Central Marine Fisheries Research Institute
-
సముద్రం నుంచి సముద్రానికి
చిన్నప్పుడు వేటకు వెళ్లిన తండ్రి ఒక్కోసారి ఖాళీ చేతులతో తిరిగి వచ్చేవాడు. ఒక్కోసారి ప్రమాదాల బారిన పడేవాడు. పడిన సరుకును సరిగ్గా అమ్ముకోగలిగేవాడు కాదు. ఇవాళ 45 ఏళ్ల వెల్విగి మెరైన్ బయాలజిస్ట్‌గా మారి తమిళనాడు కారైకల్ ప్రాంతంలో మత్స్యకారులకు సురక్షిత చేపల వేటకు సాయం చేస్తోంది. బెస్త స్త్రీల స్వయం సమృద్ధికి మార్గదర్శనం చేస్తోంది. 35 ఏళ్ల క్రితం వెల్విగికి పదేళ్లు. ఇంటికి పెద్ద పిల్ల. తన తర్వాత ముగ్గురు తోబుట్టువులు. తమిళనాడు నాగపట్టణం బెస్తపల్లెలో తండ్రి ఉదయాన్నే నాలుగ్గంటలకు చేపల వేటకు కొయ్య పడవ మీద బయలుదేరుతూ ఉంటే నిద్ర కళ్లతో చూసేది. వేటకు వెళ్లిన తండ్రి రెండు మూడు రోజులు రాడు. ఆ అన్ని రోజులు వెల్విగి దేవుణ్ణి ప్రార్థిస్తూ తండ్రి కోసం ఎదురు చూసేది. తండ్రి తిరిగి వచ్చేంత వరకూ తండ్రికీ ఇంటికీ మధ్య ఏ కమ్యూనికేషనూ ఉండేది కాదు. వాతావరణం మారితే ప్రమాదం. తుఫాను వస్తే ప్రమాదం. లేదా అంతర్జాతీయ జలాల్లోకి పడవ వెళ్లిపోతే ప్రమాదం. ఇన్ని ప్రమాదాలు దాటుకుని తండ్రి ఇల్లు చేరితే అదృష్టం. 35 ఏళ్లు గడిచిపోయాయి. ఇప్పుడు నాగపట్టణం చుట్టుపక్కలే కాదు తమిళనాడు బెస్తపల్లెలన్నింటిలోనూ వెల్విగి తన సాంకేతిక ఆలోచనలతో బెస్తవాళ్లకు ఒక ధైర్యంగా మారింది. దానికి కారణం ఏ బెస్త కుటుంబమూ ఆందోళనగా బతక్కూడదని. ఏ బెస్త ఇంటి పిల్లలు తండ్రి కోసం భయం భయంగా ఎదురు చూడకూడదు అని. అలా వారి సాయం కోసం తాను మారాలంటే మెరైన్ బయాలజీ చదవాలి. కాని బెస్త ఇళ్లల్లో ఆడపిల్లలకు అంత చదువా? ‘మన దేశంలో దాదాపు 3 వేలకు పైగా బెస్త పల్లెలు ఉన్నాయి. దాదాపు 10 లక్షల మంది బెస్త కుటుంబాలు ఉన్నాయి. 40 లక్షల బెస్తలు సముద్రాన్ని నమ్ముకుని జీవిస్తున్నారు. వీరిలో 90 శాతం మంది సంప్రదాయ మత్స్యవేట చేస్తారు. వీరిలో ఇప్పటికి మూడు వంతుల మంది దారిద్య్రరేఖకు దిగువన ఉంటే ఇక ఆడపిల్లలకు చదువు ఎక్కడ?’ అంటుంది వెల్విగి. బిఎస్సీ జువాలజీ, ఎంఎస్సీ మెరైన్ బయాలజీలను వెల్విగి తన మేనమామ సాయంతో చదువుకుంది. ‘ఆ చదువులో కూడా వివక్ష ఎదుర్కొన్నాను. బెస్త అమ్మాయి ఇలాంటి చదువు చదవడం కొందరి దృష్టిలో వింతగా ఉండేది’ అంటుంది వెల్విగి. ఇక తన కాళ్ల మీద తాను నిలబడక తప్పలేదు. పూంపుహార్‌లోని ఎం.ఎస్.స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ సంస్థ ‘ఫిష్ ఫర్ ఆల్ రీసెర్చ్ అండ్ ట్రయినింగ్ సెంటర్’ పేరుతో ఒక ప్రోగ్రామ్ని తీసుకుంటే అందులో పని చేయడానికి రామేశ్వరం వెళ్లింది వెల్విగి. అది తన ఊరికి 265 కిలోమీటర్ల దూరం. ‘కాని నాకు తప్పలేదు. డబ్బులు కావాలి’ అంది వెల్విగి. పదేళ్లు ఆ సంస్థలో పని చేశాక తిరిగి పిహెచ్డి పనిని స్వీకరించి అన్నామలై యూనివర్సిటీ నుంచి పూర్తి చేసింది. అక్కడి బెస్త సమూహంలో పిహెచ్డి చేసిన తొలి మహిళ వెల్విగి. స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ సంస్థలో ప్రస్తుతం సీనియర్ సైంటిస్ట్‌గా పని చేస్తున్న వెల్విగి బెస్తవారి కోసమే ప్రత్యేకంగా ‘మీనవా నన్బన్’ (బెస్తవారికి మిత్రుడు) యాప్‌ను డెవలప్ చేయడంలో సాయపడింది. ఇప్పుడు తమిళనాడు, పాండిచ్చేరి, ఆంధ్రప్రదేశ్‌లలో కనీసం 50 వేల మంది ఈ యాప్ వాడుతున్నారు. మత్స్య పడవల నేవిగేషన్లో ఇది సాయపడుతోంది. అంతేకాదు తీరంతో కమ్యూనికేషన్‌ను కూడా సులభం చేస్తుంది. ‘బెస్తవారి సంప్రదాయ చేపల వేట ప్రకృతి సహజమైనది. అయినప్పటికీ వలకు పడాల్సిన చేపలతో పాటు అనవసరపు సముద్ర జీవులు (బైక్యాచ్) కూడా పడుతూ ఉంటాయి. వాటిని కాకుండా కేవలం చేపలు మాత్రమే పడాలంటే ఏం చేయాలో నేను గైడ్ చేస్తూ ఉంటాను. అలాగే వలలో తాబేళ్లు చిక్కకుండా చిక్కిన తాబేళ్లు ప్రాణాలు కోల్పోకుండా ఉండేలా వాటిని తిరిగి సముద్రంలో వదిలేలా బెస్తవారికి ట్రైనింగ్ ఇస్తుంటాను’ అంటుంది వెల్విగి. ఆమె ఊరికే బోర్డు మీద పాఠాలు చెప్పే రకం కాదు. ఇప్పటికి చేపల వేటకు వెళ్లే పడవల్లో కనీసం 150 సార్లు సముద్రం మీదకు వెళ్లింది. వారితోనే ఉంటూ మెళకువలు చెబుతుంది. ఏ సమయంలో ఏ ప్రాంతంలో చేపలు పడతాయో వారికి బోధ పరుస్తుంది. ‘ఇదంతా నా చదువు వల్ల మాత్రమే కాదు. మా నాన్న నుంచి తీసుకున్న అనుభవం కూడా’ అంటుంది వెల్విగి. మత్స్స సంపద నుంచి స్త్రీలు ఆదాయం గడించేలాగా వారికి ఫుడ్‌కోర్టులు నడపడం ఎలాగో, నిల్వ ఆహారం చేయడం ఎలాగో, ఎండు చేపల మార్కెట్... వీటన్నింటి గురించి కూడా ఆమె తర్ఫీదు ఇస్తోంది. దాదాపు 17 వేల మంది మహిళలు ఆమె వల్ల లబ్ది పొందారు. ‘మత్స్యకారుల్లో వయసుకు వచ్చిన అబ్బాయిలు వేటలో పడకుండా, అమ్మాయిలు పెళ్లిలోకి వెళ్లకుండా చదువుకోవాలంటే ప్రభుత్వ పరంగా చాలా చేయాల్సి ఉంటుంది. అప్పుడే వారి జీవితాల్లో వెలుగు’ అంటుంది వెల్విగి. సముద్రంలో మత్స్యకారులతో వెల్విగి బెస్త మహిళలు, మత్స్యకారులతో వెల్విగి -
ఆంధ్రా తీరంలో తిమింగలాలు
సాక్షి, మచిలీపట్నం: తిమింగలాలు మన ప్రాంతంలోని సముద్ర తీరాన్ని ఆవాసాలుగా ఎంచుకున్నట్లు సెంట్రల్ మెరైన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (సీఎంఎఫ్ఆర్ఐ) సుమారు నెల రోజుల క్రితం గుర్తించింది. రాష్ట్రంలోని విశాఖ సముద్ర తీరంలో రెండుచోట్ల, నెల్లూరు జిల్లా మోటుపల్లి, కాకినాడ తీర ప్రాంతాలను ఆవాసాలుగా ఎంచుకుని అక్కడ తిమింగలాలు నెలల తరబడి జీవనం సాగిస్తున్నట్లు (స్టాండింగ్ లొకేషన్స్)గా వెల్లడించింది. దశాబ్ద కాలం నుంచి రాష్ట్రంలోని తీరం వెంబడి తిమింగలాల కదలికలు ఎక్కువగా ఉంటున్నాయి. ముఖ్యంగా ఆరేళ్లుగా మన తీరంలో వివిధ కారణాల వల్ల అవి మృత్యువాత పడి తీరానికి కొట్టుకొస్తున్నాయి. (చదవండి: లక్షల్లో ఫీజులు.. పురుగులతో భోజనం) సీఎంఎఫ్ఆర్ఐ మ్యాపింగ్‌తో గుర్తింపు దేశంలోని సముద్ర జలాల్లో జీవించే జంతు జాతుల కదలికలను గుర్తించేందుకు సీఎంఎఫ్ఆర్ఐ ఇటీవల మ్యాపింగ్ రూపొందించింది. దీని ద్వారా తూర్పు తీరాన గల బంగాళాఖాతంలో అరుదైన జంతు జాతుల కదలికలు ఉన్నట్లుగా గుర్తించింది. వీటిలో ప్రధానమైనవి బెలీన్ తిమింగలాలు. వీటికి ఎన్నో ప్రత్యేకతలున్నాయి. నలుపు, బూడిద రంగుల్లో ఉండే ఇవి ఉత్తర అట్లాంటిక్ సముద్ర ప్రాంతంలో ఎక్కువగా సంచరిస్తుంటాయి. 20 అడుగుల పొడవు, 3 వేల కిలోల బరువుండే ఈ తిమింగలాలు 70నుంచి 80 ఏళ్ల పాటు జీవిస్తాయి. ఇవి సాధారణ తిమింగలాలతో కలవవు. వేసవిలో ధృవ ప్రాంతాల్లో చల్లని, పోషకాలు అధికంగా ఉండే నీటి వనరుల్లోకి తరలి వెళ్తాయి. శీతాకాలంలో మాత్రం ఉష్ణ మండల జలాల్లోకి వలసపోతాయి. కనీసం రెండు మూడు నెలల పాటు ఒకే ప్రాంత జలాల్లో సంచరిస్తుంటాయి. రోజుల తరబడి కదలకుండా ఒకేచోట ఉండగలుగుతాయి. కృష్ణా జిల్లా నాగాయలంకలో మృతి చెందిన తిమింగలాల కళేబరం (ఫైల్ ఫొటో) మ్యాపింగ్ ఎలా చేస్తారంటే.. దేశం వ్యాప్తంగా విస్తరించి ఉన్న సముద్ర జలాల్లో ఎక్కడెక్కడ ఏయే రకాల జలచరాలు ఆవాసాలు ఏర్పాటు చేసుకుంటున్నాయనే విషయాన్ని శాటిలైట్ ఆధారిత జీపీఎస్ కో–ఆర్డినేట్స్ ద్వారా అక్షాంశాలు, రేఖాంశాల ఆధారంగా గుర్తిస్తారు. వివిధ రకాల జలచరాలు ఏయే ప్రాంతాల్లో ఎక్కువ రోజులు ఉంటున్నాయి, ఏ ప్రాంత జలాల్లో చనిపోయి ఏ తీరంలోకి కొట్టుకొస్తున్నాయో పరిశీలిస్తారు. ఫిష్ ల్యాండింగ్ పాయింట్స్, వేట సమయంలో మత్స్యకారుల పరిశీలనలోకి వచ్చిన విషయాలను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. ఇలా అన్ని కోణాల్లో పరిశీలించి, అధ్యయనం చేస్తారు. ఇలా గుర్తించిన ప్రాంతాలను మ్యాపింగ్ చేసి వాటి స్టాండింగ్ లొకేషన్స్‌ను ప్రకటిస్తారు. తిమింగలం జాతుల స్ట్రాండింగ్ లొకేషన్స్ ప్రకటించడం వల్ల వాటి పరిరక్షణపై దృష్టి పెట్టొచ్చు. వాటి ఉనికికి ఇబ్బంది లేకుండా అవి సంచరించే ప్రదేశాల్లో భారీ నౌకలను దారి మళ్లించడం, వేటను నిషేధించడం, నీటి అడుగు భాగాల్లో నావికా, తీర భద్రతా విభాగాలు సాగించే ప్రయోగాలు నియంత్రించడం వంటి చర్యలు చేపట్టడం ద్వారా వాటి జీవనానికి ఇబ్బంది లేకుండా చూసే వీలు కలుగుతుంది. ఏపీ తీరంలో 2013 నుంచి తిమింగల జాతుల మరణాలు నమోదవుతున్నాయి. తీరానికి కొట్టుకొచ్చిన వాటి మృత కళేబరాలను అటవీ శాఖ అధికారులు సేకరించి పరిశోధనలకు తరలిస్తున్నారే తప్ప.. మరణాలకు గల కారణాలను మాత్రం శోధించలేకపోతున్నారు. మ్యాపింగ్ అందుబాటులోకి రావడం వల్ల కారణాలను అధ్యయనం చేసే వీలు కలుగుతుంది. పరి రక్షణకు ప్రత్యేక చర్యలు మ్యాపింగ్‌లో భాగంగా ఆంధ్రప్రదేశ్ సముద్ర తీరంలో తిమింగలాల ఆవాసాలకు సంబంధించి నాలుగు స్టాండింగ్ లొకేషన్స్ గుర్తించాం. నావల్, తీర భద్రతా దళాలు తిమింగలాల స్టాండింగ్ లొకేషన్స్‌లోని జలాల్లో కసరత్తులు చేయకుండా సూచనలు ఇవ్వవచ్చు. ఇటీవల కేరళ తీరంలోని సముద్ర జలాల్లో చిక్కుకున్న తిమింగలాలకు పునరావాసం కల్పించేందుకు సీఎంఎఫ్ఆర్ఐ (కొచ్చి) ప్రత్యేక చర్యలు చేపట్టింది. అదే రీతిలో ఏపీలో కూడా అటవీ శాఖ సహకారంతో తిమింగలాల పరిరక్షణకు చర్యలు చేపట్టొచ్చు. – ఎడ్వర్డ్, శాస్త్రవేత్త, సీఎంఎఫ్ఆర్ఐ, విశాఖపట్నం ఆవాసాలపై ప్రత్యేక దృష్టి పెట్టొచ్చు మన ప్రాంతంలోని సముద్ర జలాల్లో తిమింగలాలు రోజులు, నెలల తరబడి నివాసం ఉంటున్నాయి. ఆ సమయంలో అటుగా వెళ్లే నౌకలు ఢీ కొట్టడం, నౌకల నుంచి విడుదలయ్యే ఆయిల్స్ వల్ల భూగర్భంలో ఆక్సిజన్ తగ్గిపోవడం వంటి కారణాల వల్ల తిమింగలాలు చనిపోతుంటాయి. అవి సంచరించే స్టాండింగ్ లోకేషన్స్‌ను గుర్తించడం వల్ల ఆ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టి రక్షణ చర్యలు చేపట్టే అవకాశం కలుగుతుంది. – డాక్టర్ ఎల్.సుశీల, అసిస్టెంట్ ప్రొఫెసర్, కృష్ణా యూనివర్సిటీ -
స్థూలకాయానికి సహజసిద్ధ ఔషధం
కొచ్చి: స్థూలకాయం, డిస్లీపిడీమియా (రక్తంలో లిపిడ్ల సంఖ్య పెరగడం) వ్యాధులకు శాస్త్రవేత్తలు సముద్ర కలుపు మొక్కల నుంచి సహజ సిద్ధ విరుగుడును కనుగొన్నారు. కాడల్మిన్ టీఎంఏసీఈ (కాడల్మిన్ టీఎం యాంటీపర్కొలెస్టరొలేమిక్ ఎక్స్ట్రాక్ట్)గా పిలిచే ఇది వంద శాతం సహజసిద్ధ సముద్ర బయోయాక్టివ్ పదార్థాల నుంచి తయారైన ఏకైక ఔషధమని కొచ్చిలోని కేంద్ర మెరైన్ ఫిషరీస్ పరిశోధన సంస్థ వెల్లడించింది. సంస్థ ఏర్పడి 75 వసంతాలు పూర్తవుతున్న సందర్భంగా శనివారం ఈ ఔషధాన్ని విడుదల చేస్తారు. భారత సముద్ర తీరాల్లో విరివిగా లభించే, ఔషధ గుణాలున్న కలుపు మొక్కల నుంచి దీన్ని తయారుచేశారు. దీన్ని 400 ఎంజీ మాత్రల్లో తెస్తామని, ఎలాంటి దుష్ప్రభావాలు లేవని పరీక్షల్లో తేలిందని శాస్త్రవ్తేలు చెప్పారు.