చిన్నప్పుడు వేటకు వెళ్లిన తండ్రి ఒక్కోసారి ఖాళీ చేతులతో తిరిగి వచ్చేవాడు. ఒక్కోసారి ప్రమాదాల బారిన పడేవాడు. పడిన సరుకును సరిగ్గా అమ్ముకోగలిగేవాడు కాదు. ఇవాళ 45 ఏళ్ల వెల్విగి మెరైన్ బయాలజిస్ట్‌గా మారి తమిళనాడు కారైకల్ ప్రాంతంలో మత్స్యకారులకు సురక్షిత చేపల వేటకు సాయం చేస్తోంది. బెస్త స్త్రీల స్వయం సమృద్ధికి మార్గదర్శనం చేస్తోంది.
35 ఏళ్ల క్రితం వెల్విగికి పదేళ్లు. ఇంటికి పెద్ద పిల్ల. తన తర్వాత ముగ్గురు తోబుట్టువులు. తమిళనాడు నాగపట్టణం బెస్తపల్లెలో తండ్రి ఉదయాన్నే నాలుగ్గంటలకు చేపల వేటకు కొయ్య పడవ మీద బయలుదేరుతూ ఉంటే నిద్ర కళ్లతో చూసేది. వేటకు వెళ్లిన తండ్రి రెండు మూడు రోజులు రాడు. ఆ అన్ని రోజులు వెల్విగి దేవుణ్ణి ప్రార్థిస్తూ తండ్రి కోసం ఎదురు చూసేది. తండ్రి తిరిగి వచ్చేంత వరకూ తండ్రికీ ఇంటికీ మధ్య ఏ కమ్యూనికేషనూ ఉండేది కాదు. వాతావరణం మారితే ప్రమాదం. తుఫాను వస్తే ప్రమాదం. లేదా అంతర్జాతీయ జలాల్లోకి పడవ వెళ్లిపోతే ప్రమాదం. ఇన్ని ప్రమాదాలు దాటుకుని తండ్రి ఇల్లు చేరితే అదృష్టం.
35 ఏళ్లు గడిచిపోయాయి. ఇప్పుడు నాగపట్టణం చుట్టుపక్కలే కాదు తమిళనాడు బెస్తపల్లెలన్నింటిలోనూ వెల్విగి తన సాంకేతిక ఆలోచనలతో బెస్తవాళ్లకు ఒక ధైర్యంగా మారింది. దానికి కారణం ఏ బెస్త కుటుంబమూ ఆందోళనగా బతక్కూడదని. ఏ బెస్త ఇంటి పిల్లలు తండ్రి కోసం భయం భయంగా ఎదురు చూడకూడదు అని. అలా వారి సాయం కోసం తాను మారాలంటే మెరైన్ బయాలజీ చదవాలి. కాని బెస్త ఇళ్లల్లో ఆడపిల్లలకు అంత చదువా?
‘మన దేశంలో దాదాపు 3 వేలకు పైగా బెస్త పల్లెలు ఉన్నాయి. దాదాపు 10 లక్షల మంది బెస్త కుటుంబాలు ఉన్నాయి. 40 లక్షల బెస్తలు సముద్రాన్ని నమ్ముకుని జీవిస్తున్నారు. వీరిలో 90 శాతం మంది సంప్రదాయ మత్స్యవేట చేస్తారు. వీరిలో ఇప్పటికి మూడు వంతుల మంది దారిద్య్రరేఖకు దిగువన ఉంటే ఇక ఆడపిల్లలకు చదువు ఎక్కడ?’ అంటుంది వెల్విగి.
బిఎస్సీ జువాలజీ, ఎంఎస్సీ మెరైన్ బయాలజీలను వెల్విగి తన మేనమామ సాయంతో చదువుకుంది. ‘ఆ చదువులో కూడా వివక్ష ఎదుర్కొన్నాను. బెస్త అమ్మాయి ఇలాంటి చదువు చదవడం కొందరి దృష్టిలో వింతగా ఉండేది’ అంటుంది వెల్విగి.
ఇక తన కాళ్ల మీద తాను నిలబడక తప్పలేదు. పూంపుహార్‌లోని ఎం.ఎస్.స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ సంస్థ ‘ఫిష్ ఫర్ ఆల్ రీసెర్చ్ అండ్ ట్రయినింగ్ సెంటర్’ పేరుతో ఒక ప్రోగ్రామ్‌ని తీసుకుంటే అందులో పని చేయడానికి రామేశ్వరం వెళ్లింది వెల్విగి. అది తన ఊరికి 265 కిలోమీటర్ల దూరం. ‘కాని నాకు తప్పలేదు. డబ్బులు కావాలి’ అంది వెల్విగి. పదేళ్లు ఆ సంస్థలో పని చేశాక తిరిగి పిహెచ్‌డి పనిని స్వీకరించి అన్నామలై యూనివర్సిటీ నుంచి పూర్తి చేసింది. అక్కడి బెస్త సమూహంలో పిహెచ్‌డి చేసిన తొలి మహిళ వెల్విగి.
స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ సంస్థలో ప్రస్తుతం సీనియర్ సైంటిస్ట్‌గా పని చేస్తున్న వెల్విగి బెస్తవారి కోసమే ప్రత్యేకంగా ‘మీనవా నన్బన్’ (బెస్తవారికి మిత్రుడు) యాప్‌ను డెవలప్ చేయడంలో సాయపడింది. ఇప్పుడు తమిళనాడు, పాండిచ్చేరి, ఆంధ్రప్రదేశ్‌లలో కనీసం 50 వేల మంది ఈ యాప్ వాడుతున్నారు. మత్స్య పడవల నేవిగేషన్‌లో ఇది సాయపడుతోంది. అంతేకాదు తీరంతో కమ్యూనికేషన్‌ను కూడా సులభం చేస్తుంది.
‘బెస్తవారి సంప్రదాయ చేపల వేట ప్రకృతి సహజమైనది. అయినప్పటికీ వలకు పడాల్సిన చేపలతో పాటు అనవసరపు సముద్ర జీవులు (బైక్యాచ్) కూడా పడుతూ ఉంటాయి. వాటిని కాకుండా కేవలం చేపలు మాత్రమే పడాలంటే ఏం చేయాలో నేను గైడ్ చేస్తూ ఉంటాను. అలాగే వలలో తాబేళ్లు చిక్కకుండా చిక్కిన తాబేళ్లు ప్రాణాలు కోల్పోకుండా ఉండేలా వాటిని తిరిగి సముద్రంలో వదిలేలా బెస్తవారికి ట్రైనింగ్ ఇస్తుంటాను’ అంటుంది వెల్విగి. ఆమె ఊరికే బోర్డు మీద పాఠాలు చెప్పే రకం కాదు. ఇప్పటికి చేపల వేటకు వెళ్లే పడవల్లో కనీసం 150 సార్లు సముద్రం మీదకు వెళ్లింది. వారితోనే ఉంటూ మెళకువలు చెబుతుంది. ఏ సమయంలో ఏ ప్రాంతంలో చేపలు పడతాయో వారికి బోధ పరుస్తుంది.
‘ఇదంతా నా చదువు వల్ల మాత్రమే కాదు. మా నాన్న నుంచి తీసుకున్న అనుభవం కూడా’ అంటుంది వెల్విగి.
మత్స్స సంపద నుంచి స్త్రీలు ఆదాయం గడించేలాగా వారికి ఫుడ్‌కోర్టులు నడపడం ఎలాగో, నిల్వ ఆహారం చేయడం ఎలాగో, ఎండు చేపల మార్కెట్... వీటన్నింటి గురించి కూడా ఆమె తర్ఫీదు ఇస్తోంది. దాదాపు 17 వేల మంది మహిళలు ఆమె వల్ల లబ్ది పొందారు.
‘మత్స్యకారుల్లో వయసుకు వచ్చిన అబ్బాయిలు వేటలో పడకుండా, అమ్మాయిలు పెళ్లిలోకి వెళ్లకుండా చదువుకోవాలంటే ప్రభుత్వ పరంగా చాలా చేయాల్సి ఉంటుంది. అప్పుడే వారి జీవితాల్లో వెలుగు’ అంటుంది వెల్విగి.
సముద్రంలో మత్స్యకారులతో వెల్విగి
బెస్త మహిళలు, మత్స్యకారులతో వెల్విగి
Comments
Please login to add a commentAdd a comment