సహకార వ్యవసాయంతో వ్యవసాయ రంగం సంక్షోభంలో పడుతుందని, దీర్ఘకాలంలో వ్యవసాయ ఉత్పత్తికి దెబ్బ తగులుతుందని చెబుతూ వివరణాత్మక పుస్తకాలను రచించి, ప్రచారం కూడా చేశారు.

జమిందారీ విధానం రద్దు అయిన తరువాత అప్పటికి వాస్తవంగా భూమిని సాగుచేస్తూ ఉన్న కోట్లాదిమందికి కౌలుదారులు, గ్రామీణ పేదలకు  భూమిపైన హక్కు కల్గించిన గొప్ప వ్యక్తి చరణ్‌సింగ్‌. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే దళారుల దోపిడీ నుంచి సన్నకారు, చిన్న రైతుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు వ్యవసాయ మార్కెటింగ్‌ బిల్లును విధాన సభలో ప్రవేశ పెట్టారు. పలు రాష్ట్రాలలో ఈ బిల్లును అనుసరించి చట్టాలు రూపొందాయి. కుటీర పరిశ్రమలకు ప్రాధాన్యాన్ని, మద్దతును ఇవ్వటం ద్వారా కోట్లాది మంది స్వయం వృత్తిదారులకు ఉపాధి అవకాశములను మెరుగుపరుస్తూ, దేశ ప్రజానీకానికి అవసరమైన వస్తువుల ఉత్పత్తిని భారీ ఎత్తున మూలధన పెట్టుబడుల అవసరము లేకుండానే సాధించవచ్చునని మహాత్మాగాంధీ ప్రబోధించిన సిద్ధాంతంపట్ల చరణ్‌ సింగ్‌కు పూర్తి విశ్వాసం ఉంది. భారత రాజకీయవేత్తలలో ఈ అంశాలపై అత్యంత లోతైన పరిశోధనలు జరిపి, గ్రంథ రచనలను చేసిన వ్యక్తి చరణ్‌సింగ్‌.

మన దేశంలో ఎక్సైజ్‌ డిపార్ట్‌మెంట్‌ ఉద్యోగుల వలన పొగాకు పంటను పండించే లక్షలాది మంది రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను, కష్టనష్టాలను వారి దృష్టికి తీసుకువెళ్లినప్పుడు ఒక్క కలం పోటుతో వారి ఇబ్బందులను తొలగించిన ఘనత చరణ్‌సింగ్‌దే. అప్పట్లో విజయవాడ, గుంటూరు, హైదరాబాద్‌ మున్నగు నగరాలు, పట్టణాల పరిధిలో పశుపోషణ కొరకు పారాగ్రాసు, నేపియార్‌ గ్రాసు, పచ్చగడ్డి మున్నగు వాటిని పండిస్తూ ఉన్న భూముల్ని అర్బన్‌ లాడ్‌ సీలింగ్‌ చట్టం ప్రకారం ఖాళీ స్థలాలుగా ప్రక టించారు. నాటి ప్రధాని చరణ్‌ సింగ్‌ దృష్టికి దీన్ని తీసుకెళ్లగా సదరు భూములను వ్యవసాయ భూములుగానే పరిగణించాలని ఆదేశించారు.

భారతదేశ రైతాంగానికి, వ్యవసాయ రంగానికి, గ్రామీణ ప్రజానీకానికి చరణ్‌సింగ్‌ చేసిన విశిష్ట సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం నవంబర్‌ 23వ తేదీని ‘కిసాన్‌ దివస్‌’గా నిర్వహించటం ముదావహం. మన భారతదేశంలో గత రెండు దశాబ్దాలలో దాదాపు 3 లక్షలమంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడి, వ్యవసాయం తీవ్ర సంక్షోభంగా మారిన నేపథ్యంలో మహా త్మాగాంధీ, ఆచార్య రంగా, చౌదరీ చరణ్‌సింగ్‌లు కోరి నట్లు వ్యవసాయానికి ప్రప్రథమ ప్రాధాన్యతను కుటీర, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు రెండవ ప్రాధాన్యతను ఇవ్వటమేగాక అందుకు తగిన విధంగా విధివిధానాలను రూపకల్పన చేయటం, నిధులను కేటాయించి భారతదేశ సత్వర అభివృద్ధికి, ఆ అభివృద్ధి ఫలాలు, విశాల జన బాహుళ్యానికి అందేటట్లు చేయడానికి ప్రయత్నించటం చరణ్‌ సింగ్‌నకు సరైన నివాళి అవుతుంది.
(నేడు చౌదరి చరణ్‌ సింగ్‌ జయంతి సందర్భంగా)

(వ్యాసకర్త : వడ్డే శోభనాద్రీశ్వరరావు మాజీ మంత్రి, మాజీ ఎంపీ
ఈ–మెయిల్‌ : vaddesrao@yahoo.com )

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement