వేసవిలో మాత్రమే లభ్యం.. వేటకు ప్రత్యేక సమయం
వేటకు రూ.లక్ష విలువైన వల వినియోగం
సింగరాయకొండ: బోర మెత్తళ్లు చేప..తైల వర్ణంలో ఉంటుంది. ఇది వేసవిలోనే లభిస్తుంది. వేట నిషేధ కాలంలో మత్స్యకారులకు కాసుల వర్షాన్ని కురిపిస్తుంది. వేటాడాలంటే సన్న కన్నుల వలను వినియోగించాలి. దాని ఖరీదు రూ.లక్ష పైమాటే. ఈ చేప ప్రకాశం జిల్లా సింగరాయకొండ, బాపట్ల జిల్లా చిన్నగంజాం, నిజాంపట్నం తదితర తీర ప్రాంతాల్లో లభ్యమవుతుంది. ఇది తీరానికి అర కిలోమీటర్ దూరంలో దొరుకుతుంది. దీనిని వేటాడే సమయం కూడా భిన్నంగా ఉంటుంది.
అర్ధరాత్రి ఒంటి గంటకు వెళ్లి ఎక్కడ ఉందో గుర్తిస్తారు. దాని గమనాన్ని బట్టి ఆ ప్రాంత మత్స్యకారులు వేటాడుతారు. వేకువజామున 4 గంటల నుంచి వేట మొదలుపెడతారు. ఉదయం 8 గంటలకు తీరానికి తీసుకువస్తారు. మామూలు చేపలైతే పడవల్లోనే వల నుంచి వేరు చేస్తారు. దీనిని అలా వేరుచేసేందుకు కుదరదు. తీరానికి తీసుకువచ్చి ఒడ్డుకు చేరిన తర్వాతే వల నుంచి వేరు చేస్తారు. ఒక్కసారి వేటకు వెళితే టన్ను వరకూ లభ్యమవుతుంది. వేసవి, వేట నిషేధ సమయంలో దొరికే ఈ చేపను కర్రతెప్పల్లో మాత్రమే వేటాడుతారు. ఇక్కడ దీని ధర కేజీ రూ.100. కేరళలో ఇది కేజీ రూ.300–500 మధ్యలో ధర పలుకుతుంది. మే, జూన్‌ల్లో ఎక్కువగా దొరుకుతుంది. ఈ చేపలను ప్రత్యేక వాహనాల్లో కేరళకు పంపుతారు.
Comments
Please login to add a commentAdd a comment