హూ ఈజ్‌ షీ | The story of Doctor Soumya Swaminathan | Sakshi
Sakshi News home page

హూ ఈజ్‌ షీ

Published Mon, Jul 23 2018 2:42 AM | Last Updated on Mon, Jul 23 2018 2:42 AM

The story of Doctor Soumya Swaminathan - Sakshi

అమ్మ టీచరు, నాన్న టీచరు అయితే, ఆ ఇంటి పిల్లలు కూడా టీచర్లే అవుతుంటారు. అది టీచర్ల కుటుంబం.   అమ్మానాన్నలు డాక్టర్‌లయితే పిల్లలూ డాక్టర్లే అవుతుంటారు... అది డాక్టర్ల ఫ్యామిలీ. అలాగే... సౌమ్యా స్వామినాథన్‌ది సైంటిస్టుల ఫ్యామిలీ. ఈ ఇంట్లో అందరూ పరి శోధకులే. పరిపరి విధాల శోధించి సమాజానికి దిశను చూపించేవాళ్లే. శోధించి, సాధించిన ఫలాలను సమాజ శ్రేయస్సుకు అంకితం చేసేవాళ్లే. దేశ నిర్మాణం కోసం చెమట చుక్కలను అర్పించిన వాళ్లే.

ఎం.ఎస్‌ స్వామినాథన్‌ పరిశోధనలతో మన కంచాలు నిండుతున్నాయి. మీనా స్వామినాథన్‌ విశ్లేషణలతో పిల్లల బుద్ధి పువ్వుల్లా వికసిస్తోంది. వీరిద్దరి మేధకు వారసురాలు సౌమ్య.
సమస్త జనావళి ఆరోగ్యంగా ఉండాలంటే వైద్యం చదివి మందులివ్వడంతో సరిపెట్టుకుంటే చాలదనుకున్నారు సౌమ్య. సమాజాన్ని అధ్యయనం చేశారు, వ్యాధుల మీద పరిశోధనలు జరిపారు, మందుల కోసం ప్రయోగాలు చేశారు. అలా... సౌమ్యా స్వామినాథన్‌ 30 ఏళ్లుగా పరిశోధనల్లోనే మునిగిపోయారు. పిల్లల డాక్టర్‌గా... పిల్లల ఆరోగ్యం కోసం విశేషంగా పరిశో«ధించారు. చెన్నైలోని నేషనల్‌ ట్యూబర్‌క్యూలోసిస్‌ ఇన్‌స్టిట్యూట్‌కి డైరెక్టర్‌గా టీబీ వ్యాధిని నిర్మూలించడానికి రీసెర్చ్‌ చేశారు.

ఆమె ఐసిఎమ్‌ఆర్‌... ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ లో డైరెక్టర్‌ జనరల్‌గా, ఆరోగ్య పరిశోధన, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సెక్రటరీగా దేశానికి ఆరోగ్యపథాన్ని నిర్దేశించారు. ఇన్ని కీలకమైన బాధ్యతలతో వచ్చిన అనుభవమే ఆమెను ఎల్లలు దాటించింది. ఐక్యరాజ్యసమితి చూపు ఆమె మీదకు మళ్లింది. వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌కు డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ను చేసింది. సౌమ్య పని క్షేత్రం జెనీవాకు చేరింది. ఇది జరిగి ఆరు నెలలు దాటింది. ఇప్పుడామె డబ్లు్యహెచ్‌ఓలో అనేక విభాగాల్లో సీనియర్‌ పాలసీ అడ్వైజర్‌.

పబ్లిక్‌ హెల్త్‌ కోసం ప్రపంచ స్థాయి సమీక్షలలో సౌమ్య పాత్ర కీలకమైనది. క్లినికల్‌ కేర్, రీసెర్చ్‌లో ఆమె అనుభవం, చిత్తశుద్ధి ఇప్పుడు ప్రపంచ దేశాల నుంచి హెచ్‌ఐవి/ ఎయిడ్స్, ట్యూబర్‌క్యులోసిస్, మలేరియాలను తరిమి కొట్టడానికి పనికొస్తోంది. ఆ వ్యాధుల నిర్మూలన కోసం ప్రోగ్రామ్‌ రూపొందించి సేవలందిస్తున్నారు సౌమ్య. యునిసెఫ్‌తో వరల్డ్‌ హెల్త్‌ ఆర్గనైజేషన్‌ సమన్వయకర్తగా ఉష్ణమండల దేశాల్లో వచ్చే వ్యాధులు, చికిత్స, నివారణ కోసం పరిశోధన, శిక్షణ కార్యక్రమాల రూపకల్పనలో ప్రపంచానికి ఓ దారి చూపిస్తున్నారామె.

తొలి ఇండియన్‌
డబ్లు్యహెచ్‌ఓలో డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ స్థాయికి చేరిన తొలి భారతీయురాలు సౌమ్య. ఆమెను ఈ స్థాయికి చేర్చిన ప్రయాణం చెన్నైలో మొదలైంది. బాల్యం, ప్రాథమిక విద్య చెన్నైలో సాగాయి. ఎంబీబీఎస్‌ పుణెలోని ఎఎఫ్‌ఎమ్‌సి (ఆర్మ్‌ ఫోర్సెస్‌ మెడికల్‌ కాలేజ్‌)లో, ఢిల్లీలోని ఎయిమ్స్‌ (ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌)లో ఎం.డి చేశారు. పీహెచ్‌డీకి విదేశాలకు వెళ్లారు. కాలిఫోర్నియా యూనివర్సిటీలో పీడియాట్రిక్‌ పల్మనాలజీలో పరిశోధనను  పూర్తి చేశారు. అమెరికా, యునైటెడ్‌ కింగ్‌డమ్‌లలో ప్రతిష్ఠాత్మక వైద్యసంస్థల్లో పరిశోధన విభాగాల్లో పనిచేశారు.

మూడవ ప్రపంచ దేశాల మహిళా శాస్త్రవేత్తల సమాఖ్యలో కూడా సౌమ్య కీలకమైన సభ్యురాలు. పరిశోధన రంగంలో మహిళల పాత్ర అపారమని నమ్ముతారు ఆమె. ‘‘మహిళ ఆలోచనలు ఎప్పుడూ ఇంట్లో వాళ్ల సౌఖ్యం, సంక్షేమం, సంతోషం చుట్టూ తిరుగుతుంటాయి. ప్రతి తల్లి... తన బిడ్డ ఆరోగ్యంగా ఉండాలని, తన బిడ్డ సమాజంలో గౌరవస్థానంలో ఉండాలని కోరుకుంటుంది. మహిళలు చేసే పరిశోధనలు ప్రధానంగా వీటి చుట్టూనే సాగితే, వాటిæ ఫలితంగా ఆరోగ్యవంతమైన, గౌరవప్రదమైన సమాజం ఏర్పడుతుంది’’ అంటారు సౌమ్యా స్వామినాథన్‌. ఇప్పుడామె ముందున్న ప్రధాన లక్ష్యం టీబీ రహిత సమాజం. టీబీ జీరో సిటీ ప్రాజెక్టులో భాగంగా క్షేత్రస్థాయి నుంచి టీబీ నిర్మూలనకు పనిచేస్తున్నారామె.

ఇంకా నేర్చుకో
డబ్లు్యహెచ్‌వోలో అవకాశం వచ్చినప్పుడు తండ్రి చెప్పిన మాటలను గుర్తు చేస్తుంటారు సౌమ్య. ‘దేశం బయటకు వెళ్లినప్పుడు మన దృష్టి కోణం మారుతుంది. ఆ కోణం నుంచి దేశాన్ని చూసినప్పుడు మనదేశానికి ఏం అవసరమో తెలుస్తుంది. నాకు కూడా మనదేశంలో పరిశోధించినంత కాలం తెలుసుకున్న విషయాలకంటే ఫిలిప్పీన్స్‌లోని ఇంటర్నేషనల్‌ రైస్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో డైరెక్టర్‌ జనరల్‌గా విధులు నిర్వర్తించిన సమయంలో మనదేశానికి ఇంకా ఏం కావాలో తెలిసింది. నీకు కూడా ఇంకా నేర్చుకోవడానికి, దేశానికి అవసరమైన పనులు చేయడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థలో పని చేయడం బాగా ఉపకరిస్తుంది. ఇంకా నేర్చుకుంటావు’ అన్నారట స్వామినాథన్‌.

సౌమ్య అమ్మా నాన్నలిద్దరూ కేంబ్రిడ్జిలో చదివారు. సౌమ్య తల్లి పిల్లల మే«ధా వికాసం కోసం శ్రమిస్తే, సౌమ్య పిల్లల దేహ ఆరోగ్యం కోసం ఓ తల్లిలా శ్రమిస్తున్నారు. తండ్రి హరిత విప్లవ పితామహుడు.  తల్లితండ్రులిద్దరూ మేధతో సమాజానికి దిశా నిర్దేశం చేసిన వాళ్లే. అందుకేనేమో ఆ మేధస్సు వనంలో పూసిన ఈ సౌమ్య అనే పువ్వు ప్రపంచానికి ఆరోగ్యపరిమళాలను అద్దుతోంది.
 

సౌమ్య అమ్మ!
మీనా స్వామినాథన్‌ ఈ తరానికి సౌమ్య అమ్మగానే పరిచయం. ఆమె మనదేశ విద్యావ్యవస్థలో ఒక కొత్త నిర్మాణానికి పునాదులు వేశారు. అదే ప్రీస్కూల్‌ ఎడ్యుకేషన్‌. క్లాస్‌రూమ్‌ బయట–లోపల పిల్లలు నేర్చుకునే పద్ధతుల గురించి చెప్పారు. పాఠాలు నేర్చుకోవడానికంటే ముందు భాష నేర్చుకోవాలని చెప్పారు. అందుకోసం కరికులమ్‌ రూపొందించారు. ఆరేళ్ల లోపు పిల్లలకు పలకతో పనిలేకుండా నేర్పించాల్సిన విషయాలెన్నో ఉంటాయి.

అక్షరాలు దిద్దడానికంటే ముందే పదాలను నేర్పించడం, భావవ్యక్తీకరణకు అవసరమైనంత భాషను నేర్పించడం, చిన్న చిన్న నాటికలతో పిల్లల్లో సృజనాత్మకతను రేకెత్తించడం ఎలాగో చెప్పారు. ఈ ప్రక్రియ సంపన్న వర్గాల దగ్గరే ఆగిపోకుండా రోజువారీ పనులు చేసుకునే శ్రామిక వర్గాల పిల్లలకు కూడా చేరాలని ఆకాంక్షించారు. అందుకోసమే ఇంటిగ్రేటెడ్‌ చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ సర్వీసెస్‌కు ఒక రూపాన్నిచ్చారామె.

ఎర్లీ చైల్డ్‌ కేర్, ఎడ్యుకేషన్‌ విభాగంలో యునెస్కోకు కన్సల్టెంట్‌గా సేవలందించారు. యునిసెఫ్‌ తరఫున బాధ్యతలతోపాటు, ప్రీ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ ఇండియన్‌ అసోసియేషన్‌కి అధ్యక్ష బాధ్యతలు కూడా నిర్వర్తించారామె. చైల్డ్‌ డెవలప్‌మెంట్‌ గురించి పత్రికల్లో వ్యాసాలు, పుస్తకాలు రాశారు. ఇప్పుడు ప్రీస్కూల్‌ ఎడ్యుకేషన్‌ సెంటర్లలో టీచర్లకు నియమావళిగా మార్గదర్శనం చేస్తున్నది మీనా స్వామినాథన్‌ పుస్తకాలే.

సౌమ్య నాన్న
సౌమ్యా స్వామినాథన్‌ తండ్రి మన్‌కోంబు సాంబశివన్‌ స్వామినాథన్‌. అంత పొడవైన పేరుతో మనకు పరిచయం లేదు, ఆయన ఎం.ఎస్‌ స్వామినాథన్‌గానే తెలుసు. హరిత విప్లవానికి నారు పోసిన వ్యవసాయ శాస్త్రవేత్త. దేశానికి స్వాతంత్య్రం వచ్చి ఇరవై ఏళ్లు దాటినా కూడా మనదేశం తిండి గింజలను దిగుమతి చేసుకుంటున్న రోజులవి.

దేశం కడుపు నిండా అన్నం తినడానికి, ప్రతి కంచంలో అన్నాన్ని చూడడానికి రాత్రింబవళ్లు పరిశోధనలు, ప్రయోగాలు చేశారాయన. ఒకటికి రెండింతలు, మూడింతలు పండే సస్యాలను రూపొందించాడు. నేల లోని సారాన్ని పంటకు చేర్చే మార్గాలను అన్వేషించారు. హరిత విప్లవంతో దేశాన్ని సస్యశ్యామలం చేశారు. ఆయన పరిశోధనలను ఆచరణలో పెట్టింది వ్యవసాయరంగం. వరి, గోధుమలను ఎక్కువగా పండించి, ఎగుమతి చేసే స్థాయికి ఎదిగింది భారతదేశం.

ఈ గౌరవం దేశానిది!
‘‘ప్రపంచ ఆరోగ్య సంస్థలో డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌గా విధులు నిర్వర్తించే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. నిజానికి ఇది నాకు అందుతున్న గౌరవం కాదు, మన దేశానికి దక్కిన గౌరవం. వైద్యరంగంలో కీలకమైన బాధ్యతలు నిర్వర్తించే అవకాశం కల్పించినందుకు దేశం పట్ల కృతజ్ఞతతో ఉంటాను. మన వాతావరణంలో వచ్చే అనారోగ్యాలు– వాటి నివారణ కోసం విస్తృతంగా పని చేయడానికి నాకిది మంచి అవకాశం. ’’ – డాక్టర్‌ సౌమ్యా స్వామినాథన్, డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్, డబ్ల్యూహెచ్‌వో


సౌమ్య అవార్డులు
ద ఆస్ట్రా జెనికా రీసెర్చ్‌ ఎండోమెంట్‌ అవార్డు(2016)
ఇండియన్‌ అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌ ఫెలోషిప్‌ (2013)
తమిళనాడు సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ అవార్డు (2012)
ఇండియన్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ అప్లయిడ్‌ మైక్రోబయాలజిస్ట్స్‌ నుంచి లైఫ్‌టైమ్‌ అచీవ్‌మెంట్‌ అవార్డ్‌ (2011)
ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌  రీసెర్చ్‌ క్షణిక ఓరేషన్‌ అవార్డు (2008)
 డాక్టర్‌ కేయా లహరీ గోల్డ్‌ మెడల్‌ (1999లో 11వ నేషనల్‌ పీడియాట్రిక్‌  పల్మనరీ కాన్ఫరెన్స్‌ పేపర్‌కి)


– మంజీర

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement