సాక్షి, చెన్నై: భారత హరిత విప్లవ పితామహుడు, ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త, పద్మవిభూషణ్ డాక్టర్ ఎం.ఎస్.స్వామినాథన్(98) అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. దేశంలో ఆకలితో అలమటించే అభాగ్యులు ఉండకూడదన్న లక్ష్యంతో జీవితాంతం పోరాటం సాగించిన మహా మనిషి తమిళనాడు రాజధాని చెన్నైలోని తన స్వగృహంలో గురువారం ఉదయం 11.15 గంటలకు శాశ్వత నిద్రలోకి జారుకున్నారు. ఆయన కొంతకాలంగా వృద్ధాప్య సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు డాక్టర్ సౌమ్యా స్వామినాథన్, మధుర స్వామినాథన్, నిత్యా రాయ్ ఉన్నారు.
భార్య మీనా స్వామినాథన్ గతంలోనే మృతిచెందారు. భారత్‌లో 1960వ దశకం నుంచి హరిత విప్లవానికి బాటలు వేసి, ఆహారం, పౌష్టికాహార భద్రత కోసం అలుపెరుగని కృషి చేసిన స్వామినాథన్‌ను ప్రతిష్టాత్మక పద్మవిభూషణ్, రామన్ మెగసెసే, మొట్టమొదటి వరల్డ్ ఫుడ్ ప్రైజ్ సహా ఎన్నెన్నో జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు వరించాయి. స్వామినాథన్ పారీ్థవదేహాన్ని చెన్నై తేనాంపేట రత్నానగర్‌లో ఉన్న నివాసం నుంచి గురువారం రాత్రి తరమణిలోని ఎం.ఎస్.స్వామినాథన్ ఫౌండేషన్‌కు తరలించారు. శుక్రవారం అప్తులు, ప్రముఖుల సందర్శనార్థం పారీ్థవ దేహాన్ని ఇక్కడే ఉంచుతారు. విదేశాల్లో ఉన్న కుమార్తె చెన్నైకి రావాల్సి ఉండడంతో శనివారం స్వామినాథన్ అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సన్నిహితులు చెప్పారు.
ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
ఎం.ఎస్.స్వామినాథన్ మృతిపట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. దేశానికి ఆయన అందించిన సేవలను గుర్తుచేసుకున్నారు. మానవాళి కోసం భద్రమైన, ఆకలికి తావులేని భవిష్యత్తును అందించే దిశగా ప్రపంచాన్ని నడిపించడానికి మార్గదర్శిగా పనిచేశారని స్వామినాథన్‌పై రాష్ట్రపతి ముర్ము ప్రశంసల వర్షం కురిపించారు. ఘనమైన వారసత్వాన్ని మనకు వదిలి వెళ్లారని చెప్పారు. స్వామినాథన్ మరణం తనకు తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని ప్రధాని మోదీ ‘ఎక్స్’లో పోస్టు చేశారు.
మన దేశం సంక్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన హరిత విప్లవానికి నాంది పలికారని, కోట్లాది మంది ఆకలి తీర్చారని, దేశంలో ఆహార భద్రతకు పునాది వేశారని కొనియాడారు. వ్యవసాయ రంగంలో స్వామినాథన్ కృషితో కోట్లాది మంది జీవితాలు మారాయని మోదీ గుర్తుచేశారు. మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు గురువారం స్వామినాథన్ పారీ్థవదేహానికి అంజలి ఘటించారు. ఆయన మరణం దేశానికి, రైతు ప్రపంచానికి తీరని లోటు అని పేర్కొన్నారు. స్వామినాథన్ మరణం పట్ల తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్.రవి, ముఖ్యమంత్రి స్టాలిన్, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, మాజీ ప్రధానమంత్రి హెచ్.డి.దేవెగౌడ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాం«దీ, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కె.సి.వేణుగోపాల్, భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేశ్ తికాయత్ తదితరులు సంతాపం ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment