తెలంగాణ బిడ్డ, మాజీ ప్రధాని పీవీకి భారత రత్న | PV Narasimha Rao Conferred Bharat Ratna By Indian Government | Sakshi
Sakshi News home page

తెలంగాణ బిడ్డ, మాజీ ప్రధాని పీవీకి భారత రత్న

Published Fri, Feb 9 2024 12:51 PM | Last Updated on Fri, Feb 9 2024 3:33 PM

PV Narasimha Rao Conferred Bharat Ratna By Indian Government - Sakshi

ఢిల్లీ:  మాజీ ప్రధానమంత్రి దివంగత పీవీ నరసింహరావుకు భారతరత్న వరించింది. కేంద్ర ప్రభుత్వం పీవీకి భారతరత్నను శుక్రవారం ప్రకటించింది. పీవీతో పాటు మాజీ ప్రధాని చౌదరీ చరణ్‌ సింగ్‌, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్‌ స్వామినాథన్‌కు కేంద్ర ప్రభుత్వం భారత తర్న  ప్రకటించిన విషయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీటర్‌ వేదికగా వెల్లడించారు.

వరంగల్ జిల్లా నర్సింపేట (మ) లక్నేపల్లిలో 1921 జూన్ 28న జన్మించిన పీవీ నరసింహారావు 1991లో భారత ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడయ్యాయడు. ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించడంలో పీవీ కీలక పాత్ర పోషించారు. బహు భాషా కోవిదుడిగానూ పీవీ నరసింహారావుకు గుర్తింపు ఉంది. కాంగ్రెస్ ను కష్టకాలంలో ఆదుకున్న పీవీని ఆ తర్వాత కాంగ్రెస్ పట్టించుకోలేదన్న విమర్శలున్నాయి.

పీవీ ప్రస్థానం..
పాత కరీంనగర్‌ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని వంగరకు చెందిన పీవీ నరసింహారావు మంథని నియోజకవర్గం నుంచి తన రాజకీయ అడుగులు వేశారు. 1957లో మొదటిసారి కాంగ్రెస్‌ అభ్యర్థి గా పోటీచేసి విజయం సాధించారు. తర్వాత 1962, 67, 72లో వరుసగా విజయం సాధించారు. ఎమ్మెల్యేగా రెండోసారి గెలిచిన తర్వాత పీవీకి మంత్రిగా అవకాశం వచ్చింది.

తొమ్మిది సంవత్సరాల పాటు ఆయన న్యాయ, సమాచార, వైద్య, దేవాదాయ శాఖల మంత్రిగా పనిచేశారు. 1971లో జరిగిన పరిణామాలతో పీవీని కాంగ్రెస్‌ అధిష్టానం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా నియమించింది. రెండు సంవత్సరాల పాటు ఆ పదవిలో కొనసాగిన ఆయన తర్వాత రాష్ట్ర రాజకీయాలకు గుడ్‌బై చెప్పారు. 1977లో హనుమకొండ లోక్‌సభస్థానం నుంచి పోటీ చేసి కేంద్ర రాజకీయాల్లో అడుగుపెట్టారు.

1980లో జరిగిన ఎన్నికల్లో మరోసారి ఇదే నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత 1984, 89 సంవత్సరాల్లో మహారాష్ట్రలోని రాంటెక్‌ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. కేంద్ర కేబినెట్‌లో మంత్రిగా పనిచేశారు. 1991లో అనూహ్యంగా అత్యున్నతమైన ప్రధానమంత్రి పదవి వరించింది. 1996 వరకు ప్రధానమంత్రి పనిచేశారు. పీఎం పదవి చేపట్టిన తొలి తెలుగు వ్యక్తిగా, దక్షిణ భారతీయుడిగా చరిత్రలో నిలిచిపోయారు.

ఈ ఏడాది ఐదుగురికి భారతరత్న
భారత అత్యున్నత పురస్కారమైన భారతరత్నను ఈ ఏడాది ఐదుగురికి ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి కర్పూరి ఠాకూర్‌, బీజేపీ సీనియర్‌ నేత, మాజీ ఉప ప్రధాని ఎల్‌ కే అద్వానీలకు ఇటీవల భారతరత్న ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.. తాజాగా పీవీ నరసింహారావు, చరణ్‌సింగ్‌, స్వామినాథన్‌లకు ఈ అత్యున్నత పురస్కరాన్ని ప్రకటించింది.

 ఎం.ఎస్‌ స్వామినాథ్‌ ప్రస్థానం..
మాన్‌కోంబు సాంబశివన్‌ స్వామినాథ్‌ 1925 ఆగస్టు 7న తమిళనాడు రాష్ట్రంలో కావేరి డెల్టా ప్రాంతంలోని కుంభకోణం పట్టణంలో జన్మిమంచారు. ఆయన తండ్రి డాక్టర్‌ ఎం.కె.సాంబశివన్‌ వైద్యుడు. తల్లి పార్వతీ తంగమ్మల్‌ గృహిణి. 11వ ఏట తండ్రిని కోల్పోయారు. తన మామయ్య సంరక్షణలో పెరిగిన స్వామినాథన్‌ కుంభకోణంలో మెట్రిక్యులేషన్, త్రివేండ్రంలో జంతుశాస్త్రంలో డిగ్రీ చేశారు. తర్వాత కోయంబత్తూరు అగ్రికల్చరల్‌ కాలేజీ నుంచి అండర్‌గ్రాడ్యుయేట్‌ డిగ్రీ సాధించారు. ఢిల్లీలోని భారత వ్యవసాయ పరిశోధన సంస్థలో పీజీ పూర్తి చేశారు. స్వామినాథన్‌ 2004 నుంచి 2006 దాకా ‘నేషనల్‌ కమిషన్‌ ఆన్‌ ఫార్మర్స్‌’ అధినేతగా వ్యవహరించారు. పంటలకు కనీస మద్దతు ధరపై ప్రభుత్వానికి విలువైన ప్రతిపాదనలు చేశారు. పంటల ఉత్పత్తి వ్యయం కంటే కనీసం 50 శాతాన్ని కనీస మద్దతు ధరగా నిర్ణయించాలని సూచించారు.

ఎన్నో పదవులు
కొంతకాలం కేంబ్రిడ్జ్‌ విశ్వవిద్యాలయంలో పనిచేసిన స్వామినాథన్‌ 1954లో మళ్లీ భారత్‌లో అడుగు పెట్టారు. ఇండియన్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో శాస్త్రవేత్తగా పరిశోధనలపై దృష్టి పెట్టారు. 1972–79లో ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌ డైరెక్టర్‌ జనరల్‌గా వ్యవహరించారు. 1979లో కేంద్ర ప్రభుత్వం ఆయనను వ్యవసాయ శాఖ ప్రధాన కార్యదర్శిగా నియమించింది. 2007 నుంచి 2013 దాకా రాజ్యసభలో నామినేట్‌ ఎంపీగా సేవలను అందించారు. స్వామినాథన్‌ దేశ విదేశాల్లో ఎన్నో ప్రఖ్యాత సంస్థలకు నాయకత్వం వహించారు.  
► 1981 నుంచి 1985 దాకా ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చరల్‌ ఆర్గనైజేషన్‌ కౌన్సిల్‌ స్వతంత్ర చైర్మన్‌  
► 1984 నుంచి 1990 దాకా ఇంటర్నేషనల్‌ యూనియన్‌ ఫర్‌ ద కన్జర్వేషన్‌ ఆఫ్‌ నేచర్‌ అండ్‌ నేచురల్‌ రిసోర్సెస్‌ అధ్యక్షుడు  
► 1982 నుంచి 1988 దాకా ఫిలిప్పీన్స్‌లోని  ఇంటర్నేషనల్‌ రైస్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ డైరెక్టర్‌ జనరల్‌   
► 1989 నుంచి 1996 దాకా వరల్డ్‌ వైడ్‌ ఫండ్‌ ఫర్‌ నేచర్‌(ఇండియా) అధ్యక్షుడు  
► ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ రీసెర్చ్‌      (ఐసీఏఆర్‌) డైరెక్టర్‌ జనరల్‌  

వరించిన అవార్డులు  
► 1967లో పద్మశ్రీ  
► 1971లో రామన్‌ మెగసెసే  
► 1972లో పద్మభూషణ్‌  
► 1987లో వరల్డ్‌ ఫుడ్‌ ప్రైజ్‌  
► 1989లో పద్మవిభూషణ్‌    
► ప్రపంచవ్యాప్తంగా వివిధ యూనివర్సిటీల నుంచి 84 గౌరవ డాక్టరేట్లు 

మాజీ ప్రధాని చౌదరీ చరణ్‌ సింగ్‌ ప్రస్థానం...

జమిండారీ విధానం రద్దు అయిన తరువాత అప్పటికి వాస్తవంగా భూమిని సాగుచేస్తూ ఉన్న కోట్లాది మంది కౌలుదారులకు, గ్రామీణ పేదలకు భూమిపైన హక్కు కల్గించిన రైతు బాంధవుడు చరణ్‌సింగ్‌. భారతీయ రైతాంగ సమస్యసల పరిష్కారంలో అద్వితీయ పాత్ర పోషించిన రైతుజన బాంధవుడు చౌదరి చరణ్‌సింగ్‌. జిల్లా స్థాయి నుంచి ప్రధానమంత్రి స్థాయికి ఎదిగిన క్రమంలో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి రైతు సంక్షేమానికి తుది వరకూ చిత్తశుద్ధితో ప్రయత్నించిన వారిలో అగ్రగణ్యులు చరణ్‌ సింగ్‌. సహకార వ్యవసాయం భారతీయ వ్యవసాయ రంగాన్ని సంక్షోభంలో పడవేస్తుందన్న అభిప్రాయంతో, జవహర్‌లాల్‌ నెహ్రూ విధానాలనే చరణ్‌దిక్కరించిన ధీరుడు

1902లో డిసెంబర్‌ 23న పశ్చిమ యూపీలో మీరట్‌ జిల్లాలో భడోల్‌ అనే చిన్న గ్రామంలో మధ్య తరగతి రైతు కుటుంబంలో జన్మించిన చరణ్‌సింగ్‌.. 1923లో సైన్స్‌లో డిగ్రీని పొంది.. 1925లో ఆగ్రా యూనివర్శిటీ నుండి ఎంఏ, ఎంఎల్‌ పట్టాలను పొందారు. వృత్తిపరంగానే కాక గ్రామీణ ప్రజల సమస్యలను ప్రత్యేకంగా వ్యవసాయదారుల కష్టసుఖాలను క్షుణ్ణంగా అవగాహన చేసుకుని గ్రామీణ ప్రజానీకంతో మమేకం అయ్యేవారు. 1937-1974 వరకూ శాసనసభ్యుడిగా వరుసుగా ఎన్నిక అవుతూ వచ్చారు. యూపీ రాష్ట్రానికి రెండుసార్లు సీఎంగా, కేంద్రంలో జనతా ప్రభుత్వంలో ఆర్థికమంత్రి, ఉప ప్రధాని పదవులను నిర్వహించారు. 1979లో ప్రధాని అయిన చరణ్‌ సింగ్‌ 170 రోజులకే ఆ పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది. 1987, మే 29వ తేదీన ఆయన అసువులు బాశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement