
సోమవారం అర్ధరాత్రి నుంచి సముద్రంలో వేట నిషేధం
గత సంవత్సరం వేట నిషేధ భృతిని ఎగ్గొట్టిన కూటమి ప్రభుత్వం
ఈ ఏడాది ఎప్పుడిస్తారో తెలియని దుస్థితి
వైఎస్ జగన్ హయాంలో మత్స్యకారులకు రూ.538 కోట్ల లబ్ధి
సాక్షి, అమరావతి: సముద్రంలో వేటకు వెళ్లిన బోట్లు తీరానికి చేరుకుంటున్నాయి. రెండు నెలలపాటు ఒడ్డునే ఉండనున్నాయి. సముద్రంలో చేపల వేట నిషేధం సోమవారం అర్ధరాత్రి నుంచి అమల్లోకి వచ్చింది. సంతానోత్పత్తి కాలంలో తల్లి చేపలు, తల్లి రొయ్యలను సంరక్షించడం, వాటి సంతతి పెరుగుదలను ప్రోత్సహించడం, సముద్ర జలచరాలు, మత్స్య సంపద సుస్థిరతను సాధించే లక్ష్యంతో ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14 అర్ధరాత్రి నుంచి జూన్ 15వ తేదీ వరకు 61రోజులపాటు వేట నిషేధం అమలు చేస్తున్నారు.
ఈ సమయంలో మత్స్యకార కుటుంబాల జీవనానికి ప్రభుత్వాలు వేట నిషేధిత భృతిని అందిస్తాయి. వైఎస్ జగన్ ప్రభుత్వం గత ఐదేళ్లు సమయానికి భృతిని అందించడంతోపాటు పలు విధాలుగా ఆదుకుంది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక గతేడాది వేట నిషేధ భృతి ఎగ్గొట్టింది. ఈ ఏడాది ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది.
ఐదేళ్లలో రూ.538 కోట్ల లబ్ధి
రాష్ట్రంలో తిరుపతి జిల్లా తడ నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు 1,027.58 కిలో మీటర్ల మేర విస్తరించిన సముద్ర తీరంలో 65 మండలాల పరిధిలోని 555 మత్స్యకార గ్రామాల్లో 8.50 లక్షల మంది మత్స్యకారులు ఉన్నారు. వీరిలో సముద్ర వేటపై ఆధారపడి 1.63 లక్షల మంది జీవిస్తున్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం డీజిల్æ సబ్సిడీని లీటరుకు రూ.6.03 నుంచి రూ.9కు పెంచడంతో వేటకు వెళ్లే బోట్ల సంఖ్య గణనీయంగా పెరిగింది.
రాష్ట్రవ్యాప్తంగా 2019–20లో 14,229 బోట్లు ఉండగా, ప్రస్తుతం వాటి సంఖ్య 29,156కు చేరింది. వేటకు వెళ్లే మత్స్యకార కుటుంబాలకు విరామ సమయంలో రూ.4వేలు చొప్పున ఇచ్చే వేట నిషేధ భృతిని వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.10 వేలకు పెంచింది. వైఎస్సార్ మత్స్యకార భరోసా కింద ఐదేళ్లలో 5.38 లక్షల మందికి రూ.538.01కోట్ల భృతిని అందించింది.
గత ఏడాది బకాయి కలిపి రూ.40వేలు ఇవ్వాలి
తాము అధికారంలోకి రాగానే ప్రతి మత్స్యకార కుటుంబానికి రూ.20వేలు చొప్పున వేట నిషేధ భృతిని ఇస్తామంటూ ఎన్నికల్లో టీడీపీ కూటమి నేతలు హామీలు గుప్పించారు. అధికారంలోకి వచ్చాక తొలి ఏడాది ఆ హామీని అటకెక్కించారు. 2024–25 సీజన్‌కు సంబంధించి గతేడాది మే నెలలోనే ఆర్బీకేల ద్వారా సర్వే నిర్వహించి వేటకు వెళ్లే 1.30 లక్షల మందిని అర్హులను గుర్తించారు.
అయినా కూటమి ప్రభుత్వం భృతి చెల్లించకుండా ఎగ్గొట్టింది. ఈ ఏడాది ఏప్రిల్‌లోనే వేట నిషేధ భృతిని అందిస్తామని అసెంబ్లీలో ప్రకటించిన ప్రభుత్వం... ఇప్పటివరకు ఎలాంటి నోటిఫికేషన్ జారీ చేయలేదు. ఎప్పుడిస్తారో తెలియదు. గతేడాది బకాయిలతో కలిపి వేటకు వెళ్లే ప్రతి మత్స్యకార కుటుంబానికి రూ.40వేలు చొప్పున ఇవ్వాలని మత్స్యకార సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
హామీని నిలబెట్టుకోవాలి
ఎన్నికల్లో కూటమి నేతలు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. గతేడాది వేట నిషేధభృతి ఇవ్వకపోవడం వల్ల మత్స్యకారులు వడ్డీలకు అప్పులు చేసి కుటుంబాలను పోషించుకోవాల్సి వచ్చింది. గతేడాది చెల్లించాల్సిన బకాయిలతోపాటు ఈసారి వేట నిషేధ భృతిని కలిపి ప్రతి కుటుంబానికి రూ.40వేలు చొప్పున చెల్లించాల్సిందే. లేకుంటే ఉద్యమిస్తాం. – అర్జిల్లి దాసు, ప్రధాన కార్యదర్శి, జాతీయ మత్స్యకార సంఘాల సమాఖ్య