సాక్షి, హైదరాబాద్: దేశంలో హరిత విప్లవ పితామహుడు, ప్రపంచ ప్రఖ్యాత వ్యవసాయ శాస్త్రవేత్త, రామన్ మెగసెసే అవార్డు గ్రహీత, పద్మ విభూషణ్ డాక్టర్ ఎం.ఎస్ స్వామినాథన్ మృతి పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర సంతాపాన్ని ప్రకటించారు. ఆయన మరణంతో దేశ వ్యవసాయ రంగం పెద్ద దిక్కును కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ ప్రజల ప్రధాన ఆహార వనరులైన వరి, గోధుమ పంటలపై స్వామినాథన్ చేసిన అద్భుతమైన ప్రయోగాలతో భారతదేశంలో ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగి హరిత విప్లవాన్ని సాధించిందని కేసీఆర్ తెలిపారు.
సాంప్రదాయ పద్ధతిలో సాగుతున్న దేశీయ వ్యవసాయాన్ని స్వామినాథన్ వినూత్న పద్ధతుల్లో గుణాత్మక దశకు చేర్చారని కొనియాడారు. ఆహారాభివృద్ధిలో భారత్ స్వయం సమృద్ధి సాధించిందంటే అది ఎంఎస్ స్వామినాథన్ కృషితోనే సాధ్యమైందన్నారు. దేశంలో రాష్ట్రాల వారీగా ప్రజలు పండిస్తున్న పంటలపై విస్తృత పరిశోధనలు చేసిన ఆయన ప్రతి భారత రైతు హృదయంలో స్థిరస్థాయిగా నిలిచిపోతారని సీఎం పేర్కొన్నారు.
తెలంగాణ వ్యవసాయాభివృద్ధిని ప్రశంసించారు: మంత్రులు నిరంజన్‌రెడ్డి, హరీశ్‌రావు
స్వామినాథన్ మరణం తీరని లోటుని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ఒక ప్రకటనలో సంతాపం వ్యక్తం చేశారు. ఇటీవల తాము చెన్నై వెళ్లి ఆయన్ను కలిసినప్పుడు తెలంగాణ వ్యవసాయాభివృద్ధిని ప్రశంసించారని గుర్తు చేశారు. ఎంఎస్ స్వామినాథన్ మృతి బాధాకరమని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు విచారం వెలిబుచ్చారు. ఆయన మరణం పరిశోధన రంగంతోపాటు యావత్ దేశ వ్యవసాయ రంగానికి తీరని లోటన్నారు.
వ్యవసాయ పరిశోధనలకు మార్గదర్శి : కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
దేశ వ్యవసాయరంగంలో జరిగే పరిశోధలనకు ఓ మార్గదర్శిగా హరిత విప్లవ పితామహుడు డా.ఎంఎస్ స్వామినాథన్ నిలిచారని కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి నివాళులర్పిం చారు. స్వామినాథన్ మృతిపట్ల ఓ ప్రకటనలో తీవ్రవిచారం వ్యక్తం చేశారు. ఎంఎస్ స్వామినాథన్ మరణం వ్యవసాయ రంగానికి తీరని లోటని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, బండి సంజయ్, బీజేపీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, పార్టీ తమిళనాడు సహ ఇన్‌చార్జి పొంగులేటి సుధాకరరెడ్డి వేర్వేరు ప్రకటనల్లో సంతాపం తెలిపారు.
హరియాణా గవర్నర్ దత్తాత్రేయ సంతాపం
ఎంఎస్ స్వామినాథన్ మృతి పట్ల హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ తమ ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. దేశ వ్యవసాయ రంగంలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టి, వ్యవసాయ రంగంలో అభివృద్ధికి ఆయన ఎన్నో సేవలు అందించి తన పరిశోధనలకు దేశ అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు అందుకున్నారని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. భారత్‌ను వ్యవసాయరంగంలో ప్రపంచశక్తిగా డా.స్వామినాథన్ తీర్చిదిద్దారని మాజీ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ శ్రద్ధాంజలి ఘటించారు.
దేశానికి తీరనిలోటు: పీసీసీ చీఫ్ రేవంత్
వ్యవసాయ అభివృద్ధి, రైతు సంక్షేమానికి నిరంతరం శ్రమించిన ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ మృతి అత్యంత బాధాకరమని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సంతాపం ప్రకటించారు. దేశంలో మేలైన వరి వంగడాలను సృష్టి్టంచి.. హరిత విప్లవానికి నాంది పలికిన స్వామినాథన్ మరణం దేశంలో వ్యవసాయ రంగానికి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు.
దేశ ఆత్మగౌరవాన్ని కాపాడారు: మురళీ శర్మ, ఇక్రిశాట్ విశ్రాంత శాస్త్రవేత్త.
‘‘1960లలో మనం అమెరికా తదితర దేశాల నుంచి తిండిగింజలు దిగుమతి చేసుకునేవాళ్లం. ఇందుకు డబ్బులు చెల్లించినప్పటికీ మేము మీకు తిండి పెడుతున్నామన్నట్టుగా ఆయా దేశాలు మనల్ని చిన్నచూపు చూసేవి. అలాంటి పరిస్థితుల్లో డాక్టర్ స్వామినాథన్ దేశంలో హరిత విప్లవానికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం దేశ జనాభా 140 కోట్లకు పైగా ఉన్నప్పటికీ తిండి గింజల విషయంలో స్వయం సమృద్ధిని సాధించాం. ఒక రకంగా చెప్పాలంటే దేశం తన ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకు స్వామినాథన్ నేతృత్వంలో నడిచిన హరిత విప్లవం ఉపయోగపడింది’’అని ఇక్రిశాట్ విశ్రాంత శాస్త్రవేత్త మురళీశర్మ నివాళులర్పించారు.
సాగుపై పూర్తి అవగాహన స్వామినాథన్‌కే సొంతం: జి.వి.రామాంజనేయులు
‘‘భారతీయ వ్యవసాయ రంగం బహుముఖీనతను అర్థం చేసుకునేందుకు డాక్టర్ స్వామినాథన్ నివేదికలు ఎంతో ఉపయోగపడతాయి. వ్యవసాయ శాస్త్రవేత్తల్లో సాగుకు సంబంధించిన సమగ్ర అవగాహన ఉన్న తొలి, చివరి వ్యక్తి కూడా డాక్టర్ స్వామినాథనే కావచ్చు.’’అని సెంటర్ ఫర్ సస్టెయినబుల్ అగ్రికల్చర్ వ్యవస్థాపకుడు జీవీ రామాంజనేయులు సంతాపం ప్రకటించారు. ఎం.ఎస్.స్వామినాథన్ భౌతికంగా లేకపోవచ్చు కానీ.. ఆయనిచ్చిన స్ఫూర్తి ఎప్పటికీ చెరిగిపోనిదని సీఎస్‌ఐఆర్ మాజీ డైరెక్టర్ జనరల్ రఘునాథ్ మషేల్కర్ పేర్కొన్నారు.
వ్యవసాయరంగానికి తీరని లోటు: రైతు నేతలు వెంకట్, మల్లారెడ్డి
ఎంఎస్పీ సాధన, ఆహార భద్రత చట్టం అమలు కోసం పోరాడడమే స్వామినాథన్‌కు అర్పించే నిజమైన నివాళి అని అఖిల భారత వ్యవసాయ కారి్మక సంఘం కార్యదర్శి బి.వెంకట్ పేర్కొన్నారు. స్వామినాధన్ హరిత విప్లవ మార్గదర్శకుడని అఖిల భారత కిసాన్ సభ సీనియర్ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి నివాళులర్పించారు.
భూ సంస్కరణల అమలుకు కృషి చేశారు: తమ్మినేని
స్వామినాథన్ మృతికి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రగాఢ సంతాపం ప్రకటించారు. భూసంస్కరణల అమలుకు కృషి చేసిన ఆయన మరణం దేశానికి తీరని లోటని పేర్కొన్నారు.
తెలంగాణను కొనియాడారు
తెలంగాణలో వ్యవసాయరంగాభివృద్ధికి దిశగా రాష్ట్ర ప్రభుత్వ కార్యాచరణను ఎం ఎస్ స్వామినాథన్ పలుమార్లు కొనియాడిన విషయాలను, తనతో ఉన్న అనుబంధాన్ని సీఎం కేసీఆర్ గుర్తుచేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో రాష్ట్ర సచివాలయంలో ఆయనతో తాను సమావేశం కావడం మరిచిపోలేనని పేర్కొన్నారు. ఉచిత విద్యుత్, ఎత్తిపోతలతో సాగునీటి రంగాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వ కార్యాచరణను స్వామినాథన్‌ఎంతగానో ప్రశంసించారని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు.
వ్యవసాయ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యాచరణలో స్వామినాథన్ స్పూర్తి ఇమిడి ఉందని సీఎం తెలిపారు. వీలుచూసుకుని తెలంగాణ పర్యటనకు వస్తానని మాట ఇచ్చిన స్వామినాథన్ ఆ ఆకాంక్ష తీరకుండానే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం బాధను కలిగిస్తోందని విచారం వ్యక్తం చేశారు. ఆయన మన్ననలు పొందడం రైతుబిడ్డగా, ముఖ్యమంత్రిగా తనకెంతో గర్వకారణమంటూ స్వామినాథన్ కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
జీవితకాలం మొత్తం రైతుల సంక్షేమం కోసం పరితపించిన మహావ్యక్తి వ్యవసాయ శాస్త్రవేత్త ఎమ్మెస్ స్వామినాథన్ ఇక లేరు అని విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నామని రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్ ఒక ప్రకటనలో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశంలో పంటల సమృద్ధి, ఆహార అభివృద్ధి, భద్రత, మహిళా రైతుల స్వయం సమృద్ధి కి విశేషంగా కృషి చేసిన స్వామినాథన్ మరణం పట్ల పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు.
కో ఫౌండర్..బ్రాండ్ అంబాసిడర్
ఇక్రిశాట్‌తో స్వామినాథన్‌కు అనుబంధం
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: దేశ హరితవిప్లవ పితామహుడు, వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్‌తో సంగారెడ్డి జిల్లాలో ఉన్న అంతర్జాతీయ వ్యవసాయ పరిశోధన సంస్థ(ఇక్రిశాట్)కు ప్రత్యేక అనుబంధముంది. 1972లో ఈ సంస్థ ఏర్పాటైంది. ఈ పరిశోధన సంస్థ స్థాపనలో స్వామినాథన్ కీలకపాత్ర పోషించారు. 1972 నుంచి 1980 వరకు ఆయన ఇక్రిశాట్ గవర్నింగ్ బోర్డ్ వైస్ చైర్మన్‌గా వ్యవహరించారు. అందరికీ పౌష్టికాహార భధ్రత కల్పించడమే లక్ష్యంగా ఉష్ణ మండల పాంత్రాల్లో సాగుకు యోగ్యంగా లేని భూముల్లో సైతం ఆహార పంటలు పండించేలా ఇక్రిశాట్ నూతన వంగడాలను అభివృద్ధి చేస్తోంది.
ఈ సంస్థ మెట్ట పంటలపై, వాతావరణ మార్పుల ప్రభావంపై పరిశోధన చేస్తోంది. ప్రధానంగా జొన్న, వేరుశనగ, తృణధాన్యాల పంటలకు సంబంధించిన ఎన్నో వంగడాల ను అభివృద్ధి చేసింది. ప్రజల జీవన ప్రమాణాల పెంపు, పోషకాహార భద్రతను కల్పించడమే లక్ష్యంగా అంతర్జాతీయస్థాయిలో పరిశోధనలు చేస్తున్న ఇక్రిసాట్ 2013లో ప్రపంచవ్యాప్తంగా పలువురు ప్ర ముఖులను బ్రాండ్ అంబాసిడర్‌లుగా నియమించుకుంది.
బిల్‌గేట్స్, న్యూజిలాండ్ మాజీ ప్రధానమంత్రి జేమ్స్‌బొల్గర్, ఒలింపిక్ మెడలిస్ట్ సైనా నెహా్వల్, భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్‌కలాం తదితర ప్రముఖులతోపాటు స్వామినాథన్ కూడా ఇక్రిశాట్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. ‘‘వ్యవసాయం విఫలమైతే.. అన్ని రంగాలు విఫలమైనట్లే..’’అనే ఫ్రొఫెసర్ ఎం.ఎస్ స్వామినాథన్‌తో ఇక్రిశాట్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది.
వ్యవసాయ రంగంపై చెరగని ముద్ర: ఇక్రిశాట్
వ్యవసాయ పరిశోధనల రంగంలో డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ చెరగని ముద్ర వేశారని, వ్యవసాయ రంగానికి ఆయన చేసిన సేవ ప్రపంచవ్యాప్తంగా ఎందరో శాస్త్రవేత్తలకు స్ఫూర్తినిచ్చిందని హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీ య మెట్ట ప్రాంతపంటల పరిశోధన కేంద్రం (ఇక్రిశాట్) తెలిపింది. ఇక్రిశాట్ సహ వ్యవస్థాపకుడుగా, 1972 – 80ల మధ్యకాలంలో సంసథ గవర్నింగ్ బాడీ ఉపాధ్యక్షులుగానూ డా క్టర్ స్వామినాథన్ పనిచేసిన విషయాన్ని గుర్తు చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment